మనుషులకు దూరంగా అడవిలో బతకాలనుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు.. కుళ్లిపోయిన స్థితిలో అక్కాచెల్లెళ్లు, అబ్బాయి శవాలు

కొలరెడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొలరెడో రాకీ మౌంటెన్ నేషనల్ పార్క్
    • రచయిత, మ్యాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ న్యూస్

చుట్టూ ఉన్న సమాజంలోని అనేక అవలక్షణాలకు, అసౌకర్యాలకు, గందరగోళాలకు, అసూయాద్వేషాలకు దూరంగా ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాలని ఆ ముగ్గురూ కోరుకున్నారు.

కొండలు, అడవుల్లోకి వెళ్లి మనుషులతో సంబంధంలేకుండా జీవించాలనుకున్నారు.

కానీ, అక్కడ ఎదురైన అవరోధాలను ఎదుర్కొని నిలవలేక ప్రాణాలే కోల్పోయారు.

నాగరికతకు దూరంగా బతకాలని వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారిలో ఒకరి కుమారుడు కొలరెడోలోని రాకీ పర్వతాల్లో చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

రాకీ పర్వతాల్లోని ఒక మారుమూల ప్రదేశంలో క్రిస్టిన్, రెబెక్కా వాన్స్‌లతో పాటు వారి 14 ఏళ్ల కుమారుడి అవశేషాలను ఈ నెలలో గుర్తించారు.

ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం, వారు ఆకలి వల్ల కానీ శీతాకాలంలో గడ్డకట్టించే చలి కారణంగా కానీ చనిపోయి ఉంటారని నిపుణులు మంగళవారం చెప్పారు.

కొండల్లోకి వెళ్లిన ఆ కుటుంబం వేసవిలో క్యాంపుల్లో నివసించడం మొదలుపెట్టింది. కానీ, ఆ తరువాత వాతావరణం మారిన తరువాత వీరు ఇబ్బందులుపడ్డారు.

రెబెక్కా వాన్స్ సవతి సోదరి ట్రెవలా జారా బుధవారం వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడారు.

‘‘ఈ ప్రపంచం నడుస్తున్న తీరు రెబెక్కాకు నచ్చలేదు. ఈ ప్రపంచంతో పాటు అన్నింటికీ దూరంగా తన కుమారుడు, క్రిస్టిన్‌తో కలిసి ఒంటరిగా బతికితే బాగుంటుందని రెబెక్కా అనుకున్నారు’’ అని జారా చెప్పారు.

కొలరెడో నేషనల్ పార్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొలరెడో రాకీ మౌంటెన్ నేషనల్ పార్క్

అనుభవలేమి

అక్కాచెల్లెళ్లతో పాటు వారి వెంట ఉన్న బాలుడికి అడవిలో బతికిన అనుభవం లేదు. కొలరెడో పర్వతాల్లో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి వారు ఆన్‌లైన్ వీడియోలను చూశారని జారా తెలిపారు.

‘‘సమాజానికి దూరంగా ఎలా బతకాలో ఆన్‌లైన్ వీడియోలు చూస్తే తెలియదు. ఎలాంటి అనుభవం లేకుండా వీడియోలు చూసి అలా చేయకూడదు. పైగా వారు దీనికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఆకలితో అలమటించారు’’ అని జారా చెప్పారు.

వారి మరణాలకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని పరిశోధకులు అన్నారు. టాక్సికాలజీ నివేదికలు పూర్తిగా వచ్చేవరకు ఆ కారణాన్ని బయటపెట్టబోమని తెలిపారు.

గునిసన్ నేషనల్ ఫారెస్ట్‌లోని గోల్డ్ క్రీక్ క్యాంప్ గ్రౌండ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న కొన్ని మానవ శరీర అవశేషాలను జులై 9న ఒక వ్యక్తి గమనించారు.

9,000 అడుగుల ఎత్తులోని ఒక ప్రదేశంలో ఉన్న ఒక టెంట్‌లో ఇద్దరి మృతదేహాలను, టెంట్ బయట మరో శవాన్ని కనుగొన్నట్లు గునిసన్ కౌంటీ కొరొనర్ మైకేల్ బర్న్స్ చెప్పారు.

బాలుడి పేరును వారు వెల్లడించలేదు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కాపాడుతున్న మడ అడవుల్లో ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే..

వారు అక్కడ ఒక షెల్టర్‌ను నిర్మించుకోవడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోందని ఏపీ న్యూస్ ఏజెన్సీతో కొరొనర్ చెప్పారు. కానీ, శీతాకాలం రావడంతో టెంట్ లోపలే ఉండిపోయారేమోనని అన్నారు.

‘‘చలికాలం అకస్మాత్తుగా, తొందరగా వచ్చిందా? అందుకే వారు టెంట్ లోపలే ఉండిపోయారా? అనే విషయం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అవుట్‌డోర్‌లో ఎలా బతకాలి? ఆహారాన్ని ఎలా అన్వేషించాలి? అనే విషయాలకు సంబంధించిన చాలా సాహిత్యం వారి దగ్గర కనిపించింది. కానీ, వారు తమకు కావాల్సిన సరుకులను ఒక కిరాణంలో కొన్నట్లు తెలుస్తుంది’ అని మైకేల్ చెప్పారు.

గుడ్‌బై చెప్పేందుకు చివరిసారిగా తమ సవతి సోదరి ఇంటికి వెళ్లిన ఆ ముగ్గురు, ఆ తర్వాత అడవి బాట పట్టారు.

‘‘మేం వారిని ఆపేందుకు ప్రయత్నించాం. కానీ, వారు మా మాట వినలేదు. అప్పటికే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే గట్టి నిర్ణయం వారు తీసుకున్నారు’’ అని జారా వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘అమ్మతో వెళ్లి అడుక్కునేవాడిని.. ఇప్పుడు మా అమ్మను ఏఎస్పీ తల్లి అని నమస్కరిస్తున్నారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)