'మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడతారేమోనని నాకు భయం' - సుధా మూర్తి వ్యాఖ్యలపై విమర్శలకు కారణమేంటి?

ఫొటో సోర్స్, MEHTA PUBLISHING HOUSE
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి, దిల్లీ
ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేస్తుంది ఆహారం. కానీ, తన ఆహార అలవాట్లపై రచయిత్రి, సేవా కార్యక్రమాలు నిర్వహించే సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు శాకాహారంపై భారత దేశంలో పెద్ద చర్చకు దారితీశాయి.
తమ అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి సుధా మూర్తి, ఆమె భర్త, సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎన్‌ఆర్ నారాయణ మూర్తిపై మరింత ఫోకస్ పెరిగింది.
ఇటీవల ప్రముఖ ఫుడ్ షో ''ఖానే మే కౌన్ హై?''(భోజనంలో ఏముంది?)లో 72 ఏళ్ల సుధా మూర్తి పాల్గొన్నారు. ఆ షోలో చేసిన వ్యాఖ్యలతో ఆమె పేరు ట్విటర్‌లో మూడు రోజులు ట్రెండ్ అయ్యింది.
తాను పూర్తి శాకాహారి(ప్యూర్ వెజిటేరియన్) అని, గుడ్లు తినే అలవాటు కూడా లేదని సుధా మూర్తి చెప్పారు. విదేశాలకు వెళ్లేప్పుడు ఆహారం కూడా తనతో పాటు తీసుకెళ్తానన్నారు. ''మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడతారేమోనని నాకు భయం'' అని ఆమె అన్నారు.
''అందువల్ల ప్రయాణాల సమయంలో శాకాహార రెస్టారెంట్‌కే వెళ్తాను. లేదంటే బ్యాగ్ నిండా ఆహారం తీసుకెళ్తాను. అలా ఆహారం తీసుకెళ్లడం చూసి అమ్మమ్మలు, నానమ్మలను ఆటపట్టించేదాన్ని. అక్కడ దొరికే ఆహారం తినేయొచ్చు కదా అని అడిగేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా వాళ్లలాగే మారిపోయాను'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, YouTube/KhaaneMeinKyaHai
ఆహార అలవాట్లపై సుధా మూర్తి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తాను పూర్తి శాకాహారినని ఆమె చేసిన వ్యాఖ్యలు గుడ్డు తినేవారి నుంచి తమను తాము వేరుగా చూపించుకోవడమేనని కొందరు విమర్శిస్తున్నారు.
సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థ ‘శాకాహారం స్వచ్ఛమని’ చెబుతోందని, సుధామూర్తి వ్యాఖ్యలు దీనిని గుర్తు చేస్తున్నాయని వారు అంటున్నారు. ఆమె వ్యాఖ్యలు తన ‘అగ్ర కుల’ బ్రాహ్మణ ఆలోచనలను సూచిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, FB/Sudhamurthy123
శాకాహారం కులవ్యవస్థలో కలిసిపోయిందా?
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు మాంసాహారం భుజించేవారని, ఇప్పటికీ చాలా మంది తింటారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయినప్పటికీ శాకాహారిగా ఉండటం అనేది 'స్వచ్ఛం’ అనే భావనతో ముడిపడి పోయింది.
''భారత్‌లో శాకాహారం కులవ్యవస్థతో కలిసిపోయి ఉంది. వ్యక్తిగతంగా చూస్తే అది వారి అలవాటుకు సంబంధించిన విషయమే. కానీ కులపరంగా చూస్తే మాత్రం చాలా కష్టం.'' అని సామాజిక శాస్త్రవేత్త జానకీ శ్రీనివాసన్ ట్వీట్ చేశారు.
''శాకాహారులు సోప్(SOAP) భావనను (అంటే ఎవరికి ఇష్టమైనది/అవసరమైనది వారు తీసుకోవడం)ను అర్థం చేసుకోలేదా? అది వారి మానసిక రుగ్మత స్థాయిని తెలియజేస్తోంది. 'స్వచ్ఛం, కలుషితం' అనే భావనలు కచ్చితంగా బ్రాహ్మణవాదమే'' అని మరో ట్విటర్ యూజర్ అభిప్రాయపడ్డారు.
కొందరు సుధా మూర్తి పక్కనే రిషి సునక్ ప్లేట్‌లో మాంసం ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.
దీనిపై తీవ్రమైన విమర్శలు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలో దాదాపు 20 శాతం మంది కేవలం మొక్కలు, డెయిరీ ఉత్పత్తులను మాత్రమే ఆహారంగా తీసుకుంటారని అంచనా. చాలా మంది దానిని అంగీకరించారు కూడా.
''నేను మాంసం తినేవారి పక్కన కూర్చుని భోజనం చేస్తాను. కానీ, మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైతే భోజనం చేయడం మానేస్తాను. అది మీరు అర్థం చేసుకోలేకపోతే, అది మీ సమస్య. ఎవరి ఆహారపు అలవాట్లు వారికి ఉంటాయి. సుధా మూర్తికి నేను మద్దతిస్తున్నా'' అని పోలీసు అధికారి అరుణ్ బోత్రా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సుధా మూర్తి మాదిరిగా వ్యవహరించేవాళ్లు తనకు చాలా మంది తెలుసని, ఆమెకు ఇష్టం వచ్చినట్లుగా ఆమెను ఉండనివ్వాలని జర్నలిస్ట్ షీలా భట్ కోరారు.
అలాగే, మాంసం తినే భారతీయుల్లో కూడా చాలా మంది ఆహార నియమాలు, సంప్రదాయాలు పాటిస్తున్నట్లు చెబుతున్న ఒక పరిశోధనను కొందరు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు చాలా మంది హిందువులు ఆవు మాంసం తినరు. అలాగే ముస్లింలు పంది మాంసం జోలికి పోరు.
కేవలం శాకాహారులు మాత్రమే కాదు, చాలా మంది మాంసం తినే వారు కూడా ''ఆవు మాంసంతో చేసిన ఫ్రెంచ్ ఆనియన్ సూప్, ఆవు కొవ్వుతో చేసిన థిక్ కట్ బెల్జియన్ ఫ్రైస్ ఫ్రైడ్''ని తినరు. అలాగే, హలాల్ చేశారో లేదో తెలియనప్పుడు ముస్లింలు కూడా శాకాహారమే తీసుకుంటారని మరో ట్విటర్ యూజర్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పందించని సుధా మూర్తి
కులవ్యవస్థ వేళ్లూనుకుపోయిన భారత దేశంలో విమర్శలు, భిన్నాభిప్రాయాలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించవు. ఎందుకంటే హిందువుల్లో కులవ్యవస్థ బలంగా ఉంది. ఈ వ్యవస్థలో ‘అగ్రవర్ణాల’కు ప్రత్యేక హక్కులు సంక్రమించాయి. అందువల్ల నిమ్న వర్గాలపై అణచివేత ఇప్పటికీ తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
కులవివక్ష చట్టవిరుద్ధమని దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ అట్టడుగు వర్గాలపై వివక్ష నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది.
దశాబ్ద కాలంగా శాకాహారం కూడా ఆయుధంగా మారింది. ఆవు మాంసం తింటున్నారని, ఆవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ముస్లింలపై, దళితులపై కొన్ని హిందూ సంస్థలు దాడులు చేస్తున్నాయి.
అయితే, ఇలాంటి లోతైన విషయాలపై మాట్లాడే సమయంలో సుధా మూర్తి లాంటి గొప్ప వ్యక్తులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
తన వ్యాఖ్యలపై ట్విటర్‌లో జరుగుతున్న రచ్చపై సుధా మూర్తి ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడం ఇదేమీ తొలిసారి కాదు.

ఫొటో సోర్స్, Getty Images
తన అడ్రస్ 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెబితే లండన్‌లో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ నమ్మలేదని, తన సాధారణ వేషధారణను చూసి జోక్ చేస్తున్నానని అనుకున్నారని మే నెలలో ఒక టీవీ షోలో సుధా మూర్తి అన్నారు. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
ఆ తర్వాత నెలలో మరోటి. ''నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను. నా కూతురు అక్షతా మూర్తి తన భర్తను ప్రధాన మంత్రిని చేసింది'' అన్న వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
తన భర్త ఐటీ కంపెనీ ప్రారంభించేందుకు 1981లో తాను పది వేల రూపాయలు అప్పుగా ఇచ్చానని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు... అసలేం జరిగింది?
- మనుషులకు దూరంగా అడవిలో బతకాలనుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు.. కుళ్లిపోయిన స్థితిలో అక్కాచెల్లెళ్లు, అబ్బాయి శవాలు
- ఓపెన్‌హైమర్: అణుబాంబు తయారు చేస్తున్నప్పుడు ఒక సైంటిస్ట్ చనిపోయారు... ఎలాగో తెలుసా?
- ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?
- మతమా, దేశమా అనే చర్చ ఎందుకు జరుగుతోంది... అసదుద్దీన్, కుమార్ విశ్వాస్ ఏమని ట్వీట్ చేశారు?















