పామాయిల్ రైతులు: టన్ను 23 వేలున్న ధర 13 వేలు అయ్యింది, మేం ఎలా బతకాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
నిరుడు రూ.23 వేలున్న టన్ను పామాయిల్ గెలల ధర రూ.12,800 అయ్యిందని, ఇలాగైతే తామెలా బతకాలని ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ రైతులు దిగులు చెందుతున్నారు.
ఏడాదిన్నర వ్యవధిలోనే ధర దాదాపు సగానికి పడిపోవడంతో వార నష్టపోతున్నారు.
ప్రభుత్వాలు పామాయిల్ సాగు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నా, తమ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవచూపడం లేదని రైతులు అంటున్నారు.
ధరల పతనాన్ని ఇప్పటికైనా ఆపకపోతే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతకూ పామాయిల్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ప్రభుత్వం ఏమంటోంది?
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాములవారిగూడేనికి చెందిన బిక్కిన రామేశ్వర రావు 15 ఏళ్ల కిందట 10 ఎకరాలలో పామాయిల్ పంట వేశారు. ఏడాదికి 100 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తోంది.
2022 మే నెలలో టన్ను పామాయిల్ గెలల ధర సుమారు రూ.23 వేలు ఉండగా, 2023 జులైలో ఇది రూ.12,800కి తగ్గింది. ఏడాదిన్నర కాలంలో టన్నుకు రూ.10 వేలకు పైగా ధర తగ్గిపోయింది.
‘‘కౌలు పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి. కానీ రేటు పడిపోయింది. అనేక పంటలు సాగు చేసి నష్టపోయిన తర్వాత పామాయిల్ సాగు చేస్తే కాస్త గట్టెక్కవచ్చని భావించాం. పంట వేసిన నాలుగేళ్ల వరకు ఆదాయం ఉండదు. అయినా పెట్టుబడులు పెట్టి తోటలు పెంచి, ఎదురుచూశాం. తీరా పంట వచ్చిన తర్వాత ధరలు పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతులందరం తీవ్రంగా నష్టపోతున్నాం’’ అని రామేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
ధరలు స్థిరంగా లేకపోవడంతో పంట చేతికొచ్చేసరికి ఏమవుతుందోనన్న ఆందోళన పెరుగుతోందన్నారు ఆయన.

పామాయిల్ ఉత్పత్తిలో 90 శాతం వాటా ఏపీదే
దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి పెంచాలనే సంకల్పంతో సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం, దిగుబడి క్రమంగా పెరుగుతున్నాయి.
2023 మార్చి నాటికి దేశంలో 4.6 లక్షల హెక్టార్లలో(11.366 లక్షల ఎకరాల) పామాయిల్ సాగు అవుతోంది.
భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) పరిశోధన కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో పామాయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. విస్తీర్ణంలో సుమారు సగం ఏపీలోనే ఉంది. ఒక్క ఏపీలోనే 2,21,003 హెక్టార్లలో(5.46 లక్షల ఎకరాలు) పామాయిల్ సాగు చేస్తున్నారు.
2020-21లో దేశమంతా కలిపి 2,85,656 టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేయగా, ఒక్క ఏపీలో 2,37,898 టన్నుల ఉత్పత్తి జరిగింది. అంటే ఉత్పత్తిలో 90 శాతం వాటా ఏపీదే.
30 ఏళ్ల కిందటే ఇక్కడ పామాయిల్ సాగు మొదలుకావడంతో ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఏపీ నుంచి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇటీవలే పామాయిల్ తోటల సాగు మొదలవుతోంది.
ఇతర రాష్ట్రాల్లో కొత్తగా సాగవుతున్న తోటల నుంచి దిగుబడి మొదలైతే దేశంలో మొత్తం పామాయిల్ ఉత్పత్తి 4 లక్షల టన్నులకు చేరొచ్చని అంచనా.
తెలంగాణలో 2023 మార్చి నాటికి 63,862 హెక్టార్లలో పామాయిల్ తోటలు ఉన్నాయి. దిగుబడి సుమారుగా 40 వేల టన్నుల వరకు ఉంది.
దేశంలో పామాయిల్ సాగు విస్తీర్ణంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే పామాయిల్ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పామాయిల్ ధరల పతన ప్రభావం కూడా ఇక్కడి రైతులపైనే ఎక్కువగా ఉంటోంది.

ఎకరాకు పెట్టుబడి ఎంత?
పామాయిల్ సాగుకు ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. అదనంగా కౌలు ఎకరాకు మరో లక్ష వరకూ ఉంటుంది. సహజంగా పామాయిల్ పంట జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అధికారిక అంచనాల ప్రకారమే ఈ సీజన్‌లో నెలకు మూడు టన్నుల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో అది అరటన్ను లోపే ఉంటుందని రైతులు చెబుతున్నారు.
టన్నుకు రూ.23 వేల ధర ఉంటే పెట్టుబడి, కౌలుపోను ఎకరాకు రూ. 2.3 లక్షల వరకు రైతుకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు టన్ను రూ. 12,800కు పడిపోవడంతో ఎకరాకు సగటున రూ.లక్ష ఆదాయం రావడమే గగనంగా మారింది. దాంతో పెట్టుబడి వ్యయం, కౌలు వంటివి సమకూర్చుకోవడమే కష్టం అవుతోందని రైతులు అంటున్నారు.
"పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. కానీ ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం నుంచి ఇదే పరిస్థితి. వినియోగదారులకు పామాయిల్ ధరలు భారం అవుతున్నాయనే ఉద్దేశంతో 30 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అదే సమయంలో దేశంలో రైతులు నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర అమలు చేయడానికి ప్రభుత్వాలు స్పందించడం లేదు" అంటూ ఆయిల్ ఫెడ్ రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి కృష్ణారావు బీబీసీతో చెప్పారు.
ఎకరా పెట్టుబడి వ్యయం రూ.17,500గా కేంద్ర ప్రభుత్వమే అధికారిక లెక్కలు వేసిందని, అయినా ఇప్పుడు రూ. 12,800 కి మించి ధర లేకపోయినా పట్టించుకోవడం లేదంటూ ఆయన తప్పుబట్టారు.

నాలుగేళ్లుగా రాయితీలు అందడం లేదు: ఏపీ రైతులు
పామాయిల్ సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. తోటల పెంపకం నుంచి వాటిని అందించాల్సి ఉంది. అయితే ఏపీలో మాత్రం గడిచిన నాలుగేళ్లుగా రాయితీలు అందడం లేదని రైతులు చెప్తున్నారు.
సాగుదారులకు మొక్కలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ ధర చెల్లించి కొనాల్సి వస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అంటున్నారు.
‘‘పామాయిల్ తోటల పెంపకానికి మొక్కలు కావాలంటే ఒక్కో మొక్కకు రూ.200 నుంచి రూ.300 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కొందరు రైతులు తెలంగాణ వెళ్లి మొక్కలు తెచ్చుకుంటున్నారు. కానీ ఏపీలో మాత్రం మొక్కలను అందుబాటులో ఉంచడం లేదు. కొన్ని ప్రైవేట్ నర్సరీలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ఓవైపు గిట్టుబాటు ధరలు లేవు. మరోవైపు పెట్టుబడి వ్యయం కూడా పెరిగిపోతోంది. రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు’’ అని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న రైతులకు ఉపశమనం కల్పించే చర్చలు తీసుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను పూర్తిగా విస్మరించిందని శ్రీనివాస్ విమర్శించారు.

‘‘దిగుమతి సుంకం తగ్గించడంతో మలేసియా వంటి దేశాల నుంచి వస్తున్న పామాయిల్ ధర తగ్గింది. ఫలితంగా దేశంలో పామాయిల్ ఉత్పత్తిదారులు రైతుల నుంచి కొన్న పామాయిల్ గెలల ధరలు తగ్గించారు. దాంతో దేశీయంగా రైతులు నష్టపోతున్నారనే విషయం కేంద్రం దృష్టిలో ఉంది’’ అని పెదవేగిలోని జాతీయ పామాయిల్ రీసర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కంచర్ల సురేష్ అన్నారు.
ధరల స్థిరీకరణ దిశగా కేంద్రం ఆలోచిస్తోందని, రైతులకు త్వరలోనే ఉపశమనం కలగొచ్చని ఆయన చెప్పారు.
‘‘రీసర్చ్ సెంటర్ ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించుకునే మార్గాలు సూచిస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా దేశంలోని రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఖర్చులు తగ్గించేందుకు ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోవాలి. మొక్కలు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మొక్కల దిగుమతులకు కూడా కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది" అని సురేష్ వివరించారు.
దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి కూడా రానున్న రెండు మూడేళ్లలో రెట్టింపయ్యేలా చేయాలన్న లక్ష్యంతో సాగుతున్నామని , అందుకు అనుగుణంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
పామాయిల్ రైతుల సమస్యలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విన్నవించామని, అయినా స్పందన లేదని ఆయిల్ ఫెడ్ రైతుల అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు తెలిపారు.
పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి:
- ‘రాహుల్‌కు పెళ్లి చేస్తాం, అమ్మాయి ఉంటే చెప్పండి’: హరియాణా మహిళలతో సోనియా గాంధీ వ్యాఖ్యలు
- ప్రొటీన్ సప్లిమెంట్స్ మేలు చేస్తాయా... కీడు చేస్తాయా?
- అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్‌కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు
- ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? మలబద్ధకం ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి?
- వెయిట్ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














