నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు... ఆమె పుట్టింది తెలంగాణలోనా?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలుగువారి చరిత్రలో ‘నాయకురాలు’గా ప్రసిద్ది చెందిన ‘నాగమ్మ’ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు?
నాగమ్మ జన్మస్థలం, జీవితంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాగమ్మ పల్నాడులోని ‘నాగులేరు’ ఒడ్డున శిశువుగా దొరికిందన్న వాదన ఒకటి ఉంది.
అయితే, తెలంగాణలోని ‘ఆరవెల్లి’ గ్రామం ఆమె జన్మస్థలం అని, తన గ్రామ నామంతోనే ఆమెకు ‘ఆరవెల్లి నాగమ్మ’గా పేరు వచ్చిందని ఈ విషయం శ్రీనాథుని ‘పల్నాటి వీరచరిత్ర’లో స్పష్టంగా పేర్కొన్నారన్నది మరికొందరు చరిత్రకారుల వాదన.

ఆరవెల్లి నుంచి పల్నాడుకు వలస:
చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే నాగమ్మ 12వ శాతాబ్దంలో జీవించారు.
పరిశోధనాత్మక చారిత్రక రచనలు, జానపద మౌఖిక సాహిత్యం ఆధారంగా...
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ‘ఆరవెల్లి’లో రెడ్డి కుటుంబంలో నాగమ్మ జన్మించారు. ఆమె తండ్రి చౌదరి రామిరెడ్డి. అయితే, బాల్యంలోనే తల్లిని కోల్పోయారు నాగమ్మ.
ఆరవెల్లి ప్రాంతంలో అంటువ్యాధులు సోకడంతో నాగమ్మ ఏడేళ్ల వయసులో ఉండగా పల్నాడులోని తన మేనమామ గ్రామమైన ‘జిట్ట గామాలపాడు’కు తండ్రితో కలిసి వలస వెళ్లింది. ఆమె తండ్రి రామిరెడ్డి అక్కడే వ్యవసాయం చేశారు. కాగా, గోపన్న అనే గురువు వద్ద యుద్ద విద్యల్లో నాగమ్మ శిక్షణ తీసుకున్నారు. మేనబావ సింగారెడ్డితో నాగమ్మ వివాహం అయింది. అయితే కొద్దిరోజులకే నాగమ్మ వితంతువుగా మారారు.
మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించే క్రమంలో జరిగిన గొడవల్లో తండ్రి, మేనమామలను నాగమ్మ కోల్పోయారు.

సామాన్య మహిళ నుంచి రాజ్యానికి మంత్రిగా నాగమ్మ:
సాధారణ మహిళ నుంచి పల్నాడు రాజ్యానికి మంత్రి స్థాయికి నాగమ్మ ఎలా ఎదిగారన్న దానిపై ఆసక్తికరమైన కథనం ఒకటి జానపద గాథల్లో ఉంది. ఆ గాథ ప్రకారం..
వేట నుంచి తిరిగి వస్తున్న పల్నాడు రాజు ‘అనుగురాజు’, అతని రాజపరివారానికి నాగమ్మ జిట్టగామాలపాడులో ఆతిథ్యం ఇచ్చారు. దీంతో భవిష్యత్తులో తాను కోరినప్పుడు ఏడు ఘడియలు (168 నిమిషాలు) మంత్రిగా పనిచేసేలా రాజుగారి నుంచి రాజపత్రం (వరం) పొందారు నాగమ్మ.
అనుగురాజు తర్వాత అతని కొడుకు ‘నలగామరాజు’ పాలన చేపట్టారు. రాజపత్రంతో నలగామరాజు వద్ద ఏడు ఘడియల కోసం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు నాగమ్మ. ఆ సందర్భంలో ఏర్పడ్డ విభేదాలతో పల్నాడు ప్రాంతం గురజాల, మాచర్ల రాజ్యాలుగా విడిపోయింది.
గురజాల కేంద్రంగా నలగామరాజుకు మంత్రిగా నాగమ్మ, మాచర్ల రాజు మలిదేవరాజుకు మంత్రిగా బ్రహ్మనాయుడు కొనసాగారు.
సతీసహగమనం పాటిస్తున్న రోజుల్లో, మహిళ గడపదాటని కాలంలో, స్త్రీ స్వేచ్చకు నాగమ్మ నిదర్శనంగా నిలిచారు’ అని పల్నాటి రచయితల సంఘం అధ్యక్షులు వైహెచ్‌కే. మోహన్‌రావ్ అభిప్రాయపడ్డారు.

కోడి పందేలు - పల్నాటి భారతం
మలిదేవరాజు వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోడి పందాల్లో ఓడిపోవడంతో మాచర్ల రాజ్యాన్ని కోల్పోయారు. ఒప్పందం ప్రకారం మలిదేవుడు, బ్రహ్మనాయుడు, రాజపరివారం ఏడేళ్లు అరణ్య వాసం వెళ్లారు.
అయితే, వనవాసం ముగిశాక తిరిగి రాజ్యం అప్పగించే విషయంలో ఏర్పడ్డ తగాదాలు పల్నాటి యుద్దానికి దారితీశాయి. దీంతో గురజాలకు నాగమ్మ, మాచర్లకు బ్రహ్మనాయుడు నాయకత్వం వహిస్తారు. రాజ్య భాగం విషయంలో దాయాదుల మధ్య యుద్దం జరగడం, కోడిపందాలు, వనవాస ఘట్టాల వంటి సామీప్యతతో చరిత్రకారులు దీన్ని మహాభారత యుద్దంతో పోలుస్తూ ‘పల్నాటి భారతంగా’ తమ రచనల్లో పేర్కొన్నారు.
పరోక్షంగా ఇది నాగమ్మ, బ్రహ్మనాయుడు పాటించిన వీరశైవం, వైష్ణవ మతాలకు మధ్య జరిగిన పోరాటంగా మరికొంతమంది చరిత్రకారులు అభివర్ణించారు.
‘పాలి వారి మధ్య గొడవ, మహాభారత యుద్ధానికి పోటీ అన్నట్టుగా తయారైంది. రాజ్యం చిన్నదే, ఒక జిల్లా అంత విస్తీర్ణమే, కానీ ఈ యుద్దంలో అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నారు’ అని చరిత్ర పరిశోధకులు డాక్టర్. మలయశ్రీ అన్నారు.
కారంపూడి వద్ద 1178-1182 మధ్య కాలంలో పల్నాటి యుద్దం జరిగినట్టుగా రాయలసీమ ప్రాంత ప్రముఖ పరిశోధకులు ‘పండిత అక్కిరాజు ఉమాకాంతం’ తన రచనల్లో తెలిపారు.
యుద్ధంలో నాగమ్మ చేతిలో బ్రహ్మనాయుడు మరణించారని ఒక వాదన కాగా, యుద్ధానంతర వైరాగ్యంలో ఆయన గుత్తికొండ బిలంలోకి వెళ్లారన్నది మరోవాదన.
పల్నాటి యుద్ధం ముగిశాక బ్రహ్మనాయుడి అనుచరులు కాకతీయ మొదటి ప్రతాపరుద్రుని సేవలో చేరారు. ఈ విషయాన్ని ధ్రువపరిచే తామ్రపత్ర శాసనం ఒకటి ‘జర్నల్ ఆఫ్ ఆంధ్రా హిస్టారికల్ సొసైటీ’ లో ప్రచురితమైందని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ హైమావతి బీబీసీతో చెప్పారు.
అయితే, యుద్ధం తర్వాత నాగమ్మ ఏమయ్యారనే విషయంలో ప్రామాణికమైన చారిత్రక ఆధారాలు లభించలేదు.

యుద్దం తర్వాత నాగమ్మ తన పుట్టింటికి వచ్చిందా?
పల్నాటి యుద్ధం తర్వాత పుట్టిల్లు ఆరవెల్లికి నాగమ్మ వచ్చి, తన వృద్ధాప్యాన్ని గడిపారనే ప్రస్తావన బుడగ జంగాలు, బొబ్బిలి వారు వినిపించే జానపద గాథల్లో ఉంది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంలో ‘నాయకురాలు’ పేరుతో గ్రామదేవత గుడి ఉంది. జీవిత చరమాంకంలో నాగమ్మ నివసించిన ఇల్లు ఇది అని, ఆమె తిరిగి తన పుట్టిన ఊరికే వచ్చిందనడానికి ఈ గుడే ప్రామాణికమని కొందరు చరిత్రకారులు చెబుతారు.
అయితే, శిథిలావస్థకు చేరిన పాత గుడి స్థానంలో నిరుడు కొత్తది నిర్మించారు. ఈ గుడి భూమి లోపల ఉంది. ఉపరితలం నుంచి కిందికి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి.
ఈ ఆలయంలోని కర్ర విగ్రహం ‘నాయకురాలు తల్లి’ పేరుతో పూజలందుకుంటోంది. గుడి ఉన్న ప్రాంతాన్ని ‘నాయకురాలి వాడ’ గా పిలుస్తారు.
ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఆషాడ మాసంలో ‘దిష్టికుమ్మం’ పేరుతో స్థానికులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
తమ్మళి/తంబళి కులానికి చెందిన నాలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఈ గుడి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
‘మా పెద్దలు చెప్పిన ప్రకారం.. కాలక్రమంలో ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతం మట్టితో కప్పబడి ఉండేది. అక్కడ వ్యవసాయం చేసేవారు. మద్దులపల్లి గ్రామానికి చెందిన మహిళకు పూనకం వచ్చి పాతాళంలో ఉన్న తన(నాయకమ్మ)ను తవ్వితీయాలని చెప్పింది. అప్పుడు భూగృహంలో ఏడు మెట్లతో నిర్మించిన గుడి బయటపడింది’ అని నాయకురాలు గుడి పూజారి నగునూరి రామయ్య బీబీసీతో చెప్పారు.

‘’బ్రహ్మనాయుడుతో పోరాడిన పల్నాటి నాగమ్మే ఈ నాయకురాలు అని ఈ మధ్య కొందరు చెబితే విన్నాం. అయితే, నాగమ్మ మాకు గ్రామ దేవతగానే తెలుసు. స్థానికులు ‘నాయకమ్మ తల్లి’ అనే పిలుస్తారు. గుడి చరిత్రకు సంబంధించిన ప్రామాణిక ఆధారాలు మా దగ్గర లేవు’’ అని రామయ్య వివరించారు.
నాయకురాలి గుడి ఆవరణలో చేతిలో కత్తి, డాలుతో ఉన్న శిల్పం నాగమ్మదే అని కొంతమంది నమ్ముతారు.
అయితే, అది రాష్ట్రకూట శైలిలో ఉన్న ‘స్త్రీ నాగ శిల్పం’ అని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో చెప్పారు.
‘నాగదేవత విగ్రహం నాయకురాలిదే అనేది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం. పాముకాటు, శత్రువులు, రోగాల నుంచి గ్రామాన్ని కాపాడాలని సంతానం కోసం నాగదేవతను ఆరాధించే పద్ధతి పూర్వం ఉంది. నాగమ్మ ఆరవెల్లిలో పుట్టారని, చరమాంకంలో ఇక్కడే శివైక్యం చెందారని, ఆమెపై గౌరవంతో గుడి కట్టారని చెబుతుంటారు. ఇది ఐతిహ్యం (అనాదిగా నమ్ముతుండటం). దీనికి శాసన ఆధారాలు లేవు’ అని ప్రముఖ చరిత్ర పరిశోధకులు ‘ఈమని శివనాగి రెడ్డి’ బీబీసీతో తెలిపారు.
‘నాయకురాలు స్వగ్రామం తిరిగి వచ్చిందన్నది ఒక ఊహ మాత్రమే. అయితే, ఊరి పేరు ‘ఆరవెల్లి నాగమ్మ’ గా పిలవడం, తండ్రి చౌదరి రామిరెడ్డికి సంబందించిన చౌదరి శాఖ రెడ్డి కులస్తులు తెలంగాణలోని ఈ ప్రాంతంలోనే ఉండటం, నాయకురాలు పేరుతో ఉన్న గుడి.. ఈ అంశాలన్నీ నాగమ్మది ఆరవెల్లి గ్రామం అనడానికి సరిపోలుతున్నాయి’ అని చరిత్ర పరిశోధకులు, రచయిత ‘మలయశ్రీ’ అంటున్నారు.
నాగమ్మ ఆరవెల్లిలో పుట్టి పల్నాడుకు వలస వచ్చారని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బారావు, గురజాల ప్రాంతానికి చెందిన నాటక రచయిత, పరిశోధకులు గుర్రం చెన్నారెడ్డిలు ‘తెలుగు వీరగాథ కవిత్వం’ (పలనాటి వీరకథా చక్రం), ‘పలనాటి చరిత్ర’ లో నిర్ధారించారు.

పల్నాటి యుద్దం తర్వాత నాగమ్మ తిరిగి కత్తిపట్టిందా?
యుద్ధ వైరాగ్యంతో పల్నాటి నుంచి స్వగ్రామం ఆరవెల్లికి వచ్చిన నాగమ్మ స్థానికులకు యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చి ఆ ప్రాంతంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న దోపిడీ దొంగలు, బందిపోట్లతో యుద్దం చేశారని బొబ్బిలి, బుడగ జంగాల కులస్తులు ‘కొండల రాయుని కథ’లో చెబుతుంటారు.
‘ఏడేండ్ల ప్రాయంల ఎగిరిపోయిన చిలక
యాడుందో ఏమైందో ఎరికలేక పోయెరా
ముసల్దయి వచ్చింది అమ్మోరి తీరునా
అందరినీ పసిగట్టి అడిగించినాది
నాయకురాలై నడిపించినాది.’’
పల్నాడు ప్రాంతానికి చెందిన చరిత్ర పరిశోధకులు ‘గుర్రం చెన్నారెడ్డి’ బుడగ జంగాల కథ ఆధారంగా రాసిన తన పరిశోధన గ్రంథం ‘పల్నాటి చరిత్ర’లో ఈ అంశాన్ని వివరించారు.
‘ఒకరోజు ఒంటరిగా ఒక వృద్ధ స్త్రీ ఆయుధాలతో గుర్రం మీద ఆ ఊరు చేరింది. కొండల రాయుడి భయంతో ఉన్న గ్రామస్తులు పిలిచినా దగ్గరకు రాలేదు. రెండు, మూడు రోజుల్లో గ్రామంలోని కొంతమంది మహిళలను దగ్గర చేసుకుని తనది ఆ గ్రామమే అని, తనను నాయకురాలు అని పిలుస్తారని, చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఏడేళ్ల వయసులో తండ్రి, మేనమామతో వలస పోయి అక్కడే అయినవారిని పోగొట్టుకున్నానని చెప్పారు. శక్తి మేరకు అక్కడి ప్రజలకు మేలు చేశానని, యుద్ధంలో ఓ శూరున్ని అశక్తున్ని చేసి అక్కడ ఒంటరిగా ఉండలేక శేషజీవితాన్ని జన్మస్థలంలో గడుపుదామని వచ్చానని తెలిపారు. అందరూ ఏకమైతే కొండల రాయున్ని ఎదిరించవచ్చని, అందుకు సహకరిస్తానని చెప్పి, గ్రామస్తులకు శిక్షణ ఇచ్చారు’ అని పల్నాటి చరిత్రలో ఉంది.
బుడగ జంగాల కథ ప్రకారం.. ‘’నాయకురాలు స్వయంగా ‘బల్మూరు కొండల రాయున్ని’ ఎదుర్కొంటుంది. గుర్రంతో తొక్కించడంతో ఆమె భూమి లోపలికి వెళ్లింది. అందుకే నాయకురాలి గుడి భూగృహంలో ఉంది’’
అయితే, నాగమ్మ కొండల రాయుని చేతిలో మరణించలేదని, జీవసమాధి పొందారన్నది మరో వాదన.
కొండల రాయుని చేతిలో నాగమ్మ మరణం అనేది జానపద గాథే తప్ప చారిత్రక కోణంలో చూస్తే పల్నాటి నాగమ్మ, కొండల రాయిడు తారసపడే అవకాశం లేదన్నది స్థానిక చరిత్రకారుల అభిప్రాయం.

ఫొటో సోర్స్, TWITTER/COLLECTOR PALNADU
నాగమ్మ 12వ శతాబ్దికి చెందిన మహిళ. బల్మూరి కొండలరాయుడు 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వీరిద్దరి మధ్య సుమారు 500 సంవత్సరాల తేడా ఉంది.
‘’నాగమ్మ పల్నాడు నుంచి వైరాగ్యంతో వచ్చారు. పైగా వృద్దాప్యంలో ఉన్నారు. మళ్లీ కొండలరాయునితో యుద్ధం లాంటిది చేయరు. జానపదులు కథను పెంచేందుకు చేసిన ప్రయత్నంగా దీన్ని భావించొచ్చు. జానపదాల్లో బోలెడు కల్పనలు ఉన్నాయి. అయితే వాటికి అవకాశం ఉందా లేదా అన్నది ఆలోచించి మనం సరైనది ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాటితో చరిత్రకు, సమాజానికి ఏదైనా ప్రయోజనమా అనేది కూడా ఆలోచించాలి. కొండలరాయుడు జీవించిన కాలం నాటికే నాగమ్మ ఒక దేవత” అని చరిత్ర పరిశోధకులు మలయశ్రీ అభిప్రాయపడ్డారు.
‘కొండల రాయుడు ఎదుర్కొన్న నాగమ్మ, నాయకురాలు నాగమ్మ ఒక్కరు కాదు. ఆ కాలంలో ఆరవెల్లి నాయకురాలి గుడిలో పూజారిగా పనిచేస్తున్న నాగమ్మ అనే మరో మహిళతో ఆయన తలపడ్డారు. తన తండ్రిని చంపిన ‘కటారి జింకడు’ అనే వ్యక్తిని చంపేందుకు కొండల రాయుడు ఆరవెల్లి వెళ్లారు. కొండల రాయుని జన్మస్థలం మానాల. అది ఆరవెల్లి సమీప గ్రామం కాబట్టే జానపదులు ఈ విషయంలో పొరబడి ఉండవచ్చు’ అని కరీంనగర్‌కు చెందిన విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు డాక్టర్. శ్రీనివాస రాజు అన్నారు.
కొండల రాయుడు జీవితంపై డాక్టర్. శ్రీనివాస రాజు ‘బహద్దూర్ కొండల రాయుడు’ అనే పరిశోధనాత్మక నవల రాశారు.
సుదీర్ఘకాలంగా చెబుతున్న మౌఖిక జానపద సాహిత్యంలోని అంశాలను కొద్దిమేరకు చరిత్ర నిర్మాణంలో స్వీకరించవచ్చన్న అభిప్రాయాన్ని విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్ హైమావతి బీబీసీతో వ్యక్తంచేశారు.

నాయకురాలికి తగిన ప్రాధాన్యం దక్కలేదా?
శ్రీనాథుని ‘పల్నాటి వీరచరిత్ర’ రచనకు ముందు పల్నాడు కథలన్నీ మౌఖికంగానే ప్రచారం అయ్యాయి. చరిత్రలో పల్నాటి యుద్ధం ప్రాచుర్యం పొందినా సమకాలీన శాసనాల్లో పెద్దగా దాని ప్రస్తావన కనిపించదు.
నాగమ్మ వ్యక్తిత్వంపై చారిత్రక, సాహిత్య రచనల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, మధ్యయుగంలో ఒక రాజ్యానికి ప్రధాన మంత్రిగా ఎదిగిన మహిళగా నాగమ్మకు చరిత్రలో అంతగా ప్రాధాన్యత దక్కలేదన్న అభిప్రాయం కొందరు చరిత్రకారుల్లో ఉంది.
‘ఆ రోజుల్లో ధార్మిక సంస్థల్లో తప్ప రాజ్య పాలనలో మహిళల ప్రవేశం కనిపించదు. స్త్రీ సాత్వికంగా ఉండాలనుకున్నారే తప్ప వ్యూహకర్తగా కాదు. ఆ కాలంలో సామాన్య ప్రజల్లో రాజకీయాల కంటే మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బ్రహ్మనాయుడు, నాగమ్మ సంఘ సంస్కరణలలో పోటీపడ్డారు. అణగారిన వర్గాలు, విధవలకు నాగమ్మ చదువులు చెప్పించారు. విద్యకు మహిళలు అర్హులే అని చాటి చెప్పారు’ అని ప్రొఫెసర్ హైమావతి అన్నారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నేపల్లి గ్రామ శివాలయంలో విధవా పునర్వివాహాలు జరిపే ఆచారం వెనుక నాగమ్మ కృషి ఉందని భావిస్తారు. అయితే, ఈ అంశంపై పరిశోధనలు జరగాల్సి ఉంది.
‘నాగమ్మ తెలంగాణ ప్రాంతంలో పుట్టినా, పల్నాడు ప్రాంతంలోనే ప్రసిద్ది చెందారు. తన పాండిత్యం, త్యాగ గుణంతో గొప్ప స్థాయికి ఎదిగారు. ఆమె జీవితంపై మరింత లోతైన పరిశోధనలు జరపాల్సిన బాధ్యత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వారికే ఎక్కువ ఉంది’ అని పల్నాడు రచయితల సంఘం అధ్యక్షులు వైహెచ్‌కే. మోహన్ రావ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















