11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు రూ. 250తో లాటరీ టికెట్ కొంటే రూ. 10 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలింది!

స్వీట్లు పంచుకున్న లాటరీ విజేతలు

ఫొటో సోర్స్, ARUN CHANDRABOSE

ఫొటో క్యాప్షన్, స్వీట్లు పంచుకున్న లాటరీ విజేతలు

కేరళకు చెందిన 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు తలా కొంత డబ్బులు వేసుకుని ఈ ఏడాది జూన్‌లో ఓ లాటరీ టిక్కెట్టు కొన్నారు.

గతవారం తీసిన ఈ లాటరీ టిక్కెట్ డ్రాలో వీరు ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. ఈ విషయం తెలుసుకుని వారంతా సంతోషంతో పొంగిపోతున్నారు.

ఈ 11 మంది మహిళలు మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి పట్టణంలో నాన్-బయో డీగ్రేడబుల్ చెత్తను ఇళ్ల నుంచి తీసుకెళ్లే వృత్తిలో ఉన్నారు. వీరి రోజువారీ ఆదాయం సుమారు రూ. 250 వరకు ఉంటుంది.

ఇంటి నుంచి చెత్తను తీసుకెళ్లినందుకు స్థానికులు ఇచ్చే డబ్బుతోపాటు, ఈ చెత్తలో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వీరికి ఇస్తుంది.

తాము సంపాదించే డబ్బు సౌకర్యవంతంగా జీవించడానికి ఏమాత్రం సరిపోదని, పిల్లల చదువులు, ఇతర ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఈ మహిళలు చెబుతున్నారు. ఆర్ధిక కష్టాలు తీరతాయన్న ఆశే తమను అప్పుడప్పుడు ఇలా లాటరీ టిక్కెట్ కొనేందుకు పురికొల్పుతోందని వారు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాటరీ చట్టవిరుద్ధం. అయితే, కేరళలో ప్రభుత్వమే లాటరీలు నిర్వహిస్తుంది. ఇక్కడ ప్రైవేటు లాటరీలపై నిషేధం ఉంది.

కేరళలో లాటరీలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళలో లాటరీలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది

కలిసికట్టుగా...

"గతంలో ఒకసారి మేమంతా వెయ్యి రూపాయల లాటరీ గెలుచుకున్నాం. ఆ డబ్బును అందరం షేర్ చేసుకున్నాం’’ అని వీరిలో రాధ అనే మహిళ చెప్పారు. ఆమె తరచూ గ్రూప్‌‌తో కలిసి లాటరీ టిక్కెట్లు కొంటుంటారు.

గత నెలలో, మాన్‌సూన్ బంపర్ ప్రైజ్ లాటరీ (పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో ఈ బంపర్ ప్రైజ్ లాటరీలు ప్రకటిస్తారు.) కోసం 250 రూపాయల టిక్కెట్‌ను కొనుగోలు చేయాలని ఈ గ్రూప్ నిర్ణయించింది.

లాటరీ కోసం రాధ డబ్బులు సేకరిస్తున్నప్పుడు తన దగ్గర డబ్బులు లేనందుకు బాధపడ్డానని 72 ఏళ్ల కుట్టిమల అనే మహిళ అన్నారు.

‘‘చెరుమన్నిల్ బేబీ (గ్రూప్‌లోని మరొక సభ్యురాలు) తన దగ్గర 25 రూపాయలు ఉన్నాయని, నాకు అప్పుగా ఇస్తానని చెప్పింది’’ అని కుట్టిమలు బీబీసీతో అన్నారు.

ఈ ఇద్దరు మహిళలు టిక్కెట్టులో తమ వాటాగా ఒక్కొక్కరు రూ. 12.5 ఇచ్చారు. మిగిలిన 9మంది మహిళలు ఒక్కొక్కరు రూ. 25 చెల్లించారు.

‘‘గెలిస్తే అందరం సమానంగా వాటా తీసుకోవాలని అనుకున్నాం’’ అని కుట్టిమలు అన్నారు. ‘‘ఇంత పెద్ద మొత్తం లాటరీగా తగులుతుందని అనుకోలేదు’’ అన్నారామె.

కేరళ లాటరీ

ఫొటో సోర్స్, ARUN CHANDRABOSE

ఫొటో క్యాప్షన్, చెరుమన్నిల్ బేబీ(కుడి) కుట్టిమలు(ఎడమ)కు రూ.12.5 అప్పుగా ఇచ్చారు.

లాటరీ తగిలిందని కూడా తెలియదు

డ్రా తీసిన మరుసటి రోజుకుగాని తమకు లాటరీ తగిలిందన్న విషయం వారికి తెలియ లేదు. అది కూడా గ్రూప్ సభ్యురాలైన ఓ మహిళ, లాటరీ ఫలితాలు ఏమయ్యాయో కనుక్కోవాలని తన భర్తను కోరిన తర్వాతే ఈ విషయం వారికి తెలిసింది.

"ఈ బంపర్ ప్రైజ్ కోసం లాటరీ టిక్కెట్ కొనడం ఇది నాలుగోసారి. ఇప్పటికి అదృష్టం తగిలింది.’’ అని రాధా అన్నారు.

జాక్‌పాట్ కొట్టేశామంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని 62 ఏళ్ల బేబీ అనే మహిళ అన్నారు. ‘‘నా జీవితంలో అదృష్టం ఎప్పుడూ లేదు’’ అన్నారామె.

2018లో కేరళలో సంభవించిన భారీ వరదలకు బేబీ ఇల్లు కొట్టుకుపోయింది. ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుని, అప్పులు తీర్చాలని ఆమె భావిస్తున్నారు.

గ్రూపులో చాలామంది నుంచి దాదాపు ఇలాంటి కథలే వినిపించాయి.

కేరళ లాటరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక సందర్భాలలో కేరళలలో బంపర్ లాటరీలు ప్రకటిస్తారు

ఒక్కొక్కరిది ఒక్కో కథ

50 ఏళ్ల బిందు భర్త గత ఏడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం వారి దగ్గర డబ్బు లేకపోయింది.

‘‘డయాలసిస్ కోసం దాచుకున్న డబ్బుతో ఆయన లాటరీ టిక్కెట్లు కొనేవారు. ఇల్లు కూడా పూర్తి కాకుండా ఉండిపోయింది. నేను ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలి" అన్నారు బిందు.

15 ఏళ్ల తన కూతురును బాగా చదివించాలని బిందు భావిస్తున్నారు.

లాటరీ గెలవడానికి ముందు రోజు రాత్రి వరకు కూడా తాను కుటుంబ భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నానని 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళ అన్నారు. ఆమె భర్త భవన నిర్మాణ కార్మికుడు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఆయనకు పని కూడా దొరకడం లేదని ఆమె చెప్పారు.

ఇప్పుడు వచ్చిన డబ్బును కూతురి చదువుల కోసం ఖర్చు పెడతామని ఆ దంపతులు దీమాగా చెబుతున్నారు.

కూతురు ఆపరేషన్‌కు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా అని 56 ఏళ్ల లీలా కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నారు. ‘‘ మా అమ్మాయి పెళ్లి కోసం ఇప్పటికే ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాను’’ అన్నారామె.

వీడియో క్యాప్షన్, వీడియో: మహిళా పారిశుధ్య కార్మికులకు రూ. 10 కోట్ల లాటరీ

ఎవరికి ఎంతెంత?

ఈ లాటరీ ద్వారా వచ్చిన డబ్బులో ట్యాక్సులు పోగా. రూ. 6.3 కోట్లు ఈ గ్రూప్‌కు దక్కుతాయి. ఈ 11 మందిలో ఇద్దరు మహిళలు రూ.63 లక్షలను చెరిసగం పంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వారందరికీ ఒక్కొక్కరికి రూ. 63 లక్షలు దక్కుతాయి.

చెత్తను ఏరివేసే పనే కాకుండా, టాయిలెట్లు, వ్యర్థాలను చేర్చే భవనాల నిర్మాణంలో ఈ మహిళలంతా సాయపడుతుంటారని, కేరళలో ఈ కార్మికులను సమన్వయం చేసే సంస్థ సుచిత్వ మిషన్‌ డైరెక్టర్ కె.టి. బాలభాస్కరన్ చెప్పారు.

తమ జీవితాలను మార్చేసే బంపర్ లాటరీ తగిలిన ఒక రోజు తర్వాత, వాళ్లు యథావిధిగా తమ ఏజెన్సీ ఆఫీసుకు వచ్చారు.

‘‘మేం ఒకటే నిర్ణయించుకున్నాం. చేస్తున్న పనిని మానేసే ఉద్దేశం లేదు. ఇందులోని సమష్టి తత్వమే మాకు ఇంత సంపదను తెచ్చిపెట్టింది’’ అన్నారు గ్రూపు సభ్యురాలైన లీల.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)