సుప్రీంకోర్టు: 34 మంది న్యాయమూర్తులు, ఏడాదికి 1,000 తీర్పులు, 70,000 పెండింగ్ కేసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కోర్టుగా ప్రశంసలు అందుకునే భారత సుప్రీంకోర్టుకు అంతటి కీర్తి రావడానికి కారణాలున్నాయి.
73 ఏళ్ల చరిత్ర గల ఈ సర్వోన్నత న్యాయస్థానం కార్యనిర్వాహక చట్టాలను, పార్లమెంటరీ చట్టాలనే కాదు రాజ్యాంగ సవరణలనూ రద్దు చేసే శక్తి ఉంది.
అంతేకాదు, తనంతట తాను కేసు మొదలుపెట్టే అధికారం, కేసులలో కక్షిదారులకు అవసరమైతే సాయం చేయడానికి ‘ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్’ను ఏర్పాటుచేయడం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు పొరపాట్లు జరగకుండా తమకు అవసరమైన సలహాలు అందించేందుకు నిపుణుల కమిటీలను నియమించడం వంటి విశిష్ట అధికారాలూ భారత సుప్రంకోర్టుకున్నాయి.
ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు 70,000 పెండింగ్ కేసుల భారం మోస్తూ ఏడాదికి సుమారు వెయ్యి తీర్పులిస్తుంది.
అయితే, విశేష అధికారులు ఉన్నప్పటికీ ‘సుప్రీంకోర్టు సంక్షోభంలో ఉంది’ అని ‘కోర్ట్ ఆన్ ట్రయల్’ పుస్తకంలో రచయితలు అపర్ణ చంద్ర, సీతల్ కలంత్రి, విలియం హెచ్‌జే హబర్డ్ పేర్కొన్నారు. దీనికి కారణం పెండింగు కేసులేనని, కక్షిదారులను పెండింగ్ కేసులు ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నాయని వారు పేర్కొన్నారు.
సుమారు 10 లక్షల కేస్ రికార్డుల ఆధారంగా తయారుచేసిన 5 ప్రత్యేకమైన డాటా సెట్స్ నుంచి ఈ ముగ్గురు లా స్కాలర్స్ అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
- 2018 నవంబరు నాటికి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో 40 శాతం అయిదేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 8 శాతం కేసులు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయి. 2004తో పోల్చినప్పుడు అయిదేళ్లుగా పెండింగులో ఉన్న కేసుల సంఖ్య 7 శాతం పెరిగింది.
- ట్రయల్ కోర్టులో మొదలై సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ఒక్కో కేసుకు సగటున 13 సంవత్సరాల 6 నెలల కాలం పడుతోంది. ఇందులో మూడో వంతు కాలం ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులోనే ఉంటోంది.
- కేసుల పరిష్కార కాల వ్యవధిలో గణనీయమైన తేడాలు కనిపించాయి. కొన్ని కేసులు సుప్రీంకోర్టులో రిజల్యూషన్‌కు రావడానికి నాలుగేళ్లు పడుతుండగా మరికొన్ని కేసులు దాఖలవడం నుంచి తీర్పు/ఆదేశాలు వెలువడడం వరకు మూడు నెలల సమయం పడుతోంది. ఎక్కువగా పన్ను వ్యవహారాలకు సంబంధించిన కేసులలో సుమారు నాలుగేళ్ల సమయం పడుతోంది.
- 2018 నవంబరు నాటికి రాజ్యాంగ ధర్మాసనాలలోని కేసులు సగటున ఎనిమిదన్నరేళ్లుగా పెండింగులో ఉన్నాయి. రాజ్యంగ ధర్మాసనాలు సాధారణంగా చట్టపరమైన మీమాంసలపై పనిచేస్తుంది. ఏడుగురు సభ్యుల ధర్మాసనాల్లో కేసులు కొన్ని 16 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. అయిదుగురు అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులుండే పెద్ద ధర్మాసనాలు సాధారణంగా భారత రాజ్యాంగం ఏదైనా అంశంపై ఇచ్చే వివరణకు సంబంధించి తలెత్తే ప్రశ్నలను విని ఆ వివరణల అసలు అర్థమేంటనేది నిర్ణయిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు పెండింగ్ లిస్ట్‌లో 90 శాతం స్పెషల్ లీవ్ పిటిషన్స్(ఎస్ఎల్‌పీ) ఉన్నాయి. ఎస్ఎల్‌పీ ద్వారా ఎలాంటి కేసులు తీసుకోవచ్చనే విషయంలోనూ స్పష్టతలేదని ఈ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
‘పిక్ అండ్ చూజ్ మోడల్’లో కేసుల స్వీకరణ జరుగుతోందని, దానివల్ల కొన్ని కేసులు చాలా వేగంగా ముందుకొచ్చి విచారణ పూర్తి చేసుకుంటుండగా మరికొన్ని లిస్ట్‌లో సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉండిపోతున్నాయని వీరు చెప్తున్నారు.
ఈ సందర్భంగా అధ్యయనకర్తలు 2020 నాటి ఓ రిట్ పిటిషన్‌ను ఉదహరించారు. తన కేసుపై తగిన శ్రద్ధ పెట్టకుండా ఓ జర్నలిస్ట్ బెయిల్ అభ్యర్థనకు సుప్రీంకోర్ట్ ప్రాధాన్యమిచ్చిందని పేర్కొంటూ పిటిషనర్ ఆ రిట్ దాఖలు చేశారు. అయితే, ఆ జర్నలిస్ట్ కేస్‌ను ‘మీడియా స్వేచ్ఛ’కు సంబంధించినదిగా పరిగణించి ప్రాధాన్యమిచ్చామంటూ న్యాయమూర్తులు సమర్థించుకుంటూ రిట్ పిటిషన్ కొట్టివేశారని ఈ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై ఆంక్షలను సమీక్షించడానికి న్యాయస్థానం ఆదేశించిన మెకానిజం అమలుకాకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌కు ఇలాంటి ప్రాధాన్యం లభించకపోవడం.. అది లక్షల మంది ప్రజలకు సంబంధించిన సమస్య కావడంతో ఈ రెండు కేసులను పోల్చుతూ ప్రజల్లో చర్చ జరిగిందని ‘కోర్ట్ ఆన్ ట్రయల్’ పుస్తకంలో రచయితలు పేర్కొన్నారు.
భారీ మొత్తంలో పేరుకుపోయిన కేసులను కారణంగా చూపుతూ న్యాయవ్యవస్థ క్లిష్టమైన కేసులను లిస్ట్ చేయకుండా తప్పించుకోవడానికి అవకాశమేర్పడుతోందని.. ఈ రకమైన ‘న్యాయ ఎగవేత’ వల్ల ముఖ్యమైన కేసులు మరుగునపడుతూ సాధారణ, రోజువారీ కేసులపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు అవుతోందన్నారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
దీనికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ బయోమెట్రిక్ ఐడీ స్కీమ్‌ను చాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వకుండానే కోర్టు తన నిర్ణయం వెలువరించడానికి అయిదేళ్ల సమయం తీసుకుంది.
దీంతో తీర్పు వచ్చేటప్పటికి వంద కోట్ల కంటే ఎక్కువ మంది ఆధార్ నమోదైంది. అయితే, 2018లో ఈ కేసుపై కోర్టు తీర్పు వెలువరిస్తూ ఆధార్‌ను సమర్థిస్తూ, అది రాజ్యాంగబద్ధమైనదని, గోప్యత హక్కునేమీ ఉల్లంఘించలేదని పేర్కొంది.
అనంతరం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే మార్గమైన ఎలక్టోరల్ బాండ్లను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, ఎవరికి విరాళంగా ఇచ్చారనే విషయంలో పబ్లిక్ రికార్డ్ లేదంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు సుమారు ఏడాది పాటు సాగిన తరువాత 2019 ఎన్నికలకు ముందు విచారణకు వచ్చిందని.. ఈ ఏడాది ప్రారంభంలో ఇది మళ్లీ విచారణకు వచ్చిందని.. రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని రిఫర్ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉందని రచయితలు పేర్కొన్నారు.
‘రాజకీయంగా సెన్సిటివ్ అయిన కేసులను విచారించకుండా ఎగవేయడానికి పెండింగ్ కేసులనేవి న్యాయవ్యవస్థలో ఉన్నవారికి రక్షణగా మారుతున్నాయి’ అని హార్వర్డ్ లా స్కూల్‌కు చెందిన నిక్ రాబిన్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇలాంటి ధోరణి న్యాయ ఎగవేత విమర్శలకు తావిస్తోంది అని సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ నాతో చెప్పారు. అయితే, కోర్టులు కొన్ని వివాదాస్పద అంశాలను విచారణకు స్వీకరించిన, పరిష్కరించిన సందర్బాలూ ఉన్నాయని నేను అంగీకరించాలి’ అన్నారు రాబిన్సన్.
భారతదేశ సుప్రీంకోర్టు మూడంచెల న్యాయవ్యవస్థకు పెద్ద పీట వేసింది. జిల్లా కోర్టులు, హైకోర్టులు ఆపై మూడో అంచెలో సుప్రీం కోర్టు ఉంటుంది. దిగువ న్యాయస్థానాలు ఎక్కువ కేసులను పరిష్కరించాలని, కొన్ని చట్టపరమైన సమస్యలను మాత్రమే రిజర్వ్ చేయాలని ఈ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
అయితే, ఈ సమస్యలో హైకోర్టుల పాత్రా ఉందని లోకూర్ అన్నారు. ‘హైకోర్టులు ఇచ్చే కొన్ని తీర్పులు అవుట్ ఆఫ్ సింక్. దాంతో సుప్రీంకోర్టుకు వాటిపై వచ్చే అప్పీల్‌లో జోక్యం చేసుకోక తప్పని పరస్థితి’ అన్నారు లోకూర్. కాగా దేశంలోని 25 హైకోర్టులలో 60 లక్షల కేసులు పెండింగులో ఉన్న విషయాన్నీ పరిగణణలోకి తీసుకోవాలి.
కాగా మొత్తంగా చూస్తే దేశంలోని అన్ని రకాల కోర్టులలో సుమారు 5 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. ‘సుప్రీంకోర్టు స్వయంగా తన పరిధిలోని పెండింగ్ కేసులను వీలైనంత వేగం పరిష్కరించాలి’ అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోకూర్.
ఇవి కూడా చదవండి:
- ‘రాహుల్‌కు పెళ్లి చేస్తాం, అమ్మాయి ఉంటే చెప్పండి’: హరియాణా మహిళలతో సోనియా గాంధీ వ్యాఖ్యలు
- అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్‌కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు
- మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు
- ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? మలబద్ధకం ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి?
- వెయిట్ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














