భారత క్రికెట్‌లో కాసుల వర్షం... బీసీసీఐ ఆదాయం ఎంత పెరిగిందంటే?

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చంద్రశేఖర్ లుథ్రా
    • హోదా, సీనియర్ స్టోర్ట్స్ రిపోర్టర్, బీబీసీ హిందీ

క్రికెట్ ప్రపంచంలో ఈ మధ్య కాలంలో యాషెస్ సిరీస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు వెస్టిండీస్‌లో భారత క్రికెట్ జట్టు ఆటపై కూడా చర్చలు సాగుతున్నాయి.

ఈ సమయంలోనే, రాబోయే నెలల్లో భారత్‌లో జరగబోయే ప్రపంచ కప్‌కూ సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ప్రపంచ కప్ జరిగేందుకు ఇంకా కొన్ని నెలలే మిగిలి ఉంది.

దీని కోసం ఈ నెలలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన సమావేశంలో, రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ బోర్డు ఆధిపత్యాన్ని అలానే కొనసాగించాలని నిర్ణయించారు.

డర్బన్‌లో ఈ నెలలో జరిగిన సమావేశం అనంతరం ఐసీసీ వార్షికాదాయం నుంచి భారత క్రికెట్ బోర్డుకి 38.5 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ మొత్తం సుమారు 231 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఈ వాటా విలువ సుమారు రూ. 2,000 కోట్లు.

పదేళ్ల క్రితమే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడు దేశాలకు కలిపి ఇంత వాటా ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్. శ్రీనివాసన్ డిమాండ్ చేశారు.

ఆయన ప్రతిపాదన అమల్లోకి రానప్పటికీ, శ్రీనివాసన్ డిమాండ్ మేరకు ఐసీసీ ఆదాయం నుంచి 2015 నుంచి 2023 మధ్య కాలంలో బీసీసీఐ 22 శాతం వాటాను పొందింది.

బీసీసీఐ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

2015లో ఐసీసీ చీఫ్‌గా శశాంక్ మనోహర్ పదవిలోకి వచ్చిన తర్వాత, మూడు దేశాలకు అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే విధానాన్ని వెనక్కి తీసుకున్నారు.

దీని వల్ల సంపన్న బోర్డులు మరింత సంపన్నమైనవిగా మారుతాయి, పేద బోర్డులు మరింత చతికిల పడతాయని ఆయన చెప్పారు.

ఐసీసీ కొత్త మార్పులో ఇతర సభ్య దేశాలు ఏ మేరకు వాటాను పొందనున్నాయో వివరాలను బయటికి వెల్లడించలేదు.

కానీ, ప్రతి సభ్య దేశం కూడా అంతకుముందు కంటే ఎక్కువ మనీనే పొందనుందని ఐసీసీ తెలిపింది.

ప్రస్తుతం బీసీసీఐ 38.5 శాతం వాటాను పొందనుంది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు పొందుతున్న 41 మిలియన్ డాలర్ల కంటే బీసీసీఐ పొందే మొత్తం ఆరింతలు ఎక్కువ.

అంటే, ఐసీసీ ఆదాయాల నుంచి క్రికెట్ బోర్డులు పొందే వాటాలో, 6.89 శాతం వాటాతో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు రెండో స్థానంలో ఉంది.

ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా బోర్డు 6.25 శాతం వాటాతో 37.53 మిలియన్ డాలర్లను పొందనుంది.

రెండు, మూడవ క్రికెట్ బోర్డులు కలిపి ఆర్జించే మొత్తం కంటే కూడా మూడు రెట్లు ఎక్కువగానే భారత క్రికెట్ బోర్డు ఆదాయాన్ని పొందనుంది.

ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఆదాయాల నుంచి 5.75 శాతం వాటాను అంటే 34.5 మిలియన్ డాలర్లను ఆర్జించనుంది.

బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాల క్రికెట్‌ బోర్డులు ఐదు శాతం కంటే తక్కువ వాటాలనే పొందనున్నాయి.

ఈ ఆదాయాల వాటాను చూసిన తర్వాత, ప్రతి ఒక్కరికీ బీసీసీఐ ఇంత భారీ మొత్తం వాటాను ఎలా పొందగలుగుతుందనే ప్రశ్న రావొచ్చు.

దీనికి సమాధానం కూడా మీకు బాగా తెలుసు.

చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తన ఆదాయంలో 70 నుంచి 80 శాతం వరకు భారత మార్కెట్ నుంచే ఆర్జిస్తోంది.

అయితే, ఇతర బోర్డులతో పోలిస్తే బీసీసీఐ ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి అంత ఆదాయం ఉండదు.

దీనికి ప్రధాన కారణం, ఐసీసీ టోర్నమెంట్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను రాయితీలను బీసీసీఐ పొందడం లేదు.

రాయితీలు ఇవ్వకపోతే రూ.955 కోట్ల నష్టం

క్రికెట్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

సౌరభ్ గంగూలీ చైర్మన్‌గా ఉన్న సమయంలో, 2023లో ప్రపంచ కప్ నిర్వహించేందుకు బీసీసీఐకి పన్ను రాయితీలు ఇవ్వకపోతే బోర్డు రూ.955 కోట్ల వరకు నష్టపోతుందని అంచనావేశారు.

మ్యాచ్‌ల ప్రసారాల నుంచి ఆర్జిస్తోన్న ఆదాయంపై 21.84 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భారత్‌లో పన్ను నిబంధనల ప్రకారం, ఏ రకమైన రాయితీకి కూడా ఎలాంటి నిబంధన లేదు. ఈ కారణంతో, 2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా బీసీసీఐ రూ.193 కోట్లను కట్టాల్సి వచ్చింది.

పన్నుకు సంబంధించిన అంశం ఐసీసీ ట్రిబ్యూనల్‌లో ఉందని చెప్పినప్పటికీ, బీసీసీఐ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.

సౌరభ్ గంగూలీ, జై షాలు తమ పదవీ కాలంలో ఈ మొత్తం అంశాన్ని సరైన విధానంలో హ్యాండిల్ చేయలేకపోయారని విమర్శలు కూడా వచ్చాయి.

గత ఏడాది వీరిద్దరూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

ఆ సమయంలో కూడా బీసీసీఐ నికర లాభంపై కాకుండా మొత్తం ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఐసీసీ నిబంధనల మేరకు, ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు ఆతిథ్యమిస్తోన్న దేశం ప్రభుత్వం నుంచి రాయితీలు పొందవచ్చు. కానీ, ఈ విషయంపై బీసీసీఐకి స్పష్టత లేదు.

బీసీసీఐ సెక్రటరీగా జై షా ఈ విషయంలో చివరి నిమిషంలోనైనా ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

అత్యధిక పన్నులు బీసీసీఐకి భారం కాకుండా చూసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమాన జీతాలు ఇవ్వాలని నిర్ణయం

క్రికెటర్లకు జీతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయాల పంపిణీతో పాటు, మరో కీలక నిర్ణయాన్ని కూడా ఐసీసీ సమావేశంలో తీసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లన్నంటిలో ఇక నుంచి పురుషులు, స్త్రీలు ఇద్దరూ కూడా సమానమైన ప్రైజ్ మనీని పొందనున్నారు.

అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఒకే విధంగా మ్యాచ్ ఫీజులు ఉండేలా గత సంవత్సరమే బీసీసీఐ సెక్రటరీ జై షా అమల్లోకి తెచ్చారు.

ఈ ప్రకటన సందర్భంగా కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి.

పురుషులు, మహిళల క్రికెట్‌లో అన్ని అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు సమానమైన మ్యాచ్ ఫీజులు ఉండాలని నిర్ణయించినప్పటికీ, ఇరు టీమ్‌ల ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లు, మ్యాచ్‌ల సంఖ్య విషయంలో చాలా తేడా ఉంది.

పైన పేర్కొన్న వాదన ఉన్నప్పటికీ, దీన్ని మహిళలు, పురుషుల క్రికెట్‌లో సమానత్వం దిశగా పడిన కీలక అడుగుగా పరిగణించవచ్చు.

2019లో 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో, చాంపియన్ అయినందుకు ఇంగ్లాండ్‌కు రూ.28.4 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

రన్నర్ అప్ అయిన న్యూజీలాండ్ రూ.14.2 కోట్లను పొందింది.

మహిళల ప్రపంచ కప్‌లో 2022 చాంపియన్ అయిన ఆస్ట్రేలియా టీమ్ కేవలం రూ.10 కోట్లనే ప్రైజ్ మనీగా పొందగా, రన్నర్ అప్ అయిన ఇంగ్లాండ్‌ రూ.4.5 కోట్లను దక్కించుకుంది.

2030 నాటికి అన్ని టోర్నమెంట్ల ప్రైజ్ మనీ మహిళలకు, పురుషులకు సమానంగా ఉంటాయని ఐసీసీ తెలిపింది.

క్రికెట్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

పెరగనున్న టీ20 లీగ్స్ సంఖ్య

ఐసీసీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే టీ20 లీగ్‌ల విషయంపై కూడా చర్చ జరిగింది.

ప్రతిపాదనల ఆమోదం మేరకు టీ20 క్రికెట్ లీగ్‌లపై ఎలాంటి పరిమితులు విధించకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు.

దీనిలో ఐఎల్‌టీ 20, కెనడా ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లు ఉన్నాయి.

పెరగనున్న టీ20 లీగ్‌ల దృష్ట్యా, నిపుణులైన టీ20 క్రికెటర్లు తమ సంబంధిత జట్లకు పదవీ విరమణ ప్రకటించకుండా పెద్ద సంఖ్యలో ఈ టోర్నమెంట్లలో పాల్గొనేలా ప్రొవిజన్లను సిద్ధం చేశారు.

ఇటీవల మేజర్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను అమెరికాలో కూడా ఆడుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా కూడా ఇలాంటి లీగ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో ఐసీసీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌ను సంరక్షించి, సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నిస్తోంది.

లీగ్‌ని నిర్వహించే బోర్డు కూడా విదేశీ ఆటగాళ్ల బోర్డుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)