సౌరభ్ గంగూలీ పుట్టినరోజు: భారత క్రికెట్‌ చరిత్రలో 'దాదా'గా నిలిచిన మాజీ కెప్టెన్ కథ

సౌరభ్ గంగూలీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పోతిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''గంగూలీ భారత జట్టుకు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. ఆటగాడి ప్రతిభను గుర్తించడం, ఆ తర్వాత ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం గంగూలీకి తెలుసు. ఈ కారణంగానే గంగూలీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు''.

గంగూలీ 50వ పుట్టినరోజు సందర్భంగా గతంలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పిన మాటలివి.

సౌరభ్ గంగూలీ

ఫొటో సోర్స్, Getty Images

'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా'

గంగూలీని 'మహారాజా ఆఫ్ ఇండియన్ క్రికెట్', 'గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్', 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా', 'దాదా' అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.

జులై 8న సౌరభ్ గంగూలీ పుట్టినరోజు.

గంగూలీ మైదానంలో దూకుడు, అభిరుచి, కోపం కలగలిసిన ఆటగాడు.

భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో సౌరభ్ గంగూలీ ఒకడు.

దాదా కెప్టెన్‌గా ఉన్న 2000 నుంచి 2005 వరకు భారత జట్టుకు ‘స్వర్ణయుగం’ అని అంటారు.

తర్వాత కాలంలో కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, గంగూలీ బాటలోనే ప్రయాణించి జట్టుకు ప్రపంచకప్ అందించాడనే వాదన ఉంది.

యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ధోనీ తదితరులు సౌరవ్ ఆధ్వర్యంలోనే రాటుదేలారు.

2000వ సంవత్సరంలో' క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్' ప్రకంపనలతో భారత జట్టు తన ప్రాభవాన్ని కోల్పోయింది. క్రికెట్‌కు అభిమానుల ఫాలోయింగ్‌ కూడా తగ్గిపోయింది.

అనంతరం భారత క్రికెట్‌ను పునర్నిర్మించి, ఉన్నతంగా తీర్చిదిద్ది, యువకులను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ అంటే అతిశయోక్తి కాదు.

ధోనీ నాయకత్వంలోప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గంగూలీ నేతృత్వంలో జట్టులోకి వచ్చిన వారే.

టీమిండియా క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫుట్‌బాల్ నుంచి క్రికెట్ వరకు..

గంగూలీ 1972 జులై 8న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించాడు. తండ్రి చండీదాస్, తల్లి నిరుపమా గంగూలీ.

కోల్‌కతాలోని సంపన్న కుటుంబంలో పుట్టిన గంగూలీకి చిన్నప్పుడు ఫుట్‌బాల్ ఆటపై మక్కువ ఉండేది.

కానీ గంగూలీ అన్నయ్య స్నేహాశీష్ క్రికెట్ ఆడటం చూసి గంగూలీ క్రికెట్ వైపు దృష్టి సారించాడు.

అయితే గంగూలీ జీవితం క్రీడల చుట్టూ తిరగడం తల్లి నిరుపమకు ఇష్టం లేదు.

కానీ, సోదరుడు స్నేహాశీష్ అండగా నిలవడంతో సౌరభ్ సరైన క్రికెట్ శిక్షణ పొంది గొప్ప ఆటగాడిగా ఎదిగాడు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్‌లో ఎడమ చేతికి ఎందుకు మారాడు?

గంగూలీ క్రికెట్ శిక్షణ తీసుకున్నప్పుడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. అయితే కుడిచేత్తో బ్యాటింగ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించడంతో ఎడమ చేతికి మారాడు.

బ్యాటింగ్ సాధన ఎక్కువ సేపు ఎడమ చేతితో చేయాల్సి రావడంతో అది కూడా గంగూలీకి ఇబ్బందికరంగా మారింది. ఆ రోజుల్లో సెయింట్ జేవియర్స్ స్కూల్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు గంగూలీ

అయితే అండర్-15 క్రికెట్‌లో ఒడిశాపై ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేసి, సెంచరీ సాధించాడు. దీంతో ఎడమ చేయి వాటమే సరైనదని గ్రహించాడు సౌరభ్.

అనంతరం గంగూలీ 1989లో బెంగాల్ జట్టుకు ఎంపికయ్యాడు. 1990-91 రంజీ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు సౌరభ్.

1992లో అజారుద్దీన్‌ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది.

బ్రిస్బేన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ తరఫున 19 ఏళ్ల గంగూలీ అరంగేట్రం చేశాడు.

కపిల్ దేవ్, శ్రీకాంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో మైదానంలోకి దిగిన గంగూలీ, తొలి గేమ్‌లో 6వ ఆటగాడిగా వచ్చి 3 పరుగులకే అవుటయ్యాడు.

తొలి మ్యాచ్‌లోనే కఠిన పరీక్ష ఎదుర్కొన్న గంగూలీని సిరీస్ అనంతరం జట్టు నుంచి తప్పించారు.

గంగూలీ

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్‌పై వరుసగా సెంచరీలు

1993, 1994, 1995 రంజీ ట్రోఫీ సీజన్లలో గంగూలీ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దీంతో మళ్లీ అందరి దృష్టిలో పడ్డాడు.

ముఖ్యంగా 1995-96లో దులీప్ ట్రోఫీలో గంగూలీ 171 పరుగుల భారీ స్కోరు సాధించడంతో భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాడు.

1996లో గంగూలీ ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఓడిపోయింది. ఆ టెస్టులో గంగూలీకి ఆడే అవకాశం దక్కలేదు.

అయితే, రెండో టెస్టుకు ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అకస్మాత్తుగా ఇండియాకు తిరిగి వచ్చాడు. దీంతో అతని స్థానంలో గంగూలీ ఓపెనర్‌గా బరిలో దిగాడు.

ఆ సిరీస్‌లో టెస్టు మ్యాచ్‌లలో అరంగ్రేటం చేసిన సౌరభ్ వరుసగా రెండు సెంచరీలు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 131 పరుగులు సాధించాడు దాదా.

అదే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ కూడా అరంగేట్రం చేశాడు. ద్రవిడ్ 95 పరుగులు చేశాడు.

ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన 3వ టెస్టులో 136 పరుగులు చేసి, జట్టులోకి తన ఎంపిక సరైందేనని నిరూపించాడు సౌరభ్.

కాళీచరణ్, లారెన్స్ రోవ్ తర్వాత అరంగేట్రంలోనే తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా గంగూలీ నిలిచాడు.

అంతేకాదు, గంగూలీ బ్యాటింగ్ స్టైల్, యాక్షన్ షాట్లు, ఆఫ్‌సైడ్‌లో కొట్టే టైమింగ్ షాట్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

క్రికెట్ ప్రపంచం గంగూలీని గుర్తించి సంబరాలు చేసుకోవడం ప్రారంభించింది.

1997లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా నాలుగు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు గంగూలీ.

1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై గంగూలీ, ద్రవిడ్‌ల 318 పరుగుల భారీ భాగస్వామ్యం రికార్డు పుటల్లోకెక్కింది. ఆ మ్యాచ్‌లో గంగూలీ 183 పరుగులు చేశాడు.

టీమిండియా క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా విజయానికి బ్రేకులు

1999-2000 సంవత్సరం భారత క్రికెట్ చరిత్రలో 'ఒక పెద్ద మరక'ను మిగిల్చింది.

ప్రపంచ క్రికెట్‌ను గ్యాంబ్లింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ తుపానులో భారత ఆటగాళ్లు కూడా చిక్కుకున్నారు. మహమ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజాలపై నిషేధం పడింది.

స్పాట్ ఫిక్సింగ్ నీడ 'జెంటిల్‌మన్ గేమ్‌'గా పేరొందిన క్రికెట్‌పై పడటంతో అభిమానులు ఆటను పట్టించుకోవడం మానేశారు.

అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా క్రికెట్ విలువ పడిపోయింది.

భారత్‌లో క్రికెట్‌పై అభిమానుల్లో అపనమ్మకం నెలకొన్న క్లిష్ట సమయంలోనే గంగూలీని జట్టుకు కెప్టెన్‌గా నియమించారు సెలెక్టర్లు.

గంగూలీ కెప్టెన్‌గా ఎంపికైన సమయంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ త్రయం భారత జట్టులో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాట్స్‌మెన్.

యువరాజ్ సింగ్, హేమంగ్ బదానీ, అగార్కర్, జహీర్ ఖాన్ అరంగేట్రం చేసిన రోజులవి.

ఈ క్లిష్ట సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌గా గంగూలీని నియమించారు. భారత క్రికెట్ ప్రతిష్టను పునరుద్ధరించే బాధ్యతను గంగూలీకి అప్పగించారు.

గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. 2000లో ఐసీసీ నాకౌట్ కప్‌లో ఇండియా ఫైనల్‌కు చేరుకుంది.

అప్పట్లో స్టీవ్ వా సారథ్యంలోని ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌లో దుర్భేద్యమైన జట్టు. ఆ టీం వరుసగా 16 టెస్టు మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది.

కానీ, 2001లో భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును గంగూలీ నేతృత్వంలోని టీమిండియా ఓడించింది. దీంతో కంగారూ జట్టు విజయపరంపరకు తెరపడింది.

అంతేకాదు ఈ సిరీస్‌లోనే అప్పటి యువ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను గంగూలీ భారత జట్టులోకి తీసుకున్నాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

టీమిండియా: ప్రయోగాల వర్క్‌షాప్

గంగూలీ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత అప్పటివరకున్న పలు సంప్రదాయాలను బద్ధలు కొట్టాడు. కొత్త వ్యూహాలు అమలు చేశాడు, జట్టులోకి కొత్త రక్తాన్ని నింపాడు.

స్పెషలిస్ట్ వికెట్ కీపర్ నయన్ మోంగియాను వదులుకున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేయగల సబా కరీమ్ వంటి వారిని జట్టులోకి తీసుకుని ప్రయోగాలు చేశాడు.

అది విఫలం కావడంతో రాహుల్ ద్రవిడ్‌‌కు కీపింగ్ అప్పగించాడు.

మిడిలార్డర్‌లో సెహ్వాగ్ తడబడుతున్న సమయంలో గంగూలీ తీసుకున్న నిర్ణయం.. సెహ్వాగ్ కెరీర్‌ను మార్చింది. సచిన్‌తో సెహ్వాగ్‌ను ఓపెనింగ్ పంపాడు సౌరభ్.

ఈ మార్పు సెహ్వాగ్‌‌కు అతని కెరీర్‌లో పెద్ద మలుపుగా మారింది.

టీమిండియా సచిన్-గంగూలీ ఓపెనింగ్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న రోజులవి.

కానీ, సెహ్వాగ్‌ కోసం ఓపెనింగ్ వదులుకొని నంబర్ 3 లో ఆడటం మొదలుపెట్టాడు సౌరభ్.

అంతేకాదు మిడిలార్డర్‌లో రన్‌రేట్ పెంచాలని ఇర్ఫాన్ పఠాన్, ధోనీలను 3, 4వ స్థానాల్లో పరీక్షించాడు గంగూలీ.

ధోనీ బ్యాటింగ్ సామర్థ్యం బయట ప్రపంచానికి నిరూపించిన ఘనత గంగూలీదేనని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ తెలిపాడు.

లార్డ్స్‌లో చొక్కా విప్పిన సౌరభ్

గంగూలీ కెప్టెన్సీలో నాట్‌వెస్ట్ సిరీస్ విజయాన్ని ఎవరూ మర్చిపోలేరు.

తమ భారత పర్యటన సందర్భంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఆండ్రూ ఫ్లింటాఫ్ తన చొక్కా విప్పి, సంబరాలు చేసుకున్నాడు.

అయితే సౌరభ్ నేతృత్వంలోని భారత జట్టు 'నాట్ వెస్ట్ సిరీస్' కోసం ఇంగ్లండ్ వెళ్లింది. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.

దీంతో లండన్‌లోని లార్డ్స్ స్టేడియం బాల్కనీలో నిలబడి, గంగూలీ తన షర్టు విప్పి సంబరాలు చేసుకున్నాడు.

1983లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచింది. అయితే సౌరభ్ వచ్చేంత వరకు మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకోలేదు భారత జట్టు.

20 ఏళ్ల తర్వాత అంటే 2003 ప్రపంచ కప్‌లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఘోరంగా ఓడి, ట్రోఫీ చేజార్చుకుంది టీమిండియా.

ఈ టోర్నీలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మెరిసిన గంగూలీ, 3 సెంచరీలు సహా 465 పరుగులు చేశాడు.

ప్రపంచ‌కప్ గెలిస్తే 'దాదా' కెప్టెన్సీకి అది కిరీటంలా ఉండేది. కానీ ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కారణంగా ఫైనల్లో భారత్ ఓడిపోయింది.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

గంగూలీ నాయకత్వంలో టీమిండియా ఘన విజయాలు

గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా ఎన్నో ఘన విజయాలు సాధించింది.

2000-2005 సమయంలో టీమిండియా స్వదేశంలో 21 టెస్టు మ్యాచ్‌లు ఆడి 10 మ్యాచ్‌లు గెలిచింది, 3 మ్యాచ్‌ల్లో ఓడింది.

విదేశీ గడ్డపై 28 మ్యాచ్‌ల్లో 11 గెలిచి, 10 ఓడింది. మొత్తంగా గంగూలీ 49 టెస్టులలో టీమిండియాకు సారథ్యం వహించాడు.

ఇక గంగూలీ నేతృత్వంలో స్వదేశంలో జరిగిన 36 వన్డేల్లో భారత జట్టు 18 గెలిచి, 18 ఓడిపోయింది.

విదేశాల్లో 51 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 24 విజయాలు, 24 ఓటములను చవిచూసింది.

మొత్తంగా 146 వన్డేల్లో భారత జట్టు 76 విజయాలు, 65 ఓటములు నమోదు చేసింది.

గంగూలీ కెప్టెన్సీ కాలం భారత జట్టు మొత్తం టెస్టు, వన్డే విజయాల శాతాన్ని 50కి పైగా పెంచింది.

ప్రపంచ కప్ తర్వాత కెరీర్ పతనం

2003 ప్రపంచకప్ తర్వాత గంగూలీ కెరీర్ పతనం మొదలైంది.

పేలవమైన ఫామ్ కారణంగా గంగూలీని జట్టు నుంచి తప్పించి రాహుల్ ద్రవిడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

భారత జట్టు ఎదుగుదల కోసం రకరకాల ప్రయోగాలు చేసి, వాటిలో విజయం సాధించిన గంగూలీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీ అందుకోలేకపోయాడు.

ఎందరో యువ ఆటగాళ్లను, ఫాస్ట్ బౌలర్లను, స్పిన్నర్లను భారత జట్టుకు పరిచయం చేసి అంతర్జాతీయ వేదికపై టీమిండియా రూపురేఖలను మార్చిన ఘనత గంగూలీకి దక్కుతుంది.

గంగూలీ కెప్టెన్సీ కాలంలో అతను ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణల కారణంగా భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిందని పలువురు వాదిస్తారు.

భారత జట్టు కోచ్‌గా గ్రెగ్ చాపెల్ పదవీకాలం చీకటి యుగమని పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శిస్తుంటారు.

ముఖ్యంగా చాపెల్, గంగూలీల మధ్య వివాదం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

అప్పట్లో గంగూలీ గురించి బీసీసీఐకి చాపెల్ ఈ మెయిల్ పంపారు. అందులో అతడు చేసిన ఆరోపణలు గంగూలీకి పెద్ద సమస్యగా మారాయి. దీంతో ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నించింది.

అయితే దీని తర్వాత గంగూలీ బ్యాటింగ్ ఫామ్ దారుణంగా ఉండటంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది.

తిరిగొచ్చిన 'దాదా'

జట్టు నుంచి తప్పుకున్న గంగూలీ దేశవాళీ మ్యాచ్‌లు, రంజీలపై దృష్టి సారించాడు. 10 నెలల తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో గంగూలీ తన ఫామ్‌ను చాటుకోవడంతో అనంతరం వన్డే సిరీస్‌, తరువాత 2007 ప్రపంచ‌కప్ టోర్నీకీ ఎంపికయ్యాడు.

2007లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌరభ్ డబుల్ సెంచరీ చేయడంతో 'కోల్‌కతా టైగర్' మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

అనంతరం గంగూలీ 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

బీసీసీఐ చీఫ్‌గా క్రికెట్ ప్రపంచంలోకి తిరిగొచ్చిన దాదా, భారత జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేశాడు.

అయితే వివిధ కారణాల వల్ల కుంబ్లే మధ్యలోనే నిష్క్రమించాడు.

గంగూలీ బీసీసీఐలోకి వచ్చిన తర్వాత డే-నైట్ టెస్టు మ్యాచ్‌ల నిర్వహణ, రంజీ ఆటగాళ్లకు వేతనాల పెంపు, మహిళా క్రికెట్‌కు పెరిగిన ప్రాధాన్యం భారత క్రికెట్‌ను కొత్త శకంలోకి తీసుకెళ్లాయి.

311 వన్డేలు, 11 వేలకు పైగా పరుగులు

భారత జట్టు తరఫున సౌరభ్ గంగూలీ 311 వన్డేలు ఆడి 11,363 పరుగులు చేశాడు.

ఇందులో 32 సెంచరీలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి. 113 టెస్టుల్లో 16 సెంచరీలు, 32 అర్ధసెంచరీలతో సహా 7,212 పరుగులు చేశాడు.

అంతేకాకుండా మీడియం పేస్ బౌలర్ అయిన గంగూలీ 100 వికెట్లు పడగొట్టాడు.

విదేశాల్లో సచిన్‌తో కలిసి గంగూలీ ఓపెనింగ్ వికెట్‌కు 255 పరుగులు చేయడం నేటికీ రికార్డుగా మిగిలిపోయింది.

వీరిద్దరూ కలిసి 136 మ్యాచ్‌ల్లో 7,000 పరుగులు చేశారు.

సచిన్, గంగూలీ జోడీ 26 సార్లు 100 పరుగులకు పైగా, 44 సార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గంగూలీ ఆఫ్‌సైడ్, కవర్ షాట్‌లను ఫీల్డర్ అడ్డుకోవడం కష్టమయ్యేది.

గంగూలీ బ్యాట్‌ను తాకగానే బంతి మెరుపు వేగంతో బౌండరీకి ​​చేరేది.

ఆఫ్‌సైడ్‌లో, బ్యాక్ పుట్, ఫ్రంట్ పుట్ ఆడేందుకు గంగూలీ తన పాదాలను వేగంగా కదిలించేవాడు.

అందుకే గంగూలీని 'గాడ్ ఆఫ్ ఆఫ్-సైడ్' అన్నాడు ద్రవిడ్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)