యుక్రెయిన్ యుద్ధం: శాంతి చర్చలను రష్యా తిరస్కరించదన్న అధ్యక్షుడు పుతిన్

పుతిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, మారిటా మోలోనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై శాంతి చర్చలను తిరస్కరించడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్ ఆఫ్రికన్ నేతలను కలిసిన తరువాత మాట్లాడుతూ, ఆఫ్రికా, చైనా చూపిస్తున్న చొరవ శాంతిసాధనకు ప్రాతిపదికగా నిలుస్తుందని అన్నారు.

అయితే, ఒకవైపు యుక్రెయిన్ సైన్యం దాడులు కొనసాగిస్తుంటే కాల్పుల విరమణ జరిగే పని కాదని పుతిన్ అన్నారు.

పుతిన్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే మాస్కోపై దాడి జరిగింది. యుక్రెయిన్ డ్రోన్ దాడితో మాస్కోలో రెండు కార్యాలయ బ్లాకులు దెబ్బతిన్నాయని రష్యా తెలిపింది.

దాడి కారణంగా నుకోవో విమానాశ్రయంలో కొద్దిసేపు విమానాలు నిలిపివేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారని రష్యాకు చెందిన వార్తా సంస్థ టాస్ తెలిపింది.

మాస్కో మీద డ్రోన్ దాడిపై జెలియన్‌స్కీ మాట్లాడుతూ, ఇప్పుడు యుద్ధం రష్యా వైపు వస్తోందని అన్నారు. “రష్యా మీదకు దాడులు చేయడమన్నది అనివార్యమైన, సహజమైన పరిణామం” అని ఆయన వ్యాఖ్యానించారు.

మాస్కోలో జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన లియా, ''మేం పేలుడు శబ్ధం విన్నాం. అదొక వేవ్‌లా వచ్చింది. అందరం ఎగిరిపడ్డాం'' అని రాయిటర్స్ వార్తాసంస్థతో తెలిపారు.

డ్రోన్ దాడితో మంటలు, పొగలు వచ్చాయని, తర్వాత ఏమీ కనిపించలేదని ఆమె అన్నారు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

'దాడులు చేశాం'

అవతలి పక్షం కొన్ని ముందస్తు షరతులకు అంగీకరిస్తే తప్ప తాము చర్చలకు రాబోమమని రష్యా, యుక్రెయిన్ రెండూ గతంలో ప్రకటించాయి.

తమ భూభాగాలను వదులుకోబోమని యుక్రెయిన్ చెబుతోంది. అదే సమయంలో మారిన సరిహద్దులను అంగీకరించాలని మాస్కో డిమాండ్ చేస్తోంది.

రష్యా గత ఏడాది యుక్రెయిన్‌పై దాడి చేసి, దాని దక్షిణ, తూర్పు భూభాగాలను ఆక్రమించింది.

యుక్రెయిన్ మీద దాడులను తీవ్రతరం చేసే ఆలోచనలు లేవని పుతిన్ శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

రష్యా లోపల నుంచి కొందరు హాని తలబెడుతున్నారని తెలిపారు. విమర్శకులను అదుపులోకి తీసుకోవడాన్ని పుతిన్ సమర్థించుకున్నారు.

యుక్రెయిన్‌పై మాస్కో యుద్ధం చేయడాన్ని విమర్శించడం రష్యాలో నిషేధించారు. ఇలా విమర్శించిన చాలామంది ప్రతిపక్ష పార్టీల నాయకులను జైల్లో వేశారు. పలువురు బహిష్కరణకు గురయ్యారు.

క్రిమియన్ వంతెనపై పేలుడు జరిగిన తరువాత మాస్కో కొన్ని దాడులను నిర్వహించిందని పుతిన్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఘటనను యుక్రెయిన్ ఉగ్రవాద చర్యగా పేర్కొంటూ దానికి బదులిస్తానని అప్పట్లో తెలిపారు పుతిన్.

ఆక్రమిత ద్వీపకల్పాన్ని రష్యాతో కలిపే వంతెనపై జరిగిన పేలుడుకు తామే కారణమని యుక్రెయిన్ అధికారికంగా వెల్లడించలేదు.

జెలియన్ స్కీ

ఫొటో సోర్స్, TELEGRAM

'రష్యన్ క్షిపణులు విద్యాసంస్థను తాకాయి'

యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ , పుతిన్‌లను ఏడు దేశాల నాయకులు, ప్రతినిధులతో సహా ఆఫ్రికన్ బృందం గత నెలలో కలుసుకున్న తర్వాత రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం జరిగింది.

జెలియన్ స్కీ ఇటీవల యుక్రెయిన్ ప్రత్యేక దళాలు గల బఖ్‌ముట్‌కు వెళుతున్నారు. ఈ సిటీలో భీకర పోరాటాలు జరుగుతున్నాయి.

మేలో రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న తూర్పు నగరం వైపు తమ దళాలు క్రమంగా ముందుకు సాగుతున్నాయని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

రాత్రిపూట ఈశాన్య యుక్రెయిన్ నగరమైన సుమీపై జరిగిన రాకెట్ల దాడిలో ఒకరు మరణించారని, ఐదుగురు గాయపడినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

శనివారం సాయంత్రం రష్యన్ క్షిపణి ఒక విద్యా సంస్థను తాకినట్లు యుక్రెయిన్ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో తెలిపింది. బీబీసీ ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.

దక్షిణ యుక్రెయిన్ నగరమైన జాపోరిజ్జియాలో శనివారం ఒక క్షిపణి బహిరంగ ప్రదేశంలో పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరొకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

శత్రువు క్షిపణి పేలుడుకు అపార్ట్‌మెంట్ కిటికీలు ఎగిరి పడ్డాయని, పక్కనే ఉన్న విద్యాసంస్థ, సూపర్ మార్కెట్‌‌లు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ సెక్రటరీ అనటోలీ కుర్టీవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)