లిమా సొరంగం: పెరూ రాజధాని అడుగున వేలాది పుర్రెలు, ఎముకల గుట్టలు.... ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి?

ఫొటో సోర్స్, Getty Images
చీకటిగా ఉన్న గ్యాలరీల్లో ఎముకలు, పుర్రెల మధ్య ప్రొఫెసర్ కాయెటానో విల్లావిసెన్షియా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాటిపై ఆయన ఏళ్ల తరబడి అధ్యయనం చేస్తున్నారు. వాటిని పరిరక్షించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారు.
''తొడ ఎముకలు కొన్ని చాలా పొడవుగా ఉన్నాయి చూడండి'' అని ఓ సందర్శకుడికి ఆయన చెబుతున్నారు.
లిమా నడిబొడ్డున భూగర్భంలో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కో డి అసిస్ కాన్వెంట్ అనే సమాధుల వద్ద ఉన్నాం. పెరూ రాజధానిలోని ప్రఖ్యాత ప్రార్ధనా కేంద్రం కింద జరిపిన తవ్వకాల్లో స్పానిష్ పాలనాకాలం నుంచి, కొన్ని శతాబ్దాలుగా పాతిపెట్టిన వేలాది మంది అవశేషాలు బయటపడ్డాయి.
''ఇది లాటిన్ అమెరికాకి చెందిన భూగర్భ శ్మశానవాటిక'' అని ప్రొఫెసర్ విల్లావిసెన్షియా ధ్రువీకరించారు. పెరూ ప్రభుత్వ పర్యాటక శాఖ వెబ్ సైట్ పేజీల్లోనూ దాని గురించి ఇలాగే రాసి ఉంటుంది.
ఈ కాన్వెంట్ వలసరాజ్యాల కాలం నాటి బరోక్ కళాఖండాల నిధి. 1535వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. స్పానిష్ ఏలుబడిలో ఉన్న ఆ కాలంలోనే అమెరికాలో ఫ్రాన్సిస్కన్స్, ఇతర మతాలకు చెందిన వారిని ఇక్కడ ఖననం చేయడం మొదలైంది.
అయితే, ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విషయం అక్కడి పుర్రెలు, తొడ ఎముకలు, కాలర్‌బోన్స్. ఈ శ్మశానంలో ఒక క్రమ పద్ధతిలో, జాగ్రత్తగా పేర్చిన ఎముకలు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.
''పుర్రెలు, తొడ ఎముకలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాటిని చాలా కాలం నుంచి భద్రపరిచారు.'' అని విలావిసెన్సియో వివరించారు. స్టెర్నమ్(ఛాతి ఎముక), కాకిగ్జ్ ఫ్రాగ్మెంట్స్(వెన్నెముక చివరిభాగం), ఎముకల అవశేషాలు కూడా అక్కడ ఉన్నాయి.
ఇక్కడ ఎంతమందిని ఖననం చేశారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఈ భూగర్భ శ్మశాన వాటికలో దాదాపు 25 వేల మందిని ఖననం చేసి ఉండొచ్చని ఇటీవలి అంచనాలు చెబుతున్నప్పటికీ, సుమారు లక్ష మందికి పైగానే ఖననం చేసి ఉంటారని ప్రొఫెసర్ విలావిసెన్సియో అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ కాన్వెంట్‌లో చాలా కారిడార్లు, గ్యాలరీలు ఉన్నాయని తెలుసు. అందులో ఇంకా తవ్వకాలు జరపని ప్రదేశాలు ఉన్నాయి.'' అని ఆయన చెప్పారు.
వాస్తవానికి, వైస్రాయ్‌ల కాలంలో మతపరంగా ఖననాలు జరిగిన ప్రదేశం ఇదొక్కటే కాదు. మరికొన్ని చర్చిలలో కూడా అలాంటి అవశేషాలు లభించాయి.
పెరూ రాజధాని మధ్యలో, ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కింద ఒక పెద్ద భూగర్భ శ్మశానం ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
''ఇప్పటి వరకూ కేవలం 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే తవ్వకాలు జరిగాయి. కానీ లిమాలోని చారిత్రక కేంద్రం అడుగున విస్తరించి ఉన్న సొరంగాల తవ్వకాల గురించి ఆలోచించాల్సి ఉంది'' అని నేషనల్ మేజర్ యూనివర్సిటీ ఆఫ్ శాన్ మార్కోస్‌కి చెందిన ఆర్కియాలజిస్ట్ పీటర్ వాన్ డాలెన్ బీబీసీతో చెప్పారు.
అయితే ఈ సొరంగాలు ఎంత దూరం వెళ్తాయో ఎవరికీ తెలియదు. అవి ప్రభుత్వ రాజభవనం, లేదా ఎల్ కల్లావో పోర్టు వరకూ ఉండొచ్చని కొందరు స్థానిక నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ లిమా సమాధులేంటి?
భారీ సంఖ్యలో అవశేషాల కారణంగా ఈ భూగర్భ శ్మశానాలు పర్యాటకంగా అత్యంత ఆకర్షణీయ ప్రదేశాలుగా మారాయి. 1940లలో వాటిని కనుగొన్న నాటి నుంచి ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఈ అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు.
ఎముకలు నిండిన గ్యాలరీలతో ఉండే ఈ ప్రదేశం ఎక్కువగా భయపడే వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
''కొంతమంది పర్యాటకులు తప్పిపోయి భయాందోళనకు గురయ్యారు. అందువల్ల మార్గాన్ని గుర్తించేలా ఏర్పాట్లు చేశాం.'' అని విలావిసెన్సియో చెప్పారు.
లిమాలోని మరికొన్ని చర్చిల్లోనూ భారీ సంఖ్యలో ఖననాలు జరిగినట్లు గుర్తించారు. శాన్ లజారో, శాంటా యానా, అనాథల చర్చిగా పేరొందిన శాంటిసిమో కొరాజన్ డి జీసస్ వంటివి వాటిలో ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో చాలా మంది చిన్నారుల అవశేషాలను కూడా గుర్తించారు.
''అవి చర్చిలు, కాన్వెంట్లు, ఇతర మతపరమైన సంస్థలకు అనుసంధానంగా నిర్మితమైన అంత్యక్రియల నిర్మాణాలు. వలస పాలన కాలంలో లిమా, ఇంకా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే జనాభాను ఇక్కడే ఖననం చేసేవారు'' అని వాన్ డాలెన్ అన్నారు.
''తొలుత అక్కడ మతపరమైన ఖననాలు మాత్రమే జరిగేవి. తర్వాతి కాలంలో అంటువ్యాధులు, భూకంపాల కారణంగా అందరినీ అక్కడ ఖననం చేయడం ప్రారంభమైంది.'' అని ఆయన అన్నారు.
చనిపోయిన వారిని చర్చిలు, ఆలయాలకు దగ్గరగా ఖననం చేయడం వల్ల వారు దేవుడి దగ్గరకు చేరుకుంటారని, వారికి ఆత్మకు మోక్షం కలుగుతుందని బలంగా విశ్వసించేవారు.
''బలిపీఠానికి దగ్గరగా ఉంటే, దేవుడికి దగ్గరగా ఉన్నట్టు వాళ్లు భావించేవారు.'' అని ఈ ఖననాల వెనక ఉన్న సామాజిక నేపథ్యంపై పరిశోధిస్తున్న ప్రొఫెసర్ విలావిసెన్సియో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ ఎవరెవరిని ఖననం చేశారు?
''స్పానిష్ దేశస్తులు, క్రియోల్స్(అమెరికాలో స్థిరపడిన ఫ్రెంచ్, స్పానిష్ జాతీయులు), ఇండియన్స్ (అమెరికాలోని స్థానికులు), నల్లజాతీయులను ఇక్కడ ఖననం చేశారు. అప్పటికే సామాజిక అంతరాలు ఉన్నప్పటికీ ఖననం విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవు. చర్చి బలిపీఠాల పక్కన ఖననం చేసిన కొందరు సోదరసంఘాల సభ్యుల గురించి తెలియజేస్తుంది.'' అని విలావిసెన్సియో అన్నారు.
ఆ రోజుల్లో సోదరభావం ఎక్కువ. ఇలాంటి సమూహాలు కూడా ఎక్కువ.
ఈ శ్మశానంలో ఉన్న చాలా అవశేషాలను గుర్తించలేదు. అవి ఎవరికి చెందినవో తెలియలేదు. అయితే, వాళ్లంతా అజ్ఞాత వ్యక్తులు కాదు. వారిలో అప్పట్లో ప్రముఖులు, 1648 నుంచి 1655 వరకూ పెరూ వైస్రాయ్‌గా ఉన్న గర్సియా శార్మియెంటో డీ సొటొమేయర్ వంటి వారు కూడా ఉన్నారు.
శవపేటికలో పెట్టకుండానే శవాలను ఒకటి తర్వాత మరొకటి ఖననం చేసేవారు. వాటి మధ్యలో మట్టి మాత్రమే ఉండేది. ఒక వరుస పూర్తయ్యాక దానిపై మరో వరుసలో ఖననం చేసేవారు.
1949లో కాన్వెంట్‌లోని ఫ్రాన్సిస్కన్ సన్యాసులు లోపల ఏముందో తెలుసుకునేందుకు వాటిని తెరిచినప్పుడు, వారికి నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలు కనిపించాయి.
ఆ విషయం స్థానికులు, అక్కడి మీడియా దృష్టిని ఆకర్షించడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అలా అది సందర్శించదగిన మ్యూజియంగా మారింది.

ఈ ఖననాలు ఎప్పుడు ఆగాయి?
అర్జెంటీనా జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ లిమాలోని ప్లాజా మేయర్‌లో 1821 జులై 28న పెరూకి స్వాతంత్ర్యం ప్రకటించారు.
స్వతంత్ర పెరూ రక్షకుడిగా మారిన శాన్ మార్టిన్ నగరంలో పారిశుధ్యం లోపించడంపై ఆందోళనతో చర్చిలలో భూగర్భ ఖననాలను నిషేధించారు.
భూగర్భ ఖననాల వల్ల ప్రజారోగ్యానికి హాని కలగడమే కాకుండా భవనాల స్థిరత్వానికి కూడా ముప్పు అని దానికంటే ముందే కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
1808లోనే లిమా సాధారణ శ్మశానవాటికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రెస్బిటెరో మేస్ట్రో సిమెట్రీలుగా వ్యవహరిస్తున్న శ్మశాన వాటికలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ స్థానికులు మాత్రం అక్కడ ఖననం చేసేందుకు తొలుత అంగీకరించలేదు. కొన్ని సంవత్సరాల పాటు పాత పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
తర్వాతికాలంలో ఆ ఆచారం క్రమంగా మరుగునపడింది. శాన్‌ఫ్రాన్సిస్కో కాన్వెంట్‌లో ఖననాలు చేయడం ఆగిపోయినప్పటికీ అదొక స్మారక కేంద్రంగా మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని, తెగిపడిన తలలెన్ని?
- Turkey : ఓ వ్యక్తి తప్పిపోయిన తన కోళ్ల కోసం వెతుకుతుంటే, 20,000మంది నివసించగల భూగర్భ నగరం కనిపించింది
- భారతదేశంలో డైనోసార్లను మింగేసే పాములు, ఒంటికొమ్ము రాకాసి బల్లులు ఏమయ్యాయి?
- సింగిల్ ఫాదర్: భార్య లేకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు, ఇక ముందు ఇలా అందరికీ సాధ్యం కాదా?














