జస్టిస్ విక్టోరియా గౌరీ: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆమెను నియమించడంపై ప్రశ్నలు ఎందుకు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని నియమించడం వివాదాస్పదంగా మారింది. కొలీజియం వ్యవస్థ మీద కూడా మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గతంలో మైనారిటీలపై మతపరమైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం.
రాష్ట్ర హైకోర్టులో మదురై ధర్మాసనంలో న్యాయవాదిగా పనిచేసిన 49 ఏళ్ల గౌరీ న్యాయమూర్తిగా మంగళవారం ప్రమాణం చేశారు.
ఆమెకు 13 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉండటంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా ఆమె నియమితులయ్యే అవకాశముంది.
కొలీజియం ముందుకు విక్టోరియా గౌరీ పేరు రావడం, వెంటనే నియామకానికి ఆమోదం తెలపడం, ఆమె న్యాయమూర్తిగా నియమితురాలు కావడంపై న్యాయ కోవిదులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
కేవలం ఒక రోజులోనే గౌరీ పేరును రాష్ట్రపతికి కేంద్రం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన చేయడం, ఆ తర్వాత ఆమె బాధ్యతలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు చేయడం అన్నీ వేగంగా జరిగిపోయాయి.
గౌరీ నియామకాన్ని సమీక్షించాలని సుప్రీం కోర్టులో 21 మంది న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆమె చేసిన విద్వేష వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని ఆ నియామకాన్ని రద్దు చేయాలని వారు కోరారు. మరోవైపు మరికొంత మంది న్యాయవాదులు ఆమెకు మద్దతుగా ఒక ‘‘మెమొరాండం’’ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సమర్పించారు.
ఒక పక్క ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పరిశీలనలో ఉన్నప్పుడే ఆమె బాధ్యతలు తీసుకునే కార్యక్రమం మొదలైంది. చివరగా ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.

ఫొటో సోర్స్, FACEBOOK/VVICTORY LEGAL ASSOCIATES
వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటి?
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయవాదిగా, అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్‌గా పనిచేసినప్పుడు జస్టిస్ విక్టోరియా గౌరీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నేడు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటి?
‘‘ఇది రోమన్ క్యాథలిక్‌ల అత్యంత దుర్మార్గపు చర్య. కళలు, సంస్కృతి, సాహిత్యంలో ఆధిపత్యం కోసం వీరు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ద్రావిడ సాహిత్యం పేరుతో వామపక్ష భావజాలాన్ని వీరు ప్రజలపై రుద్దుతున్నారు. మత మార్పిడులనూ వీరు ప్రోత్సహిస్తున్నారు’’అని ఆమె చెబుతున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.
‘‘భరతనాట్యంలోనూ ఇదే జరుగుతోంది. ఒక క్రైస్తవ సంస్థ ఆహ్వానిస్తే అక్కడకు వెళ్లాను. నటరాజుకు బదులుగా ఏసు ప్రభుకు నమస్కరించే ఒక వింత, వికృత భంగిమను అక్కడ చూశాను. అసలు నటరాజుకు ఏసు ప్రభుతో ముడిపెట్టడం ఏమిటి? క్రైస్తవ పాటలకు భరతనాట్యం చేయకూడదు. అసలు నటరాజ భంగమలను ఏసు ప్రభు పేరిట చేయడం ఏమిటి? రేపు ఒక క్రైస్తవ పాఠశాలలో హిందూ బాలికను నటరాజుకు బదులుగా ఏసు ప్రభును పూజించాలని బలవంతం చేస్తారా?’’అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
‘‘భారత్‌కు ఇస్లామిక్ కంటే క్రైస్తవ సంస్థలతోనే ఎక్కువ ముప్పు. మత మార్పిడుల విషయానికి వస్తే ఇద్దరూ సమానమే. ముఖ్యంగా లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకోవాలి’’అని ఆమె చేసిన వ్యాఖ్యలపై కూడా కొందరు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తించేశారు.
ఇస్లాంను ‘‘గ్రీన్ టెర్రర్’’, క్రైస్తవాన్ని ‘‘వైట్ టెర్రర్’’గా ఆమె చెబుతుంటారని ఆ న్యాయవాదులు వివరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/CHANDRASEKAR
రాజకీయంగానూ...
ఈ వివాదాస్పద వ్యాఖ్యల్లో చాలావరకు ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు విభాగం మహిళా మోర్చా కన్వీనర్‌గా ఉన్నప్పుడు చేసినవే.
అయినప్పటికీ, సెప్టెంబరు 2020లో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్‌గా విక్టోరియా గౌరీ నియమితులయ్యారు.
అయితే, ఈ పదవి చేపట్టే ముందే బీజేపీ పదవికి ఆమె రాజీనామా చేశారు. గతంలో రాజకీయ పార్టీతో సంబంధం ఉండటం అనేది తప్పుకాదని మదురై, చెన్నైలకు చెందిన కొందరు న్యాయవాదులు బీబీసీతో చెప్పారు. గతంలో చాలా మందికి ఇలాంటి నేపథ్యం ఉండేదని వారు అన్నారు.
‘‘ఇటీవల పదవీ విరమణ పొందిన ఒక న్యాయమూర్తికి కూడా ఇలాంటి నేపథ్యం ఉంది. కానీ, ఆయన తీర్పుల్లో అలాంటి పక్షపాత ధోరణి కనిపించలేదు. ఆయన ఒక మంచి న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఆయన గత రాజకీయ నేపథ్యం సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు’’అని హైకోర్టుకు చెందిన ఓ సీనియర్ న్యాయవాది బీబీసీతో చెప్పారు.
మరోవైపు మద్రాసు హైకోర్టులో న్యాయవాది అనంత్ కృష్ణ స్పందిస్తూ.. ‘‘మీరు జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్‌ను తీసుకోండి. గతంలో ఆయన ఒక కమ్యూనిస్టు. కానీ, న్యాయమూర్తిగా మారిన తర్వాత, ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. గతాన్ని చూపిస్తూ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయకూడదు’’అని ఆయన అన్నారు.
రాజకీయ అభిప్రాయాలు కాదు.. విద్వేష వ్యాఖ్యలు
ఈ వివాదంపై మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు కాస్త భిన్నంగా స్పందించారు. ‘‘రాజకీయ అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి న్యాయమూర్తి అయ్యేందుకు అర్హతలేదని చెప్పకూడదు. కానీ, ఇక్కడ వివాదం భిన్నమైనది. విద్వేష వ్యాఖ్యలు చేస్తే వారిని అనర్హులుగా ప్రకటించొచ్చు. ఎందుకంటే మీరు రాజకీయ అభిప్రాయాలున్న వ్యక్తి అని కాదు.. రాజ్యాంగ విలువలపై నమ్మకంలేని, మతపరమైన విద్వేషాలను వ్యాపించేసే వ్యక్తి కాబట్టి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అంతిమంగా కొలీజం వైఫల్యాలకు విక్టోరియా గౌరీ ఒక చక్కటి ఉదాహరణ. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఎవరికీ ఫిర్యాదు చేయలేం. ఒక శాశ్వత సచివాలయం ఏర్పాటుచేస్తేనే నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. పారదర్శకత అనేది నియామకానికి ముందే ఉండాలి, తర్వాత కాదు’’అని ఆయన చెప్పారు.
‘‘సాధారణంగా న్యాయమూర్తిగా ఒకరిని నియమించే ముందు నిఘా విభాగం (ఐబీ), ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. ఐబీ తప్పకుండా నివేదిక పంపిస్తుంది. కానీ, దాన్ని కొలీజియానికి కేంద్రం పంపాల్సిన అవసరం లేదు. అసలు ఈ వ్యవస్థలోనే లోపం ఉంది’’అని ఆయన వివరించారు.
మరోవైపు ఆర్ జాన్ సత్యన్ నియామకం వివాదాన్ని ఈ సందర్భంగా న్యాయవాదులు ఉదహరించారు. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయనను న్యాయమూర్తిగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే, ఈ కేసులో ఐబీ నివేదికను కొలీజియానికి కేంద్రం పంపించింది.
‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించిన ‘ద క్వింట్’ కథనాన్ని ఆయన షేర్ చేశారు. మరోవైపు 2017లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న అనిత అనే అమ్మాయి కథనాన్ని షేర్ చేస్తూ.. ‘ఇది రాజకీయ హత్య, భారత్‌కు సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు’’అని ఐబీ తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని కొలీజియం ఇటీవల మీడియాకు విడుదల చేసింది.
అయితే, ఆ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మద్రాసు హైకోర్టుకు ఆయన పేరును జనవరి 17న కొలీజియం పునరుద్ఘాటించింది. అయితే, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య... కొనసాగుతున్న సహాయక చర్యలు
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- తుర్కియే-సిరియా- 'గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం' - అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి
- బంగ్లాదేశ్: ఒకే రాత్రి 12 హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















