క్వీన్ విక్టోరియా: ఏడుసార్లు హత్యాయత్నం జరిగినా ప్రజల్లో తిరిగిన రాణి.. నిజంగా ధైర్యవంతురాలేనా?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, బాబ్ నికల్సన్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అది 1850 జూన్ 27. విక్టోరియా మహారాణి మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చారు.
ఆ రోజు సాయంత్రం ఆమె తన ముగ్గురు పిల్లలను తీసుకుని పికాడిల్లీలో అనారోగ్యంతో బాధపడుతున్న తన అంకుల్‌ను పరామర్శించడానికి వెళ్లారు.
అక్కడ బయట వందల మంది లండన్ ప్రజలు ఆమె దర్శనం కోసం వేచి ఉన్నారు.
అందులో చాలా మంది లక్ష్యం ఆమె కంట్లో పడడమే. అందులో ఒకరు మాత్రం వేరే లక్ష్యంతో అక్కడికి వచ్చారు. ఆయనే రాబర్ట్ పేట్.
రాణి పరివారం అక్కడి నుంచి బయలుదేరిన సమయంలో రాబర్ట్ పేట్ గుంపులోంచి చాలా వేగంగా ముందుకొచ్చి రాణి కూర్చున్న ఓపెన్ టాప్ వాహనం సమీపానికి వచ్చి లోహపు తొడుగు ఉన్న బెత్తంతో ఆమె తలపై కొట్టారు. జనం ఉలిక్కిపడ్డారు. గందరగోళం చెలరేగింది. ఆ గందరగోళంలోనే విక్టోరియా రాణి నిలబడి తన టోపీని సరిచేసుకుంటూ, ‘‘నాకేమీ కాలేదు’’ అని చెప్పారు.
1837లో సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుంచి ఆమెపై దాడి జరగడం అది అయిదోసారి. దాడి తరువాత ఆమె కూల్‌గానే ఉన్నట్లు మీడియా కథనాలు చెప్పుకొచ్చాయి. కానీ, పబ్లిక్‌లో ఆమె స్పందన ఎలా ఉన్నప్పటికీ విక్టోరియా పర్సనల్ జర్నల్స్ ఆమెలోని భావోద్వేగ కోణాలను వెల్లడించాయి.
బకింగ్‌హామ్ ప్యాలస్ భద్రతా కోణం నుంచి చూస్తే ఆ ఘటన ఓ పీడకలలా అనిపించిందని ఆమె రాశారు. ఆ ఘటనపై రాణి మనసులో మాట బయటకు రావడంతో భయం, ఆందోళనలు ఆగ్రహానికి దారితీశాయి.
ఈ ఘటనతో ఉద్వేగానికి లోనైనది విక్టోరియా రాణి ఒక్కరే కాదు. ప్రిన్స్ అల్బర్ట్ కూడా షాకయ్యారు. అప్పటి హోం మంత్రి సర్ జార్జ్ గ్రే కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బకింగ్‌హామ్ ప్యాలస్‌కు వచ్చారు.
దాడి జరిగిన కొన్ని గంటల వరకు కూడా విక్టోరియా రాణి భయంతోనే ఉన్నారు, ఆమె ఏమీ తినలేకపోయారు కూడా.
అయినా, ఆమె ఒపేరాకు వెళ్లారు. అక్కడ తమ టోపీలు గాల్లోకి విసురుతూ కేరింతలు కొడుతున్న ప్రజలు ‘గాడ్ సేవ్ ద క్వీన్’ అంటూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడారు.
విక్టోరియా పాలనలోని ప్రజలంతా రాజరికాన్ని ఇష్టపడేవారు కానప్పటికీ రాణిపై జరిగిన దాడి ప్రజల భావోద్వేగాలను ప్రేరేపించింది.

ఫొటో సోర్స్, Alamy
దాడి జరిగినంత మాత్రాన దాక్కోరాదన్నది చిన్న వయసులో ఆమెకు ఉన్న సంకల్పం.
ఇంతకుముందు 1842లో జాన్ ఫ్రాన్సిస్ అనే టీనేజ్ బాలుడు కాన్‌స్టిట్యూషన్ హిల్‌పైకి వెళ్తున్న ఆమె వాహనంపై పిస్టల్ గురిపెట్టాడు. అల్బర్ట్ ఆ విషయం గుర్తించారు. అయితే, జాన్ ఫ్రాన్సిస్ కాల్పులు జరపలేదు. కానీ, దొరక్కుండా తప్పించుకున్నాడు.
దాంతో విక్టోరియా హత్యకు కుట్ర జరుగుతోందని భావించి అప్పటి ప్రధాన మంత్రి రాబర్ట్ పీల్, దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకునేవరకు ప్యాలస్ నుంచి బయటకు వెళ్లొద్దని విక్టోరియా రాణికి సూచించారు. కానీ, అందుకు ఆమె నిరాకరించారు.
ఆ మరుసటి రోజు సాయంత్రం అల్బర్ట్, విక్టోరియా ఓపెన్ టాప్ క్యారేజ్‌లో బయటకు వచ్చారు. దాంతో ఫ్రాన్సిస్ మరో ప్రయత్నం చేశాడు. గార్డులు ఆయన్ను పట్టుకునేలోపే పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అయితే, విక్టోరియా దంపతులకు ఎలాంటి ప్రమాదం కలగలేదు.
ఈ దాడి తరువాత రాణి వెంటనే తన రాచరిక విధులను తిరిగి ప్రారంభించారు. ఫ్రాన్సిస్‌ను గార్డులు పట్టుకుని జైలులో వేయడంతో ఆమె నిర్భయంగా పబ్లిక్‌లో కనిపించడం ప్రారంభించారు. దీంతో ఆమెను ధైర్యవంతురాలిగా కొనియాడింది మీడియా. టైమ్స్‌లో అయితే ‘లయన్ హార్టెడ్ మోనార్క్’ అంటూ కవితలు ప్రచురితమయ్యాయి. ‘‘జెండర్ పరంగా రాణి అయినా ధైర్యం విషయంలో ఆమె రాజు’’ అంటూ ఆమెను ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
1840లో విక్టోరియా రాణి మరోసారి దాడులకు గురయ్యారు. ఈసారి నలుగురు వేర్వేరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు.
ఆ తరువాత 1850లో ఆమెపై రాబర్ట్ పేట్ దాడి చేసిన తరువాత ఆమె జనాల్లోకి రావాలంటేనే భయపడడం ప్రారంభించారు.
ప్రజల్లోకి వచ్చినప్పుడు జనం తన వాహనానికి దగ్గరగా రాగానే తనలో ఆందోళన మొదలవుతున్నట్లు ఆమె చెప్పారు.
అయితే, దాడులకు పాల్పడినవారి నుంచి కాకుండా సన్నిహితుల మరణాల వల్ల మరింత వేదనకు గురయ్యారు రాణి.
అల్బర్ట్, విక్టోరియాలకు స్నేహితుడైన రాబర్ట్ పీల్ గుర్రంపైనుంచి పడి మరణించారు. ఆ తరువాత విక్టోరియా మేనమామ చనిపోయారు.
అనంతరం 1861లో అల్బర్ట్ మరణంతో ఆమె దుఃఖం రెట్టింపైంది. అనంతర దశాబ్దంలో ఆమె ప్రజాజీవితం నుంచి వైదొలిగారు. ఆమె తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఆ తరువాత ఆమె మరో 40 ఏళ్లు జీవించారు. కానీ, పూర్తిగా కోలుకోలేదు. అప్పుడప్పుడు పబ్లిక్‌లో కనిపించేవారు.
విక్టోరియా తొమ్మిది మందికి జన్మనిచ్చారు.
విక్టోరియా జీవితకాలంలో ఆమెపై ఏడుసార్లు హత్యాయత్నాలు జరిగాయి.
ప్రజాజీవితంలో ఆమె కనబరిచిన ధైర్యం, ఆత్మ నిగ్రహం ఆమె జీవితంలోని సగాన్ని మాత్రమే చెబుతాయి.
ఇవి కూడా చదవండి:
- ‘రాహుల్‌కు పెళ్లి చేస్తాం, అమ్మాయి ఉంటే చెప్పండి’: హరియాణా మహిళలతో సోనియా గాంధీ వ్యాఖ్యలు
- అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్‌కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు
- మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు
- ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? మలబద్ధకం ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి?
- వెయిట్ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














