చమురు సంపన్న దేశమైన వెనిజ్వెలా ఎందుకిలా పతనమైంది?

ఫొటో సోర్స్, Getty Images
పనామా, కొలంబియా మధ్యలో కొండలు, పర్వతాలు, అభయారణ్యాలు మీదుగా సాగే 100 కి.మీల పొడవైన మార్గాన్ని ‘డారియన్ గ్యాప్’ అని పిలుస్తారు.
చిత్తడి నేలలు, పాములు, అడవి మృగాలు, పెద్ద ఎత్తున జరిగే నేరాలు కారణంతో, ఈ మార్గాన్ని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస మార్గంగా చెబుతుంటారు.
ఈ మార్గం గుండా వెళ్తూ చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మధ్య, దక్షిణ అమెరికాలను కలిపేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే.
కానీ, ఈ మార్గం గుండా వెళ్తూ తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వేలాది మంది ప్రజలు అటు కొలంబియాకు, ఇటు పనామాకు చెందినవారు కాదు.
వారు వాస్తవంగా దక్షిణంలో ఉన్న వెనిజ్వెలా నుంచి వస్తున్నారు.
వెనిజ్వెలా శరణార్థుల సంక్షోభం లాటిన్ అమెరికాలో అతిపెద్ద శరణార్థుల సంక్షోభంగా ఉంది.
ప్రపంచంలో అతిపెద్ద శరణార్థుల సంక్షోభాల్లో దీన్ని ఒకటిగా పరిగణిస్తున్నారు.
వెనిజ్వెలా ‘ఒక విఫలమైన దేశమా’ అనే అంశాన్ని తెలుసుకునేందుకు మనం కూడా ప్రయత్నిద్దాం..
వెనిజ్వెలాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ప్రభుత్వం, విపక్షాల మధ్యలో పారదర్శకంగా, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఎన్నికలు జరిపేందుకు చర్చలు జరగడం లేదు.
ఎందుకు లక్షలాది మంది ప్రజలు దేశం నుంచి పారిపోతున్నారు?
వెనిజ్వెలాలో శరణార్థుల సంక్షోభాన్ని అర్థం చేసుకునేందుకు, మేం జర్మనీలోని బీలెఫెల్డ్ యూనివర్సిటీకి చెందిన శరణార్థుల రీసెర్చర్ మారియా గాబ్రియేలా ట్రాన్పోటెరోతో మాట్లాడాం.
గత ఏడేళ్లుగా 73 లక్షల మంది వరకు దేశం విడిచి వెళ్లిపోయారని మారియా గాబ్రియేలా చెప్పారు.
వీరిలో చాలా మంది ఇతర లాటిన్ అమెరికా దేశాలకు లేదా కరేబియన్ దేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలం లాటిన్ అమెరికాలోనే కాదు, ప్రపంచమంతా ఈ శరణార్థుల సంక్షోభం ఉంది. యుక్రెయిన్, సిరియా, ఇతర దేశాల నుంచి శరణార్థులు వస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో యుద్ధం జరుగుతోంది. కానీ, వెనిజ్వెలాలో ఎలాంటి యుద్ధం, ఆందోళనలు జరగడం లేదు.’’ అని చెప్పారు.
వెనిజ్వెలా శరణార్థుల సంక్షోభానికి అతిపెద్ద కారణం పేదరికమని మారియా గాబ్రియేలా నమ్ముతున్నారు.
దేశ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వెనిజ్వెలా ప్రజలకు అతి కష్టంగా మారింది.
ఉదాహరణకు, ఒక కుటుంబం ఆహారం కోసం నెలకు 500 డాలర్లు(రూ.41,130) ఖర్చు చేయాల్సి ఉంటే, వారికి నెలకు వచ్చే కనీస వేతనం 50 డాలర్లు(రూ.4,113) మాత్రమే.
యువత చదువుకునేందుకు కాలేజీకి వెళ్లేందుకు కూడా కష్టమవుతోంది.
ఎందుకంటే, 18 నుంచి 19 ఏళ్లు వచ్చిన వెంటనే అక్కడి యువత బతికేందుకు ఎంతో కొంత సంపాదించాల్సి ఉంటుంది. నీటి, విద్యుత్ సమస్య నిత్యం వారిని వేధిస్తోంది.
పేదరికం వల్లనే మానవ హక్కుల ఉల్లంఘనలు జరగడం లేదని చెప్పిన మారియా గాబ్రియేలా ట్రాన్పోటెరో, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అప్రజాస్వామిక పాలన, రాజకీయ అణచివేత కూడా ఒక కారణమన్నారు.
అందుకే పెద్ద ఎత్తున ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల్లో సంతోషం లేదు...
నికోలస్ మదురో ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని మారియా చెప్పారు. ‘‘పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు. భావాప్రకటన స్వేచ్ఛ లేదు. 280 మందికి పైగా ప్రజలు రాజకీయ ఖైదీలుగా మారారు. 2014, 2017, 2019 కాలాల్లో జరిగిన నిరసనల్లో భద్రతా బలగాల చేతిలో వందలాది మంది మరణించారు.
దేశం విడిచి పారిపోవాలనుకునే వారికి, ఇతర దేశాలకు చేరుకోవడం కూడా చాలా కష్టమవుతుంది.
ఎందుకంటే పాస్‌పోర్ట్, వీసా కోసం వారి వద్ద సరిపడా డబ్బులు ఉండవు. చాలా మంది ప్రజలు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. ’’
‘‘ఇలా వెళ్లే వారు మధ్యలో చాలా ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలు గర్భవంతులైనా కూడా ఈ కష్టతరమైన ప్రయాణాలు చేస్తున్నారు.’’ అని మారియా గాబ్రియేలా ట్రాన్పోటెరో చెప్పారు.
‘‘లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లోకి ప్రవేశించేందుకు వెనిజ్వెలా ప్రజలకు వీసా అవసరం. అయితే, ఈ దేశ ప్రజలు వీసాలు, డాక్యుమెంట్లు లేకుండానే సరిహద్దుల మీదుగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నారు.’’ అని తెలిపారు.
ప్రజలు ఎవరైతే ఇలా అక్రమంగా ఉత్తరాది దేశాలకు వెళ్లాలనుకుంటారో వారు ‘డారియన్ గ్యాప్’ గుండా ప్రయాణించాల్సి ఉంది.
వీరు పయనించే ఈ మార్గంలో అడవి మృగాలు, చిత్తడి నేలలు, వేగంగా పయనించే నదులు ఎదురుపడుతుంటాయి. వీటిని దాటుకుంటూ వీరు ఉత్తరాది దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
వెనిజ్వెలాలో పదవీ విరమణ పొందిన వ్యక్తికి నెలకు కేవలం 20 డాలర్లు మాత్రమే వస్తాయని తెలుపుతూ వెనిజ్వెలాలో పేదరికం ఏ స్థాయిలో ఉందో మారియా వివరించారు.
వీరు విదేశాల్లో స్థిరపడిన తమ పిల్లలపైనే ఆధారపడతారు.
వెనిజ్వెలాలో వందేళ్ల క్రితమే చమురు నిల్వలను కనుగొన్నారు. ఆ తర్వాత 20 ఏళ్లలోనే వెనిజ్వెలా ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతుల దేశాల్లో ఒకటిగా నిలిచింది.
వెనిజ్వెలాకి ఎక్కువగా ఆదాయం చమురు ఎగుమతుల నుంచే వస్తోంది. ఇది కూడా అస్థిరతకు ఒక కారణంగా నిలుస్తోంది.
గత కొన్నేళ్లలో, వెనిజ్వెలా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను, రాజకీయ తిరుగుబాట్లను చవిచూసింది.

ఫొటో సోర్స్, AFP
చావెజ్‌ను నమ్మారు...
మనం గత 25 ఏళ్ల గురించి మాట్లాడుకుంటే.. 1990ల్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. వెనిజ్వెలాలో పేదరికం విస్తరించింది. ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లించలేక సతికిల పడింది.
ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమైన తర్వాత, 1998లో వెనిజ్వెలాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకున్నారు.
మార్పును ఆశిస్తూ యువనేత, ఆకర్షణీయమైన నాయకుడు హ్యూగో చావెజ్‌ను ఎన్నుకున్నారు. చావెజ్ చాలా తేలిగ్గా అధ్యక్ష ఎన్నికలో గెలిచారు.
హ్యూగో చావెజ్ పాలన, రాజకీయాలపై మరింత సమాచారం కోసం బీబీసీ న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆధునిక వెనిజ్వెలా నిపుణులు అలెజాండ్రో వలస్కోతో మాట్లాడింది.
హ్యూగో చావెజ్ చాలా ప్రభావితమైన వక్త అని, పెద్ద పెద్ద నేతలు ఎక్కడి నుంచైతే వచ్చారో ఆయన కూడా అదే ప్రాంతానికి చెందిన వారని చెప్పారు.
ఆయన అధికారంలోకి రాగానే, వెనిజ్వెలా ఉజ్వల భవిష్యత్‌కు సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు అనిపించింది.
దేశంలోని కొత్త, పాత విధానాలను కలుపుకుని ఎన్నో విషయాలను చావెజ్ ప్రతిపాదించారు. ఆయన అధికారంలోకి రావడంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు కనిపించింది.
కానీ, ఈ సరికొత్త అధ్యాయం ఎలా ఉండబోతుందంటే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
సోషలిస్ట్ అజెండాతో అధికారంలోకి వచ్చిన చావెజ్, దేశ పేద ప్రజల జీవితాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.
దేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన విజయవంతమయ్యారు.
శిశు మరణాల రేటును తగ్గించారు. పేదరికం నుంచి చాలా మందిని బయటపడేశారు.
కానీ, దీనికి కావాల్సిన నిధుల కోసం చావెజ్ చమురు పరిశ్రమను, దాని ఆదాయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నారు.
2003లో ఇరాక్ యుద్ధంతో, ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. వెనిజ్వెలా చమురు లాభాలు బాగా పెరిగాయి.
‘‘చమురు పరిశ్రమ, పార్లమెంట్, ప్రభుత్వ సంస్థలు, ఆర్మీని పూర్తిగా ఆయన ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఆయనకు సమస్య బయట నుంచి రాలేదు. చావిస్మో లేదా చావెజిజమే ఆయనకు సమస్యగా మారింది. 21వ శతాబ్దంలో సోషలిస్ట్ చావెజ్‌గా ఆయన మారారు’’ అని అలెజాండ్రో వలస్కో అన్నారు.
2012లో చావెజ్ మూడోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు ఆయన వయసు కేవలం 57 ఏళ్లు మాత్రమే. కానీ, అప్పటికే చావెజ్ ఆరోగ్యం బాగా క్షీణించింది.
ఈయన సోషలిస్ట్ రాజకీయ సిద్ధాంతాన్ని చావిస్మో అని పిలుస్తారు. ఈ చావిస్మోను కొనసాగించడానికి ఆయనకి రాజకీయ వారసులు అవసరమైంది.
ఆయన వారసుడిగా విదేశాంగ మంత్రి నికోలస్ మదురోను ఎంపిక చేశారు. కానీ, చావెజ్‌కి ఉన్న వ్యక్తిత్వాన్ని వెనిజ్వెలా ప్రజలు మదురోలో చూడలేదు.
2013లో చావెజ్ మరణించిన కొన్ని వారాలకే, మదురో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కానీ, తక్కువ మార్జిన్‌తోనే మదురో ఈ ఎన్నికల్లో విజయం పొందారు.
2012 అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ చారిత్రాత్మక విజయాన్ని సాధించడం ఆశ్చర్యమని అలెజాండ్రో వలస్కో అన్నారు. కానీ, ఆయన మరణించిన కొన్ని వారాలకి జరిగిన ఎన్నికల్లో 1.5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో మదురో గెలుపొందడం ఆసక్తికరంగా అభివర్ణించారు.
ఇలా చూసుకుంటే, మదురో పాలనకు మొదట్నుంచి చాలా తక్కువ ప్రాధాన్యతనే ఉంది.
చావెజ్ పాలనలో ఆర్థిక నిర్వహణ లోపాలు, చమురుపై ఎక్కువగా ఆధారపడటం, మళ్లీ వెనిజ్వెలా ఆర్థిక వ్యవస్థను కింద పడేశాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది.
ప్రతి సమస్యకు పరిష్కారంగా చమురు ఎగుమతుల వైపే వెనిజ్వెలా ప్రభుత్వం చూస్తోందని అలెజాండ్రో వలస్కో అన్నారు. దూరదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళికను వారు పట్టించుకోవడం లేదని చెప్పారు.
అందుకే, చమురు ధరలు పెరిగినప్పుడు, లాభాలన్నింటిన్ని ఖర్చు చేశారు. ధరలు తగ్గినప్పుడు, రుణాలు తిరిగి చెల్లించేందుకు కనీసం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు.

ఫొటో సోర్స్, Reuters
లాటిన్ అమెరికా పాలిటి సౌదీ అరేబియా
వెనిజ్వెలాలో చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించిన తర్వాత, విదేశీ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం నుంచి చమురు బావులను అద్దెకు తీసుకుని ఆయిల్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.
1960లో వెనిజ్వెలా చమురు ఉత్పత్తి దేశాల సంస్థ అయిన ఒపెక్( OPEC)లో వ్యవస్థాపక సభ్యదేశంగా మారింది.
పదేళ్ల తర్వాత, ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 6% వెనిజ్వెలా నుంచే వస్తున్నట్లు తేలింది.
వెనిజ్వెలా ఆయిల్ ఇండస్ట్రీ చరిత్ర గురించి కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎనర్జీ పాలసీలో సీనియర్ పరిశోధకురాలు లూయిసా పలాసియోస్‌తో మేం మాట్లాడాం.
చమురు కారణంగా ప్రపంచంలో వెనిజ్వెలా ప్రాధాన్యతా చాలా పెరిగిందని ఆమె చెప్పారు.
"చమురు మార్కెట్లో వెనిజ్వెలా ప్రధాన శక్తిగా మారింది. అమెరికాకు పెద్ద మొత్తంలో చమురును ఎగుమతి చేయడం ప్రారంభించింది. దీనిని సౌదీ అరేబియా ఆఫ్ లాటిన్ అమెరికా అని కూడా పిలుస్తారు. దేశంలోని ఇతర పరిశ్రమలలో కూడా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. దీని కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది’’ అని ఆమె చెప్పారు.
1970లలో అధిక చమురు ధరల నుంచి వెనిజ్వెలా బాగా లాభపడింది. 1976లో ప్రభుత్వం పెట్రోలియాస్ డి వెనిజులా అనే జాతీయ చమురు కంపెనీని స్థాపించింది.
1980ల మధ్య నాటికి, అంతర్జాతీయంగా చమురు ధర సగానికి పైగా పడిపోయింది. 1990ల నాటికి మరింత దిగజారింది. అయితే, 90ల చివరి నుంచి మళ్లీ పెరగడం మొదలైంది.
1998లో హ్యూగో చావెజ్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పెరిగిన చమురు ధరలను సద్వినియోగం చేసుకునేందుకు ఆయనకు మంచి అవకాశం వచ్చింది.
చావెజ్ హయాంలో చమురు ధర ఆరు రెట్లు పెరిగిందని లూయిసా పలాసియోస్ అన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది.
అయితే, ఇది కేవలం అదృష్టానికి సంబంధించిన విషయం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా మరింత డబ్బు సంపాదించే అవకాశం కలిగింది.

ఫొటో సోర్స్, AFP
వెనిజ్వెలాకు ఇబ్బందులు ఎలా మొదలయ్యాయి?
చమురును ఉత్పత్తి చేసే విధానాలలో లోపాల వల్ల వెనిజ్వెలాకు ఇబ్బందులు మొదలయ్యాయని లూయిసా పలాసియోస్ అన్నారు. అప్పటికి దేశంలో సాంకేతిక నిపుణుల కొరత ఉంది. చావెజ్ పాలనా విధానాలు దీనికి కారణం.
తనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన కార్మికులను చావెజ్ ఉద్యోగాల నుంచి తొలగించారు. దీంతో చాలామంది సాంకేతిక నిపుణులు దేశం విడిచి వెళ్లిపోయారు.
“వెనిజ్వెలా చమురు పరిశ్రమ చరిత్రలో ఇది ఒక ప్రధాన సంఘటన. చమురు పరిశ్రమతో సంబంధం ఉన్న సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లారు. వారితో రాజీకి ప్రభుత్వం ప్రయత్నించలేదు’’అని లూయిసా అన్నారు.
ఒక పక్క ఆయిల్‌కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతుండగా, వెనెజ్వెలాలో మాత్రం ఉత్పత్తి క్షీణించింది. ఇతర పరిశ్రమలలో కూడా ఇదే జరిగింది. అప్పటికి ఇంకా సాంకేతిక నిపుణుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
దీంతో వెనిజ్వెలా నిత్యావసర వస్తువులను కూడా తయారు చేసుకోలేక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చింది.
అయితే, చావెజ్ ఎక్కడా తగ్గకుండా, తన రాజకీయ ఎజెండాను కొనసాగించారు. అప్పటి వరకు చమురు వల్ల వచ్చిన సంపద అతని పాలసీలలోని లోపాలను కనిపించకుండా చేశాయి.
ఆయన వారసుడు నికోలస్ మదురో 2013లో అధికారంలోకి వచ్చినప్పుడు, చమురు ధరల పతనం మళ్లీ మొదలైంది.
కానీ, ఆయన కూడా కఠినమైన జాతీయవాద విధానాలను అనుసరించాడు. దీంతో దేశంలో ఆగ్రహావేశాలు, నిరసనలు మొదలయ్యాయి.
2015లో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెనిజ్వెలాపై ఆంక్షలు విధించారు.
నికోలస్ మదురో 2018లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, అయితే ఈ ఎన్నికలు బూటకమని చాలామంది భావించారు.
ఆ తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజ్వెలా చమురు పరిశ్రమపై ఆంక్షలు విధించారు. ఆదాయం కోల్పోవడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారింది.
దేశం ఏకాకిగా మారి పేదరికంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి దేశ విధానాలలో మార్పు అవసరమైంది.

ఫొటో సోర్స్, EPA
2024 అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పు వస్తుంది?
2019లో, మదురో ప్రభుత్వానికి గట్టి ప్రత్యర్థి అయిన యువ నాయకుడు జువాన్ గైడో తనను తాను వెనిజ్వెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. 2018 ఎన్నికలను ఆయన మోసపూరిత ఎన్నికలని పేర్కొన్నారు.
డజన్ల కొద్దీ దేశాలు ఆయన స్థాపించిన మధ్యంతర ప్రభుత్వాన్ని గుర్తించాయి. కొద్దికాలం పాటు దేశంలో మార్పుపై ఆశలు చిగురించాయి. కానీ ఏడాదిలోపే ప్రతిపక్ష పార్టీలు జువాన్ గైడోకు వ్యతిరేకంగా మారాయి. దీంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
వెనిజ్వెలాలో అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. మరి వచ్చే ఎన్నికల నుంచి ఏం ఆశించవచ్చు?
దేశంలో ఓటర్లు చాలామంది విసిగిపోయి ఉన్నారని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ మరియానో డి ఆల్బా అన్నారు.
“వెనిజ్వెలాలోని మెజారిటీ ప్రజల ఆందోళన ఏంటంటే, ఈ నెల ఖర్చులు ఎలా వెళ్లదీయాలి అన్నదే. రాజకీయాలు, నిరసన ప్రదర్శనలు చేసే ఆలోచన, ఆసక్తి వారికి లేదు’’ అని మరియానో అన్నారు.
అయితే, మార్పు వస్తుందన్న భరోసాతో ప్రజలు ఓటు వేయడానికి వెళ్లినా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు చాలా తక్కువ.
“వెనిజ్వెలాలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రస్తుతం అసాధ్యమని నేను భావిస్తున్నాను. ఎన్నికల ప్రక్రియను, మీడియాను, కోర్టులను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పనంత మెజారిటీ వస్తే ప్రతిపక్షాలకు కొంత ఆశ ఉంటుంది.’’ అని మరియానో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
2025 నాటికి దేశం నుంచి పావు వంతుమంది వెళ్లిపోతారు !
గత ఐదేళ్లలో ప్రతిపక్షాలు తాము చేసిన డిమాండ్‌లను సాధించ లేకపోయాయి. అందువల్ల ప్రతిపక్షాలకు కూడా ఇది అంత సులభం కాదు. దేశాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరగడం లేదు.
ఇటీవల అమెరికా, వెనిజ్వెలా ప్రభుత్వ ప్రతినిధులు దోహాలో చర్చలు జరిపారు.
వెనిజ్వెలాలో సంక్షోభాన్ని పరిష్కరించడంలో అంతర్జాతీయ సమాజం పాత్ర కీలకమని మరియానో అభిప్రాయపడ్డారు.
దేశంలో న్యాయమైన, నిష్పక్షపాతతమైన ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం అంతర్జాతీయ సమాజానికి ఉందని మరియానో అన్నారు.
ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటే ఆంక్షలపై సడలింపులు కూడా రావచ్చు.
చట్ట ప్రకారం పాలన నిర్వహించలేనప్పుడు ఆ దేశాన్ని విఫల రాజ్యం లేదా విఫల దేశం అంటారు.
వెనిజ్వెలాలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని చమురు నిల్వలు ఉన్నాయి. కానీ, చావెజ్, ఆయన తర్వాత వచ్చిన మదురోలు ఆర్ధిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, అధికారంలో కొనసాగడానికి అనుసరించిన విధానాల వల్ల దేశంలో ప్రజలు వలసబాట పట్టాల్సి వచ్చింది.
2025 నాటికి వెనిజ్వెలా జనాభాలో నాలుగింట ఒక వంతు మంది దేశం విడిచి వెళ్లిపోతారని ఒక అంచనా. అంటే, గ్రౌండ్‌లెవెల్లో ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, వెనిజ్వెలాను ప్రజాస్వామ్య పథంలోకి తీసుకురావడం ద్వారా, ఆ దేశంలో పరిస్థితులను మెరుగుపరచడంలో అమెరికా పాత్ర ముఖ్యమని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- లావోస్: ‘ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఇదే’
- అమెరికా అప్పుల కుప్పగా మారనుందా? భారత సాఫ్ట్వేర్ రంగంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే?
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- చైనాకు శ్రీలంక లక్ష కోతులను ఎందుకు పంపిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














