‘సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారా... ప్రభుత్వానికి తిరిగి చెల్లించండి’ అంటూ లక్షలాదిమందికి డిమాండ్ నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాన్సిస్ మయో
- హోదా, బీబీసీ న్యూస్
సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వానికి తిరిగి డబ్బు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు రావడంతో బాధితులు నేరస్థులలా ఫీలవ్వాల్సిన పరిస్థితులు కలిగాయని, వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆస్ట్రేలియాలో జరిగిన ఓ విచారణలో గుర్తించారు.
స్థానికంగా ‘రోబో డెట్’గా పిలుస్తున్న ఈ వ్యవహారంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు అనుచితంగా ప్రయోజనాలను పొందారని, కాబట్టి ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలంటూ తప్పుడు నోటీసులు వెళ్లాయి.
అల్గారిథమ్‌లో తప్పుల కారణంగా ప్రజలకు ఇలాంటి నోటీసులు అందాయి. వేల డాలర్ల మేర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు.
సుమారు 5 లక్షల మంది ఆస్ట్రేలియన్లపై ఈ పాలసీ ప్రభావం చూపింది.

ఫొటో సోర్స్, KATH MADGWICK
2016 నుంచి ఈ పథకం అమలైంది. అది చట్టవిరుద్ధమని 2019లో కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు కూడా కొనసాగింది.
ఈ స్కీమ్ కారణంగా ఆస్ట్రేలియాలోని లక్షలాది మంది పేదలు తామకు సంబంధం లేని రుణాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది.
చాలామంది దారుణమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బయట అప్పులు తీసుకుని కొందరు, కార్లు అమ్ముకొని మరి కొందరు, పొదుపు చేసుకున్న డబ్బులతో ఇంకొందరు ఈ తప్పుడు బకాయిలను తిరిగి చెల్లించారు. కేవలం కొన్ని వారాల సమయమే ఇచ్చి, ఆ గడువులోగా డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో చాలామందికి ఇదంతా తప్పలేదు.
తమను తనిఖీ చేయడమనేది అవమానకరంగా అనిపించిందని కొందరు చెప్పారు.
ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసిన రాయల్ కమిషన్ శుక్రవారం తుది నివేదిక ఇచ్చింది. ఈ స్కీమ్‌ను అత్యంత ఖరీదైన వైఫల్యంగా అభివర్ణించింది ఈ నివేదిక.
‘రోబోడెట్ అనేది క్రూరమైన విధానం. ఇది ఏమాత్రం సరైంది కాదు, చట్టబద్ధమైనదీ కాదు. దీని కారణంగా చాలామంది నేరస్థుల్లా నిలబడాల్సి వచ్చింది’ అని విచారణ కమిషనర్ కేథరిన్ హోమ్స్ తన 990 పేజీల నివేదికలో పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో రాయల్ కమిషన్ అనేది అత్యంత శక్తిమంతమైన విచారణ వ్యవస్థ. ఈ కేసులో రాయల్ కమిషన్ 11 నెలల పాటు విచారించింది. ఈ క్రమంలో వందల మంది నుంచి సమాచారం, వినతులు తీసుకుంది.
ఈ విచారణ నివేదిక విడుదల సందర్భంగా శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు తీరని ద్రోహం చేసిందని అన్నారు.
రోబోడెట్ పాలసీ కారణంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని.. ‘ఇవి కాకుండా మరిన్ని విషాదాలు ఉన్నాయి’ అని ఈ నివేదికలో పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న ముగ్గురిలో రైస్ కాజో(28), జరాడ్ మాగ్విక్(22) అనే ఇద్దరు యువకులు ఉన్నారు. వీరిద్దరి తల్లులు కమిషన్‌తో మాట్లాడారు. జరాడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బకాయిలు తీర్చాలంటూ డిమాండ్ నోటీసులు ఇవ్వడంతో తాము ఎంతగా ఆందోళనకు గురయ్యామో, ఎంత ఒత్తిడికి గురయ్యామో.. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించేంతగా ఎంత డిప్రెషన్‌కు గురయ్యామో కొందరు బాధితులు చెప్పారు.
తన తలపై మోపిన బకాయి భారం కారణంగా కొన్ని నెలల పాటు తీవ్రమైన ఒత్తిడికి గురై ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాధిత మహిళ ఒకరు చెప్పారు. తన బ్యాంక్ ఖాతా నుంచి బకాయి కోసం డబ్బు విత్ డ్రా అయిన రోజు పూర్తిగా నిస్సహాయంగా అనిపించిందని చెప్పారు.
‘ఆ రోజు చాలా నిరాశగా అనిపించింది. నా కూతురి వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉండడం బాధ కలిగించింది. నా పరిస్థితి మెరుగుపర్చుకోవడానికి మార్గం లేక నిస్సహాయంగా అనిపించింది’ అన్నారామె.
11 వేల ఆస్ట్రేలియా డాలర్లు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు అందుకున్న మరో వ్యక్తి కూడా విచారణ కమిషన్‌తో మాట్లాడారు. ఆ డబ్బు ప్రభుత్వానికి తిరిగి చెల్లించడం వల్ల తన ఆర్థిక పరిస్థితి కొన్ని ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందని, ఆ నోటీసు అందగానే షాక్‌కు గురయ్యానని చెప్పారు. ఆయన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది.
మాజీ ప్రధాని స్కాట మోరిసన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ప్రజలపై దుష్ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.
ఈ పథకాన్ని తీసుకొచ్చేటప్పటికి సామాజిక సేవల మంత్రిగా ఉన్న స్కాట్ మోరిసన్ ‘ఆటోమేటెడ్ సిస్టమ్’కు మారడానికి సభ ఆమోదం అవసరం లేదంటూ కేబినెట్‌ను తప్పుదోవ పట్టించారని నివేదిక ఆరోపించింది.
కాగా ఈ నివేదికలో తనను తప్పు పడుతూ ఉన్న అంశాలు, తనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నిటినీ ఆయన ఖండించారు.
సంబంధిత శాఖ సూచనలతో, వారిపై నమ్మకంతోనే తాను వ్యవహరించానని మోరిసన్ చెప్పారు.
ఈ పథకం అసంబంద్ధమైనదని అర్థమైనా, చట్టవిరుద్ధంగా అనిపించినా కూడా అవన్నీ కప్పిపుచ్చుతూ దీన్ని కొనసాగించారని నివేదికలో ఆరోపించారు.
కనీసం అప్పుడైనా దీన్ని ఆపినా, సవరించినా ఇంత దారుణ పరిస్థితులకు దారి తీసేది కాదని నివేదిక పేర్కొంది.
అలా చేయకుండా దీనిపై ఫిర్యాదుచేస్తే ప్రతీకారం తీర్చుకోవడం, మీడియాలో దాడి చేయడం వంటివి జరిగాయని నివేదికలో రాశారు.
ఒక సంక్షేమ విధానాన్ని రాజకీయీకరణ చేయడం వల్ల అప్పటికే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న చిన్నచూపునకు గురవుతున్నామన్న భావనను మరింత పెంచినట్లయిందని కమిషనర్ హోమ్స్ చెప్పారు.
సంక్షేమ పథకాలలో అవినీతి ప్రభుత్వం చెప్పినంతగా లేదని, అలాంటి కేసులు 0.1 శాతం కన్నా తక్కువగా ఉన్నా దాన్ని భూతద్దంలో చూపించి ఇలాంటి బకాయిల వసూలు కార్యక్రమాలకు తెరలేపారన్నారు.
ఈ పాలసీలో భాగమైన అనేక మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా విచారించాలని కమిషన్ సిఫారసు చేసింది.
ఈ బకాయిల వసూలు కార్యక్రమానికి వ్యతిరేకంగా బాధితులు ఆస్ట్రేలియాలో ఫెడరల్ కోర్టును ఆశ్రయించడం.. అది చట్టవిరుద్ధమని తేలడంతో 2019లో మోరిసన్ ప్రభుత్వం దీనికి ముగింపు పలికింది.
ప్రతిగా కొందరు బాధితులకు 70 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల మేర తిరిగి పరిహారం చెల్లించింది ప్రభుత్వం. ఇలా నష్టపరిహారం కోరుతూ చాలామంది బాధుతులు వేసిన కేసులను పరిష్కరించి చెల్లింపులు చేశారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














