వందల మంది రష్యా సైనికులను గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తున్న ‘బఖ్‌ముత్ ఘోస్ట్స్’ ఎవరు?

స్నిపర్ ఘోస్ట్

ఫొటో సోర్స్, MOOSE CAMPBELL/BBC

    • రచయిత, జోనాథన్ బీలె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బఖ్‌ముత్ సిటీని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుక్రెయిన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రోజు "ది ఘోస్ట్స్ ఆఫ్ బఖ్‌ముత్" అని పిలిచే స్నైపర్‌ల బృందంతో ఉండటానికి బీబీసీకి ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

ఈ బృందం బఖ్‌ముత్ సమీపంలో రాత్రి దాడులు నిర్వహిస్తుంది.

స్నైపింగ్ టీమ్ కమాండర్ అయిన 'ఘోస్ట్' మమ్మల్ని 'ఎడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్' అని పిలిచే వారి బేస్ క్యాంపు ప్రదేశానికి తీసుకువెళ్లారు. వారి స్థావరం నగర శివార్లలో ఉంది.

"నన్ను ఘోస్ట్ అని పిలుస్తారు" అని ఆయన బీబీసీతో చెప్పారు. "మేం బఖ్‌ముత్‌లో భయం పుట్టించినపుడు, మాకు 'ది ఘోస్ట్స్ ఆఫ్ బఖ్‌ముత్' అనే పేరు వచ్చింది" అని అన్నారు.

వారి స్థావరం ఇప్పటికే రష్యన్ ఫిరంగి దళాల పరిధిలో ఉంది. అయితే దాడులకు ఈ ఘోస్ట్స్ భయపడరు.

"ఫిరంగి ఎల్లప్పుడూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మీరు ఫిరంగి నుంచి తప్పించుకోవచ్చు, స్నైపర్ నుంచి కాదు" అని ఆయన అన్నారు.

దాదాపు 20 మంది సైనికులతో కూడిన ఘోస్ట్స్ బృందం గత ఆరు నెలలుగా బఖ్‌ముత్ శివార్లలో పనిచేస్తున్నారు. వారు పెద్ద లక్ష్యాల కోసమే వేటాడతారు.

స్నిపర్

ఫొటో సోర్స్, MOOSE CAMPBELL/BBC

'నేను 76 మందిని చంపేశా'

అతని బృందం ఎంత మంది రష్యన్‌‌లను చంపిందని ఆ ఘోస్ట్‌‌ను బీబీసీ అడిగింది. 524 మందిని మట్టుబెట్టామని, అందులో 76 మంది తన ఖాతాలోని వారని చెప్పారు.

ఈ బృందం తమ రైఫిల్‌లోని దృశ్యాల ద్వారా ప్రతి షాట్‌ను ఎలక్ట్రానిక్‌గా రికార్డ్ చేస్తుంది.

కుజియా కూడా ఈ రాత్రి మిషన్ కోసం పనిచేయనున్నారు.

"ఇది గర్వించదగినదేం కాదు. మేం ప్రజలను చంపడం లేదు, శత్రువును నాశనం చేస్తున్నాం" అని కుజియా చెప్పారు.

యుద్ధానికి ముందు కుజియా ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆయన తుపాకీలను ఎప్పుడూ ఇష్టపడలేదని, రష్యా దాడి చేయడంతో ఆయుధాలు పట్టుకోవల్సి వచ్చిందన్నారు.

అమెరికా తయారు చేసిన తన బారెట్ స్నైపర్ రైఫిల్‌ను కుజియా చివరిగా చెక్ చేశారు.

"ప్రతి మిషన్ ప్రమాదకరమైనది, మనం పొరపాటు చేసినప్పుడు శత్రువులు మాపై దాడి చేయగలరు" అని కుజియా తెలిపారు.

"అవును నేను భయపడుతున్నా. మూర్ఖుడు మాత్రమే భయపడడు" అని అన్నారు కుజియా.

రాత్రి చేయబోయే మిషన్‌లో కుజియాతో పాటు టారస్ కూడా ఉంటారు.

ఇక కుష్ ఒక డ్రైవర్, వారిని గమ్యస్థానం వద్దకు వీలైనంత దగ్గరగా తీసుకువెళతారు.

అక్కడి నుంచి ఇరువురు (కుజియా, టారస్) తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మైలు కంటే ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది.

వీరే కాకుండా బ్రిట్ అనే మరో వ్యక్తి కూడా గ్రూపులో సభ్యుడే. ఘోస్ట్ తనతో పాటు బేస్ వద్దే ఉంటాడు.

స్నిపర్ బృందం

స్నైపర్‌ను ఎలా ఎంపిక చేస్తారు?

అతి పిన్న వయస్కుడైన ఈ జవాన్ యూకేలో శిక్షణ పొందిన తర్వాత బ్రిట్ అనే పేరు పొందాడు. అయితే, అతను ఇప్పటివరకు ఒక్కరిని కూడా చంపలేదు.

జట్టులోని ప్రతి సభ్యుడిని వారి సైనిక అనుభవం, నైపుణ్యాల కంటే వారి "మానవత్వం, దేశభక్తి" ఆధారంగా ఎంపిక చేసినట్లు ఘోస్ట్ చెప్పారు.

సాయంత్రానికి స్నైపర్ బృందం వారి సాయుధ వాహనంలోకి ఎక్కింది. నేను, కెమెరామెన్ డ్రాప్ చేయడానికి వారితో పాటు వెళ్లాం.

అయితే, ఈ మార్గంలో కొంత భాగాన్ని ఇప్పటికీ రష్యన్ ఫిరంగిదళం లక్ష్యంగా చేసుకుంటుందని కుష్ బీబీసీ ప్రతినిధులతో చెప్పారు.

కుష్ ఇంజిన్‌ను ప్రారంభించినప్పుడు గ్రూపు సభ్యులు క్రాస్ గుర్తును చూపించారు. కుష్ తన ఫోన్ నుంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు.

యుక్రేనియన్ ర్యాప్ పాట తమను మూడ్‌లోకి తీసుకువస్తుందని ఆయన చెప్పారు. అది దాడుల శబ్దం వినపడకుండా కూడా చేస్తుంది.

అయితే, కుష్ చాలాసార్లు ఆకాశం వైపు చూపిస్తూ- "వస్తోంది" అని హెచ్చరించారు. సమీపంలో కొన్ని చప్పుళ్లు కూడా వినిపించాయి.

మేం దారిలో ధ్వంసమైన ఆరు యుక్రెయిన్ సాయుధ వాహనాలనూ చూశాం.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఆ రాత్రి లైట్లు లేకుండానే డ్రైవ్ చేశారు

ఇరవై నిమిషాల తర్వాత మేం ఒక శిథిలమైన ఇంటి దగ్గర ఆకస్మికంగా ఆగిపోయాం.

ఇద్దరు స్నైపర్లు తలుపులు తెరిచి అటు వైపు వెళ్లారు. కుష్, "దేవుడు మీతో ఉంటాడు" అని పెద్దగా అరిచారు.

మేం తిరిగి వస్తున్నప్పుడు పెద్ద పేలుడు జరిగింది. కుష్ డ్రైవింగ్ చేస్తూ, వెనుకకు చూసేందుకు తలుపు తెరిచారు. పేలుడు పదార్థం ముక్క ఒకటి వెనుక టైరును ముక్కలు చేసింది.

మేం బేస్‌కు తిరిగి రాగానే, టైర్‌ను చీల్చిన మెటల్ ముక్కను కుష్ మాకు చూపించారు. ఆ తర్వాత చీకటి పడింది, దాడులు తగ్గాయి.

బేస్ లోపల కుష్, బ్రిట్‌లు నేలపై నడుస్తూ స్నిపర్ బృందం నుంచి సమాచారం కోసం తమ రేడియోలను ఆత్రుతగా పట్టుకున్నారు.

ఘోస్ట్ తన ఏడేళ్ల కూతురికి ఫోన్ చేశారు. స్పీకర్‌లో ఉండగా "ఐ లవ్ యూ డాడీ" అని ఆమె ఉత్సాహంగా అరుస్తోంది.

అతను కూతురికి తుపాకీని వాడటం ఇప్పటికే నేర్పించారు.

ఆ తర్వాత నిద్రపోయి ఏడు గంటల తర్వాత బయటికొచ్చాం. బయట మంటలు చెలరేగుతున్నపుడు మేం భవనంలోనే ఆశ్రయం పొందాం. తిరిగి హంవీ వాహనంలోకి వెళ్లాం.

ఈసారి చీకటిగా ఉంది, కానీ కుష్ డ్రైవ్ చేశారు. ఎవరూ గుర్తించకూడదని హెడ్‌లైట్‌లు ఆన్ చేయకుండానే వెళ్లారు.

మరొక చోట ఆకస్మికంగా ఆగిపోయింది వాహనం, ఆ సమయంలో ఇద్దరు స్నైపర్స్ హంవీ లోపలికి తిరిగి వచ్చారు.

వారి బేస్‌కు చేరుకొగానే చాలా ఉపశమనంగా అనిపించింది.

'ప్రతీ ట్రిప్ మాకు చివరిది కావొచ్చు'

రాత్రి దాడి ఘటనలో స్కోప్ నుంచి వీడియోను మాకు చూపారు. అందులో ఫ్రంట్ లైన్ సమీపంలో యుక్రెయిన్ దళాలపై కాల్పులు జరుపుతున్నది రష్యన్ మెషిన్ గన్నర్‌ అని చెప్పారు.

"నేను తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా. అందరూ సజీవంగా ఉన్నందుకు సంతోషం" అని కుజియా అన్నారు.

గత ఆరు నెలల్లో కమాండర్ ఘోస్ట్‌తో సహా జట్టులోని పలువురు గాయపడ్డారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదు.

"ప్రతి ట్రిప్ మా చివరిది కావచ్చు, కానీ మేం ఒక గొప్ప పని చేస్తున్నాం" అని ఘోస్ట్ అన్నారు.

స్నైపర్‌ల ఒక చిన్న బృందం ఈ యుద్ధంలో గెలవలేదు లేదా బఖ్‌ముత్‌ను వెనక్కి తీసుకోలేదు. కానీ స్నైపర్‌ల దాడులు ప్రభావం చూపుతాయని మాత్రం నమ్ముతారు.

కనపడని ప్రదేశం నుంచి వినబడని శబ్దంతో రష్యన్ సైనికుడిని వేటాడటమనేది వారిపై మానసిక ప్రభావాన్ని చూపుతుందని కుష్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, బఖ్మూత్‌ పోరాటంలో తమ బలగాలు ముందుకు కదిలేలా చేస్తున్న యుక్రెయిన్ ఎలీట్ స్నైపర్స్‌

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)