విశాఖ: ‘బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి, మా అమ్మను చంపేసి వచ్చాడు'

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
“బాత్రూమ్‌కు అర్జెంటుగా వెళ్లాలని, నా బండి అడిగితే ఇచ్చాను. నా బండిపై మా ఇంటికే వెళ్లి మా అమ్మను హత్య చేశాడు. మళ్లీ నా దగ్గరకే వచ్చి మీ ఇంట్లో బాత్రూమ్ వాడుకున్నానని అమ్మగారు తిట్టారని నవ్వుతూ చెప్పాడు. అది కట్టుకథని, అప్పటికే అమ్మను చంపేశాడని నేను ఊహించలేకపోయాను” అంటూ తల్లిని కోల్పోయిన కోటగిరి శ్రీనివాసరావు కన్నీళ్లు పెట్టుకున్నారు.
విశాఖపట్నం సుజాతనగర్ 80 ఫీట్ రోడ్‌లో 72 ఏళ్ల కె. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని రాయవరపు వెంకటేష్ అనే యువకుడు ఆదివారం రాత్రి 10.30 గంటలకు హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
నిందితుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు.
బంగారు నగల కోసమే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Screen grabs
నిందితుడు వెంకటేష్ సుజాతనగర్‌కు సమీపంలోనే ఉన్న 95 వార్డు పురుషోత్తపురంలో వాలంటీరుగా పని చేస్తున్నట్లు బాధిత కుటుంబం తెలిపింది. దీంతో, 72 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
వెంకటేష్ వాలంటీరుగా పని చేస్తున్నాడా లేదా అనే అంశంపై పెందుర్తి పోలీసులతో బీబీసీ మాట్లాడింది.
“స్థానికులు రకరకాలుగా చెప్తున్నారు. కొందరు ఇంతకుముందు పని చేశాడని, ఇప్పుడు చేయడం లేదని, మరికొందరు చేస్తున్నాడని ఇలా చెప్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. అతడి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇతర వివరాలు తెలుస్తాయి” అని పెందుర్తి ఎస్ఐ అసిరి తాత బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
‘మా అమ్మను హత్య చేసి నా వద్దకే వచ్చాడు’
కోటగిరి శ్రీనివాసరావు, అతని తల్లిదండ్రులు గోపాలకృష్ణ, వరలక్ష్మీ సుజాతనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. తండ్రి, కొడుకు అక్కడే స్ట్రీట్ ఫుడ్ బండి నిర్వహిస్తున్నారు.
సమీపంలోనే ఉన్న పురుషోత్తపురానికి చెందిన వెంకటేష్ వీరి వద్ద రోజుకు రూ.400కు హెల్పర్‌గా చేరారు.
వెంకటేష్ తమకు పరిచయమై కేవలం 20 రోజులే అయ్యిందని శ్రీనివాసరావు తెలిపారు.
వెంకటేష్ తమ వద్దకు ఎలా వచ్చాడనే విషయాన్ని శ్రీనివాసరావు వివరించారు.
‘‘పురుషోత్తపురంలో వాలంటీరుగా పని చేస్తున్నాను. నాకు భార్య, చిన్నపాప ఉంది. వాలంటీరుగా వస్తున్న డబ్బులు సరిపోవడం లేదు. పైగా గతంలో కొన్ని వ్యాపారాలు చేసి డబ్బులు పోగొట్టుకున్నాను. ఏ పనైనా చేస్తానని అంటూ మా వద్దకు వచ్చాడు.
ఎంత కావాలని అడిగాను. పాప పాల కోసం రూ. 150 ఇచ్చినా చాలు అన్నాడు. సరేనని మా షాపులో రోజుకు రూ. 400 చొప్పున పనికి కుదుర్చుకున్నాను. అతడే మా అమ్మను చంపేస్తాడని ఊహించలేకపోయాను’’ అని శ్రీనివాసరావు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
‘బాత్రూం వాడుకున్నానని ఆంటీ దెబ్బలాడారని చెప్పాడు’
ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీనివాసరావు చెప్పారు.
‘‘మాది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కావడంతో ఏదైనా వస్తువులు అవసరమైనప్పుడు ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటుంటాం. దానికి నేను, మా నాన్న ఎవరో ఒకరు వెళ్తుంటాం. వెంకటేష్ మా వద్ద జాయిన్ అయిన తర్వాత అతడిని కూడా అప్పుడప్పుడు పంపుతున్నాం.
ఉల్లిపాయలు, ఇతర వస్తువులు ఏవైనా అవసరమైతే ఇంటికి వెళ్లి తీసుకుని రమ్మని వెంకటేష్‌ని పంపుతూ ఉంటాం. అలా మా ఇల్లు, మా అమ్మగారు కూడా వెంకటేష్‌కు పరిచయం. ఆదివారం వ్యాపారం జరుగుతుండగా... అర్జెంటుగా బాత్రూమ్‌కి వెళ్లాలి, బండి కావాలని అడిగాడు.
సరేనని నా టూవీలర్ ఇచ్చాను. రాత్రి 9.30కి వెళ్లాడు. అతని ఇల్లు మా షాపుకు సమీపంలోనే. చాలా సమయం గడిచినా, రాకపోయేసరికి వెంకటేష్‌కు ఫోన్ చేస్తే ‘మా పాపకి మందులు కోసమని వచ్చాను. మీ ఇల్లు దగ్గర కదా అని మీ ఇంట్లో బాత్రూమ్ వాడుకున్నాను అని చెప్పాడు’ సరే తొందరగా రా అని చెప్పాను.
ఎంత సేపైనా రాకపోయే సరికి మళ్లీ ఫోన్ చేస్తే... ‘పాప మందులు దొరకడం లేదండి...మరో షాపుకి వచ్చాను. వచ్చేస్తున్నానని చెప్పాడు.’ 10.45కి వచ్చాడు. మీ ఇంట్లో బాత్రూమ్ వాడుకున్నానని ఆంటీ (మా అమ్మ) తిట్టారండీ అని కూడా చెప్పాడు. మీ ఇల్లు పక్కనే ఉండగా, మా బాత్రూమ్‌కు ఎందుకు వెళ్తావు అని నేను మందలించాను. ఇంకెప్పుడూ అలా చేయనని అన్నాడు. కొద్ది సేపు తర్వాత షాపు మూసేసి మేం ఇంటికి బయలుదేరాం’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
హత్య చేశారని తెలియదు, పడుకుందని అనుకున్నాం: మృతురాలి భర్త
‘‘మేం షాపు నుంచి ఇంటికొచ్చే సరికి మంచంపై నా భార్య వరలక్ష్మీ పడుకుని ఉంది. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో తొందరగానే పడుకుంటుంది. మేం రోజూ మా పని చూసుకుని ఇంటికొచ్చి భోజనం చేసి ఎవరి మటుకు వాళ్లం నిద్రపోతాం. నా భార్య వద్ద, మా వద్ద ఇంటి తాళాలు వేర్వేరుగా ఉంటాయి’’ అని మృతురాలి భర్త గోపాలకృష్ణ చెప్పారు.
“మేం భోజనాలు చేసేందుకు సిద్ధమవుతుండగా... మా అబ్బాయి నాన్న అమ్మ చనిపోయిందంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఏమైందని నేను అక్కడికి వెళ్లి చూస్తే ఆమె ముక్కు నుంచి రక్తం చిన్నగా కారుతోంది. అప్పటికే చనిపోయి ఉంది.
ఆమె మెడలోని మంగళసూత్రం, బంగారు గొలుసు కనిపించలేదు. అలాగే బీరువాలో కొంత డబ్బు కూడా కనిపించలేదు. ఎవరో దొంగతనానికి వచ్చి ఆమెను హత్య చేసి ఉంటారని భావించాం. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం” అని గోపాలకృష్ణ తెలిపారు.
“నేను ఫోన్ చేసినప్పుడు మీ ఇంట్లోనే ఉన్నానండీ అని వెంకటేష్ చెప్పడంతో అతడిపైనే నాకు అనుమానమొచ్చింది. వెంటనే వెంకటేష్‌కి ఫోన్ చేసి రమ్మంటే వచ్చాడు. ఎందుకు హత్య చేశావని అడిగితే, నేను చేయడమేంటి, కావాలంటే పోలీసులకు కంప్లైట్ చేసుకో అని దురుసుగా మాట్లాడాడు” అని మృతురాలి కుమారుడు శ్రీనివాసరావు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
సీసీటీవీ పుటేజ్‌లో ఏముంది?
సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకున్నారు.
వృద్ధురాలి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు క్లూస్ టీం ఆధారాలు సేకరించిందని పెందుర్తి పోలీసులు చెప్పారు.
ఈ హత్య కేసుపై క్రైం ఏడీసీపీ గంగాధరం ఇతర వివరాలను వెల్లడించారు.
‘‘వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిందితుడు దోచుకెళ్లాడనే విషయాన్ని నిర్ధారించుకున్నాం. నిందితుడు వెంకటేష్ వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
రాత్రి 9 గంటల 47 నిముషాలకు అపార్ట్‌మెంట్ లోకి వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచి మళ్లీ రాత్రి 11 గంటల మధ్యలో బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాలేదు. ఈ 73 నిముషాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనతో వెంకటేష్‌పై అనుమానం వచ్చింది. అతడిని ప్రశ్నించాం. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
‘‘నిందితుడు వెంకటేష్ మృతురాలి కుమారుడు శ్రీనివాసరావు నిర్వహించే చికెన్ బిర్యానీ బండిలోనే పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాడు. అతడు స్ట్రీట్ ఫుడ్ దుకాణంలో పనికి చేరి కేవలం 20 రోజులే అవుతోంది. సామాన్లు, ఇతర వస్తువుల కోసం వీళ్లింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు.
అదే సమయంలో ఇంటి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డాడు. పైగా వెంకటేష్ గతంలో కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోయాడని తెలుస్తోంది. ఆ తర్వాత మాల్స్‌లో పని చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ గా కూడా చేశాడు. ఆర్థిక కష్టాలు పెరగడంతో డబ్బులు కోసం ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు’’ అని గంగాధరం చెప్పారు.
“అతడు వాలంటీరుగా పని చేశాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరింత పరిశీలించిన తర్వాత వివరాలు తెలుస్తాయి” అని ఏడీసీపీ గంగాధరం చెప్పారు. దర్యాప్తు పూర్తయితే కానీ స్పష్టత రాదు అని గంగాధరం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’.. భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం క్రైమ్ క్యాపిటల్‌గా మారుతోందా?
- మాట్లాడటం మానేసిందని యువతిపై వేట కొడవలితో దాడి
- కిడ్నీ కాజేయాలనుకున్న కోటీశ్వరుడిని జైల్లో వేయించిన 'వీధి వ్యాపారి'
- బాపట్ల: ‘అబ్బాయి శరీరమంతా కాలిపోయింది, కాపాడన్నా కాపాడన్నా అంటూ వచ్చాడు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














