'నా కళ్ల ముందే నా భార్య వరదలో కొట్టుకుపోయింది...' తెలంగాణలోని మోరంచపల్లిలో ఇంటింటికో విషాదం

గడ్డం శ్రీనివాసు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ వరదల్లో భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం దారుణంగా దెబ్బతింది. వరద వచ్చిన నాలుగు రోజుల తరువాత కూడా ఆ గ్రామం ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఇప్పటికీ సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సిబ్బందితో పాటూ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున గ్రామస్థులకు సహాయం చేస్తున్నాయి.

గ్రామానికి చెందిన నలుగురు వరదల్లో గల్లంతు కాగా, ఇద్దరి మృతదేహాలే దొరికాయి.

గ్రామాన్ని ముంచెత్తిన వరద తీవ్రతను బీబీసీకి వివరించారు గడ్డం శ్రీనివాసు. "నా భార్య నా కళ్లముందే కొట్టుకుపోయింది" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆవిడ ఆచూకీ ఇంకా దొరకలేదు.

మోరంచపల్లి వాగు

చిన్న చెట్టు ఆసరాతో...

‘‘తెల్లవారుజామున మూడున్నరకు బాత్రూంకని లేచి వెళ్లొచ్చాం. లోపలికి వచ్చాక మా బంధువు ఒకరు ఫోన్ చేసి వాన గట్టిగా పడింది. బయటకు రా అని చెప్పాడు.

తలుపు తీయగానే బయట చాలా నీళ్లున్నాయి. ఎందుకైనా మంచిదని ఇంటికి తాళం వేసి అలా వాకిట్లో కాలు పెట్టగానే నా ఎత్తు నీళ్లొచ్చాయి. నిమిషాల్లో నీళ్లు వచ్చేశాయి.

మా పెరట్లో ఉన్న ఆ చిన్న చెట్టును పట్టుకున్నాం నేనూ, నా భార్య. ఇద్దరం గంటసేపు చెట్టును పట్టుకునే ఉన్నాం. మా మీద నుంచే నీళ్లు వెళ్లాయి. బర్రెలు వచ్చి తాకాయి. గట్టిగా తగిలాయి. గడ్డివాములు మాకు తాకుతూ వెళ్లాయి.

ఎన్ని బర్రెలు తాకాయో చెప్పలేను. బర్రె తాకినప్పుడల్లా చెట్టు వంగేది. చివరకు చెట్టుకూడా పోతుందేమోనని ధైర్యం చేసి ఇంటి ముందున్న రెండు స్తంభాలను పట్టుకున్నాం’’ అంటూ బీబీసీతో చెప్పారు శ్రీనివాస్.

వరదలు

నీటిలో నాలుగు గంటల పాటు నరకం

ఆయన ఇంటి ముందు పాత డిజైన్‌లో రెండు సన్నటి సిమెంట్ స్తంభాలు పక్కనే ఉంటాయి. అవే శ్రీనివాస్ ప్రాణాలు కాపాడాయి. కానీ, ఆయన భార్య మాత్రం దక్కలేదు.

‘‘స్తంభాలను పట్టుకున్న తరువాత వరద మా మీద నుంచే వెళ్లింది. స్తంభాలను పట్టుకున్నప్పటికీ చేతులు జారిపోతున్నాయి. మునుగుతున్నాం. తేలుతున్నాం.

నా భార్యకు ఆస్తమా ఉంది. కాస్త బరువు ఉంటుంది. అప్పటికే ఆవిడకు దమ్ము (ఆయాసం) వచ్చేసింది. చేతులు నానిపోయి గ్రిప్ దొరకలేదు. అంతే.. నా కళ్లముందే జారిపోయింది. నా చేతుల్లోంచే వెళ్లిపోయింది.

ఆవిడ జారిపోవడంతో నేను షాక్‌తో నీటిలో కూలిపోయాను. కానీ, నా కాళ్లను రెండు స్తంభాల మధ్య ఇరికించుకుని బతికిపోయాను. ఆ తరువాత కూడా స్తంభాలను పట్టుకుని నీటి మట్టంతో పాటూ పైకి కిందకూ వెళుతూ జారుతూనే ఉన్నాను. ఎన్నో బర్రెలు తాకాయి.

ప్రవాహం తగ్గిన తరువాత అక్కడ కిటికీకి కట్టి ఉన్న టవల్ అందుకుని ఇంట్లోకి వెళ్లాను. అప్పటికి ఇంట్లో కూడా పీకల్లోతు నీరు ఉంది.

మేమిద్దరం కలసి గంటన్నర నరకం చూశాం. ఆమె వెళ్లిపోయాక మరో రెండు గంటలు నరకం చూశాను. సుమారు నాలుగు గంటలు నీటిలో నరకం కనిపించింది’’ అంటూ ఆ భయానక అనుభవం గుర్తు చేసుకున్నారు శ్రీనివాసు.

మోరంచపల్లి వరదలు

ప్రతీ ఇంటికో విషాద గాథ..

‘‘మా అమ్మ కోసం వెతికే క్రమంలో మా గ్రామానికే చెందిన మరో వృద్దురాలి శరీరం ఎక్కడో దూరంగా చెట్ల మధ్య కనిపించింది. కానీ, మా అమ్మ శరీరం దొరకలేదు. మా అమ్మ కోసం ఎవరూ వెతకలేదు’’ అంటూ ఆవేదనతో చెప్పారు శ్రీనివాసు కుమార్తెలు.

ఆ ఇంట్లో సాధారణ రోజుల్లో శ్రీనివాస్ అత్తగారు కూడా ఉంటారు. కానీ, వరద సమయంలో ఆమె మనుమరాలి ఇంటికి వెళ్లారు. ఐదు రోజులుగా ఆయన భార్య ఆచూకీ దొరకలేదు.

శ్రీనివాసు భార్యే కాదు, ఆ ఊరిలో మొత్తం నలుగురు వరదల్లో కొట్టుకుపోయారు. అందులో ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకాల్సి ఉంది.

మోరంచపల్లెలో ప్రతీ ఇంటిలో ఒక విషాద గాథ ఉంది. ఆత్మీయులను పోగొట్టుకున్న వారితో పాటూ, అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన వారు ఎందరో.

భూపాలపల్లి పట్టణానికి దగ్గరలో ప్రధాన రహదారి మీద ఉండే మోరంచపల్లె గ్రామాన్ని ఆనుకుని మోరంచ వాగు ప్రవహిస్తుంది. ఆ వాగు తెచ్చిన వరదే ఈ ఊరిని ఇలా మార్చింది.

తెల్లవారుజామున వచ్చిన వరద కొన్ని గంటల వ్యవధిలో ఊరిని ముంచేసి, అంతే వేగంగా వెళ్లిపోయింది. వరద ఉన్నది కొన్ని గంటలే అయినా ఆ ప్రభావం నుంచి మాత్రం ఆ గ్రామస్తులు ఇంకా తేరుకోలేదు.

మోరంచపల్లి వరదలు
ఫొటో క్యాప్షన్, మోరంచపల్లి వరదలు

హెచ్చరించని అధికారులు

ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. చాలా ఇళ్ల పునాదులు బయటపడ్డాయి. భూమి కింద కాంక్రీటు పిల్లర్లు కనిపిస్తున్నాయి. వరద తగ్గి నాలుగు రోజులు అయినా ఇంకా ఇళ్లల్లో వంట చేసుకునే పరిస్థితి లేదు.

వంట సామాగ్రి, పదార్థాలూ ఏమీ మిగల్లేదు. స్వచ్ఛంద సంస్థల వారు పెద్ద ఎత్తున వండిన ఆహారాన్ని పంచుతున్నారు. అలాగే బియ్యం, ఇతర సరకులు, దుప్పట్లు, చీర, పంచెలు ఇస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటూ రాజకీయ పార్టీలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి.

ఈ పంపకాలు చేసే వాహనాలు, తీసుకునే జనాలతో మెయిన్ రోడ్డుపై ఉండే ఆ ఊరిలో ట్రాఫిక్ కూడా మెల్లిగా వెళుతోంది. అనంతపురం ఆర్డీటీ నుంచి పెద్ద ఎత్తున వరద సహాయం సామగ్రి ఆ ఊరిలో పంచారు.

మోరంచపల్లి వరదలు

ఆదివారం కరెంటు తిరిగి ఇచ్చే పనులు మొదలుపెట్టారు. కరెంటు స్తంభాలు నాటి, తీగలు లాగుతున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయితీల సిబ్బంది సమ్మెలో ఉన్నారు. అయినప్పటికీ తాత్కాలికంగా సమ్మెను పక్కన పెట్టి ఈ ఉపద్రవంలో పనిచేస్తున్నారు ఆ చుట్టు పక్కల గ్రామాల పంచాయితీ సిబ్బంది.

వ్యవసాయం, పశు సంపద నష్టం కూడా బాగానే జరిగింది. ఫైర్, పోలీసు, వైద్య శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉన్నారు. గ్రామస్తులు ఇళ్లలో బురద కడుక్కోవడం నాలుగు రోజులుగా కొనసాగుతోంది. నిన్న కాస్త తెరిపి ఇవ్వడంతో మొత్తం నానిన బట్టలు ఉతుక్కుంటున్నారు. నీళ్లలో నానిపోయిన పరుపులు, కుర్చీలు, పుస్తకాలు ఊరంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ గ్రామం వరద దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.

‘‘గతంలో ఒకసారి ముందస్తు హెచ్చరిక చేశారు. రామప్ప చెరువు తెగిపోయేలా ఉంది అంటూ అధికారులు, పోలీసులు ఊరిలో అందర్నీ లేపారు. కానీ, అప్పుడు అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు. కానీ, ఈసారి ఎవరూ వరద గురించి చెప్పలేదు. అంత పెద్ద వరద గురించి సమాచారం ఎవరూ ఇవ్వలేదు’’ అని శ్రీనివాసు కుమార్తె బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 'నా కళ్ల ముందే నా భార్య వరదలో కొట్టుకుపోయింది'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)