భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోతే ప్రపంచంలో ఆహార సంక్షోభం మొదలవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా కోట్లమందికి రోజువారీ ఆహారమైన బియ్యాన్ని భారతదేశం ఎగుమతి చేయడం ఆపేస్తే ఏం జరుగుతుంది?
దేశంలో పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను జూలై 20న భారత్ నిషేధించింది. ఈ నిర్ణయంతో అమెరికా, కెనడాలలోని సూపర్ మార్కెట్లపై ఒక్కసారిగా ఒత్తిడి కనిపించింది. చాలామంది భారతీయు, ఆసియా సంతతి ప్రజలు షాపులకు ఎగబడి బియ్యాన్ని కొనుగోలు చేశారు. ధరలు కూడా పెరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా బియ్యం రకాలు ఉన్నా, అందులో కేవలం నాలుగు రకాలే ఎక్కువగా మార్కెట్ అవుతుంటాయి. ఇందులో ప్రధానమైనది సన్నని, పొడవైన ఇండికా రకం బియ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఎక్కువగా మార్కెట్ అవుతూ ఉంటుంది. రెండోది బాస్మతీ రకం బియ్యం. వీటితో పాటు సుషీ కోసం ఉపయోగించే పొట్టి రకం జపోనికా రైస్, స్వీట్స్ తయారీకి ఉపయోగించే స్వీట్ రైస్ ప్రధానమైనవి.
ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. తృణధాన్యాల వాణిజ్యంలో 40 శాతం వాటా భారత్‌దే (థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికాలు తర్వాతి స్థానాల్లో ఉంటాయి).
ఇక బియ్యం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా, ఫిలిప్పీన్స్, నైజీరియా ముందు వరసలో ఉంటాయి. ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు దేశీయంగా కొరత ఏర్పడినప్పుడే దిగుమతులకు ప్రయత్నిస్తుంటాయి. ఆఫ్రికాలో బియ్యం వాడకం ఎక్కువగా ఉండటంతోపాటు అది క్రమంగా పెరుగుతోంది కూడా. క్యూబా, పనామా వంటి దేశాలలో ఇదే ప్రధాన ఆహారం.
గత ఏడాది భారత్ 140 దేశాలకు 2.2 కోట్ల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో 60 లక్షల టన్నులు ఇండికా బియ్యమే. ఈ బియ్యం తక్కువ ధరకే లభిస్తాయి. (ప్రపంచ వాణిజ్యంలో బియ్యం వాటా 5.6 కోట్ల టన్నులని అంచనా)

ఫొటో సోర్స్, AFP
నిషేధం ప్రభావం
ఇండికా రకం వైట్ రైస్ ప్రపంచ వాణిజ్యంలో 70% వరకు ఉంటుంది. భారతదేశం ఇప్పుడు దాని ఎగుమతినే నిలిపివేసింది. గత సంవత్సరం నూకలపై నిషేధంతోపాటు, బాస్మతియేతర బియ్యంపై 20 శాతం సుంకం విధించింది.
బియ్యం ఎగుమతిపై నిషేధం ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరల గురించి ఆందోళన కలిగించిందనడంలో సందేహం లేదు. దీని కారణంగా బియ్యం ధరలు పెరుగుతాయని, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం ధరలు 15 శాతం వరకు పెరుగుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) లో చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివియర్ గౌరించాస్ అంచనా వేశారు.
పైగా, భారతదేశపు నిర్ణయం చాలా ప్రతికూలమైన సమయంలో వచ్చిందని అమెరికా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌లో మార్కెట్ ఎనలిస్ట్ షిర్లీ ముస్తఫా అన్నారు.
దీనికి కారణాలలో ఒకటి, 2022 ప్రారంభం నుండి ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత జూన్ నుండి 14% పెరుగుదల ఉంది.
రెండోది, మార్కెట్‌లలో కొత్త పంట రావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున సరఫరాలో ఒత్తిడి కనిపిస్తోంది.
ఇక మూడో అంశం, దక్షిణాసియాలో ప్రతికూల వాతావరణం. భారతదేశంలో రుతుపవనాలు సరిగా లేకపోవడం, పాకిస్తాన్‌లో వరదలు ఈ సప్లై చైన్‌పై ప్రభావం చూపించాయి. ఎరువుల ధరలు పెరగడంతో వరి సాగు ఖర్చు కూడా పెరిగింది.
కరెన్సీల విలువ తగ్గింపు అనేక దేశాలకు దిగుమతి ఖర్చులు పెరగడానికి కారణమైంది. అలాగే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం రుణాల భారాన్ని పెంచింది.

ఫొటో సోర్స్, AFP
పెరుగుతున్న ఖర్చులు
"దిగుమతిదారులు చాలా ఒత్తిళ్లలో ఉన్నారు. మున్ముందు వారు పెరిగిన ధరలను భరించగలిగే స్థితిలో ఉంటారో లేదో చూడాలి’’ అని ముస్తఫా అన్నారు.
భారతదేశం దగ్గర 4.1 కోట్ల టన్నుల దాకా నిల్వలు ఉన్నాయి. ఇది అవసరమైన బఫర్ నిల్వలకంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ బియ్యం దేశంలోని 70 కోట్లమంది పేదలకు చౌక ధరకే అందుతోంది.
ఏడాదికాలంగా భారతదేశం ఆహార ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడింది. గత అక్టోబర్ నుండి దేశీయ బియ్యం ధరలు 30% కంటే ఎక్కువ పెరిగాయి. ఫలితంగా వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్లకు ముందు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. అలాగే, రాబోయే నెలల్లో రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా, ప్రజల జీవన వ్యయంలో పెరుగుదల ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
"బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించే చర్య ముందు జాగ్రత్త. అలాగే ఇది తాత్కాలికం కావచ్చు కూడా" అని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జోసెఫ్ గ్లాబర్ అన్నారు.
దక్షిణాదిలోని వరి పండించే ప్రాంతాలలో ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, అందువల్ల ప్రభుత్వం ఉత్పత్తి కొరతను ఊహించి, దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తోందని అగ్రికల్చర్ పాలసీ నిపుణుడు దేవిందర్ శర్మ అభిప్రాయపడ్డారు.
అయితే, ప్రపంచ ఆహార భద్రతకు ఇబ్బంది కలిగించేలా భారతదేశం నిర్ణయం ఉందని, ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయాలని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు 42 దేశాల్లోని సగం బియ్యం దిగుమతులు భారతదేశం నుంచే జరుగుతాయి. ఆఫ్రికన్ దేశాలకు భారతదేశపు బియ్యపు ఎగుమతులు మార్కెట్ వాటాలో 80శాతానికి మించి పోయిందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు చెబుతున్నాయి.
ఆసియాలోని అత్యధికంగా బియ్యం వాడే దేశాలలో - బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, శ్రీలంకలు ఉంటాయి. ఈ దేశాలలో ప్రజలు ఒక రోజుకు తీసుకునే మొత్తం కేలరీలలో బియ్యం వాటా 40-67% వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పేదలపై ప్రభావం
"ఇలాంటి నిషేధాలు పేదరికంలో ఉన్నవారిని ఇబ్బంది పెడతాయి. వారి ఆదాయంలో ఎక్కువ భాగం ఆహార కొనుగోలుకే ఉపయోగించాల్సి ఉంటుంది’’ అని ముస్తఫా అన్నారు.
"పెరుగుతున్న ధరలు వారు తినే ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవడం, పోషకాలు లేని ప్రత్యామ్నాయాలకు మారడం, లేదంటే ఇంటి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించేలా చేస్తుంది’’ అని ముస్తఫా అభిప్రాయపడ్డారు.
దేశాలు ఆహారధాన్యాలను ఎగుమతి నిషేధించడం కొత్తేమీ కాదు. గత సంవత్సరం యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి, ఇలా ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించే దేశాల సంఖ్య మూడు నుంచి 16కు పెరిగిందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ ఇనిస్టిట్యూట్ చెబుతోంది.
ఇండోనేషియా పామాయిల్‌ను, అర్జెంటీనా గొడ్డు మాంసం ఎగుమతులను నిషేధించాయి. తుర్కియే, కిర్గిజ్‌స్తాన్ దేశాలు కొన్ని ధాన్యాల ఎక్స్‌పోర్టును నిలిపేశాయి. కోవిడ్ వచ్చిన మొదటి 4 వారాల్లో 21 దేశాలు తమ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించాయి.
అయితే భారతదేశపు నిర్ణయం ఎక్కువ నష్టాలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
‘‘ ఇది ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. చాలా ఆఫ్రికన్ దేశాల ఆహార భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుంది." అని దిల్లీకి చెందిన థింక్‌ట్యాంక్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐక్రియర్)లో పని చేస్తున్న అశోక్ గులాటి, రాయ దాస్ హెచ్చరిస్తున్నారు.
వీరి అభిప్రాయం ప్రకారం భారతదేశం జీ-20లో గ్లోబల్ సౌత్‌కు బాధ్యతాయుతమైన నాయకుడిగా ఎదగాలంటే, హఠాత్తుగా తీసుకునే ఇలాంటి నిషేధ నిర్ణయాలను నివారించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల దిగుమతుల విషయంలో మిగిలిన దేశాలు భారతదేశాన్ని అపనమ్మకంతో చూస్తాయి.’’
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















