ఓపెన్‌హైమర్: అణుబాంబు తయారు చేస్తున్నప్పుడు ఒక సైంటిస్ట్ చనిపోయారు... ఎలాగో తెలుసా?

ఓపెన్‌హైమర్ నాయకత్వంలోని మ్యాన్‌హాటన్ ప్రాజెక్టులో ఒకరోజు జరిగిన అతి సాధారణమైన చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక శాస్త్రవేత్త చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అణుబాంబు తయారు చేస్తున్న సైంటిస్టులకు ఏం జరిగిందో, అది ఇప్పటికీ ఒక గుణపాఠంగా ఎందుకు మారిందో చిత్రకారుడు, రచయిత బెన్ ప్లాట్స్-మిల్స్ ప్రత్యేకంగా చిత్రీకరించిన ఈ కథలో వివరించారు.
''జీవితం సాఫీగా సాగాలని జరిగే అన్వేషణలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అస్తిత్వ నాటకంలో మనమే నటులు, మనమే ప్రేక్షకులమనే సంగతి అస్సలు మర్చిపోకూడదు'' నీల్ బోర్, భౌతిక శాస్త్రవేత్త.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మ్యాన్‌హాటన్ ప్రాజెక్టును చేపట్టింది. దేశవ్యాప్తంగా చాలా మంది సైంటిస్టులు, ఇంజనీర్లను చేర్చుకుని న్యూమెక్సికోలోని లాస్ ఆలమోస్‌లోని రహస్య పరిశోధన కేంద్రానికి తరలించింది.
వారంతా అక్కడే ఉండి పనిచేయాల్సి ఉంటుంది. ఎడారిలోని ఈ పరిశోధన కేంద్రంలోనే రాబర్ట్ ఓపెన్‌హైమర్ సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటసారిగా అణుబాంబులను తయారు చేశారు.
1946 మే 21న ఫిజిసిస్ట్ (భౌతిక శాస్త్రవేత్త) లూయిస్ స్లోటిన్ పనిచేసుకుంటున్నారు. కొద్దివారాల్లోనే ఆయన అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంది. బాంబులను అసెంబుల్ చేయడంలో స్లోటిన్ నిపుణుడు.
జపాన్‌పై ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్ అణుబాంబులతో దాడి చేయడానికి నెల రోజుల ముందు 1945 జులైలో ట్రినిటీలో అమెరికా అణుపరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో వినియోగించిన బాంబును ఆయనే అసెంబుల్ చేశారు.
అయితే, ఓపెన్‌హైమర్ మాదిరిగానే ఆయన కూడా అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.
స్లోటిన్ తన తర్వాత ఆ స్థానంలోకి రానున్న అల్విన్ గ్రేవ్స్‌ను వెంటబెట్టుకుని లేబొరేటరీ చూపిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో లేబొరేటరీ భవనాల మధ్య తిరుగుతున్నప్పుడు గ్రేవ్స్‌కి ఏదో కనిపించింది. అదే ''క్రిటికల్ అసెంబ్లీ.'' అందులో స్లోటిన్ సిద్ధహస్తుడు.

ఆయనపై నమ్మకముంది... కానీ,
ప్రయోగాత్మకంగా ఉపయోగించే అణుబాంబు లాంటిదే ఇది కూడా. ప్లూటోనియం కోర్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు దానిని ఉపయోగిస్తారు.
అసెంబుల్ ప్రక్రియ ఎలా చేస్తారో తాను ఇంతవరకూ చూడలేదని గ్రేవ్స్ అనడంతో, తాను చేసి చూపిస్తాను రమ్మన్నారు స్లోటిన్.
ఆ గదిలో మరోవైపు ఉన్న స్లోటిన్ సహోద్యోగి రయ్‌మెర్ స్కైబర్ అందుకు ఒప్పుకున్నారు. నెమ్మదిగా, జాగ్రత్తగా చేయాలని ఆయన సూచించారు.
''మా అందరికీ స్లోటిన్ సామర్థ్యంపై నమ్మకముంది'' కాబట్టి అది అంత సీరియస్ విషయం కాదనుకున్నట్లు ఆ తర్వాత స్కైబర్ చెప్పారు.
ప్లూటోనియం కోర్ రియాక్టివిటీని నిర్దిష్ట స్థాయికి తీసుకొచ్చి చూపించాలని అనుకున్నారు. ఒక కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంచడం లాంటిదే ఇది కూడా.
అయితే, అక్కడ ఏం జరిగిందనే విషయంపై మాత్రం విరుద్ధమైన నివేదికలు వచ్చాయి. స్లోటిన్ బాగానే చేశారని అక్కడున్న ఒకరు చెప్పారు. అది చాలా సాధారణమని మరికొందరు అన్నారు.
అయితే, ''అక్కడున్న వాటిని సరిగ్గా పరిశీలించకుండానే స్లోటిన్ చాలా వేగంగా క్రిటికల్ అసెంబ్లీని ఆపరేట్ చేశారు.'' ఆ గదిలో ఉన్న వాళ్లంతా ''మౌనంగా ఉన్నారు. ఆయన చేస్తున్న పనికి వారంతా ఒప్పుకున్నారు'' అని అధికారికంగా సమర్పించిన నివేదికలో స్కైబర్ తెలిపారు.
''ఒక్కసారిగా ఏదో జరిగినట్టు శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూశాను'' అని స్కైబర్ రాశారు.
''నేనొక బ్లూ ఫ్లాష్ చూశాను. దానితో పాటే వేడి తరంగాలు కూడా వచ్చాయి.''
''స్క్రూడ్రైవర్ జారిపడినట్లు అనిపించింది. దీంతో రిఫ్లెక్టర్ వెళ్లి ప్లూటోనియంపై పడడంతో అది 'ప్రాంప్ట్ క్రిటికల్' (రియాక్ట్) స్థాయికి వచ్చినట్టుంది. సెకనులో పదో వంతు సమయంలోనే అదంతా జరిగిపోయింది.'' అని స్కైబర్ రాశారు.

క్షణాల్లో జరిగిపోయింది...
పైభాగంలో ఉండే రిఫ్లెక్టర్‌ని స్లోటిన్ వెంటనే కిందవైపుకి తిప్పాడు. అయితే, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లో ఆ గది అంతా నిశ్శబ్దంగా మారింది.
''మంచిది. జరిగిపోయింది.'' అని స్లోటిన్ చిన్నగా అన్నాడు.
దాని తర్వాత అక్కడ అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. సైంటిస్టులంతా కారిడార్ బయట గుమిగూడారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో స్లోటిన్ ఒక చిత్రాన్ని గీశారు. దూరంగా ఉన్న స్కైబర్ వెంటనే వెళ్లి రేడియేషన్ రీడింగ్ పరిశీలిస్తున్నారు. ఆయన అక్కడే ఉన్నప్పటికీ తన జాకెట్‌ను సిద్ధం చేసుకున్నారు.
ఒక్కసారి రేడియేషన్ విడుదలయ్యాక మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అంతకుముందులా ఉండలేరని ఒక అంతర్గత నివేదిక తెలిపింది. అది వెర్టిగోకి దారితీసే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. అయితే, అది అణుప్రభావం నేరుగా పడిందా? లేదా అది మరణానికి దారితీస్తుందా? అనే విషయాలు ఆ రిపోర్టులో లేవు.
ఆ ఘటన తర్వాత అవయవాలు పనిచేయకపోవడంతో 9 రోజులకి స్లోటిన్ చనిపోయారు.
''రేడియేషన్ వల్ల మరణం సంభవిస్తుందనడానికి అదే స్పష్టమైన ఉదాహరణ'' అని ఆయన సహోద్యోగి ఒకరు వివరించారు.
అధికారి చెప్పినట్టు స్లోటిన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేదా అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో కనుక్కోవడం కష్టంగా మారిందా?
1940లలో అణుబాంబులపై పరిశోధనలు జరుగుతున్న సమయంలో డానిష్ ఫిజిసిస్ట్ నీల్స్ బోర్ క్వాంటమ్ మెకానిక్స్ ఆవిష్కరణల్లో ఉన్నారు. సైంటిఫిక్ ఆబ్జెక్టివిటీలో ఉన్న క్లిష్టమైన విషయాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు.
గతంలో భౌతిక శాస్త్రంలో చెప్పిన విధంగా కాకుండా, క్వాంటమ్ యాక్టివిటీని కేవలం భౌతికంగా పరస్పర చర్య ద్వారా మాత్రమే కొలవగలమని బోర్స్ చెప్పారు. ఈ పరస్పర చర్య పరమాణువులు, వాటిని కొలిచేందుకు ఉపయోగించే పరికరాలను రెండింటినీ మార్చేసింది.
ఆబ్జెక్టివిటీ అనేది కేవలం మనం పరోక్షంగా గుర్తించగలిగేది మాత్రమే కాదు, శాశ్వతంగా కనిపిస్తుంది. అది ఎలక్ట్రాన్ ప్రభావం వల్ల ఫొటోగ్రఫిక్ ప్లేట్‌పై కనిపించిన గుర్తు లాంటిది. దాని ప్రభావం ప్రయోగానికి ఉపయోగించిన వస్తువులపై కనిపిస్తుంది.
పరమాణు సిద్ధాంతం వాటిని కొలిచేందుకు ఉపయోగించే పరికరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, అందుకు ఉపయోగించిన పరికరాన్ని బట్టి ఉంటుంది.

క్రిటికల్ స్థాయికి ఎందుకు చేరుకుంది?
ప్రయోగాత్మక పరిస్థితుల గురించి బోర్ వివరిస్తూ, అతను మనిషి శరీరం గురించి కాకుండా కేవలం ఉపకరణాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండి ఉంటారని అన్నారు. అయితే, ఆ రోజు క్రిటికల్ అసెంబ్లీని మాన్యువల్‌గా ఆపరేట్ చేయడం ద్వారా స్లోటిన్ శరీరం కూడా ఉపకరణంలో భాగంగా మారిందని, పరమాణు ప్రభావం అన్నింటిపై ఒకే విధంగా ఉంటుందని ఆయన అన్నారు.
అదనపు న్యూట్రాన్ రిఫ్లెక్టర్‌గా పనిచేసే బెరీలియం హెమీస్ఫియర్‌పై ఆయన చేయి లేకుండా ఉండి ఉంటే, ప్లూటోనియం కోర్ 'క్రిటికల్ స్థాయి'కి చేరుకోలేదని అప్పటి ప్రమాదంపై 2018లో నిర్వహించిన రీకన్‌స్ట్రక్షన్ తెలిపింది.
విషాదమేంటంటే, స్లోటిన్ మరణం అనూహ్యం ఏమీ కాదు. ఏడాది ముందు ప్లూటోనియం కోర్ వల్ల జరిగిన ప్రమాదంలో ఆయన సహోద్యోగి ఒకరు చనిపోయారు.
నిజానికి, అతని బాస్ ఎన్రికో ఫెర్మీ కొద్దినెలల ముందే క్రిటికల్ అసెంబ్లీపై స్లోటిన్ పనిచేస్తున్న విధానం గురించి హెచ్చరించారు. ''నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఏడాదిలో చచ్చిపోతావు'' అని ఆయన అన్నారు. ప్రమాదాల గురించి ఫెర్మీ మాత్రమే మాట్లాడేవారు. అందువల్ల పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఒకసారి భారీ పేలుడు పదార్థానికి సంబంధించిన ఒక చిన్న వస్తువు ఒకరి నోట్లో పడడం, ప్రమాదవశాత్తూ ఆయన దాన్ని మింగేయడం లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ వైల్డర్ చూశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లాస్ ఆలమోస్ హై ఎక్సప్లోజివ్స్ అండ్ అసెంబ్లీ టీమ్‌లో ఆయన పనిచేశారు. అప్పటికీ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు పెద్దగా లేవు.
ఒక ప్రయోగం అంటే.. మనం ఏం చేశాం, దాని నుంచి మనం ఏం తెలుసుకున్నామనేది ఇతరులకు చెప్పడమని నీల్స్ బోర్ ఒకసారి చెప్పారు.
ఆ విధంగా చూస్తే, స్లోటిన్‌కు జరిగిన ప్రమాదం ఒక చేజారిన అవకాశం లాంటిది. సాంకేతికంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న విషయం గురించి అంతగా పట్టించుకోకపోవడమనేది ఇందులో కనిపిస్తుంది.
స్వగ్రామంలో జరిగిన స్లోటిన్ అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు. కానీ, ఆయన మరణం గురించి చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుకున్నారు.

'ఆయన ఎలా బతికి ఉన్నారో అర్థం కాలేదు'
అమెరికా ప్రభుత్వం ఈ పరిశోధనలను రహస్యంగా ఉంచడం వల్లే ఈ విషయం బయటికి రాలేదు. స్లోటిన్ మరణంతో అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
ఆ తర్వాత స్లోటిన్‌కు జరిగిన తరహాలో ప్రమాదాలు జరగకుండా వాటిని ఆపరేట్ చేసేందుకు భద్రతాప్రమాణాలు పాటిస్తూ కొత్త విధానాన్ని స్క్రైబర్ అభివృద్ధి చేశారు.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో స్టోలిన్ పక్కనే ఉన్న గ్రేవ్స్‌పై కూడా రేడియేషన్ ప్రభావం తీవ్రంగా పడింది. అధికారిక నివేదికలో ప్రభావాన్ని తగ్గించి చూపించినప్పటికీ, ఆయన ఎడమ కన్ను మసకమసకగా, దాదాపు కనిపించనంతగా దెబ్బతింది. ఆయన వీర్యకణాల సంఖ్య పెరిగేందుకు కూడా చాలా నెలల పట్టింది.
''ఆ సంఘటన జరిగిన 38 నెలల తర్వాత ఆయన పరిస్థితి మెరుగైంది. చాలా బాధ్యతాయుతమైన పదవిలో కష్టపడి పనిచేస్తున్నారు'' అని ఒక నివేదికలో పేర్కొన్నారు.
గ్రేవ్స్‌కి వైద్యం చేసిన హీమటాలజిస్ట్ ఫ్లోయ్ యాగ్నెస్ లీ 2017లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అప్పడు అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించారు.
''ఆయన శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినా ఆయన ఎలా బతికి ఉన్నారో అర్థం కాలేదు'' అని ఆమె అన్నారు. ఆయన జుట్టు మళ్లీ పెరగడం ఎప్పుడు ప్రారంభమైందో సరిగ్గా గుర్తులేదన్నారు.
ఆ తర్వాత గ్రేవ్స్ లాస్ ఆలమోస్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పసిఫిక్ దీవులను ఆవిరి చేసిన, సముద్ర జీవావరణంపై పెనుప్రభావం చూపిన ఎన్నో విధ్వంసకర ఆయుధ పరీక్షలను ఆయన సమీక్షించారు. ఆ ప్రయోగాలు అక్కడి ప్రజలకు భయంకరమైన అణువారసత్వాన్ని మిగిల్చాయి.
క్యాన్సర్‌కి గురయ్యే అవకాశాలు పెరగడంతో పాటు, జననాల రేటుపై అణుప్రభావం పడింది. ఇక సొంత ప్రదేశాల నుంచి తరలిపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇవి కూడా చదవండి:
- భారత్-శ్రీలంక మధ్య వంతెన కడితే రామ సేతు ధ్వంసమవుతుందా?
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
- మైటోకాండ్రియల్ ఈవ్: ప్రపంచంలోని ఆడవాళ్లందరికీ మూలం ఈమేనా?
- మగ శరణార్థుల కోసం తీరంలో తేలియాడే నివాసం.. లోపల ఏముంది?
- ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?














