మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?

ఫొటో సోర్స్, MANISH JAIN/EPA-EFE/REX/SHUTTERSTOCK
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లోని విమానాశ్రయం నుంచి బయటికి అడుగు పెట్టగానే నీలాకాశం కనిపిస్తుంది. గాలిలోని తాజాదనాన్ని అనుభవిస్తారు. ఫోన్ నిశ్శబ్ధంగా మారుతుంది.
దాదాపు మూడు నెలల కిందట కుకీ, మెయితీ వర్గాల మధ్య మొదలైన అల్లర్లు, ఆ తర్వాత హింసాకాండకు సంబంధించిన భయాలు మీ మనసులో మెదులుతుంటాయి. కానీ, దీనికి విరుద్ధంగా అక్కడ వాతావరణం నిశ్శబ్ధంగా ఉంది.
ఈ హింసాత్మక ఘర్షణలు గురించి మీకు తెలిసి ఉండకపోతే ఈ నిశ్శబ్ధ వాతావరణాన్ని మీరు ప్రశాంత వాతావరణంగా, శాంతిగా పొరబడొచ్చు.
మణిపుర్‌లో మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేశారు. దేశంలోని ఏదో మూలలో జరిగిన ఘర్షణలు, అల్లర్ల తాలూకూ వార్తల నోటిఫికేషన్లు మీ మొబైల్‌కు వచ్చే అవకాశం లేదు.
పగటి వేళల్లో ఇంఫాల్‌లోని రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలు, మార్కెట్‌లో తెరుచుకున్న దుకాణాలు, గస్తీ కాస్తున్న పోలీసులు వాహనాలు అక్కడి పరిస్థితులు సాధారణంగా మారాయనే భ్రమను కలిగిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మేం ఒక పెద్ద భవనం ముందు నుంచి వెళ్తూ దాన్ని గమనించాం. అది పూర్తిగా మంటల్లో కాలిపోయి నల్లగా మారింది. అది ఒక మాల్. అందులో చతురస్రాకారంలో ఉన్న ఉన్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
మాల్ మాత్రమే కాదు అక్కడి పాఠశాల భవనాలది ఇదే పరిస్థితి. ఇవన్నీ మే నెలలో చెలరేగిన హింసకు గుర్తులు.
'రిలీఫ్ క్యాంప్' అని రాసి ఉన్న బోర్డులు చాలా చోట్ల కనిపించాయి. వీటిలో కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి కాగా మరికొన్నింటిని ఇతర పార్టీలు, సంస్థలు ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాలు చాలా వరకు పాఠశాల భవనాల్లోనే ఏర్పాటు చేశారు.
స్కూళ్లు ఇంకా మూతపడే ఉన్నాయి. ఇంటర్నెట్ లేదు కాబట్టి పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే ప్రసక్తి కూడా లేదు.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బడులను తెరవాలని మూడు వారాల కిందట ప్రభుత్వం ఆదేశించింది.
హింసాకాండ తర్వాత లోయల్లో నివసించే మెయితీలకు, పూర్తిగా పర్వత ప్రాంతాలకు తరలిపోయిన కుకీ ప్రజలకు మధ్య బలమైన విభజన రేఖ ఏర్పడింది. లోయ, పర్వతాల మధ్య ఏర్పడిన ఈ చీలికే ఇప్పుడు మణిపుర్‌లోని గ్రౌండ్ రియాలిటీ.

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్ లోపల సరిహద్దు
జాతి ఘర్షణలకు ముందు ఇంఫాల్ లోయ, మెయితీ ఆధిపత్య ప్రాంతంగా ఉండేది.
ఇంఫాల్‌లో పెద్ద పెద్ద పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉండటంతో కుకీ గ్రూపుల ప్రజలు కూడా ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు.
హింస తర్వాత వారంతా లోయ వదిలి కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొండ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో నివసిస్తున్న మెయితీలు కూడా అక్కడి నుంచి పారిపోయి ఇంఫాల్‌లోని సహాయక శిబిరాల్లో చేరారు.
మణిపుర్ నడిబొడ్డున ఉన్న ఇంఫాల్ లోయ చుట్టూ సరిహద్దు గీశారు. మెయితీ ప్రజలు పర్వత ప్రాంతాలకు వెళ్ళలేరు. కుకీ ప్రజలు లోయకు రాలేరు.
ముస్లింగా ఉండటం సురక్షితం
మెయితీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఉన్న ఈ రేఖను, రెండు వర్గాలలో ఎవరితోనూ స్నేహం లేదా శత్రుత్వం లేని వారు మాత్రమే దాటగలరు.
హిందువులు మెజారిటీగా ఉండే మెయితీ, క్రైస్తవులు అధికంగా ఉండే కుకీ ప్రాంతాల మధ్య ప్రయాణించే వ్యక్తులు ముస్లిం డ్రైవర్ల సహాయం తీసుకుంటారు. మణిపుర్‌లో ముస్లింగా ఉండటం సురక్షితం.
మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పటివరకు కుకీ ప్రజలను కలిసేందుకు వారి ప్రాంతాలకు వెళ్లలేదు. దీనికి కారణం మెయితీలు అని అంటున్నారు.
గవర్నర్ అనుసుయా ఉకే స్వస్థలం మణిపుర్ కాదు. ఆమె మెయితీ, కుకీ ప్రాంతాల్లోని శిబిరాలను సందర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా?
కుకీ, మెయితీ కమ్యూనిటీల మధ్య సరిహద్దు ఒక రేఖలా ఉండదు. ఇది అనేక కిలోమీటర్లతో కూడిన ప్రాంతం. మెయితీ ప్రాంతం నుంచి నిష్క్రమించడానికి, కుకీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి మధ్య గల ఈ దూరంలో చాలా చెక్ పాయింట్లు ఉన్నాయి.
మొదటి చెక్‌పాయింట్ వద్ద మెయితీ కమ్యూనిటీ వాళ్లు ఉంటారు. చివరి చెక్ పాయింట్ కుకీ కమ్యూనిటీ చేతుల్లో ఉంటుంది. మధ్యలో ఆర్మీ, పోలీసుల చెక్ పాయింట్లు ఉన్నాయి.
ఈ కమ్యూనిటీల ప్రజలు కొన్నిచోట్ల గోనె సంచులతో, కొన్ని చోట్ల ముళ్ల తీగలతో, పెద్ద పెద్ద పైపులతో దారిని అడ్డుకున్నారు. ఈ చెక్‌పాయింట్‌ల వద్ద ఉండే వ్యక్తుల వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ప్రతీ వాహనాన్ని ఆపి పరిశీలిస్తారు. వాహనంలో ఏదైనా ఆయుధం ఉందేమో అని తనిఖీ చేస్తారు. వాహనం నడిపే వ్యక్తి గుర్తింపు కార్డును అడగడం ద్వారా అతని కులం, మతానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ వివరాల ద్వారా సరిహద్దు దాటడానికి అతనికి హక్కు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తారు.
మెయితీ, కుకీ వర్గాల వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఈ పకడ్బందీ చెక్ పాయింట్లు ఒక వింత అనుభవం. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండీ లేనట్లుందని చెప్పడానికి ఈ చెక్ పాయింట్లే నిదర్శనం.
నగరంలో నివసించే వారితో పాటు గ్రామస్థుల వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయి. అవి చౌకగా లభిస్తాయి. ప్రజలు తమ భద్రత కోసం ఇళ్లు, కార్యాలయాల్లో వాటిని ఉంచుకుంటారు.
ఇంఫాల్‌లో ఒక వ్యక్తి, చాలా మామూలుగా తన టేబుల్ కింద నుంచి ఒక నిజమైన గ్రెనేడ్‌ను బయటకు తీసి మాకు చూపించారు.
ఆత్మరక్షణ కోసం గ్రెనేడ్‌ను దగ్గర పెట్టుకున్నట్లు ఆయన మాకు చెప్పారు.

హింస భయం
రాష్ట్రంతో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో మాత్రమే ఉన్నాయి. ఇంఫాల్ లోయ నుంచి పర్వత ప్రాంతాలకు వెళ్ళే రోడ్లకు రెండు వైపులా కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన వాహనాలు పడి ఉన్నాయి.
ఈ గ్రామాల నుంచి ప్రజలు పారిపోయారు. కాలిపోయి మిగిలిపోయిన భవనాలలో ఆర్మీ వారు ఉంటున్నారు.
రోజూ సాయంత్రం రెండు వర్గాల మధ్య కాల్పులు మొదలవుతాయి.
ఈ ఘటనల్లో ఒక్కోసారి మనుషులు చనిపోయినట్లు, కొన్ని సార్లు ఖాళీగా ఉన్న దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తుంటాయి. కూరగాయలు, పండ్లు, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ హింసాపూరిత భయాల మధ్యే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఎనిమిదో తరగతి వరకు పాఠశాలలు తెరవాలని మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది.
ఇంఫాల్ లోయలో కొన్ని స్కూళ్లు తెరుచుకున్నాయి కూడా. కానీ చాలా తక్కువ మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు.
కొండ ప్రాంతాల్లో పాఠశాలలు అసలు తెరవలేదు. అక్కడి సహాయ శిబిరాల్లో వాలంటీర్లు తమకు తెలిసినంత వరకు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కానీ, ఉండటానికి ఇల్లు కూడా లేననప్పుడు చదువు మీద దృష్టిపెట్టడం చాలా కష్టమే.
చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు లోయ ప్రాంతంలోనే ఉన్నాయి.
పని చేయకపోతే జీతమివ్వబోమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మెయితీ వర్గానికి చెందిన వారు తిరిగి పని చేయడం మొదలుపెట్టారు. కానీ, కుకీలు చెప్పినదాని ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో వారు లోయ ప్రాంతానికి వెళ్లడం దాదాపు అసాధ్యం.

ఫొటో సోర్స్, Reuters
సూర్యుడు అస్తమించగానే ప్రతీచోటు నిర్మానుష్యంగా మారుతుంది. రాత్రి వేళల్లో మణిపుర్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది.
కోపం, ద్వేషాలు బిగ్గరగా కనిపిస్తుండగా.. శాంతి గురించి మాట్లాడే వారు మాత్రం, తమ సొంత కమ్యూనిటీ వారే తమపై కోపం తెచ్చుకోవచ్చనే భయంలో ఉన్నారు.
మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ప్రతీ ఫోన్‌లో ఉంది.
వైఫై కనెక్షన్‌ల ద్వారా, ఇంటర్నెట్ లేకుండానే వీడియోలను బదిలీ చేసే యాప్‌ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతోంది.
దానితో పాటు కోపం, దు:ఖం, ద్వేషం అనే భావనలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. మణిపూర్ మధ్య గీసిన సరిహద్దును ఎలాంటి అడ్డంకి లేకుండా దాటుతున్నవి కూడా ఈ భావనలే.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















