‘లవ్ బాంబింగ్’ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలా బలి అవుతారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదర్శ్ రాఠోర్
- హోదా, బీబీసీ కోసం
కొందరు మిమ్మల్ని ప్రతీరోజూ మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, ఫోన్ కాల్‌ల ద్వారా చాలా సార్లు సంప్రదిస్తుంటారు. మిమ్మల్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతారు. మీ కంటే సమర్థులు ఎవరూ లేరన్నట్లుగా మాట్లాడుతుంటారు.
మీరు వారిని కలిసి కొన్ని రోజులే అయి ఉంటుంది. కానీ, వారు మిమ్మల్ని పొగడటంలో, మీకు వాగ్దానాలు ఇవ్వడంలో గంటల సమయం గడిపి ఉంటారు. ఈ రకమైన ప్రవర్తననే 'లవ్ బాంబింగ్' అంటారు.
డేటింగ్‌కు సంబంధించి తరచుగా ఈ పదాన్ని వాడుతుంటారు. అయితే, లవ్ బాంబింగ్ అనేది కేవలం రొమాంటిక్ సంబంధాలకే పరిమితం కాలేదు. పనిచేసే చోట కూడా చాలామంది ఇలాంటి ప్రవర్తనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు చాలా కంపెనీలు అభ్యర్థుల పట్ల ఇలాంటి ప్రవర్తనను కనబరుస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగ బాధ్యతలు, విధి విధానాలు, చేయాల్సిన పని గురించిన సమాచారాన్ని ఇవ్వడానికి బదులుగా అభ్యర్థుల పని అనుభవాన్ని ప్రశంసించడం, ఇతర హామీలు ఇస్తూ వారిని ఆకర్షించడానికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి.
బెంగుళూరులోని ఒక బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రోహిత్ పరాశర్ తనకు గత ఉద్యోగంలో ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు.
వడోదరలోని ఒక కంపెనీలో ఆయన అంతకుముందు పనిచేసేవారు. అయితే, జీతం పెరగకపోవడంతో ఉద్యోగం మారాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గురుగ్రామ్‌లోని ఒక కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగానికి ఎంపికయ్యారు కూడా.
ఇంతలో రోహిత్‌కు మునుపటి కంపెనీలో జీతం పెరిగింది. అయితే గురుగ్రామ్ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ విభాగం తమ కంపెనీ ఆఫర్‌ను అంగీకరించాల్సిందిగా రోహిత్‌కు చాలా రోజుల పాటు ఫోన్ చేసి ఒప్పించింది.
తమ కంపెనీ మంచి వేతనం ఇవ్వడం మాత్రమే కాకుండా, అనేక ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తుందంటూ తనకు పదే పదే ఫోన్లు చేశారని రోహిత్ చెప్పారు.
‘‘మా కంపెనీలో పని చేసే సంస్కృతి బాగుంటుంది. మేం ఉద్యోగుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం. మీ ప్రొఫైల్ ప్రకారం మీకు పనిని కేటాయిస్తాం. మంచి పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి’’ అని తనకు చెప్పినట్లు రోహిత్ వివరించారు.
సుదీర్ఘ చర్చల తర్వాత చివరకు రోహిత్ ఆ ఆఫర్‌ను అంగీకరించారు. వడోదరలో ఉద్యోగం వదిలేసి గురుగ్రామ్ చేరుకున్నారు..
తమ వద్ద ఖాళీ అయిన ఉద్యోగాలకు సరిపడా అర్హత కలిగిన అభ్యర్థులు లేబర్ మార్కెట్‌లో అందుబాటులో లేనప్పుడు కంపెనీలు ఇలా వ్యవహరిస్తాయని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కెరీర్ కోచ్‌గా పనిచేస్తున్న సమోరన్ సెలిమ్ చెప్పారు.
ప్రతిభ గల అభ్యర్థులను ఆకర్షించడానికి రిక్రూటర్లు ఇలా ప్రవర్తిస్తుంటారని సమోరన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం మంచిని మాత్రమే చూపించడం
కొన్నిసార్లు కంపెనీలు తమలోని సానుకూల అంశాలను మాత్రమే చూపించేలా రిక్రూటర్లపై ఒత్తిడిని తెస్తాయి.
ఒక రొమాంటిక్ రిలేషన్ తొలినాళ్లలో ఉన్నట్లుగా రిక్రూటర్లు తమ కంపెనీ బలహీనతలను కాకుండా పాజిటివ్ అంశాలను మాత్రమే అభ్యర్థులకు చూపించాలని కోరుకుంటారని కెరీర్ కోచ్ సమోరన్ చెప్పారు.
అభ్యర్థులతో తాము లవ్ బాంబింగ్ తరహాలో వ్యవహరిస్తున్నామనే సంగతిని చాలా మంది రిక్రూటర్లు గుర్తించలేరని గ్లోబల్ రిక్రూట్‌మెంట్ కంపెనీ ‘సియెలో’కు చెందిన యూకే మేనేజింగ్ డైరెక్టర్ సాలీ హంటర్ తెలిపారు.
కానీ, కొన్నిసార్లు ఈ లవ్ బాంబింగ్ వంటి ప్రవర్తన వెనుక ఇతర కారణాలు కూడా ఉండొచ్చని సాలీ హెచ్చరించారు.
‘‘రిక్రూటర్లు కంపెనీలో ఉద్యోగాల భర్తీని థర్డ్ పార్టీకి అప్పగించిప్పుడు...థర్డ్ పార్టీ వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం అతిశయోక్తులు మాట్లాడుతూ అభ్యర్థులను ఆకర్షిస్తుంటారు. రిక్రూట్‌మెంట్ ద్వారా ఎక్కువ కమిషన్ వస్తుంటే దాన్ని పొందడానికి వారు అభ్యర్థులను మంచి మంచి మాటలతో ఆకర్షిస్తుంటారు’’ అని సాలీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చేటు చేసే పొగడ్తలు
సాధారణంగా ఇదంతా ఏదో దురుద్దేశంతో జరగదు. కంపెనీల ఉద్దేశాలు ఏమైనా కావొచ్చు. కానీ, లవ్ బాంబింగ్ కారణంగా చాలా సార్లు ఉద్యోగులు నష్టపోవాల్సి ఉంటుంది. ఒత్తిడికి గురై లేదా మొహమాటం కారణంగా అభ్యర్థులు తమకు సరిపడని ఉద్యోగంలో చేరవచ్చు.
రోహిత్ పరాశర్ విషయంలో కూడా అదే జరిగింది. మంచి భవిష్యత్‌పై ఆశతో ఆయన గురుగ్రామ్ వచ్చి కొత్త కంపెనీ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆయనకు పరిస్థితులు భిన్నంగా ఉంటాయనే విషయం అర్ధమైంది.
‘‘ఏదైనా తప్పు జరిగితే జూనియర్లపై సీనియర్లు అరవడం సాధారణం. కార్పొరేట్ ప్రపంచంలో అందర్నీ పేరుతోనే పిలుస్తారు. కానీ, మా మేనేజర్‌ను నేను సర్ అని పిలవకపోవడంతో ఆయనకు కోపం రావడం గమనించాను. టీమ్‌లో ఏదైనా సమస్య వస్తే మేనేజర్ పక్కకి తీసుకెళ్లి మాట్లాడకుండా, అక్కడే అందరి ముందు మాట్లాడేవారు’’ అని రోహిత్ వివరించారు.
జాబ్ ఆఫర్ చేసినప్పుడు తనకు చెప్పిన మాటలకు, పని ప్రదేశంలో జరుగుతున్న వాటికి చాలా తేడా ఉందని ఆయన గుర్తించారు.
అలాంటి పని వాతావరణంలో మనుగడ సాగించలేక కొత్త ఉద్యోగంలో చేరిన నాలుగో నెలకే రాజీనామా చేసినట్లు రోహిత్ చెప్పారు.
అమెరికాకు చెందిన 46 ఏళ్ల కియర్‌స్టన్ గ్రెగ్స్ అనే మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆమె స్వయంగా రిక్రూటర్ కూడా. ఆమె పని ఏంటంటే, కంపెనీలకు ప్రతిభావంతులను నియమించడం.
వాషింగ్టన్ డీసీలోని ఒక కంపెనీ తనను ఎన్నో రకాలుగా మభ్యపెట్టిందని ఆమె చెప్పారు.
“నాకు ఈ రంగంలో చాలా పేరు ఉందని తమకు తెలిసినట్లు వారు నాతో అన్నారు. వెంటనే నాకు జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇంటి నుంచే పని చేయొచ్చని చెప్పారు. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ముగియగానే పరిస్థితులు మారిపోయాయి. మొదటిరోజే ఆఫీసుకు రమ్మని పిలిచారు. కనీసం ఎవరూ పలకరించలేదు. టీమ్‌కు నన్ను పరిచయం చేయలేదు. మేనేజర్‌ను కలిస్తే ఇంటి నుంచి పని చేసే విధానం తమ కంపెనీ పాలసీ కాదని అన్నారు. అక్కడి పని సంస్కృతి చూసి కూడా నేను ఆశ్చర్యపోయా. చెడు పదాలను ఉపయోగించేవారు. ఎనిమిది రోజుల్లోనే ఆ ఉద్యోగం మానేశాను’’ అని గ్రెగ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆత్మవిశ్వాసంపై ప్రభావం
ఇక్కడ ఉన్న మరో సమస్య గురించి కెరీర్ కోచ్ సెలిమ్ చెప్పారు.
“కొందరు రిక్రూటర్లు చాలా మంది ఉద్యోగార్థులతో సంప్రదింపులు జరుపుతుంటారు. వారందరినీ ఒక గందరగోళంలోకి నెడతారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మీరు ఇతర అభ్యర్థుల కంటే ముందున్నారని వారు ఎవరికైనా చెబితే దానర్థం మీకు కచ్చితంగా ఆ ఉద్యోగం వస్తుందని కాదు. ఒక్కోసారి అసలు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు కూడా’’ అని సెలిమ్ వివరించారు.
కెరీర్ కౌన్సిలర్ పర్వీన్ మల్హోత్రా దీనికి మరో కారణం కూడా చెప్పారు.
“సాధారణంగా ఉద్యోగాలు తక్కువగా ఉండి, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు ఆ ఉద్యోగాన్ని ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ణయం అవుతుంది. కానీ, పారదర్శకత కోసం నోటిఫికేషన్లు జారీ చేసి నకిలీ రిక్రూట్‌మెంట్లు చేపడుతుంటారు. ఇలా చాలాసార్లు జరుగుతుంది.
ఇలా చేయడం వల్ల అభ్యర్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది’’ అని ఆమె వివరించారు.
లవ్ బాంబింగ్ వలలో పడకుండా ఏం చేయాలి?
ఉద్యోగార్థుల పట్ల రిక్రూటర్లు వ్యవహరించే తీరును మార్చడం కష్టమే. కానీ, లవ్ బాంబింగ్ జరుగుతోందని తెలిసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సెలిమ్ సూచిస్తున్నారు.
“అభ్యర్థులు లవ్ బాంబింగ్ సంకేతాలను గుర్తించాలి. రిక్రూట్‌మెంట్ చేసే సమయంలో అభ్యర్థి అనుభవం, ప్రతిభను అభినందించడం అసాధారణం కాదు. కానీ, ఏదైనా అతిశయోక్తిగా అనిపించినప్పుడు లేదా పారదర్శకత పాటించనట్లుగా భావించినప్పుడు అభ్యర్థులు జాగ్రత్త పడాలి’’ అని సెలిమ్ చెప్పారు.
షాపింగ్ చేసేటప్పుడు కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఇదే సూత్రం ఉద్యోగ వేటలో కూడా వర్తిస్తుందని పర్వీన్ మల్హోత్రా అన్నారు.
“చాలా సార్లు కంపెనీలు వాగ్దానం చేసిన వాటిలో సగం కూడా ఉద్యోగులకు దక్కవు. కాబట్టి కంపెనీ గురించి ముందుగానే అభ్యర్థులు తెలుసుకోవాలి. గతంలో ఈ పని కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఒక కంపెనీ గురించి రివ్యూలు పెడుతున్నారు. కాబట్టి ఆన్‌లైన్ ద్వారా కంపెనీ గురించి ఒక అవగాహనకు రావొచ్చు’’ అని పర్వీన్ చెప్పారు.
లవ్ బాంబింగ్, దాని వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఉన్నఏకైక మార్గం జాగ్రత్తగా ఉండటమే.
ఇవి కూడా చదవండి:
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















