అలీసియా నవారో: ఈ అమ్మాయి 14 ఏళ్ళ వయసులో ఇంట్లోంచి ఎందుకు పారిపోయింది?

ఫొటో సోర్స్, GLENDALE POLICE DEPARTMENT
- రచయిత, సామ్ కాబ్రల్
- హోదా, బీబీసీ న్యూస్
నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన అరిజోనాకు చెందిన ఒక బాలిక తాజాగా మోంటానాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది.
2019లో అలీసియా నవారో ఇంటి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు.
అమెరికా-కెనడా సరిహద్దుకు 64 కి.మీ దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్‌కు ఆమె వచ్చినట్లు మంగళవారం ఆమె స్వస్థలమైన అరిజోనాలోని గ్లెండేల్ పట్టణంలోని పోలీసులు చెప్పారు.
‘‘అద్భుతాలు జరుగుతాయి’’ అని అలీసియా తల్లి జెస్సికా నునెజ్ ఫేస్‌బుక్‌లోని ఒక పోస్టులో పేర్కొన్నారు.
అలీసియా 2019 సెప్టెంబర్ 15వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు. అప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్లు. ఇంటి నుంచి వెళ్లిపోయేముందు ఆమె ఒక నోట్ రాసి పెట్టి వెళ్లారు.
‘‘నేను పారిపోతున్నా, ఒట్టు... మళ్లీ వస్తా. నన్ను క్షమించండి’’ అని ఆమె నోట్‌లో రాశారు.
ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి ఎవరో అలీసియాను మభ్యపెట్టి ఉంటారని తాను నమ్ముతున్నట్లు సీబీఎస్ న్యూస్‌తో జెస్సికా చెప్పారు.

ఫొటో సోర్స్, Glendale Police Department/face book
‘‘ఇది పూర్తిగా ఊహించని విషయమేమీ కాదు. ఆమెను ఎవరో మభ్యపెట్టి ఉంటారు. సాహసం పేరుతోనో లేదా పార్టీ చేసుకుందామనో లేదా ప్రేమ పేరు చెప్పి ఆమెకు ఎరవేసి ఉండొచ్చు’’ అని జెస్సికా అన్నారు.
అలీసియాకు ‘‘హై ఫంక్షనింగ్ ఆటిజం స్పెక్ట్రమ్’’ రుగ్మత ఉన్నట్లు, ఆమె విపరీతంగా వీడియో గేమ్స్ ఆడుతుండేవారని జెస్సికా చెప్పారు.
తన బిడ్డ తప్పిపోయినప్పుడు అరిజోనాలో తొలిసారిగా ‘‘సిల్వర్ అలర్ట్’’ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు జెస్సికా తెలిపారు.
వృద్ధులు, మానసిక అభివృద్ధి వైకల్యం వంటి ప్రత్యేక రుగ్మతలు ఉన్న వ్యక్తులు తప్పిపోయినప్పుడు ఇచ్చే అరుదైన అత్యవసర నోటిఫికేషనే సిల్వర్ అలర్ట్.
అలీసియా స్వయంగా ఒంటరిగా మోంటానా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన వివరాలను వెల్లడించారని మంగళవారం గ్లెండేల్ పోలీస్ అధికార ప్రతినిధి జోస్ శాంటియాగో చెప్పారు.
అలీసియా పోలీసుల సహాయం కోరారని ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు కనిపించారని శాంటియాగో వివరించారు.
ఆమెకు ఏ విధమైన ఇబ్బందులు లేవని, ఉద్దేశపూర్వకంగానే ఇంటినుంచి పారిపోయినట్లు అనిపిస్తోందని శాంటియాగో చెప్పారు.

ఫొటో సోర్స్, FaceBook/Glendale Police Department
అయితే, ఆమె మోంటానాకు ఎలా చేరుకున్నారో ఇంకా అస్పష్టంగానే ఉంది. ఆమె ఇంటికి 1900 కిమీ దూరంలో మోంటానా ఉంటుంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
తన కూతురు క్షేమంగా తిరిగి వచ్చిందని జెస్సికా ఫేస్‌బుక్‌లో ఒక వీడియో ద్వారా సమాచారాన్ని పంచుకున్నారు. ప్రస్తుతానికి తన వద్ద ఎలాంటి వివరాలు లేవని చెప్పారు.
‘‘నా ప్రార్థనలు విన్నందుకు, ఈ అద్భుతం జరిగేలా చేసినందుకు నేను భగవంతుడికి రుణపడి ఉంటా.
తమ ప్రియమైన వ్యక్తులకు దూరమైన ప్రతీ ఒక్కరూ నా కేసును ఉదాహరణగా చూడండి. అద్భుతాలు జరుగుతుంటాయి. నమ్మకాన్ని కోల్పోవద్దు, చివరి వరకు పోరాడండి’’ అన జెస్సికా అన్నారు.
కలుసుకున్న తర్వాత తల్లీ కూతుళ్లిద్దరూ భావోద్వేగానికి గురయ్యారని విలేఖరులతో లెఫ్టినెంట్ స్కాట్ వేటీ చెప్పారు.
తన తల్లిని బాధపెట్టినందుకు అలీసియా పదే పదే క్షమాపణలు కోరారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














