‘‘స్నైపర్ అంటే చావుతో ఆట ఆడినట్లే... నువ్వు ఆడా, మగా అన్న సంగతి మిసైల్‌కు తెలియదు’’- యుక్రెయిన్ మహిళా సైనికుల అనుభవాలు

యుక్రెయిన్

ఫొటో సోర్స్, ILLIA LARIONOV

ఫొటో క్యాప్షన్, యుద్ధ రంగంలో స్నైపర్ పని కఠినంగా ఉంటుందని ఎమరాల్డ్ అన్నారు
    • రచయిత, ఓల్గా మాల్చెవ్‌స్కా
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యాతో యుద్ధం చేసేందుకు పోరాట దళాల్లో చేరడానికి యుక్రెయిన్ మహిళలు చాలామంది ముందుకొస్తూ, తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

ఇలా యుద్ధరంగంలో శత్రువుపై పోరాటం చేస్తున్న 5,000 మంది మహిళా ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ముగ్గురితో బీబీసీ మాట్లాడింది.

ఈ మహిళా సైనికులు, శత్రువుతోనే కాకుండా తమ ర్యాంకుల పరిధిలో ఎదురవుతున్న సెక్సిస్ట్ వైఖరులతో కూడా పోరాడుతున్నారు.

నీలి కళ్లు, బ్రౌన్ రంగు జుట్టు, స్లిమ్‌గా ఉన్న ఒక మహిళ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు.

రష్యా మీడియా ప్రకారం ఆమె చనిపోయారు.

ఆమె పేరు ఆండ్రియానా అరెఖ్తా. యుక్రెయిన్ సైనిక బలగాల్లోని ఒక ప్రత్యేక యూనిట్‌కు ఆమె సార్జెంట్. ఫ్రంట్ లైన్‌లోకి తిరిగి రావడానికి ఆమె సన్నద్ధం అవుతున్నారు.

యుక్రెయిన్‌లోని ఒక పునరావాస శిబిరంలో ఆండ్రియానాను బీబీసీ సంప్రదించింది. ఆమె భద్రత దృష్ట్యా శిబిరానికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించడం లేదు.

డిసెంబర్‌లో ఖేర్సన్ రీజియన్‌లో ఒక ల్యాండ్‌మైన్ పేలడం వల్ల ఆమె గాయపడ్డారు.

ఆమె మరణానికి సంబంధించి రష్యన్ భాషలో ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలలో అనేక రిపోర్టులు వచ్చాయి.

‘‘నాకు కాళ్లు, చేతులు లేనట్లుగా... వారు నన్ను చంపినట్లుగా వార్తలు వేశారు. ఇలాంటి దుష్ప్రచారాల్లో వారు నిష్ణాతులు’’ అని ఆండ్రియానా చెప్పారు.

ఆండ్రియానా
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని పునరావాస శిబిరంలో ఆండ్రియానా

ఎలాంటి రుజువులు లేకుండా క్రూరురాలు, శాడిస్ట్ అంటూ ఆమెపై ఆరోపణలు చేశారు.

‘‘ఇది చాలా తమాషాగా ఉంది. నేను బతికే ఉన్నా. నా దేశాన్ని నేను రక్షిస్తా’’ అని ఆమె అన్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన 18 నెలల నుంచి 60 వేల మంది యుక్రెయిన్ మహిళలు తమ దేశ సాయుధ దళాల్లో సేవలు అందిస్తున్నారు.

42 వేలకు పైగా మహిళా సైనికులు, సైనిక స్థావరాల్లో పనిచేస్తుండగా, వీరిలో 5,000 మంది ఫ్రంట్‌లైన్‌లో ఉన్నట్లు బీబీసీతో యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

చట్ట ప్రకారం, వారికి ఇష్టం లేకుండా ఏ మహిళను సైన్యంలోకి తీసుకోబోమని చెప్పింది.

కానీ, మహిళలు మాత్రమే మెరుగ్గా పనిచేయగల కొన్ని ప్రత్యేక యుద్ధరంగ పదవులు ఉన్నాయని కొందరు నమ్ముతారు.

‘‘మా కమాండర్ దగ్గరకు వెళ్లి, నా పాత్ర ఏంటి? దేశం కోసం నేనేం చేయగలను? అని అడిగాను. మీరు ఒక స్నైపర్ బాధ్యతలు నిర్వహించాలి అని ఆయన చెప్పారు’’ అని ఈజెనియా ఎమరాల్డ్ గుర్తు చేసుకున్నారు. ఇటీవలి వరకు ఆమె ఫ్రంట్‌లైన్‌లో స్నైపర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఎమరాల్డ్
ఫొటో క్యాప్షన్, మూడు నెలల కూతురితో ఈజెనియా ఎమరాల్డ్

రెండో ప్రపంచ యుద్ధం నుంచి మహిళా స్నైపర్ల పాత్రను రొమాంటిక్‌గా మార్చారని ఈజెనియా ఎమరాల్డ్ అన్నారు. ఇలా చేయడానికి ఒక ప్రాక్టికల్ కారణం ఉందని కూడా ఆమె చెప్పారు.

ఆమెకు 3 నెలల కూతురు ఉన్నారు.

31 ఏళ్ల ఈజెనియా ఎమరాల్డ్ 2022లో ఆర్మీలో చేరారు. క్రిమియాపై రష్యా దాడి చేసిన తర్వాతే ఆమె మిలిటరీ శిక్షణ పొందారు. యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆమె జ్యూయెలరీ బిజినెస్ నడిపేవారు.

యుక్రెయిన్ మహిళా సైనికుల ప్రొఫైల్‌కు ప్రాచుర్యం కల్పించడానికి బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచడానికి వ్యాపారిగా తనకున్న అనుభవాన్ని ఎమరాల్డ్ ఉపయోగించారు.

ఆండ్రియానా తరహాలోనే ఈజెనియాను కూడా రష్యా మీడియా ఒక నాజీ అనీ, శిక్షించతగిన వ్యక్తి అంటూ వర్ణిస్తోంది. ఒక మహిళా స్నైపర్‌గా ఆమె ఫ్రంట్ లైన్ పాత్ర, ఆమె వ్యక్తిగత జీవితం గురించి వందలాది కథనాల్లో వివరించారు.

స్నైపర్‌గా పనిచేయడం శారీరకంగా, మానసికంగా చాలా కఠినంగా ఉంటుందని ఎమరాల్డ్ చెప్పారు.

‘‘ఎందుకంటే, ఏం జరుగుతుందో మీరు చూడగలరు. లక్ష్యాన్ని ఛేదించడాన్ని మీరు చూస్తారు. స్నైపర్‌గా పనిచేసే ప్రతీ ఒక్కరికి ఇది వ్యక్తిగత నరకం’’ అని ఆమె అన్నారు.

ఇప్పటి వరకు వారు ఎన్ని లక్ష్యాలను ఛేదించారో మాకు వెల్లడించలేదు. కానీ, తానొకరిని చంపాల్సి ఉంటుందని గ్రహించినప్పుడు అనుభవించిన వేదన గురించి ఎమరాల్డ్ మాట్లాడారు.

‘’30 సెకన్ల పాటు నా ఒళ్లంతా జలదరించింది. వణికిపోయాను. నేను దాన్ని ఆపలేను. కానీ, మేం వారిపై యుద్ధానికి వెళ్లలేదు. వారే మా మీద యుద్ధానికి వచ్చారు’’ అని ఆమె అన్నారు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, IRYNA

ఫొటో క్యాప్షన్, సినిమాల్లో స్పైపర్లను రొమాంటిక్‌గా చూపిస్తారని ఇరీనా అన్నారు

2014లో రష్యా తొలిసారి దాడి చేసినప్పటి నుంచి యుక్రెయిన్ మిలిటరీలో మహిళల శాతం పెరుగుతూ వస్తోంది. 2020 నాటికి 15 శాతానికి చేరింది.

రష్యాకు వ్యతిరేకంగా పోరాట దళాల్లో చాలామంది మహిళా సైనికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సెక్సిస్ట్ వైఖరికి వ్యతిరేకంగా తమ ర్యాంకుల్లోనే అదనపు యుద్ధం చేయాల్సి ఉందని వారు అంటున్నారు.

ఫ్రంట్ లైన్ స్నైపర్‌గా నిలదొక్కుకునే ముందు తాను కూడా ఇలాంటి వైఖరిని ఎదుర్కొన్నట్లు ఎమరాల్డ్ చెప్పారు.

‘‘నేను ఒక ప్రత్యేక దళంలో చేరినప్పుడు ఫైటర్లలో ఒకరు నా దగ్గరకు వచ్చి, ‘ఏ అమ్మాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావ్? వెళ్లి వంట చెయ్’ అని అన్నారు. ఆ క్షణంలో నాకు చాలా బాధ అనిపించింది. ‘జోక్ చేస్తున్నారా? నేను కిచెన్‌లో వంట చేయగలను, అలాగే నిన్ను స్పృహ తప్పేలా కొట్టగలను’ అని మనసులో అనుకున్నా’’ అని ఎమరాల్డ్ తెలిపారు.

యుక్రెయిన్ మహిళా సైనికులకు సహాయం అందించే ‘ఆర్మ్ విమెన్ నౌ’ అనే చారిటీకి చెందిన ఎవ్‌జెనియా వెలికా మాట్లాడుతూ, ‘‘భర్తను వెదుక్కోవడం కోసం అమ్మాయిలు ఆర్మీకి వెళ్తారనే బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది’’ అని అన్నారు.

శారీరక వేధింపుల కేసుల గురించి తనకు మహిళలు చెప్పారని వెలికా తెలిపారు.

‘‘ప్రతీ మహిళా సోల్జర్ దీని గురించి మాట్లాడాలని అనుకోరు. కాబట్టి దీని తీవ్రతను ఊహించలేం’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

స్నైపర్లు

ఫొటో సోర్స్, UKRAINE DEFENCE MINISTRY

ఫొటో క్యాప్షన్, హీల్స్‌తో పరేడ్ ప్రాక్టీస్ చేస్తోన్న మహిళా సైనికుల ఫోటోలను 2021లో యుక్రెయిన్ ఆర్మీ విడుదల చేయడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి

యుక్రెయిన్ ఆర్మీలో మహిళా సైనికులకు సరిగ్గా నప్పే యూనిఫామ్‌లు కూడా ఉండవు. వారికి మగవారు వాడే అండర్‌వేర్‌లు, పెద్దగా ఉండే బూట్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇస్తారు.

తన ఫీల్డ్ యూనిఫామ్‌ కూడా పురుషుల కోసం డిజైన్ చేసినదే అని యుక్రెయిన్ ఉప రక్షణ మంత్రి హన్నా మల్యర్ చెప్పారు. తన ఎత్తు తక్కువగా ఉండటం మూలానా ఆ యూనిఫామ్‌ను తర్వాత ఫిట్టింగ్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఒకవేళ సైన్యంలోని మహిళలు, ఆడవారికి తగిన ఆర్మీ యూనిఫామ్‌ను ధరించాలనుకుంటే వారు సొంత జెనెరిక్ కిట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి. లేదా చారిటీలు, ఇతర నిధుల సేకరణ సంస్థలపై ఆధారపడాలి.

సైన్యంలోని మహిళా సిబ్బందికి సమాన హక్కుల కోసం పోరాడే వెటరెంకా అనే చారిటీకి ఆండ్రియానా సహవ్యవస్థాపకురాలు.

ప్రభుత్వం ఈ విషయంలో పురోగతి సాధించిందని మల్యర్ చెప్పారు. మహిళల కోసం యూనిఫామ్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించారని త్వరలోనే దాన్ని భారీగా ఉత్పత్తి చేస్తారని చెప్పారు.

ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పటికీ, యుద్ధానికి లింగ భేదాలు ఉండవని స్నైపర్ ఎమరాల్డ్ అన్నారు.

‘‘నువ్వు ఆడా? లేక మగా? అన్న సంగతిని యుద్ధం పట్టించుకోదు. ఒక ఇంటికి ఢీకొట్టే క్షిపణికి ఆ ఇంట్లో పురుషులు ఉన్నారా? మహిళలు, చిన్నారులు ఉన్నారా? అనేది తెలియదు. అందరూ చనిపోతారు.

ఫ్రంట్ లైన్‌లో ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక సమర్థవంతమైన మహిళ అయితే, మీ దేశాన్ని, మీ ప్రజలను ఎందుకు రక్షించకూడదు?’’ అని ఆమె అన్నారు.

ఆండ్రియాానా
ఫొటో క్యాప్షన్, 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్నప్పుడే ఆండ్రియానా ఆర్మీలో చేరారు

తూర్పు దోన్బస్ ప్రాంతంలో స్నైపర్ ఇరీనా ప్రస్తుతం ఎదురుదాడి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. యుద్ధ క్షేత్రంలో కాస్త విరామం ఉన్న సమయంలో ఆమెను మేం సంప్రదించాం.

ఆమె అందరూ పురుషులే ఉన్న ఒక యూనిట్‌కు కమాండర్‌గా పనిచేస్తున్నారు.

‘‘ స్నైపర్ల ఇమేజ్‌ను రొమాంటిక్ చేశారు. సినిమాల కారణంగా స్నైపర్‌ పాత్ర చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇది చాలా కష్టమైన పని’’ అని ఇరీనా అన్నారు.

స్నైపర్లు ఒక షాట్ కాల్చడానికి ఆరు గంటల పాటు నేలపై కదలకుండా ఎలా ఉంటారో, ఆ తర్వాత వేగంగా పొజిషన్‌ను ఎలా మార్చుకుంటారో ఆమె వివరించారు.

‘‘ఇది చావుతో ఆడుకోవడం లాంటిది’’ అని అన్నారు.

వేలాది మంది మహిళలు తమ కుటుంబాలు, కెరీర్లను వదిలేసి సేవలు అందిస్తున్నారు.

ఆండ్రియానా ఆర్మీలో చేరడం కోసం తన ఉద్యోగాన్ని వదిలేశారు. అంతకు ముందు యుక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ వెటరన్స్ ఆఫైర్స్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీపై యూఎన్ కన్సల్టెంట్‌గా పనిచేసేవారు.

గతేడాది రష్యా దండయాత్ర తర్వాత ఆమె ఉద్యోగాన్ని వదిలేసి ఆర్మీలో చేరారు.

‘‘నా జీవితంలోని అత్యత్తమ సమయాన్ని వారు తీసుకున్నారు. నేను ట్రావెల్ చేస్తూ సంతోషంగా ఉండేదాన్ని. కెరీర్‌లో స్థిరపడి కలలు సాకారం చేసుకునేదాన్ని’’ అని 35 ఏళ్ల ఆండ్రియానా అన్నారు.

ఆండ్రియాకు ప్రాథమిక పాఠశాలలో చదివే కొడుకు ఉన్నారు. గత ఏడు నెలలుగా తన కొడుకుిన దగ్గరకు తీసుకోలేదని కన్నీటితో ఆమె చెప్పారు.

తన ఫోన్‌లో బాబు ఫొటోలను నాకు చూపిస్తున్నప్పుడు కన్నీళ్ల స్థానంలో మురిపెంతో కూడిన నవ్వు ఆమె ముఖంపై కనిపించింది.

తన కుమారుడికి తన సొంత దేశంలో శాంతియుత భవిష్యత్‌ను అందించాలనే కోరికతో ఆమె యుద్ధరంగంలో పోరాడుతున్నారు. తన తల్లిదండ్రుల్లా అతను కూడా జీవితాన్ని పణంగా పెట్టే పరిస్థితులు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.

ఆండ్రియానా
ఫొటో క్యాప్షన్, ఫ్రంట్ లైన్‌లోకి తిరిగి వెళ్లడానికి జిమ్‌లో ఆండ్రియానా శ్రమిస్తున్నారు

ఎమరాల్డ్ తరహాలో కాకుండా ఆండ్రియానాకు గతంలో సైన్యంలో పని చేసిన అనుభవం ఉంది.

2014లో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసి క్రిమియాను స్వాధీనం చేసుకొని దోన్బస్‌ను ఆక్రమించినప్పుడు ఆమె ఒక బ్రాండ్‌కు మేనేజర్‌గా ఉండేవారు. అప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి వేలాది మంది ఇతర యుక్రెయిన్లతో కలిసి మొదటి వాలంటీర్ బెటాలియన్‌ అయిన ‘ఐడర్’లో చేరారు. ఆ సమయంలో సైన్యం ఇప్పటికంటే చాలా చిన్నది.

ఐడర్ బెటాలియన్, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని రష్యా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించాయి.

అయితే, ఈ ఆరోపణలను నిరూపించే రుజువులేవీ లేవని బీబీసీతో యుక్రెయిన్ ఆర్మీ చెప్పింది.

ఎనిమిదేళ్ల క్రితమే ఐడర్ బెటాలియన్ నుంచి ఆండ్రియానా బయటకు వచ్చారు. దుష్ప్రవర్తనకు సంబంధించి ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేదు. అయినప్పటికీ ఆమె శాడిస్టు అంటూ ఎలాంటి రుజువుల్లేకుండానే రష్యా మీడియా అనేకమార్లు ఆరోపించింది.

సైన్యంలో ఆమె చేసిన సేవలకు గానూ యుక్రెయిన్ ఆమెను మెడల్స్‌తో సత్కరించింది. ఆమె చూపిన ధైర్యానికి ఒక మెడల్, ప్రజల దృష్టిలో హీరోగా నిలిచారంటూ మరో మెడల్‌ను అందజేసింది.

ఇక ఐడర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బీబీసీతో ఆండ్రియానా చెప్పారు. 2022 లో మళ్లీ ఆర్మీ ఫ్రంట్ లైన్‌లో చేరి సేవలందించడం గర్వంగా ఉందని ఆమె అన్నారు.

యుక్రెయిన్ రష్యా యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

సమాచారానికి ఉన్న సున్నితత్వం కారణంగా యుద్ధ సమయంలో ఎంతమంది సైనికులు మరణించారో చెప్పలేమని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

అయితే, బీబీసీకి అందిన సమాచారం ప్రకారం రష్యా దాడి మొదలైనప్పటి నుంచి 93 మంది మహిళా సైనికులు చనిపోయినట్లు తెలిసింది.

చారిటీ ఆర్మ్ విమెన్ నౌ సంస్థకు చెందిన డేటా ప్రకారం, ఇప్పటివరకు 500 మందికి పైగా గాయపడ్డారు.

ఆండ్రియానా ఫోన్ బుక్ ఇప్పుడు మృతుల జాబితాగా మారిపోయింది.

‘‘100 మందికి పైగా నా స్నేహితులను నేను కోల్పోయా. ఇంకా ఎంత మంది ఫోన్ నంబర్లను డిలీట్ చేయాల్సి వస్తుందో కూడా తెలియట్లేదు’’ అని ఆమె అన్నారు.

ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నందున ఇక దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆమె జిమ్‌లో తన ప్రాక్టీస్‌ను పూర్తి చేసేందుకు వెళ్లారు.

వీడియో క్యాప్షన్, సొంతంగా డ్రోన్స్ ఉత్పత్తిని ప్రారంభించిన యుక్రెయిన్..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)