ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఎవరు అర్హులు? ఎవరు కాదు? నిర్ణయించేది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ప్రజా గాయకుడు’ గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గద్దర్ తన జీవితకాలమంతా ప్రజల కోసమే బతికారని, ఆయన ప్రజా వాగ్గేయకారుడని, తెలంగాణ గర్వించే బిడ్డ అని, ఆయన తన జీవితాంతం చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారంటూ తెలంగాణ సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది.
ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటూ కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా ‘యాంటీ టెర్రరిజం ఫోరం’(ఏటీఎఫ్) అనే సంస్థ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.
‘‘గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడమంటే పోలీసు అమరుల త్యాగాలను అగౌరవపరచడమే’’ అని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ అన్నారు.
గద్దర్ తన విప్లవ గేయాలతో వేల మందిని నక్సలిజం, మావోయిజం వైపు వెళ్లేలా ప్రోత్సహించారని,నక్సలైట్లు, మావోయిస్టుల కారణంగా అనేక మంది పోలీసులు బలయ్యారని, ప్రభుత్వ నిర్ణయం పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని శశిధర్ తప్పుబట్టారు.
ఈ వివాదం నేపథ్యంలో అసలు ఎవరెవరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు? దీనికి అర్హతలు ఏమైనా ఉన్నాయా? విధివిధానాలు ఏమైనా ఉన్నాయా? అనేది చర్చనీయమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ స్థాయుల్లో అధికారికంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని ‘ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు’గా పేర్కొంటున్నారు.
కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మాజీ రాష్ట్రపతులు, రాష్ట్రాల గవర్నర్లు మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అయితే, వీరే కాకుండా ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేబినెట్ మంత్రులు, కేంద్రంలో సహాయ మంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారతరత్న పురస్కార గ్రహీతలకు కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయొచ్చు.
వీరే కాకుండా ఏ రంగంలోనైనా విశేష ప్రతిభ చూపి దేశానికి పేరు తెచ్చారు, దేశానికి సేవలందించారు అని ప్రభుత్వం భావిస్తే అలాంటి వ్యక్తులు మరణించిన సందర్భాలలోనూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
‘‘రాష్ట్రాలలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ‘బీబీసీ’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరున్న సినీ నటులు, ఇతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు, ఇతర లబ్ధప్రతిష్ఠులకు రాష్ట్రాలలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం తరచూ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఇది సాధారణమే. ఇటీవల కాలంలో చూస్తే సినీ నటులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ వంటివారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, దర్శకుడు కె.విశ్వనాథ్, అలనాటి నటి జమునలకు ప్రభుత్వ లాంఛనాలు కల్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి.
అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినప్పుడు చర్చ జరిగింది.
ఇటీవల కాలంలో ఏపీలోని కాకినాడ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా గుండెపోటుతో మరణించగా వైసీపీ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించిన సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై విమర్శలు వచ్చాయి.
రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలు, కులాల ఓట్ల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్శలు వచ్చిన సందర్భాలున్నాయి.

ఫొటో సోర్స్, APgovt/Facebook
సీఎం విచక్షణాధికారం ప్రకారం నిర్వహణ: ఎల్‌వీ సుబ్రహ్మణ్యం
రాష్ట్రాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మరణించినప్పుడు వారు చేసిన సేవలు, ప్రజాదరణ వంటి అంశాల ప్రాతిపదికగా వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ‘బీబీసీ’తో చెప్పారు.
ప్రభుత్వ పదవులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కాకుండా ఇతర ప్రముఖుల విషయంలో ప్రత్యేకంగా విధివిధానాలేమీ లేవని, ముఖ్యమంత్రులు విచక్షణాధికారం, నిర్ణయాధికారం ప్రకారం ఈ గౌరవం కల్పిస్తారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తరువాత అందుకు తగ్గ ప్రక్రియ పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి అప్పగిస్తారని ఎల్‌వీ సుబ్రహ్మణ్యం చెప్పారు.
ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రతినిధిగా ఎవరు పాల్గొనాలనేది కూడా నిర్దిష్టంగా ఏమీ ఉండదని చెప్పారు.
జిల్లాలో ఒక్కోసారి కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రతినిధిగా పంపిస్తారని, మంత్రులు కూడా ప్రభుత్వ ప్రతినిధులుగా హాజరైన సందర్భాలున్నాయని ఎల్‌వీ సుబ్రహ్మణ్యం చెప్పారు.
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డీలు, పోలీస్ మెడల్స్ అందుకున్నవారికి కొన్ని సార్లు ఇలాంటి గౌరవం కల్పించిన సందర్భాలున్నాయని ఆయన తెలిపారు.
మాజీ మంత్రులకు కొందరికి ఇలా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగితే మరికొందరికి జరగని సందర్భాలూ ఉన్నాయని, అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినప్పుడు పోలీసులు గన్ శాల్యూట్ చేస్తారని, ‘రివర్స్ ఆర్మ్స్’.. అంటే తుపాకులు వెనక్కు తిప్పి శోకాన్ని వ్యక్తం చేస్తారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ వివాదాలు, విమర్శలు
కొందరు ప్రముఖులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, మరికొందరికి నిర్వహించకపోవడంపై జాతీయ స్థాయిలో, ఇతర రాష్ట్రాలలోనూ అనేక సందర్భాలలో విమర్శలు వచ్చాయి.
తెలుగులోను, బాలీవుడ్‌లోను ఎన్నో చిత్రాలలో నటించిన శ్రీదేవికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రుల విచక్షణాధికారంపై విమర్శలొచ్చాయి.
బాలీవుడ్ నటులలో కొందరికి కల్పించడం, ఇంకొందరిని విస్మరించడంపై మహారాష్ట్రలో తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.
2017లో హత్యకు గురైన యాక్టివిస్ట్, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు అప్పటి కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని రైట్ వింగ్‌కు చెందిన కొందరు తప్పుపట్టారు. ఆమె మావోయిస్టులకు మద్దతుదారని, ఆమెకు ఎలా ఈ గౌరవం కల్పిస్తారని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మరణిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రాలలో మంత్రుల విషయంలోనూ ఇలాగే చేస్తారు.
మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లకూ ఈ గౌరవం కల్పిస్తుంటారు.
సంతాప దినాలు, అంత్యక్రియలలో పాటించే విధానాలలో రాష్ట్రానికి రాష్ట్రానికి వ్యత్యాసాలు ఉండొచ్చు.
సంతాప దినాలు ఎన్ని రోజులు?
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మాజీ రాష్ట్రపతులు మరణిస్తే ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటిస్తుంది.
రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరణించిన సందర్భాలలో ఎన్ని రోజులు ‘సంతాప దినాలు’ ప్రకటించాలనేది ఆయా రాష్ట్రాల స్థాయిలో నిర్ణయిస్తారు.
సంతాప దినాలు పాటించే రోజుల్లో ప్రభుత్వపరంగా అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించరు.
సంతాప దినాలు పాటించేటప్పుడు జాతీయ జెండాను అవనతం చేస్తారు.
సంతాప దినాల మధ్యలో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి వస్తే ఆ రోజుల్లో పాటించరు. ఆ రోజుల్లో జాతీయ జెండా అవనతం కూడా చేయరు.
జెండా అవనతం
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతులు మరణిస్తే దేశ వ్యాప్తంగా జాతీయ జెండాలు అవనతం చేస్తారు.
లోక్ సభ స్పీకర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరణిస్తే దేశ రాజధాని దిల్లీలో జెండాలు అవనతం చేస్తారు.
కేంద్ర మంత్రులు మరణిస్తే దేశ రాజధాని, రాష్ట్రాల రాజధానులలో జాతీయ జెండాలను అవనతం చేస్తారు.
రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మృతిచెందితే ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అంతటా జెండా అవనతం చేస్తారు.
రాష్ట్రాలలో కేబినెట్ మంత్రులు మృతిచెందితే ఆ రాష్ట్ర రాజధానిలో జెండా అవనతం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- హిరోషిమా డే: 'మంచి నీళ్ళు తాగగానే చనిపోయారు, ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... వాళ్ళు మనుషుల్లా చనిపోలేదు'
- బ్లూ వేల్స్: రోజుకు 4 టన్నుల ఆహారం తినే నీలి తిమింగలాలు చనిపోయి విశాఖ తూర్పుతీరానికి కొట్టుకొస్తున్నాయి... ఎందుకు?
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే
- డీఎన్ఏ టెస్ట్: పిల్లలు తమకే పుట్టారో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు చేయిస్తున్న తండ్రులు
- స్వాల్బార్డ్: 4 నెలలు చీకటి, 4 నెలలు పగలు.. ఈ అందమైన ప్రాంతానికి రావాలంటే వీసా అక్కర్లేదు, కానీ తుపాకీ కావాలి














