గద్దర్ చివరి లేఖ: ‘నా ఒంట్లో ఇరుక్కున్న తూటా వయసు 25 ఏళ్లు’ – లెటర్ రాసిన ఆరు రోజులకే మృతి, ఇంతకీ అందులో ఏముంది?

ఫొటో సోర్స్, DasyamVinayBhaskar/fb
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గద్దర్ రాసిన చివరి లేఖపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
గద్దర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఇటీవల బహిరంగ లేఖ రాశారు.
దీన్ని ఆయన జులై 31న మీడియాకు విడుదల చేశారు.
అందులో ఆయన తన ఆరోగ్య విషయాలు చెప్పారు.
తాను చికిత్స తీసుకుంటున్నానని.. ఆరోగ్యం కుదుటపడుతోందని రాశారు.
అయితే, ఈ లేఖ రాసిన ఆరు రోజులకే ఆయన కన్నుమూశారు.

ఫొటో సోర్స్, Virasam
ఇంతకీ ఆయన రాసిన లేఖలో ఏముంది?
‘‘గుమ్మడి విఠల్ నా పేరు.
గద్దర్ నా పాట పేరు.
నా బతుకు సుదీర్ఘ పోరాటం.
నా వయసు 76 సంవత్సరాలు.
నా వెన్నుపూసలో ఇరుక్కున తూటా వయస్సు 25 సంవత్సరాలు.
ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.
నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది.
ఈ గాయానికి చికిత్స కోసం బేగంపేటలోని శ్యామ కరణ్ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరాను.
జులై 20 నుంచి నేటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను.
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి.శేషగిరి రావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ నర్సప్ప(అనస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతోంది.
గతంలో నాకు డాక్టర్ జి.సూర్యప్రకాష్, బి.సోమరాజు వైద్యం చేశారు.
పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను’’ అంటూ ఆ లేఖలో రాశారు.

ఫొటో సోర్స్, fb/brs
మూడు నెలల కిందట ఇద్దరం కలిసి పాట పాడాం: నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి
గద్దర్‌తో తన అనుబంధంపై ‘నల్గొండ గద్దర్’గా పేరుతెచ్చుకున్న కాసాల నర్సిరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘ఆయన పాటలు, గొంతుక, శబ్దాన్ని అలాగే పాడుతున్నాడని గమనించి ప్రజలే నాకు ఆ పేరు ఇచ్చారు.
ఆయన పాటలు విని సింగర్ అయ్యాను.
అలా గద్దర్ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది.
ఎవరో నల్గొండ వ్యక్తి నాలాగే పాడున్నాడని తెలుసుకుని.. వచ్చి కలవమని ఫోన్ చేశారు. అలా ఆయన్ను కలిశాను.
ఆ తర్వాత మూడు సార్లు కలిశాం.
మంద కృష్ణను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కలిశాను. మూడు నెలల కిందట ఇద్దరం కలిసి పాట పాడాం. ‘నన్ను గన్న తల్లుల్లారా.. తెలంగాణ పల్లెల్లారా..’’ నాతో పాడించారు.
మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆల్బమ్ కోసం ఇద్దరం కలిసి ఆ పాట పాడాం.
ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందనే సందర్భంపై ఆయన(గద్దర్) స్వతహాగా రాసుకున్న పాట అది.
సంగీత దర్శకుడు మణిశర్మ పిలిచినప్పుడు ఇద్దరం కలిసి వెళ్లాం. ఇద్దరితో కలిసి పాట పాడించాలని అనుకున్నారు.
గద్దర్ చనిపోవడం చాలా బాధాకరం.
ఆయన ఉద్యమాలు, త్యాగాల దారిలో వచ్చారు. నేను ఉద్యమాలకు సంబంధం లేకుండా పెరిగాను. ఆయన శబ్దాన్నే తీసుకుని ముందుకు సాగుతున్నా.’’ అని చెప్పారు నర్సిరెడ్డి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















