హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...

- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, ప్రజెంటర్, ఇన్‌సైడ్ హెల్త్, బీబీసీ రేడియో 4
ప్రపంచం మండిపోతోందా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ ఏడాది వేసవి మంటలు మండించింది.
అటు యూరప్ ఖండం వేడి గాలులతో ఉడికిపోతోంది. అమెరికా, చైనాలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి నమోదయ్యాయి.
దాంతో ఆసుపత్రులలోని రోగులకు వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఐస్‌తో నింపిన బాడీబ్యాగులు వాడుతున్నారు.
మరోవైపు బ్రిటన్ కూడా జూన్ నెలలో మునుపెన్నడూ లేనంత వేడి వాతావరణాన్ని అనుభవించింది.
2022లో బ్రిటన్‌లో మొట్టమొదటి సారిగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2022 వేసవిలో వడగాడ్పులకు యూరప్ వ్యాప్తంగా 60 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తాకథనాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలోనే ‘ప్రస్తుతం మనం ప్రపంచమంతా వేడితో ఉడికిపోతున్న కాలంలో జీవిస్తున్నాం’ అంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీచేసింది.
మరి.. వాతావరణం ఈ స్థాయిలో మారిపోతుండటం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
బాగా వేడిగా ఉన్నప్పుడు చెమటలు పట్టి కుప్పకూలిపోతాను నేను.. కానీ, హీట్ వేవ్ ప్రయోగంలో పాల్గొనేందుకు పిలవడంతో వెళ్లకతప్పలేదు.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్‌కు చెందిన ప్రొఫెసర్ డామియన్ బెయిలీ నాకు ఈ వడగాడ్పుల అనుభవం కల్పించబోతున్నారు. ఈ ప్రయోగం 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మొదలుకానుంది. క్రమంగా వేడి 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెంచుతారు, చివరికి బ్రిటన్‌లోని అత్యంత వేడిగా ఉన్న రోజు నాటి ఉష్ణోగ్రతకు సమానంగా 40.3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెంచుతారు.

‘మీకు చెమటలు పడతాయి, మీ శరీరం పనితీరులో మార్పులు రావొచ్చు’ అని బెయిలీ ఈ ప్రయోగానికి ముందు నాతో చెప్పారు.
ప్రొఫెసర్ బెయిలీ నన్ను తన ఎన్విరాన్‌మెంటల్ చాంబర్‌లోకి తీసుకెళ్లారు. అది గాలి కూడా చొరబడని ప్రదేశం. ఉష్ణోగ్రత, తేమ, ఆక్సిజన్ స్థాయిలను కచ్చితంగా నియంత్రించగల గది అది.
చలి ప్రభావాలను అంచనా వేయడానికి ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఇందులోకి వచ్చాను.
ఇప్పుడు ఈ గదిలో మెరుస్తున్న ఉక్కు గోడలు, భారీ తలుపు వంటివి చూస్తే అందులో వేడి ఎలా పెరగబోతోందో అర్థమవుతుంది.
ఒవెన్‌లో ఉంటూ బయటకు చూస్తున్నట్లుగా ఉంది.
‘ఒంటి మీద దుస్తులన్నీ తీసేయ్’ అంటూ ప్రొఫెసర్ బెయిలీ నుంచి మొదటి ఆదేశం వచ్చినప్పటికీ గదిలో ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది.
వేడి పెరుగుతున్న కొద్దీ ఎంత ఎక్కువగా చెమట పడుతుందో.. బరువులో మార్పు వస్తుందో లేదో పరిశీలించడానికేనని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, DAN WELSH
ఆ తరువాత నా చర్మం ఉష్ణోగ్రత, ఒంట్లోని అవయవాల ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, బీపీ కొలిచే గిజ్మోలను నాకు కనెక్ట్ చేశారు.
వాటితో పాటు ఒక పెద్ద మౌత్ పీస్ నేను పీల్చే గాలిని విశ్లేషిస్తుంది. అల్ట్రాసౌండ్ నా మెడలోని కరోటిడ్ ధమనుల ద్వారా నా మెదడుకు రక్త ప్రసారం ఎలా జరుగుతుందో పరిశీలిస్తుంది.
‘రక్తపోటు సక్రమంగానే ఉంది. హృదయ స్పందన రేటు సరిగానే ఉంది. ప్రస్తుతం శరీర సంకేతాలన్నీ మీరు సరైన స్థితిలోనే ఉన్నారని చెప్తున్నాయి’ అని ప్రొఫెసర్ బెయిలీ అన్నారు.
‘ఇప్పుడొక బ్రెయిన్ టెస్ట్ చేయాలి. 30 పదాల జాబితా గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.
నా శరీరానికి ఒక సాధారణ లక్ష్యం ఉంది. నా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాల చుట్టూ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మెయింటెయిన్ కావాలి.
మరిన్ని కొలతలు రికార్డ్ చేయడం కోసం 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కాస్త విరామం ఇచ్చారు. ఇప్పుడు గదిలో వెచ్చగా ఉంది. పెద్దగా అసౌకర్యం ఏమీ లేదు. కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాను. పనిచేయాలని కానీ, వ్యాయామం చేయాలని కానీ అనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
శరీరంలో ఇప్పటికే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. శరీరం రంగు మారి నేను ఎర్రగా కనిపిస్తున్నాను. ప్రొఫెసర్ బెయిలీదీ అదే పరిస్థితి. ఆయన కూడా నాతోపాటు ఇందులో ఉన్నారు.
వేడి కారణంగా శరీరంలోని రక్తం కూడా వెచ్చనయ్యాక.. ఆ వేడిని కోల్పోవడానికి వీలుగా చర్మం ఉపరితలానికి సమీపంలోని రక్తనాళాలు తెరచుకుంటాయి. ఆ కారణంగానే శరీరంగా ఎర్రగా కనిపిస్తుంది.
నాకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. చెమటలు ఆరగానే చల్లగా ఉంటోంది.
ఇప్పుడు 40.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుతున్నాం. చాలా వేడిగా అనిపిస్తోంది.
ఇది మామూలుగా లేదు.. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం అంటే వినడానికి ఎక్కువేమీ అనిపించదు. కానీ, శరీరానికి కలిగే అనుభవం మాత్రం చాలా తీవ్రంగా ఉంది అని బెయిలీ చెప్పారు.
నేను నా నుదుటిపై చేత్తో తుడిస్తే చెయ్యి తడిసిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
నేను నా చొక్కాను నేలపై విసిరేసి, తువ్వాలు కూడా తీసేశాను. ప్రయోగ సమయంలో లీటరులో దాదాపు మూడోవంతు నీటిని నా శరీరం కోల్పోయిందని తెలిసి ఆశ్చర్యపోయాను.
నా గుండె కొట్టుకునే రేటు చాలా పెరిగింది. ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటితో పోల్చితే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర అది నా శరీరం అంతటికీ అదనంగా లీటరు రక్తం ప్రసారం చేస్తోంది.
ఉష్ణోగ్రతలు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వల్ల మరణాలు ఎందుకు సంభవిస్తాయనడానికి ఇలా గుండెపై పెరుగుతున్న ఒత్తిడి చెప్తోంది.
అంతేకాదు... రక్తం వేడెక్కి, ఆ వేడిని కోల్పోవడానికి చర్మం ఉపరితలంలోని నాళాలు విచ్చుకునే ప్రక్రియలో భాగంగా రక్తమంతా చర్మం ఉపరితలం వైపు ప్రవహించడం వల్ల మెదడుకు ప్రసరణ తగ్గి షార్ట్ టెర్మ్ మెమరీ కూడా తగ్గుతుంది.
అయితే, శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటెయిన్ చేయాలన్న శరీర లక్ష్యం మాత్రం నెరవేరుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
తేమ
నా ప్రయోగంలో ఉష్ణోగ్రత ఒక్కటే మారింది. కానీ, ఇక్కడ మరో కీలకాంశం తేమ.
ఈ ప్రయోగంలో ప్రొఫెసర్ బెయిలీ తేమను 50 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. 50 శాతం తేమ అనేది బ్రిటన్‌లో అసాధారణమేమీ కాదు.
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొందరు యువకులపై ఒక పరిశోధన చేశారు. అందులోవారు వేర్వేరు ఉష్ణోగ్రతలు, వేర్వేరు తేమ వద్ద శరీరంలో కలిగే మార్పులను పరిశీలించింది.
శరీరంలోని కీలకావయవాల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే క్షణం కోసం వారు చూశారు.
‘అలా ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితి అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది’ అని పరిశోధకురాలు రాచెల్ కాటిల్ చెప్పారు.
ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ తేమ అధికంగా ఉంటే ఇలాంటి ప్రమాదమేర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ ఆందోళనకర అంశం ఏంటంటే వడగాల్పులు తరచుగా రావడం, దీర్ఘకాలం కొనసాగడం, అధిక తీవ్రంగా ఉండటం మాత్రమే కాకుండా అవి ఎక్కువ తేమతో ఉంటున్నాయని కాటిల్ అన్నారు.
నిరుడు అధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యధిక తేమతో కూడిన వడగాల్పుల వల్ల భారత్, పాకిస్తాన్ దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని ఆమె నొక్కి చెప్పారు.
‘‘ఇది కచ్చితంగా ఇప్పటి సమస్యే. భవిష్యత్‌లో ఎదుర్కొనే సమస్యగా దీన్ని చూడకూడదు’’ అని ఆమె అన్నారు.
మానవ శరీరం, 37 డిగ్రీల కోర్ ఉష్ణోగ్రతను తట్టుకుని తన విధులు నిర్వర్తించగలుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరయ్యే కొద్ది మనం సమన్వయం కోల్పోయి స్పృహతప్పే ప్రమాదం ఉంటుంది.
అధిక కోర్ ఉష్ణోగ్రతలు గుండె కండరాలు, మెదడు వంటి శరీర కణజాలాలను నాశనం చేస్తాయి. క్రమంగా ఇది ప్రాణాంతంకంగా మారుతుంది.
‘‘ఒక్కసారి కోర్ ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీలకు చేరితే మనం చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు సరైన సమయంలో చికిత్స అందించకపోతే హైపర్‌థర్మియా కారణంగా చనిపోవడం ఖాయం’’ అని ప్రొఫెసర్ బెయిలీ వివరించారు.
అందుకే వడదెబ్బను మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి.
వేడిని తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. వయస్సు, అనారోగ్యం ఈ పరిస్థితిని మరింత కఠినంగా మార్చుతాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా మారొచ్చు.
‘‘ఈరోజు మీరు ఈ ప్రయోగశాల నుంచి బయటకు వెళ్లబోతున్నారు. ఈ గణాంకాలన్నీ మీరు సవాలును సమర్థంగా ఎదుర్కొన్నట్లు చూపిస్తున్నాయి’’ అని ప్రొఫెసర్ బెయిలీ అన్నారు.
వృద్ధాప్యం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, డెమెంతియా వంటి పరిస్థితులు ఉంటే శరీరం అప్పటికే కష్టపడి పనిచేస్తున్నట్లు లెక్క. ఈ నేపథ్యంలో వేడిని కూడా తట్టుకోవడం శరీరానికి మరింత కష్టమైన పని.

ఎదుర్కోవడం ఎలా?
వేడిని ఎదుర్కొనే చిట్కాలు చాలావరకు మనకు తెలిసినవే ఉంటాయి. నీడలో గడపడం, వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, ఇంట్లో చల్లగా ఉండేలా చూసుకోవడం, బాగా వేడిగా ఉండే సమయంలో వ్యాయామాలు చేయకపోవడం, ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం ఇవే వేడిని ఎదుర్కొనే చిట్కాలు.
‘‘మరో చిట్కా ఏంటంటే వడదెబ్బ తగలకుండా చూసుకోవడం. స్వల్పస్థాయి వడదెబ్బ కూడా రెండు వారాల పాటు శరీరంపై దుష్ప్రభావం చూపగలదు’’ అని ప్రొఫెసర్ బెయిలీ అన్నారు.
కానీ, ఎండ వేడితో వ్యవహరించడానికి మనందరం అలవాటు పడాల్సి ఉంటుంది.
వాతావరణ మార్పులపై తగిన చర్యలు తీసుకోకుంటే యూకే వేసవిలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత ఒకే రోజు 6 డిగ్రీలు పెరుగుతుందని ప్రొఫెసర్ లిజీ కెండన్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














