సమాజానికి దూరంగా ఉండాలని అడవిలో బతికేందుకు వెళ్లారు, కానీ చివరకు....

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అడవిలో జీవించేందుకు వెళ్లి, చనిపోయారు.

బయటి జీవితాన్ని పూర్తిగా వదిలేసి భిన్నమైన జీవన విధానాన్ని అనుసరించేందుకు ముగ్గురు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అడవిలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్న ఈ ముగ్గురు రాకీ పర్వతాలలోని మారుమూల ప్రాంతానికి వెళ్లారు. కానీ అక్కడి భౌగోళిక పరిస్థితులు తట్టుకోలేక ముగ్గురూ చనిపోయినట్లు భావిస్తున్నారు.

సమాజం తీరు నచ్చక..

రెబెక్కా వాన్స్, ఆమె 14 ఏళ్ల కొడుకు, రెబెక్కా సోదరి క్రిస్టీన్‌లు అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌ పట్నంలో ఉంటున్నారు. అడవిలో ఉండేందుకు వీరు గనిసన్ కౌంటీలోని ఓ క్యాంప్‌సైట్‌కు వెళ్లారు.

వేసవిలో అక్కడికి వెళ్లిన ఈ ముగ్గురు, తీవ్రమైన మంచు లేదా ఆకలి కారణంగా చనిపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

వారి కుళ్లిపోయిన మృతదేహాలను జూలై 9న గన్నిసన్ నేషనల్ ఫారెస్ట్‌లోని కొండ ప్రాంతంలో గల శిబిరంలో కనుగొన్నారు.

సమాజం తీరు రెబెక్కాకు అంతగా నచ్చదని ఆమె మరో సోదరి ట్రెవెలా జారా వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అందుకే తన కొడుకు, మరో సోదరి క్రిస్టీన్‌లతో కలిసి ఎవరూ లేని ప్రదేశంలో బతికితే బాగుంటుందని భావించారని తెలిపారు రెబెక్కా సోదరి జారా.

అయితే నలభైలలో ఉన్న క్రిస్టీన్, రెబెక్కా ఇద్దరికీ తమ ఇల్లు దాటి బయటి ప్రపంచంలో జీవించిన అనుభవం లేదు.

కాబట్టి ఈ అనుభవాన్ని తెలుసుకోవడానికి, వారు యూట్యూబ్ వంటి సైట్‌లలో మనుషులు లేని ప్రదేశంలో ఎలా జీవించాలో వీడియోలను చూశారని జారా చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మరణానికి కారణం ఏమిటి?

“ప్రాక్టికల్ లైఫ్ నుంచి ఎలా బయటపడాలి? మానవులు లేని ప్రదేశంలో ఎలా జీవించాలని ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి వెళ్లడం కరెక్టు కాదు. ఎందుకంటే అనుభవం లేనివారు, మనుషులు లేని చోట జీవించడం కష్టం'' అని గెజిట్‌ వార్తాసంస్థతో జారా అన్నారు.

"కొత్త వాతావరణంలో బతకడం తెలియక, వారు ఆకలితో మరణించి ఉండొచ్చు" అని ఆమె తెలిపారు.

ముగ్గురి మరణానికి కారణం తెలియలేదని, మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఓ అంచనాకు రాలేమని దర్యాప్తు అధికారులు చెప్పారు.

అడవిలోని గోల్డ్ క్రీక్ క్యాంప్‌గ్రౌండ్‌లో రెబెక్కా కుటుంబీకుల మృతదేహాలను మొదటగా ఆ ప్రాంతంలో హైకింగ్‌కు వెళ్లిన మైఖేల్ బార్న్స్ చూశారు.

"టెంట్‌లో రెండు మృతదేహాలు కనిపించాయి. కొండ ప్రాంతంలో సుమారు 9,500 అడుగుల (2,900 మీ) ఎత్తులో మరొక వ్యక్తి మృతదేహం ఉంది" అని గన్నిసన్ ప్రాంతానికి చెందిన మైఖేల్ బార్న్స్ చెప్పారు.

''అడవిలో ఇల్లు నిర్మించుకునేందుకు ముగ్గురూ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికి, శీతాకాలం ప్రారంభమైంది. దీంతో వారు ఇంటిని నిర్మించడం ఆపి, డేరా లోపల గడిపారు. చలికాలంలో ముగ్గురు టెంట్‌లోనే బతుకగలమని భావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది'' అని బార్న్స్ ఏపీ న్యూస్‌తో చెప్పారు.

నెల ముందే చలికాలం రావడంతో..

“అడవి, పర్వత ప్రాంతాలలో ఎలా జీవించాలి? ఆహారాన్ని ఎలా సమీకరించుకోవాలో వివరించే చాలా పుస్తకాలు వారి వద్ద ఉన్నాయి. కానీ అవన్నీ కిరాణా సామగ్రి మాదిరి కట్టగట్టి ఉన్నాయి ” అని బార్న్స్ చెప్పారు.

గత ఆగస్టు ప్రారంభంలో రెబెక్కా తన కుమారుడు, క్రిస్టీన్‌తో కలిసి సోదరి జారా ఇంటికి వెళ్లారు. అప్పుడు వారు తమ కొత్త జీవిత ప్రయాణం గురించి జారాకు చెప్పారు.

"మేం వారి ప్లాన్ విని షాకయ్యాం. వారిని ఆపడానికి ప్రయత్నించాం. కానీ మా మాట వినలేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నారు” అని కన్నీళ్లు పెట్టుకుంటూ జారా చెప్పారు.

అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో జూన్, జూలై, ఆగస్టులను సాధారణంగా వేసవి నెలలుగా పరిగణిస్తారు. అయితే అక్కడ ఈసారి శీతాకాలం నెల రోజుల ముందే ప్రారంభమైంది.

అక్కాచెల్లెళ్లు ఇది ఊహించకపోవచ్చని అధికారులు తెలిపారు. చలికాలం ప్రారంభం కావడంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేక, తమ ఆహార అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడి ఉంటారని అధికారులు చెప్పారు.

ఇవి కూడాచదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)