బరువు పెరగాలంటే ఇలా చేయండి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రణీత అశోక్
- హోదా, బీబీసీ మరాఠీ కోసం
బరువు పెరిగిపోతున్నామని గాభరా పడిపోతుంటారు చాలా మంది. బరువు ఎలా తగ్గించుకోవాలా అని మథనపడుతుంటారు. అందుకు చాలా మార్గాలున్నాయి. కానీ, కొందరు ఉండాల్సినంత బరువు ఉండరు. అలాంటి వారు బరువు పెంచుకోవాలంటే ఏం చేయాలి?
బరువు తగ్గించుకోవడం సులువైన పనే. అందుకు చాలా మార్గాలు కూడా ఉన్నాయి. కానీ, బరువు పెంచుకోవడం మాత్రం సవాల్ అనే చెప్పాలి. ముందుగా బరువు ఎందుకు పెరగడం లేదో అసలు కారణం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా అలర్జీ వంటిది ఉందా? కొన్ని రకాల ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉంటోందా? అనేవి గుర్తించాలి.
కడుపులో ఇబ్బందిగా అనిపించే అన్ని విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాటి వల్ల ఆకలిగా అనిపించడం మానేస్తుంది.
అన్ని పరీక్షలు అయిన తర్వాత అసలు కారణం నిర్ధారణ అవుతుంది. ఒకవేళ అంతా సవ్యంగా ఉంటే డైట్ (ఆహార నియమావళి) పాటించడం ద్వారా బరువు పెరగొచ్చు.
ఏదో ఒకటి తినడం వల్ల మీరు బరువు పెరగలేరు. డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చాలి. బరువు పెరిగేందుకు ఏది తినాలో, ఎంత తినాలో తెలుసుకుని డైట్ ప్లాన్ చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే బరువు పెరగడం సాధ్యమవుతుంది.
బరువు పెరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, డైట్‌లో సూచించే ఆహార పదార్థాలేవీ కడుపులో ఇబ్బంది కలిగించకూడదు. అలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారంలో నాణ్యమైన నూనెలు ఉండేలా చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అయితే, వాటిని ఎక్కువగా తీసుకున్నా కడుపులో ఇబ్బంది కలగొచ్చు. డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించి, లేదా బెల్లంతో కలిపి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.
బరువు పెరగడానికి కేవలం నాణ్యమైన, మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, అందుకు తగ్గట్టుగా జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడం కూడా ఈ ప్రక్రియలో ప్రధానం.
చిన్నపిల్లలతో పాటు చాలా మంది ఆకుకూరలు తినేందుకు ఇష్టపడరు. అందువల్ల పీచుపదార్థం, అవసరమైన పోషక విలువలు సరైన స్థాయిల్లో శరీరానికి అందవు. ఇతర మార్గాల్లో వాటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఆకుకూరలతో పాటు దుంపలు కూడా చాలా ముఖ్యం. ఐరన్ ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో వారు వేరుశనగలను తీసుకోవచ్చు. అలాగే, ధాన్యం నుంచి వచ్చిన గంజి కూడా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. పీనట్ బటర్‌ను కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. అది కూడా ఇంట్లో తయారుచేసినదైతే ఉత్తమం.
మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌లో షుగర్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాటికి దూరంగా ఉంటే మంచిది.
బరువు పెరగడంలో పండ్లు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. వివిధ రకాల పండ్లను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. వాటి నుంచి అనేక రకాల ఎంజైమ్‌లు, ఖనిజాలు లభిస్తాయి. శరీర పోషణకు, బరువు పెరిగేందుకు ఈ ఖనిజాలు చాలా అవసరం.
అరటి పండ్లు బరువు పెరిగేందుకు ఉపయోగపడతాయి. అలాగే, ఆయా సీజన్లలో వచ్చే పండ్లను కూడా తీసుకోవచ్చు. రోజులో కనీసం రెండుసార్లు అయినా పండ్లు తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
పాలు, పెరుగు, నెయ్యి కూడా శరీర బరువు పెంచుతాయి. పాలల్లో డ్రై ఫ్రూట్ పొడిని కలుపుకుని తాగొచ్చు. అలాగే యోగర్ట్ (పాలతో తయారు చేసే పెరుగు వంటి పదార్థం)లో ఉండే ప్రొబయోటిక్ శరీరానికి చాలా అవసరం. యోగర్ట్‌కి ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం ద్వారా ప్రొబయోటిక్‌ను ఎక్కువగా పొందవచ్చు. అది ఆకలిని పెంచడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు సాయపడుతుంది.
వాటి తర్వాత పప్పుధాన్యాల వంతు. ముక్కలు చేసిన పప్పు ధాన్యాలను సలాడ్‌లపై వేసుకుని ఆహారంగా తీసుకోవచ్చు. నానబెట్టిన లేదా ఉడికించిన శనగలు, నల్ల శనగలను తినొచ్చు. ఇవి శరీరానికి ప్రొటీన్‌ను అందిస్తాయి. శాఖాహారులకు ఇది ఉత్తమమైన ఆహారం.
పప్పు, బియ్యంతో చేసిన వండిన ఆహార పదార్థాలు బరువు పెరగడానికి, తగ్గడానికి కూడా ఉపయోగపడుతాయి. అందులో మంచి పోషక విలువలు ఉంటాయి.
గేదె పాలు కూడా శరీర బరువును పెంచుతాయి. అందులో ఉండే పోషక విలువలు శరీరానికి చాలా అవసరం. పాల నుంచి తయారు చేసే చీజ్, పన్నీర్ వంటివి తినొచ్చు.
మాంసాహారులైతే వారంలో రెండు నుంచి మూడుసార్లు కోడిగుడ్లు, చేపలు, కోడి మాంసం, వేట మాంసం తినొచ్చు. అయితే ఎంత పరిమాణంలో తీసుకుంటే జీర్ణం అవుతుందో వైద్యుడి సలహా మేరకు తీసుకోవడం మంచిది.
ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. మనం ఏ ఆహారం తిన్నప్పటికీ అది జీర్ణమవడం చాలా అవసరం. అందుకు వ్యాయామం తప్పనిసరి. రోజువారీ వ్యాయామాలు చేసుకోవచ్చు.
యోగ, ప్రాణాయామ, ధ్యానం వంటివి రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచిగా నిద్రపోవడం, డైట్ పాటించడం ద్వారా శరీర బరువును పెంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- వి. శివన్కుట్టి: ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- అన్నం, చపాతి తినకూడదంటే ఏం తినాలి, పిండిపదార్థాలతో ఆరోగ్యానికి ప్రమాదమా
- ఒబేసిటీ: ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
- NFHS-5: భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- దోశల పెనంపై కోటింగ్ కారణంగా వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుందా














