ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

91 మంది బాలికలను లైంగికంగా వేధించి, అశ్లీలంగా వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టిన ఒకరిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడిపై 1,600కి పైగా అభియోగాలు నమోదు చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి చైల్డ్ కేర్ సెంటర్లలో పనిచేసేవారని పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియా, ఇతర కొన్ని దేశాలలోని చైల్డ్ కేర్ సెంటర్లలో పనిచేసిన ఆ వ్యక్తి 15 ఏళ్ల పాటు ఇలా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపించారు.

45 ఏళ్ల ఆయన్ను 2022 ఆగస్టులో అరెస్ట్ చేశారు.

ఆయన వల్ల లైంగిక వేధింపులకు గురైన బాధితులను గుర్తించేందుకు, విచారణ చేపట్టేందుకు పోలీసులకు ఏడాది సమయం పట్టింది.

ఇప్పటి వరకు తాము చూసిన అత్యంత దారుణమైన కేసుల్లో ఇదొకటని అధికారులు చెప్పారు.

పిల్లలపై ఈ వ్యక్తి 246 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, 673 సార్లు అసభ్యకరంగా వేధింపులు గురి చేశాడని ఆరోపణలున్నాయి.

ఆస్ట్రేలియాలో అత్యంత తీవ్రమైన నేరాలకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

పిల్లల అభ్యంతరకర ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టినందుకు ఇప్పటికే ఇతనిపై పోలీసులు వందలాది అభియోగాలు మోపారు.

పిల్లలపై తాను పాల్పడ్డ వేధింపులన్నింటిన్నీ ఆయన రికార్డు చేశాడని పోలీసులు ఆరోపించారు.

ఈ వ్యక్తి ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో 4 వేల ఫోటోలు, వీడియోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

క్వీన్స్‌ల్యాండ్‌లోని 10 చైల్డ్‌కేర్ సెంటర్లలో, న్యూ సౌత్ వేల్స్‌లో మరో కేంద్రంలో, బయట వేరే దేశంలోని ఒక చైల్డ్‌కేర్ సెంటర్‌లో పనిచేసినప్పుడు, ఈ వ్యక్తి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఇతర చైల్డ్‌కేర్ సెంటర్లలో కూడా ఈ వ్యక్తి పనిచేశాడని, కానీ ఈ కేంద్రాలలో అతను నేరాలకు పాల్పడలేదని ఆ సెంటర్లు పూర్తి నమ్మకం వ్యక్తం చేసినట్లు ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు(ఏఎఫ్‌పీ) తెలిపింది.

పిల్లలపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసు సమాజాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందని ఏఎఫ్‌పీ అసిస్టెంట్ కమిషనర్ జస్టిన్ గాఘ్ మీడియాతో అన్నారు.

‘‘చిన్నారులపై ఆయన అకృత్యాలకు ఎవరి ఊహకు కూడా అందవు. ఇది చాలా దారుణమైన కేసు’’ అని ఆమె అన్నారు.

ఆస్ట్రేలియాలో 87 మంది పిల్లలు ఈయన చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలున్నాయి.

వారిలో కొంతమంది ప్రస్తుతం యుక్త వయసుకు వచ్చారు. వారిని గుర్తించి, కుటుంబాలను సంప్రదించామని జస్టిన్ గాఘ్ తెలిపారు.

మరో నలుగురు బాధితులను గుర్తించేందుకు విదేశాల్లో ఉన్న తమ అనుబంధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆస్ట్రేలియా అథారిటీలు తెలిపాయి.

పిల్లలకు చెందిన ఈ ఫోటోలు, వీడియోలను చూస్తున్నప్పుడు, నిందితుడు పనిచేసిన పిల్లల సంరక్షణ కేంద్రానికి సంబంధించిన ఒకదాని సమాచారం విచారణ అధికారులకు కనిపించింది.

ఆ సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.

ఆ వ్యక్తి గోల్డ్ కోస్ట్ హోమ్‌ను వెతికేందుకు ముందు 2022 ఆగస్ట్ 20న బ్రిస్బేన్ సెంటర్‌కు సెర్చ్ వారెంట్ పంపినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.

నిందితుడు చిత్రీకరించిన పిల్లల వీడియోలు, చిత్రాలున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఏఎఫ్‌పీ అధికారులు సీజ్ చేశారు.

2021, 2022లో రెండుసార్లు ఆ వ్యక్తి క్వీన్స్‌ల్యాండ్‌కి వచ్చాడని, కానీ అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అప్పటికి తమ వద్ద తగినన్ని ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు.

ఆగస్ట్ 21న బ్రిస్బేన్ మెజిస్ట్రేట్స్ కోర్టులో ఆయన్ను హాజరు పరచనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)