మీ శరీరం నుంచి చెమట వాసన వస్తోందా? తగ్గాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు

చెమట

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ ఫుడ్ మ్యాగజైన్
    • హోదా, .

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. అయితే, మన చర్మం నుంచి బయటికొచ్చిన ప్రతి చెమట చుక్క మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచే ఒక సహజసిద్ధమైన మార్గం.

కానీ, ఈ ప్రక్రియ కొన్నిసార్లు దుర్వాసనకు కూడా కారణమవుతుంది.

చెమట పట్టినప్పుడు ప్రతి ఒక్కరికీ వారి శరీరాన్ని బట్టి వేర్వేరు వాసనలు వస్తుంటాయి. కొందరికి వాసన తక్కువుంటుంది. మరికొందరికి ఎక్కువగా ఉంటుంది.

స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ జోహన్ లేండ్‌స్ట్రోమ్ వాసనలపై పరిశోధనలు చేశారు.

మన చెమట వాసన విభిన్న విషయాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

"మన శరీర వాసనలు వివిధ గ్రంథుల ద్వారా బయటికొచ్చిన సమ్మేళనాల నుంచి ఉద్భవిస్తాయి. ఇలాంటి వాసన కొంతవరకు మన జన్యువులు, శరీరంలోని బ్యాక్టీరియా (శుభ్రత లేకపోవడం, జెనెటిక్స్ కారణంగా వచ్చేవి), పర్యావరణం (తేమ, ఉష్ణోగ్రత, గాలి, ఒత్తిడి) ఆధారంగా వస్తుంది. చివరిగా, మనం తినే ఆహారం కూడా శరీర వాసనకు కారణమవుతుంది" అని జోహన్ అంటున్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

శరీర వాసనను మార్చే ఆహారాలు..

మనకు చెమట పట్టినప్పుడు శరీరం నుంచి వెలువడే దుర్వాసనపై ఆహారం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అందరికీ తెలియదు.

"నాకు తెలిసినంతవరకు ఇది అధికారికంగా లెక్కించలేదు" అని జోహన్ చెప్పారు. కానీ ఏయే ఆహారాలు వాసనను ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నారు.

"శాకాహారులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తినే వ్యక్తుల శరీరం నుంచి ఎక్కువ దుర్వాసన వస్తుంది. అలాగే వెల్లుల్లిని ఎక్కువగా ఆహారంలో వాడే వారి చెమటలో దుర్వాసన ఉంటుందని ఆధారాలున్నాయి" అని ఆయన చెప్పారు.

ఆస్పరాగస్, వివిధ సుగంధ ద్రవ్యాలు కూడా శరీర వాసనను ప్రభావితం చేస్తాయి. అయితే, మన చెమటను మార్చగలిగే నిర్దిష్ట పదార్ధాల మాటేమిటి?

"ప్రాథమికంగా అవి రక్తంలో కలిసిపోయే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇలా రక్తప్రవాహంలోకి ప్రవేశించే చాలా రసాయనాలు మన శరీర వాసన ద్వారా బయటికి వస్తాయి" అని అన్నారు జోహన్.

ఉదాహరణకు వెల్లుల్లి, మాంసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరం నుంచి చెమటతో సహా వివిధ మార్గాల ద్వారా అది బయటికి వెళ్లిపోతుంది.

మాంసం

ఫొటో సోర్స్, Getty Images

మాంసం తింటే దుర్వాసన వస్తుందా?

చెమట దుర్వాసనను తగ్గించడానికి చేసిన పరిశోధనలు తక్కువే ఉన్నప్పటికీ, కొన్ని ఆహారాలు శరీర దుర్వాసనలు తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాంటి ప్రయోగమే ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీలో జరిగింది.

43 మంది పురుషులు కాటన్ టీ-షర్టులు ధరించే ముందు శుభ్రంగా స్నానం చేశారు. (డియోడరెంట్ వాడలేదు). స్వేద గ్రంథులు ఉత్తేజితమవడానికి వారితో గంటపాటు వ్యాయామాలు చేయించారు. మొత్తంగా ఆ పురుషులు చొక్కాలు 48 గంటల పాటు వేసుకున్నారు. తర్వాత టీషర్టులను వాసన విశ్లేషణకు పంపారు.

పరిశోధనలో తేలింది ఏంటంటే.. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునే పురుషుల్లో చెమట ప్రభావం తక్కువ ఉంది. ఇక వారిలో శరీర దుర్వాసన కూడా తక్కువే.

కొవ్వు, మాంసం, గుడ్డు లాంటి ఆహారం తిన్న వారిలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో అధికంగా చెమట రావడమే కాకుండా, దుర్వాసన కూడా చోటుచేసుకుంది.

మరో అధ్యయనంలో.. 17 మంది పురుషులు మాంసం లేని ఆహారం లేదా ఎర్ర మాంసం ఉన్న ఆహారం తిన్నారు. రెండు వారాల తర్వాత చెమట నమూనాలను సేకరించారు.

ఒక నెల తరువాత ప్రయోగం మళ్లీ చేశారు. ఈ సారి ఆ 17 మంది ఆహారంలో మార్పులు చేశారు.

చివరగా మహిళల బృందం ఈ పురుషుల చెమటకు రేటింగ్ ఇచ్చారు.

అధ్యయనంలో పాల్గొన్న వారు శాకాహారం తీసుకున్నపుడు వారి శరీర చెమట వాసన స్థిరంగా, ఆహ్లాదకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. మాంసం తిన్న వారి శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసన కలిగిస్తుందని ఇది తెలియజేస్తోంది.

Gym

ఫొటో సోర్స్, Getty Images

డైట్ మార్చితే ఏమవుతుంది?

అలాగే ఈ సారి పరిశోధకులు మహిళలపై అధ్యయనం జరిపారు. దీనిలో భాగంగా మహిళల చెమటను పురుషులు పరిశీలించారు.

మొదటగా మహిళలకు నిర్ధిష్ట ఆహారం ఇచ్చారు, మరికొన్ని రోజులు సాధారణ డైట్ ఇచ్చారు. అయితే నిర్దిష్టమైన ఆహారం తీసుకున్నపుడు కంటే సాధారణ ఆహారం తీసుకున్నపుడే మహిళల చెమటలో దుర్వాసన లేదని తేలింది.

కాబట్టి మీ శరీర వాసనను మెరుగుపరచడానికి మీ ఆహారాన్ని మార్చడం సరైనదేనా? అంటే డైట్ మార్చడానికి బదులుగా "డియోడరెంట్‌లు, పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించడం సులభం" అని అంటున్నారు జోహన్. అయితే దుర్వాసన చెడ్డదేం కాదని ఆయన తెలిపారు.

“అయితే ఆయా దేశాల ప్రజల్లో శరీర వాసన పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయంటున్నారు జోహన్. ఉదాహరణకు మీరు పడక గదిలో మీకు నచ్చిన వ్యక్తితో ఉన్నపుడు మీకు కలిగే శరీర వాసన, జిమ్‌లో ఉన్నపుడు కలిగే శరీర వాసనలో తేడాలుంటాయి. అలాగే బస్సులో ప్రయాణిస్తున్నపుడు కొత్త వ్యక్తి పక్కన కూర్చుంటే వారి శరీర వాసన కూడా మీకు భిన్నంగా అనిపిస్తుంది. మీ భాగస్వామి మీ సహజమైన శరీర వాసనను ఇష్టపడవచ్చు. వాస్తవానికి, మిమ్మల్ని ఇష్టపడేవారెవరో తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం'' అని అంటున్నారు పరిశోధకుడు జోహన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)