చంపారన్ మటన్: ఆస్కార్ సెమీఫైనల్స్‌కు ఇండియన్ 'మటన్ కర్రీ' సినిమా... అసలు కథేంటి?

చంపారన్ మటన్

ఫొటో సోర్స్, FALAK KHAN

    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, పట్నా

భార్య కోరిక తీర్చేందుకు ఒక భర్త ఎనిమిది వందల రూపాయలు పెట్టి కేజీ మటన్ ఎలా కొన్నాడు, ఉపాధి కోల్పోయిన ఓ పేద కుటుంబం ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో 'చంపారన్ మటన్' సినిమాలో చూపించారు.

అసలే కష్టకాలం, ఎలాగో మటన్ తెచ్చుకుని వండుకుంటుంటే హఠాత్తుగా అతిథి వస్తే ఏమవుతుంది? మటన్ వండుతున్న వాసనకు ఇరుగుపొరుగు కూడా టేస్ట్ చూసేందుకు వస్తే పరిస్థితేంటి?

ఆర్థిక, సామాజిక ఇబ్బందుల నడుమ సాగే డ్రామా నేపథ్యంలో 'చంపారన్ మటన్' సినిమాను తెరకెక్కించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పూణెలో డైరెక్షన్ కోర్సు చేస్తున్న రంజన్ ఉమా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

తన కోర్సు చివరి సెమిస్టర్ ప్రాజెక్టులో భాగంగా ఈ 24 నిమిషాల చిత్రాన్ని రూపొందించారు. బిహార్‌లో వాడుకలో ఉన్న వజ్జిక భాషలో ఈ సినిమా తీశారు.

బిహార్ రాజధాని పట్నాకి సమీపంలోని ముజఫర్‌పూర్ ప్రాంతంలో వజ్జిక భాష ఎక్కువగా వాడుకలో ఉంటుంది.

చంపారన్ మటన్

ఫొటో సోర్స్, RANJAN KUMAR

ఆస్కార్ సెమీ ఫైనల్స్‌ వరకూ ఎలా?

చాలా మంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆస్కార్స్ స్టూడెంట్ అకాడమీ అవార్డు - ఫిల్మ్ నెరేటివ్ విభాగంలో ఈ సినిమా సెమీ ఫైనల్స్‌కి చేరింది. స్టూడెంట్ అకాడమీ అవార్డులను నాలుగు కేటగిరీల్లో ఇస్తారు.

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు ఆస్కార్స్‌కు పంపిస్తే, చంపారన్ మటన్‌ ఒక్కటే ఎంపికైంది..

ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్టూడెంట్ అకాడమీ అవార్డులు అందజేస్తారు. వీటిని 1972లో ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డుకు దాదాపు 2,400లకు పైగా సినిమాలు ఈ పోటీలో నిలిచాయి. సెమీ ఫైనల్స్‌కి చేరిన చంపారన్ మటన్ సినిమా టాప్ 17 జాబితాలో చోటుదక్కించుకుంది. అక్టోబర్‌లో అవార్డు ప్రకటించే అవకాశం ఉంది.

ఒక సాధారణ కుటుంబంలోని మనుషుల మధ్య సంబంధాలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులే ఈ సినిమా కథాంశం. మహారాష్ట్రలోని బారామతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. నెలరోజుల పాటు చిత్రీకరణ జరిపారు.

ఈ సినిమాలో బిహార్ మట్టి వాసనను చూపించాలని అనుకున్నామని రంజన్ కుమార్ చెప్పారు. ఇది ఐదుగురు విద్యార్థుల డిప్లొమా ఫిల్మ్. ఇలాంటి వాటికి ఎఫ్‌టీఐఐ కూడా పెద్దగా ఆర్థిక సాయం చేయదు.

ఈ సినిమా కోసం రంజన్ కుమార్ లక్ష రూపాయలు అప్పు కూడా చేశారు.

చంపారన్ మటన్

ఫొటో సోర్స్, FALAK KHAN

వ్యవస్థపై ఘాటైన సెటైర్

బిహార్‌లోని చంపారన్ ప్రాంతంలో మట్టితో చేసిన కుండలో, తక్కువ మంటలో మటన్ వండుతారు. అదే చంపారన్ మటన్ ప్రత్యేకత.

బిహార్‌తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో చంపారన్ మటన్ వంటకం కనిపిస్తుంది.

సినిమా దర్శకుడు రంజన్ కుమార్‌ కూడా బిహార్‌లోని హాజీపూర్‌ ప్రాంతానికి చెందిన వారే. ఈ సినిమాతో దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థపై ఘాటుగా సెటైర్లు వేశారు దర్శకుడు.

''ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమాలో నిరుద్యోగమే ముఖ్యమైన పాయింట్. కోవిడ్ తర్వాత లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారి కథ ఈ సినిమా'' అని రంజన్ కుమార్ వివరించారు.

ఈ సినిమాలో హీరో ప్రేమ వివాహం చేసుకుంటాడు. అతని భార్యది చంపారన్. గర్భంతో ఉన్న భార్య మటన్ తినాలని ఉందని భర్తకు చెబుతుంది.

ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. ఒకసారి అనుకోకుండా పట్నాలోని దనాపూర్ ఏరియాలో ఉంటున్న బంధువుల ఇంటికి అనుకోకుండా వెళ్లినప్పుడు వాళ్లింట్లో మటన్ ఉడుకుతూ ఉంటుంది.

అదే సమయంలో, మటన్ వాసనకు ఇరుగుపొరుగు కూడా వస్తారు. అలాంటి సమయంలో ఆ కుటుంబం పరిస్థితి ఏంటనేది సినిమాలో చూపించారు.

చందన్ రాయ్, ఫలక్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బిహార్‌కే చెందిన దాదాపు 10 మంది ఈ సినిమాలో నటించడంతో అక్కడి నేటివిటీ కనిపిస్తుంది.

చంపారన్ మటన్

ఫొటో సోర్స్, FALAK KHAN

సెమీఫైనల్స్‌కి వెళ్తుందని అనుకోలేదు..

పంచాయత్ వెబ్ సిరీస్‌‌తో పేరుతెచ్చుకున్న హాజీపూర్‌కే చెందిన చందన్ రాయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. వికాస్ పాత్రలో చందన్ కనిపించారు. పంచాయత్‌లో ఆయన సెక్రటరీ అసిస్టెంట్‌ రోల్‌ చేశారు.

''అవి స్టూడెంట్ ఫిల్మ్స్. వాటికి ఎఫ్‌టీఐఐ పెద్దగా డబ్బులు ఇవ్వదు. అందుకే వాళ్ల దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. ఈ సినిమా మా మాతృభాష వజ్జికలో తీశారు. డైరెక్టర్ రంజన్‌ది కూడా హాజీపూరే. సినిమా తీస్తున్నట్లు తెలిసింది. సరేనన్నాను.'' అని చందన్ బీబీసీతో చెప్పారు.

''ఒక స్టూడెంట్‌ అయిన రంజన్‌‌కి మద్దతుగా ఉందామనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాను. సినిమా కథ చాలా బాగుంది. ఆస్కార్స్ వరకూ వెళ్తుందని అస్సలు అనుకోలేదు'' అని చందన్ అన్నారు.

''రంజన్ ఇంజనీరింగ్‌లో మా సీనియర్. ఆయన ఫోన్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్‌గా నాకు కథ చాలా నచ్చింది. సినిమా పేరు కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమాలో నటనకు చాలా అవకాశం ఉందని అప్పుడే అనుకున్నాను'' అని హీరోయిన్‌ ఫలక్ ఖాన్ తెలిపారు.

''హీరోయిన్‌గా చాలా గ్లామరస్ పాత్రలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్ర దొరికింది. ఈ సినిమాలో నా లుక్ కూడా కొత్తగా ఉంటుంది'' అని ఆమె అన్నారు.

దీని కంటే ముందు చాలా సినిమాల్లో నటించినట్లు ఆమె చెప్పారు. అయితే, చంపారన్ మటన్‌లో తన నటనకు ప్రశంసలు వచ్చాయని ఆమె అన్నారు.

''నేను కోపంగా ఉన్నప్పుడు నా భర్త నా కాళ్లు పడుతూ నన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నేను వదిలేయండి లేకపోతే, తంతాను'' అనే సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా నవ్వు తెప్పిస్తుంది. చాలా మంది ఆ సీన్ చూసి మెచ్చుకున్నారు.

చంపారన్ మటన్

ఫొటో సోర్స్, FALAK KHAN

ఈ సినిమాకు అదే కారణం

''మా అమ్మది కూడా చంపారన్ ప్రాంతమే. ఇంట్లో మటన్ వండుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అది చాలా ఖరీదైన వ్యవహారం. ఈ సినిమాకు అదే కారణం'' అని రంజన్ కుమార్ చెప్పారు.

ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంది. ఆస్కార్ నిబంధనల ప్రకారం, ఈ సినిమా గురించిన విషయాలు బహిరంగం చేయకూడదు. అయితే, ఈ సినిమాపై రంజన్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

స్థానిక అంశాల ఆధారంగా ఆకట్టుకునేలా ఈ సినిమా తీసేందుకు ప్రయత్నించాం. చాలా మంచిగా వచ్చింది. ఈ సినిమాకు కచ్చితంగా అవార్డులు వస్తాయని రంజన్ చెబుతున్నారు.

దర్భంగా ప్రముఖ నటి మీరా ఝా ఈ సినిమాలో నటించారు. ఆమె ఆల్ ఇండియా రేడియోలో చాలా కాలం పనిచేశారు. స్థానిక చిత్రాల్లో కూడా ఆమె నటించారు.

తొలుత ఆమె ఈ సినిమా చేసేందుకు సిద్ధంగా లేరు. వజ్జిక కథ విన్న తర్వాత ఆమె వెంటనే పూణె వెళ్లిపోయారు. ఈ సినిమాలో హీరో నాయనమ్మగా మీరా ఝా నటించారు.

పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబం వారి అవసరాలు ఎలా తీర్చుకుంటుందనే కథ ఆమెకు నచ్చింది.

ఈ సినిమాకు అవార్డు వస్తుందో రాదో కొద్దివారాల్లో తేలిపోతుంది. కానీ, ఇప్పటికే ప్రశంసలు పొందడంతో పాటు హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి: