బేబీ లాస్ ఇన్ ప్రెగ్నెన్సీ: గర్భంలోనే చనిపోయిన శిశువుల అవశేషాలు భద్రపరిచేందుకు ఏర్పాట్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్మితా ముందాసాద్, తులిప్ మజుందార్
- హోదా, హెల్త్ రిపోర్టర్లు
గర్భంలోనే బిడ్డను కోల్పోయిన మహిళలకు మెరుగైన చికిత్సను అందించడమే కాకుండా, గర్భస్థ దశలోనే చనిపోయిన ఆ శిశువు అవశేషాలను సేకరించి, వాటిని గౌరవప్రదంగా భద్రపరిచే అవకాశం ఇంగ్లండ్‌లో కల్పిస్తున్నారు.
గర్భస్థ దశలో 24 వారాల కంటే ముందే శిశువును కోల్పోయిన తల్లిదండ్రులకు వాలంటరీ సర్టిఫికేట్‌ను కూడా అందజేయనుంది.
ఇంగ్లండ్‌లో ఇలాంటి కేసులకు సంబంధించిన ఒక స్వతంత్ర సమీక్షకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో మృత శిశువు అవశేషాలను టాయిలెట్ల నుంచి సేకరించి, వాటిని ఫ్రిజ్‌లో భద్రపరచాలని మహిళలకు చెప్పిన సందర్భాలున్నాయి.
మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించేందుకు చేపట్టిన తాజా చర్యలలో భాగంగా.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీపై మరింత కంటెంట్‌ను జత చేస్తూ ఎన్‌హెచ్‌ఎస్ తన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తోంది.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్‌మెంట్(ఐవీఎఫ్) స్థానికంగా ఎక్కడక్కడ అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు ఇది సాయపడుతుంది.

ఫొటో సోర్స్, JESSICA
'ఇక ఈ నరకాన్ని భరించాల్సిన అవసరం లేదు'
అడెనోమైయోసిస్ వల్ల కడుపులో వచ్చే తీవ్రమైన నొప్పిపై అవగాహన కల్పించడంపై బీబీసీ ప్రజెంటర్ నాగా ముచేటి, పేషెంట్ గ్రూప్‌లు పనిచేస్తున్నాయి.
వారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మ్యూజిషియన్, టీవీ ప్రజెంటర్ అయిన మైలీన్ క్లాస్ గర్భస్థ దశలోనే తన నలుగురు శిశువులను కోల్పోయారు. ఆమె కూడా ఈ సంస్కరణలపై అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నారు.
‘‘నిజంగా ఈ విషయంపై నా గొంతును వినిపించాలనుకుంటున్నాను. కానీ, ఇది చాలా కష్టతరమైన పని ’’ అని ఈ సంస్కరణలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న మైలీన్ క్లాస్ చెప్పారు.
గర్భంలో 24 వారాల కంటే ముందే బిడ్డను కోల్పోయిన వారికి మెరుగైన సంరక్షణను అందించేందుకు 73 ప్రతిపాదనలను ఇండిపెండెంట్ ప్రెగ్నెన్సీ లాస్ రివ్యూ సూచించింది.
బ్రిటన్‌లో రోజుకి 500 మంది గర్భం కోల్పోతున్నారు. 24 వారాల కంటే ముందే వీరు ప్రెగ్నెన్సీని కోల్పోతున్నారు.
చాలా మంది మహిళలకు ఇది ఇళ్లలోనే జరుగుతోంది. ఈ బాధను భరించే క్రమంలో వారికి అంత ఎక్కువ సపోర్ట్ లభించడం లేదు.
వైథెన్‌షావేకి చెందిన 28 ఏళ్ల ఇంగ్లీష్ ట్యూటర్ జెస్సికా వార్టన్, గత ఏడాది రెండుసార్లు గర్భం కోల్పోయారు.
ఎందుకు తాను ప్రెగ్నెన్సీని కోల్పోతున్నానో తెలియక, సరైన అవగాహన లేకపోవడంతో ఇలా జరిగిందని తెలిసి చాలా బాధపడాల్సి వచ్చిందన్నారు.
తనకి మాత్రమే కాక, తన స్నేహితులకు, కుటుంబానికి నిజానికి ఎవరికీ కూడా తమకు జరిగిన నష్టంపై సరైన అవగాహన లేదన్నారు.
‘‘మాలో ఒక భాగంగా బిడ్డను భావించాం. చాలా కాలంగా ప్రయత్నిస్తే మాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పటికీ ఇది మా బిడ్డనే’’ అని చెప్పారు.
సిబ్బంది మరింత సానుభూతితో ఉండటం, ఆమె చెప్పేది వినడానికి ప్రయత్నించడం, మరింత అందుబాటులో ఉండటం, ఆ తర్వాత ఏం చెయొచ్చో తెలుపడం ద్వారా తన అనుభవాలను మెరుగుపడేవని చెప్పారు.
గర్భంలో 24 వారాల తర్వాత చనిపోయిన శిశువుల డేటాను అధికారిక జన్మలుగా నమోదు చేయడం లేదు. అందుకే వారికి జరిగిన నష్టాన్ని గుర్తించడానికి మార్గం వారి దగ్గర ఉండటం లేదు.
అక్టోబరు నుంచి స్వచ్ఛంద ధ్రువీకరణ పత్రం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. చట్టపరమైన పత్రం కానప్పటికీ, తల్లిదండ్రులు వారి నష్టాన్ని ధృవీకరించడంలో సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది నిజంగా బేబీ లాస్..
ఎవరి శిశువైనా చనిపోతే ఆ తల్లులు 24/7 సంరక్షణకు ఎలా యాక్సెస్‌ను పొందగలరు, ఎక్కువసార్లు గర్భస్రావమైనవారికి చికిత్స, పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? అనేది తెలుసుకోనున్నారు.
శిశువు అవశేషాలను సేకరించడానికి, గౌరవప్రదంగా భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళలకు జరిగే ఈ నష్టాన్ని సాధారణంగా "క్లినికల్ ఎపిసోడ్"గా చూడవచ్చని స్వతంత్ర సమీక్ష ఒకటి పేర్కొంది.
ఆరోగ్య సంరక్షణ నిపుణులు వ్యక్తుల భావోద్వేగ, శారీరక సంరక్షణను తీవ్రంగా పరిగణించడం లేదని పేర్కొంది.
బేబీ లాస్ ఛారిటీ స్థాపకురాలైన జో క్లార్క్-కోట్స్ ఈ సమీక్షకు సహ నాయకత్వం వహించారు. ఐదుగురు శిశువులను కోల్పోయిన కూడా తనకు సరైన మార్గనిర్దేశం లేదని ఆమె అంటున్నారు.
"నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాయం కోసం ఎక్కడికి వెళ్లాలి' అని తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతికే అవసరం రాకూడదు. ఈ మద్దతు ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులో ఉండాలి" ఆమె చెప్పారు.
''శిశువు నష్టం గురించి భాషను మార్చడం చాలా అవసరం. గర్భస్రావాలను నేను బేబీ నష్టం (బేబీ లాస్) అంటాను. దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. శిశువు నష్టం మొత్తం కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. ఇది కేవలం మహిళల సమస్యే కాదు. ఈ దుర్ఘటన నుంచి ఎవరూ దూరంగా వెళ్లలేరు’ అని ఆమె బీబీసీ రేడియో 4 టుడే ప్రోగ్రామ్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సమీక్షలోని ఇతర సిఫార్సులు:
- బేబీ లాస్‌కు ముందు తలెత్తే పరిస్థితులు, ఎక్కడ సహాయం పొందాలో పాఠశాల విద్యలో నేర్పడం.
- మహిళలు, భాగస్వాములకు సైకలాజికల్ హెల్త్ సపోర్ట్.
- గతంలో బేబీ లాస్ ఎందుకు సంభవించిందో అర్థం చేసుకోవడానికి సాయం, భవిష్యత్ గర్భాల కోసం సలహాలు.
- బేబీ లాస్ అనుభవిస్తున్న బాధితుల కోసం ఆసుపత్రులలో ప్రైవేట్ స్థలాలు.
- నల్లజాతీయులు, ఆసియా, మైనారిటీ నేపథ్యం, ఇతర వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు పెరుగుతున్న ప్రమాదంపై మరింత పరిశోధన
"మేం పని చేస్తూనే ఉంటాం. పెట్టుబడులు పెడుతూనే ఉంటాం, తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు, మహిళలు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ నుంచి ప్రయోజనం పొందవచ్చు" అని మహిళా ఆరోగ్య శాఖ మంత్రి కాల్‌ఫీల్డ్ అన్నారు.
బర్మింగ్‌హామ్‌లోని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం ఫలితాలు అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
- బియ్యం ఎగుమతులపై నిషేధం: భారత్ నిర్ణయంతో అమెరికా సహా అనేక దేశాలపై ప్రభావం.. సూపర్ మార్కెట్ల దగ్గర క్యూ
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














