టమాటా ఆరోగ్యానికి మంచిదా కాదా?

టమాటా

ఫొటో సోర్స్, Thinkstock

సలాడ్‌, సాస్‌, కర్రీ, సూప్‌.. ఇలా దేనిలోనైనా కలిసిపోతుంది టమాటా.

టమాట సాధారణంగా వంటగదిలో వైల్డ్ కార్డ్. దీన్ని ఏ కూరగాయలతోనైనా కలిపి వండవచ్చు. ఇది ఏ వంటకం రుచినైనా పెంచుతుంది.

టమాటా కొద్దిరోజుల కిందటి వరకు చౌకగానే దొరికేది. అయితే ఇపుడు టమోటా ధరలు కొండెక్కాయి.

టమాట మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

టమాటాలు సాధారణంగా ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

పచ్చి టమాటాలు కూడా తినొచ్చా?

టమాటా అసలు ఆరోగ్యానికి మంచిదేనా? కాదా?

టమాటా

ఫొటో సోర్స్, ANI

టమాటాలు ఎన్ని రకాలు?

మనం టమాటాను కూరగాయ అని తింటున్నా, వృక్షశాస్త్రం పరంగా చూస్తే అది ఒక పండు.

భూమ్మీద సుమారు పదివేల రకాల టామోటాలు పండుతున్నాయి.

వాటి పరిమాణం, ఆకారం, రంగు విభిన్నంగా ఉంటాయి, కానీ టమాటాలు ప్రధానంగా ఎరుపు రంగులో ఉంటాయి .

పోషకాహారం లెక్కల్లో చూస్తే టమాటా శరీరానికి మంచి ఆహారంగా పనిచేస్తుందని 'ది కాన్వర్సేషన్‌'లో ఇటీవల ప్రచురితమైన ఒక కథనంలో కెటలోనియా ఓపెన్ యూనివర్శిటీకి చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ గెమ్మా చివా-బ్లాంచ్ వివరించారు.

"కూరగాయలకు పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ వంటి వాటి వల్ల రంగు వస్తుంది. ఇవి పసుపు (నిమ్మకాయ) నుంచి ఊదా (వంగ చెట్టు) వరకు వర్ణపటాన్ని కవర్ చేస్తాయి. టామోటాలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటాయి, ఎందుకంటే అవి ఇలాంటి సమ్మేళనాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే కొన్ని టమాటాలు విభిన్న రంగులో ఉండటానికి కారణం వాటిలో విభిన్న సమ్మేళనాలు ఉండటం" అని న్యూట్రిషన్ ప్రొఫెసర్ చివా చెప్పారు.

"ఈ బయోయాక్టివ్ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటాయి'' అని చివా తెలిపారు. దీంతో మీ శరీరంలోని హానికరమైన వాటితో పోరాడటానికి ఇవి సహాయపడతాయి

గుండె సంబంధిత వ్యాధులు

ఫొటో సోర్స్, BOY_ANUPONG/GETTYIMAGES

గుండె సంబంధిత రోగాలకు చెక్..

80 గ్రాముల టమాటాలో ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియం 5 శాతం ఉంటుంది.

పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కరోనరీ హార్ట్ రోగాలు ( గుండెకు రక్త సరఫరా తగ్గిపోవడం) తక్కువగా వస్తాయి .

టమాటాలలో లైకోపీన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది.

ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావం చూపించడంతో పాటు కార్డియోవాస్కులర్ డిసీజ్ (గుండె, రక్తనాళాల జబ్బు) ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

టమాటా

ఫొటో సోర్స్, Getty Images

పచ్చి టమాటాలో ఏముంటాయి?

టమాటా చూర్ణం చేసి తీసుకుంటే శరీరానికి ప్రయోజనకరమైన లైకోపీన్ అందుతుందని న్యూట్రిషన్ ప్రొఫెసర్ చెబుతున్నారు.

స్పానిష్ సూప్ అయిన గజ్‌పాచో లేదా సాల్మోరెజో వంటి వాటిని తయారు చేయడానికి టమాటాలను చూర్ణం చేస్తారు.

ఇతర పండ్లు, కూరగాయల మాదిరిగానే టమాటాలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు విటమిన్లు, ఖనిజాలను కోల్పోతాయి.

అయితే వేడి కారణంగా లైకోపీన్‌లో యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం ఎక్కువుంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆలివ్ నూనెతో వండిన టమాటాలను తినడం కూడా మంచిది. ఇది ప్రయోజనకరమైన సమ్మేళనాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

బీబీసీ గుడ్ ఫుడ్ మ్యాగజైన్ ప్రకారం టమాటా తొక్కలో కెరోటినాయిడ్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దానిని తొలగించకపోవడమే మంచిది.

పచ్చి టమాటా తింటుంటారు చాలామంది. 80 గ్రాముల టమాటా తీసుకుంటే శరీరానికి 11 కిలో కేలరీస్, 0.4 గ్రాముల ప్రోటీన్, 0.1 గ్రాముల ఫ్యాట్, 2.4 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.8 గ్రాముల ఫైబర్, 178 మిల్లీ గ్రాముల పొటాషియం, 279 ఎంసీజీల కెరోటిన్, 18 మిల్లీ గ్రాముల విటమిన్ సి అందుతాయని అని అధ్యయనాలు చెప్తున్నాయి.

టమాటా వంటకం

ఫొటో సోర్స్, Getty Images

మరిన్ని ప్రయోజనాలు

టమాటా పైటోన్యూట్రియంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయస్సు-సంబంధిత మచ్చలు, ఇతర కంటి వ్యాధుల నుంచి రక్షణగా ఉంటాయి.

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు టమాటాలు తింటే ప్రమాదం తక్కువేనని న్యూట్రిషన్ ప్రొఫెసర్ చివా సూచిస్తున్నారు.

రోజులో తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఐదు రకాల పండ్లు, కూరగాయలలో 80 గ్రాముల టమోట తీసుకోవచ్చు.

80 గ్రాముల టమోట దాదాపు ఏడు చెర్రీ పండ్లకు సమానం. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు చివా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)