సన్నగా ఉంటే హానికర కొవ్వు లేనట్టా? TOFI అంటే తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లుసా మెట్‌కాల్ఫ్
- హోదా, బీబీసీ గుడ్ హెల్త్
ఒకవేళ మీరు స్లిమ్‌గా ఉంటే, ఆరోగ్యానికి దాన్ని ఒక సంకేతంగా మీరు భావిస్తుండొచ్చు.
అధిక బరువు లేకుండా స్లిమ్‌గా ఉండటాన్ని చాలా మంది ఆరోగ్యానికి సంకేతంగా అనుకొంటుంటారు. అయితే, బయటకు కనిపించే శరీరం మనల్ని మోసం చేయవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తి, ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) కలిగి ఉన్నారు. అంటే ఆయన బీఎంఐ 18.5-24.9 మధ్య ఉందనుకుందాం. కానీ, ఆయన అనారోగ్యకర డైట్ తీసుకుంటూ అతిగా తాగడం, స్మోకింగ్ వంటి అలవాట్లతో పాటు పెద్దగా శారీరక శ్రమ లేని జీవన శైలిలో జీవిస్తుంటే ఆయన పొత్తికడుపులో కొవ్వు దాగి ఉండొచ్చు.
నిజానికి ఇలాంటి వారిని ‘టోఫీ (TOFI)’గా పరిగణిస్తారు. టీవోఎఫ్‌ఐ అంటే పైకి బక్కగా కనిపిస్తూ, లోపల కొవ్వును కలిగి ఉండేవారు. ఇలా లోపల దాగి ఉండే కొవ్వునే ‘విసెరల్ ఫ్యాట్’ అంటారు.
శరీరంలోని అంతర్గత అవయవాలపై స్థిరపడే ఈ విసెరల్ ఫ్యాట్ అనేది డయాబెటిస్, అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక రకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది.
‘‘విసెరల్ ఫ్యాట్ అంటే నడుము చుట్టూ ఉండే కొవ్వు’’ అని రిజిస్టర్డ్ డైటీషియన్ అలీసన్ క్లార్క్ చెప్పారు.
మీకు బాన లాంటి పెద్ద పొట్ట ఉంటే అది కూడా విసెరల్ ఫ్యాట్ వల్లే అయి ఉండొచ్చని అలీసన్ వివరించారు.
మీలో విసెరల్ ఫ్యాట్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.

ఫొటో సోర్స్, Getty Images
విసెరల్ ఫ్యాట్ అంటే ఏంటి?
మన చేతులు, కాళ్లు, దిగువ భాగంలోని చర్మం లోపల పేరుకుపోయే కొవ్వును ‘సబ్‌క్యుటనియస్ ఫ్యాట్’ లేదా చర్మం కింది భాగపు కొవ్వు అని అంటారు.
ఈ రకమైన కొవ్వును ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారని ‘‘బ్లూ ప్రింట్ ఫర్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ’ అనే పుస్తకంలో ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ జెన్నా మెసించి పేర్కొన్నారు.
విసెరల్ ఫ్యాట్ అనేది అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. దీన్ని పొత్తికడుపు కొవ్వు (అబ్డామినల్ ఫ్యాట్) అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పొత్తికడుపు కొవ్వుతో ప్రమాదం ఏంటి?
అబ్డామినల్ ఫ్యాట్‌ను యాక్టివ్ ఫ్యాట్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన కొవ్వు, మెటబాలిక్ సిండ్రోమ్ (డయాబెటిస్, హైబీపీ, ఒబెసిటీల కలయిక) రావడానికి దారి తీస్తుంది.
‘‘విసెరల్ ఫ్యాట్‌కు జీవక్రియకు సంబంధం ఉంటుంది. అంటే ఇది రసాయనాలు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిని శరీరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కొవ్వుకు హార్మోన్ ఆధారిత క్యాన్సర్లకు సంబంధం ఉంటుంది’’ అని అలీసన్ చెప్పారు.
విసెరల్ ఫ్యాట్, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణం అవుతుంది. ఫలితంగా ప్రిడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్, ఒబెసిటీ వంటి సమస్యలు వస్తాయి.
కడుపు, గాల్ బ్లాడర్, ఓవరీన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కిడ్నీ, లివర్, రొమ్ము వంటి 13 రకాల క్యాన్సర్లకు ఇది కారకంగా ఉంటుంది.
2021 నాటి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం, ఒకరికి ఫ్యాటీ లివర్ ఉందనడానికి కూడా విసెరల్ ఫ్యాట్ సంకేతం కావొచ్చని, దాని వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు రావొచ్చని తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
విసెరల్ ఫ్యాట్ ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి?
ఒకవేళ మీరు అధిక బరువు లేదా ఊబకాయులైతే, యాపిల్ ఆకారంలో పెద్ద పొట్ట ఉంటే మీలో కొంత విసెరల్ ఫ్యాట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
టేప్ సహాయంతో శరీర కూర్పును తెలుసుకోవచ్చని అలీసన్ అన్నారు.
‘‘మీ బీఎంఐ ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, మీ నడుం చుట్టుకొలత నిర్దిష్ట ప్రమాణం కంటే ఎక్కువగా ఉండొచ్చు. మీ ప్యాంట్ సైజు ఆధారంగా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ప్యాంట్‌ను పొట్టపై కాకుండా కాస్త కిందకు ధరిస్తాం.
నడుం చుట్టుకొలతను ఎలా కొలవాలో ఇప్పుడు చెబుతాను. మీ పక్కటెముకల కింద భాగానికి, తుంటి ఎముక పైభాగానికి సరిగ్గా మధ్య పాయింట్‌ను గుర్తించండి. అక్కడ టేప్ సహాయంతో నడుము చుట్టుకొలత తీసుకోవాలి’’ అని అలీసన్ వివరించారు.
బ్రిటిష్ హార్ట్ పౌండేషన్ చెప్పినదాని ప్రకారం ఆఫ్రికన్ కరీబియన్, దక్షిణాసియా, చైనా, జపాన్ మూలానికి చెందిన పురుషుల నడుము చుట్టుకొలత 35.4 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే వారు అధిక ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. అదే మహిళలకైతే 31.5 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే వారు అధిక ప్రమాదంలో ఉన్నట్లుగా పరిగణించాలి.
యూరోపియన్ సంతతి వారికైతే మహిళలకు 31.5, పురుషులకు 37 అంగుళాల కంటే ఎక్కువ నడుము చుట్టుకొలత ఉంటే, విసెరల్ ఫ్యాట్ ఉన్నట్లే.

ఫొటో సోర్స్, Getty Images
విసెరల్ ఫ్యాట్‌కు చెక్ పెట్టే ఉత్తమ ఆహారం ఏంటి?
మెడిటేరియన్ డైట్‌ను ఓవరాల్‌గా ఆరోగ్యానికి ఉత్తమ ఆహారంగా భావిస్తారు.
‘‘మీట్ తినడాన్ని తగ్గించండి. సాల్మన్, ట్రౌట్, సార్డిన్స్, మాక్రెల్ వంటి ఆయిలీ చేపలను ఎక్కువగా తినండి. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో పాటు తృణధాన్యాలు, గింజలను తీసుకోండి’’ అని అలీసన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
నిద్ర చాలా ముఖ్యమని అలీసన్ హెచ్చరించారు.
‘‘ఇది రెండు రకాల ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. గ్రూలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. నిద్రలేమి వల్ల ఆ రెండు హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది’’ అని ఆమె వివరించారు.
రోజువారీ వ్యాయామాలు కూడా చాలా కీలకం. పెద్దలు రోజూ కాసేపైనా శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తోంది. వారంలో 150 నిమిషాల పాటు ఓ మోస్తరు తీవ్రతతో లేదా నాలుగైదు రోజులు 75 నిమిషాల పాటు తీవ్రమైన ఇంటెన్సిటీతో వ్యాయామం చేయాలని సిఫార్సు చేసింది.
‘‘కండలు పెంచండి. 30 ఏళ్ల నుంచి ‘మజిల్ మాస్’ కోల్పోవడం మొదలవుతుంది. నిద్రలో కూడా కేలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి మీరు జిమ్‌కే వెళ్లాలని లేదు. ఇంట్లోనే ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను ఎత్తండి. లేదా స్క్వాట్స్ వంటివి చేయండి’’ అని అలీసన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














