పోలవరం నిర్వాసితులు: జగన్ మాటలు నీటి మూటలేనా? ఏం చెప్పారు, ఏం జరిగింది?

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCP, BBC
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
"పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతోందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాబట్టే మీకు అన్యాయం జరగనివ్వనని మాట ఇస్తున్నా" ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 2022 జులై 27న అల్లూరి జిల్లా చింతూరులో వరద బాధితులతో మాట్లాడుతూ ఈ మాటలన్నారు.
"కేంద్రం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులు తీసుకొస్తాం. ఈ సెప్టెంబర్ లోగా అందరికీ పీడీఎఫ్‌లు కట్టేస్తాం. ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం. ఇళ్లు కూడా పూర్తవుతున్నాయి. అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఒక వేళ పొరపాటున కేంద్రం నుంచి డబ్బులు రాలేకపోతే నీళ్లయినా నింపకుండా ఆపుతా. మీకు డబ్బులిచ్చిన తర్వాతే ఆ కార్యక్రమం చేస్తాం. అవసరమైతే సొంతంగా అయినా ఇచ్చి మీకు తోడుగా ఉంటా" ఈ మాటలు కూడా ఆ రోజున సీఎం జగన్ అన్నవే.
ఏడాది గడిచింది. మళ్లీ వరదలు వచ్చాయి. పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తిగా మూసేయడం వల్ల మళ్లీ వందల గ్రామాలు మునిగిపోయాయి. నిర్వాసితులు ఇళ్లూ, వాకిళ్లూ వదిలి కొండలపైకి ఎక్కి తలదాచుకోవాల్సి వచ్చింది.
మరి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఏమయ్యాయి? నిర్వాసితులు ఏం ఆశిస్తున్నారన్నది బీబీసీ పరిశీలించింది.

ఏటేటా వరదల్లోనే...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. స్పిల్ వే కూడా సిద్ధం కావడంతో నదీ ప్రవాహాన్ని మళ్లించి మూడు సీజన్ల నుంచి గోదావరి నదిని మళ్లించారు. వరద ప్రవాహం స్పిల్ చానెల్ గుండా సాగుతోంది.
కాఫర్ డ్యాములు పూర్తవడంతో గోదావరి బ్యాక్ వాటర్ ఏజెన్సీ గ్రామాల్లోకి చేరింది. గోదావరి నీరు ఇళ్లల్లో చేరి అనేక మంది ఇళ్లు, ఊళ్లూ ఖాళీ చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా వరద నీరు నిర్వాసితులను ముంచేయకముందే వారికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పునరావాసం, పరిహారం అందించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేందుకు మూడు దశలుంటాయని అందులో భాగంగా తొలిదశలో 41.5 మీటర్ల వద్ద ముంపు బారిన పడే వారందరికీ పరిహారం మొదట ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తామే చెల్లిస్తామని కూడా చెప్పారు. సీఎం మాటలకు ఆరోజు నిర్వాసితులు చప్పట్లు కూడా కొట్టారు. కానీ, తీరా చూస్తే సీఎం చెప్పినట్టు జరగడం లేదని బాధితులు అంటున్నారు.
2022లో గోదావరికి అతి పెద్ద వరదలు వచ్చాయి. అపార నష్టం జరిగింది. 2023లో కూడా పోలవరం వద్ద సుమారుగా 40 మీటర్ల వరకూ ప్రవాహం చేరింది. కానీ ప్లస్ 41 కాంటూరుగా చెబుతున్న ప్రాంతానికి ముంపు ఏర్పడింది. ప్రభుత్వ లెక్కలకు మించి వందల గ్రామాలు గోదావరి వరదల్లో చిక్కుకున్నాయి. ఫలితంగా ఒక్క అల్లూరి జిల్లాలోనే దేవీపట్నం, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో 184 గ్రామాలు వరద బారిన పడ్డాయి. పలు మండలాల్లోని 30వేల కుటుంబాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

ముఖ్యమంత్రి చెప్పినట్టు జరిగితే...
సీఎం జగన్ 2022 లో చింతూరులో చెప్పిన విధంగా జరిగితే ప్లస్ 41 కాంటూరు పరిధిలో అందరికీ పరిహారం అందించాల్సి ఉంది. పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని తరలించాల్సి ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి బ్యాక్ వాటర్‌తో మరోసారి ముంపు బారిన పడకుండా వారికి ఉపశమనం దక్కాల్సి ఉంది. కానీ, అందుకు భిన్నంగా జరుగుతోందని ముంపు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
నిర్వాసిత కాలనీల పరిస్థితి కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. సీఎం చెప్పిన ఏడాది తర్వాత కూడా అనేక కాలనీల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిర్వాసితులను తరలించే ప్రయత్నాలు జరగలేదు. వారికి పరిహారం కూడా పూర్తిగా అందించలేదు. ఫలితంగా మరోసారి వరదల్లో చిక్కుకున్నారు. అపార నష్టాన్ని అనుభవిస్తున్నారు.
"మాకేమీ వద్దు. మా ప్యాకేజీ మాకు ఇస్తే చాలనుకుంటున్నాం.వెళ్లిపోతాం. ఏటా వరద వచ్చి ఇళ్లు పడిపోయి ఎన్నాళ్లిలా నష్టపోతాం. నిరుడు ఇల్లు పడిపోయిన వాళ్లకు పదివేలిస్తామన్నారు. ఇప్పటికీ పది పైసలు కూడా ఇవ్వలేదు. మా ఇల్లు పడిపోతే రేకులు కూడా వేసుకోలేదు. గుడ్డలు కట్టుకుని ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ వరద వచ్చింది. మూడుసార్లు వచ్చి బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. ప్యాకేజ్ కొడతామని. కానీ ఫలితం లేదు. మమ్మల్ని ఇలా ఎన్నాళ్లని ముంచుతారు" అంటూ ప్రశ్నించారు ఊకా వెంకాయమ్మ.
ఈసారి వరదల్లో ఆమె ఇల్లు కూడా చిక్కుకోవడంతో ఆగస్టు 1 నాటికి వెంకాయమ్మ కుటుంబమంతా పునరావాస కాలనీకి చేరింది. ఇతర వరద బాధితులతో కలిసి తాత్కాలిక గుడిసెల్లో గడుపుతున్నారు.
తమ కోసం నిర్మిస్తున్నట్టు చెప్పిన పునరావాస కాలనీ కూడా సిద్ధం కాలేదని వెంకాయమ్మ బీబీసీతో అన్నారు.

మాటలు మాత్రమే మిగిలాయి...
ముఖ్యమంత్రి స్వయంగా చింతూరు వచ్చి చెప్పిన మాటలు కూడా ఆచరణ రూపం దాల్చకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ నిలదీస్తున్నారు. ఇటీవల వరదల సమయంలో ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కాలనీలకు తరలిరావాలని కోరిన స్థానిక యంత్రాంగం మీద నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సీపీఎం కార్యకర్తలు ఇటీవల పాదయాత్ర నిర్వహించారు. చింతూరు ఏజెన్సీ నుంచి విజయవాడ వరకూ 300 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, పునరావాసం కల్పించకుండా పోలవరం వద్ద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ముంచేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.
"ముఖ్యమంత్రి మాటలు మాత్రమే మిగిలాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం నాన్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. మండల కేంద్రాల్లోనే నష్టం కళ్లెదురుగా కనిపిస్తోంది. మారుమూల గిరిజన పల్లెలయితే కోలుకోలేని దశలో ఉన్నాయి. కనీసం వాటిని ఆదుకుందామన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి కరువైంది’’అని సీపీఎం నాయకుడు టి. ఆరుణ్ అన్నారు.
కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకముందు పోలవరం వద్ద 50 మీటర్లకు చేరినా వరద ముప్పు తెలియని ప్రాంతాలు కూడా ప్రస్తుతం 40 మీటర్లకే నీట మునుగుతున్నాయని, కాంటూరు లెక్కలు సరిచేసి బాధితులందరికీ ఆర్ అండ్ ఆర్ అందించాలని ఆయన కోరారు.

బాధ్యతారాహిత్యమే...
పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిర్వాసితులు నష్టపోవాల్సి వస్తోందని సామాజిక విశ్లేషకుడు అచ్యుత్ దేశాయ్ వ్యాఖ్యానించారు.
"గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, లోపాలు అంటూ ఎన్నాళ్లు గడుపుతారు. ఆనాటి నిర్వాకాలను, ప్రణాళికా లోపాలను సరిచేసి బాధితుల గోడు వినాలి కదా. కాంటూరు లెక్కల్లో అనేక తప్పిదాలున్నాయి. సరిచేయడం లేదు. ఇంజనీర్లు ఇచ్చిన జాబితాలో లోపాలపై లైడార్ సర్వే నిర్వహించారు. ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదో తెలియడం లేదు. ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఇచ్చిన వివరాలను మించి 41 కాంటూరులోనే ఉన్న ముంపు గ్రామాల పరిస్థితిపై స్పష్టత నివ్వాలి" అంటూ ఆయన కోరారు.
దేవీపట్నంలో కూడా 44 గ్రామాల ప్రజలు ఈసారి వరదలతో ఊళ్లన్నీ ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఏమంటోంది?
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం ప్యాకేజ్ పై ఏపీ ప్రభుత్వం వివరణాత్మక లేఖ విడుదల చేసింది.
'కేంద్రానికి తొలుత 41.15 మీటర్ల పైబడిన ప్రాంతం వారికి పునరావాసం గురించి ప్రతిపాదనలు పంపించాం. తదుపరి కేంద్రం సూచనల మేరకే లైడార్ సర్వే జరిగింది. 45 మీటర్ల పరిధిలో కొన్ని ముంపు ప్రాంతాలను తొలిదశలో పరిహారం చెల్లించాల్సిన వాటిలో చేర్చాం. దాంతో పరిహారం కోసం రూ. 5,217 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. పరిహారం చెల్లింపులో అలసత్వం లేదు. రెండో దశ పరిహారం కూడా గ్రామసభల ద్వారా ఫ్రీజ్ చేసి కేంద్ర జలశక్తి శాఖకు పంపిస్తాం' అంటూ తెలిపింది.
ఆగస్ట్ 1న చేసిన ఈ ప్రకటనలో ఏడాది క్రితం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తామే పరిహారం చెల్లిస్తామని, అప్పటి వరకూ నీటి నిల్వ జరగకుండా చూస్తామని సీఎం చెప్పిన మాటల ప్రస్తావన లేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఏటా వరదల్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, దానికి తగ్గట్టుగా ఆర్ అండ్ ఆర్ పంపిణీ జరగకపోవడం పట్ల వివరణ కోసం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ అధికారుల వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- నిద్ర తగ్గితే వచ్చే చిక్కులివే...
- బెడ్షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?
- కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి? నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?
- నిజ జీవితంలో ‘ఇన్సెప్షన్’ ప్రయోగం.. ల్యూసిడ్ డ్రీమ్స్‌తో కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















