తల్లిపాలు: మందులు వాడే తల్లులు బిడ్డకు పాలివ్వకూడదా... 7 అపోహలు, వాస్తవాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అఫ్రామ్ గాబ్రిబ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉద్యోగాలు చేసే మహిళలను తమ పిల్లలకు పాలిచ్చేలా ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది.
పిల్లలకు పాలిచ్చే తల్లుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది ఐక్యరాజ్యసమితి.
తల్లిపాలు తాగని పిల్లల్లలో ఏడాదిలోపు మరణాల ప్రమాదం 14 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ ప్రచారం ద్వారా ప్రజలకు వివరిస్తోంది.
తల్లులు కాబోయే వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఆఫీసులో పనిచేసే సమయంలో బిడ్డకు పాలు పట్టేందుకు తల్లులకు బ్రేక్ ఇవ్వాలని కూడా ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
వారికి సౌకర్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా గదులలాంటి ఏర్పాటు చేయాలని కూడా చెబుతోంది .
తల్లిపాల ప్రాధాన్యత చాలామందికి తెలిసినా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అపోహల కారణంగా, పిల్లలకు పాలివ్వడానికి కొందరు తల్లులు వెనకడుగు వేస్తున్నారు.
ఈ అపోహలు తొలగించడానికి కాట్రియోనా వ్యాట్, ఆలిస్టర్ సట్‌క్లిఫ్ అనే ఇద్దరు నిపుణులతో మాట్లాడింది బీబీసీ. కాట్రియెనా లివర్‌పూల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ అండ్ గ్లోబల్ హెల్త్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో పీడియాట్రిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు అలిస్టర్ సట్‌క్లిఫ్. ఈ అపోహలకు వారు ఎలాంటి వివరణ చెబుతున్నారో చూద్దాం....

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 1: పాలివ్వడం వల్ల చనుమొనలకు గాయాలవుతాయి, వాపు వస్తుంది.
ప్రొఫెసర్ కాట్రియోనా: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే పాలివ్వడం తల్లులకు ప్రారంభంలో కొంత అసౌకర్యం కలిగించేమాట నిజం. ఒక్కోసారి చనుమొనలు వాపు కూడా జరుగుతుంటుంది. అయితే, పిల్లలకు పాలిచ్చిన తర్వాత కూడా తల్లికి రొమ్ముల్లో నొప్పి ఉందంటే, ఏదైనా ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు భావించాలి.
ఇక మొదటిసారి తల్లులైన వారికి పాలివ్వడంలో కొంత అసౌకర్యం కలగడం సహజం. అలవాటు కావడానికి కొంత సమయం పడుతుంది. చనుమొనల్లో నొప్పి మరీ అసౌకర్యంగా అనిపిస్తే నర్సు లేదా డాక్టర్‌ను సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 2: పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి ఇవ్వకపోతే, తర్వాత వాళ్లు పిల్లలకు పాలు ఇవ్వలేరు
ప్రొఫెసర్ అలస్టర్ సట్‌క్లిఫ్: తల్లి తన బిడ్డకు పాలివ్వమని ప్రోత్సహించే చర్య ఏదైనా బిడ్డ ఆరోగ్యానికి మేలు చేసేదే. పాలివ్వకుండా ఆపే ఏ పరిమితి అయినా అది సైన్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదు. పుట్టిన వెంటనే బిడ్డకు పాలివ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకి తక్షణమే పౌష్టికాహారం అందించడం అనేది అతి పెద్ద ప్రయోజనం. ఇక రెండోది, బిడ్డకు పాలు పాలిస్తుంటే గర్భాశయం సంకోచ ప్రక్రియను కూడా మొదలవుతుంది. ఇది ప్రసవం తర్వాత గర్భాశయం నుండి రక్తం లీకేజీ ఆపడంలో సహాయపడుతుంది. శిశువు జన్మించిన తొలి దినాల్లో తల్లి శరీరం కొలొస్ట్రమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అధిక ప్రొటీన్‌లున్న పదార్ధం.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 3: పాలిచ్చే తల్లులు ఎలాంటి ఔషధాలు వాడకూడదు
ప్రొఫెసర్ కాట్రియోనా వ్యాట్: ఇది చాలామంది తల్లుల్లో వచ్చే సందేహం. నేను మందులు వాడుతున్నాను, బిడ్డకు పాలు పట్టొచ్చా అని అడుగుతుంటారు. వాస్తవం ఏంటంటే, తల్లి తీసుకునే ఔషధాలు చాలా కొద్ది పరిమాణంలోనే పాలల్లో కలిసి బిడ్డకు చేరతాయి. ఒకవేళ డాక్టర్ మీకు మందులు రాసిస్తే నేను బిడ్డకు పాలు పడుతున్నాను, ఫరావలేదా అని అడగండి. వారు సరైన సలహా ఇస్తారు. సర్వ సాధారణంగా మందులు పిల్లలకు హానికరం కాదు. బిడ్డకు ఆరోగ్యవంతమైన తల్లి చాలా అవసరం. ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్, లేదంటే నొప్పులకు తీసుకునే మందుల వల్ల పిల్లలకు ఏమీ అనర్ధం జరగదు.
పాలిచ్చే సమయంలో తల్లులు తీసుకోకూడని మెడిసిన్‌లు చాలా తక్కువ. అలాంటివి ఏవైనా ఉంటే అవి సర్వసాధారణంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించినవి అయ్యుంటాయి.
కొన్ని ఇతర మందులు కూడా ఉంటాయి. వాటిని వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పాలిచ్చే తల్లికి ఏ వైద్యుడైనా మెడిసిన్‌లు రాస్తే, అవి పాలు తాగే బిడ్డ మీద ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఆ వైద్యుడిని అడిగి తెలుసుకునే హక్కు ప్రతి మహిళకు కల్పించాలి.
వైద్యుడి సలహా లేకుండా నేరుగా మెడికల్ షాపుల నుంచి తీసుకునే మందులు అంటే జలుబు, దగ్గు, జ్వరాలను తగ్గించే మెడిసిన్‌లు వాడటం వల్ల కొన్నిసార్లు పాలు తగ్గిపోయే అవకాలు ఉంటాయి. ఇక మూలికా వైద్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో ఏమేమీ ఉంటాయో చాలామందికి తెలియదు. వీటికి ఎక్కువగా ప్రామాణికత కూడా ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 4: మామూలు ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మసాలాలు తగ్గించాలి.
ప్రొఫెసర్ కాట్రియోనా వ్యాట్: బిడ్డకు పాలిచ్చే తల్లి ఈ ఆహారం తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోకూడదు అనే నియమం ఏమీలేదు. అయితే, మీరు తినే ఆహారం మీ పాలపై ప్రభావం చూపుతున్నట్లు గమనించారు. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను నారింజ రసంలాంటి పుల్లటి డ్రింక్స్ తాగిన తర్వాత నా బిడ్డకు పాలిచ్చినప్పుడు ఆ బిడ్డ కాస్త ఇరిటేట్ అయినట్లుగా గొడవ చేయడం గమనించాను.
తల్లులు కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు తాగే బిడ్డల ప్రవర్తనలో తేడా ఉండటాన్ని గమనించవచ్చు. కానీ, వీటిలో ఏదీ ప్రమాదకరమైతే కాదు. అంటే, బిడ్డకు పాలిచ్చే తల్లి ఏ విధమైన ఆహారాన్నీ దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా దూరం చేస్తే అది బిడ్డకు కూడా నష్టం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 5: బిడ్డకు పాలివ్వాలనుకుంటే డబ్బా పాలను అస్సలు పట్టకూడదు.
ప్రొఫెసర్ కాట్రియోనా వ్యాట్: ఇది కరెక్టు కాదు. కానీ, తల్లి రొమ్ములో పాలు డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై ఉంటుంది. స్త్రీ శరీరంలో ఉండే గొప్ప గుణం ఏంటంటే, పిల్లలకు ఎన్ని పాలు అవసరమో అన్ని పాలు ఉత్పత్తి అవుతుంటాయి.
శిశువు చనుమొనల నుంచి పాలు తాగడం మొదలు పెట్టడగానే తల్లి శరీరంలో హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి బిడ్డకు కావాల్సిన పాలను ఉత్పత్తి చేస్తుంటాయి. బిడ్డ చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, కవలలైనా...వారికి సరిపడా పాలు తల్లి శరీరంలో ఉత్పత్తి అవుతుంటాయి.
ఇక పిల్లలకు డబ్బా పాలను ఇవ్వడం మొదలుపెడితే మీ శరీరంలోని హార్మోన్లకు సిగ్నల్స్ అందవు. మీ బిడ్డకు పాలు ఇంకా అవసరమన్న విషయం మీ శరీరానికి తెలియదు. బిడ్డకు తగినన్ని పాలు అందకపోయిన సందర్భంలో బిడ్డకు డబ్బా పాలు పట్టడం తాత్కాలికంగా ఉపశమనం కలిగించేదే. అయితే, తర్వాత కొన్ని సమస్యలకు దారి తీస్తుంది.
మీరు రాత్రి నిద్రలో ఉన్నప్పుడో, అలసిపోయి ఉన్నప్పుడో మీ పార్ట్‌నర్ బిడ్డకు డబ్బా పాలు పట్టించడంలో నష్టం లేదు. కానీ, ఇలా చేయడం వల్ల మీరు మున్ముందు చిన్నారికి పాలు ఇవ్వలేరనడం సరికాదు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 6: అనారోగ్యంతో ఉంటే బిడ్డకు తల్లిపాలు ఇవ్వకూడదు
ప్రొఫెసర్ అలిస్టర్ సట్‌క్లిఫ్: ఇది శుద్ధ తప్పు. హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నవారు మాత్రమే బిడ్డకు పాలివ్వకూడదు. ఎందుకంటే, పాల ద్వారా కూడా ఈ వ్యాధుల వైరస్‌లు పిల్లలకు సంక్రమించినట్లు గతంలో చూశాం.
కానీ, చాలా రోగాలు వచ్చిన సమయంలో తల్లి పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు.
తల్లికి అనారోగ్యంగా ఉంటే ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఇవి నవజాత శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 7: సంవత్సరం కంటే ఎక్కువకాలం పాలిస్తే, పిల్లలకు ఆ అలవాటు మాన్పడం కష్టమవుతుంది
ప్రొఫెసర్ కాట్రియోనా వ్యాట్: పుట్టిన ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. దీని తరువాత అతను ఇతర పోషకాలను ఇవ్వడం ప్రారంభించాలి. కానీ, ఈ సమయంలో తల్లి తాను కోరుకున్నంత కాలం బిడ్డకు పాలివ్వడం కొనసాగించవచ్చుర. తల్లి పాలుపట్టడం ఎప్పుడు ఆపాలన్న దానిపై ఎలాంటి కాలపరిమితి లేదు.
యూకేలాంటి అధికాదాయ దేశాలలో ఒకటి రెండు సంవత్సరాల మధ్యలోనే పాలు పట్టడం ఆపేస్తారు తల్లులు. అయితే, ఉగాండా లాంటి తక్కువ ఆదాయ దేశాలలో తల్లులు తమ పిల్లలకు మూడు నాలుగేళ్లు వచ్చే వరకు పాలు ఇస్తూనే ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఏంటంటే, పిల్లలకు పాలిచ్చేందుకు తల్లులకు సరిపడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, చాలా దేశాలలో అది అమలు కావడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














