బ్లూ వేల్స్: రోజుకు 4 టన్నుల ఆహారం తినే తిమింగలాలు చనిపోయి విశాఖ తూర్పుతీరానికి కొట్టుకొస్తున్నాయి... ఎందుకు?

తిమింగలం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మరణించిన భారీ తిమింగలాలు భారత తూర్పు తీరానికి కొట్టుకొస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. తాజాగా జులై 28న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరానికి 33.5 అడుగుల పొడువు, సుమారు 5 టన్నుల బరువున్న చనిపోయిన తిమింగలం కొట్టుకొచ్చింది.

ఇదే ఏడాది జనవరి 22న అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో 5 అడుగులు, 2022 మార్చి 21న ముత్యాలమ్మపాలెం తీరంలో 30 అడుగుల తిమింగలాలు మత్స్యకారులకు చనిపోయి కనిపించాయి. అలాగే, చనిపోయిన డాల్ఫిన్లూ తూర్పు తీరంలో కనిపిస్తున్నాయి.

ఇలా చనిపోయిన తిమింగలాలు నీలి తిమింగలాలేనని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

నిపుణులు మాత్రం అన్నీ నీలి తిమింగలాలు కావని, కొన్ని మాత్రమే నీలి తిమింగలాలని చెప్తున్నారు.

అయితే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ కన్జర్వేషన్ (ఐయూసీ) అంతరించిపోతున్న జాతిగా గుర్తించిన నీలి తిమింగలాలు తూర్పు తీరంలో ఉంటాయని చెప్తున్నారు.

మరి భారత మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్ఎస్ఐ) లెక్కలు ఏం చెప్తున్నాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం.

తూర్పు తీరంలో నీలి తిమింగలాలు ఉన్నాయా?

ప్రపంచంలోని అతి పెద్ద జీవుల్లో తిమింగలం ఒకటి.

ఈ తిమింగలాల్లోనూ నీలి తిమింగలాన్నే అతి పెద్ద జీవిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

దీని శాస్త్రీయ నామం బాలేనోప్టెరా మస్క్యులస్.

సముద్రంలో చాలా రకాలైన తిమింగలాలు ఉంటాయని, వాటిలో నీలి తిమింగలాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఏయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ సి.మంజులత బీబీసీతో చెప్పారు.

అయితే, నీలి తిమింగలాలు భారతదేశ తూర్పు తీరంలో కనిపిస్తాయని, దానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉందని ఆమె చెప్పారు.

నీలి తిమింగలాలకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

''భారీ నీలి తిమింగలం సుమారు 100 టన్నుల నుంచి 130 టన్నుల బరువు, 30 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. నీలం రంగులో ఉండి లేత బూడిద రంగు మచ్చలతో ఉంటుంది. కొన్ని తిమింగలాలకు పసుపు రంగు కూడా ఉంటుంది. తిమింగలాల శరీరంపై నివాసం ఏర్పరుచుకునే కొన్ని రకాల అల్గేల వలన వీటికి ఆ రంగు వస్తుంది.'' అని ఆమె తెలిపారు.

భారత సముద్ర జలాల్లో ఉండే తిమింగలాలు, మరీముఖ్యంగా నీలి తిమింగలాలు పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి ప్రయాణం చేస్తుంటాయి. అలా వచ్చిన తిమింగలాలు తూర్పు తీరంలోనే ఎక్కువ కాలం గడుపుతాయి. తూర్పు తీరం తిమింగలాలకు కావలసిన ఆహారం దొరికే అనువైన ప్రదేశం.

''ప్రపంచంలో అతి పెద్ద జీవులైన నీలి తిమింగలాలు, క్రిల్ అనే అతి చిన్న రొయ్యలను ఆహారంగా తింటాయి. ఈ రొయ్యలు తూర్పుతీరంలో ఎక్కువగా దొరుకుతాయి. ఒక పెద్ద నీలి తిమింగలం రోజుకు నాలుగు టన్నుల వరకు ఆహారం తింటుందని అంచనా'' అని ప్రొఫెసర్ మంజులత వివరించారు.

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, UGC

ఎందుకు చనిపోతున్నాయి?

తూర్పు తీరంలో మంచి ఆహారం దొరుకుతుండడంతో ఇవి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా గడుపుతుంటాయి. తిమింగలాలు ఏ ప్రాంతంలో అయితే మలం విడుదల చేస్తాయో, అక్కడికి చిన్న చిన్న చేపలు, క్రిల్ రొయ్యలు చేరుకుంటాయి. అలా వచ్చిన వాటిని నీలి తిమింగలం ఆహారంగా తీసుకుంటుంది.

నీలి తిమింగలాలు ట్రాపికల్ జోన్, అంటే ఉష్ణ మండల ప్రాంతాల వైపు ఉండేందుకు ఆసక్తి చూపుతాయి. అందుకే ఈ తిమింగలాలు తూర్పు తీర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కనిపిస్తుంటాయి.

నీలి తిమింగలాలు ఉండేందుకు తూర్పు తీరం అనువుగా ఉండడంతో వాటి ప్రయాణం కూడా ఇటు వైపే ఉంటుంది. అందువల్ల వీటి మరణాలు కూడా ఇక్కడే సంభవించే అవకాశం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ప్రొఫెసర్ పి. ఏడుకొండలరావు బీబీసీతో చెప్పారు.

“సముద్రంలో నౌకలు, వాటి ప్రొఫెల్లర్లు తగలడం వల్ల తిమింగలాలు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. తూర్పు తీరంలో నౌకల ద్వారా సముద్ర వాణిజ్యం ఎక్కువగా జరుగుతుండటంతో ఇక్కడ తిమింగలాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.

అలాగే కలుషితమైన సముద్ర జలాల్లోని ఆహారం తినడం వలన, సముద్రంలోని విపరీతమైన శబ్ధ కాలుష్యం కూడా తిమింగలాల మరణాలకు కారణం కావొచ్చు.” అని ప్రొఫెసర్ ఏడుకొండల రావు వివరించారు.

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, UGC

తిమింగలం కనిపిస్తే పంట పండినట్టే...

విశాఖపట్నం, పూడిమడక తీర ప్రాంతాల నుంచి వేటకు వెళ్లే మత్స్యకారులు తూర్పు తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు వెళ్తుంటారు. ఒకసారి వేటకు వెళ్తే 20 నుంచి 30 రోజులు సముద్రంపైనే ఉంటారు. వీరు భారత జలాలు దాటి అంతర్జాతీయ జలాల్లో కూడా వేట సాగిస్తారు. దీని కోసం వీరు 200 నాటికన్ మైళ్లు దాటి ప్రయాణాలు చేస్తుంటారు.

ఇలా చేపల కోసం వేటకు వెళ్తే మత్స్యకారులకు తిమింగలాలు కనిపిస్తుంటాయి. వేటలో తిమింగలాలను చూసిన కొందరు మత్స్యకారులతో బీబీసీ మాట్లాడింది.

“ఆగస్టు మొదటి వారంలోనే తిమింగలాన్ని చూశాను. రొయ్యల వేట కోసం బెంగాల్ తీరానికి వెళ్లి వస్తుండగా గంగవరం సమీపంలోనే తిమింగలం కనిపించింది. ఇవి నిత్యం కనిపించవు. ఏడాదిలో మూడు, నాలుగు సార్లు కనిపిస్తాయి. తిమింగలాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పంట పండినట్టే. ఎందుకంటే, తిమింగలం ఉందంటే అక్కడ చేపలు ఎక్కువగా ఉన్నట్టే” అని మత్స్యకారుడు మసేన్ బీబీసీతో చెప్పారు.

అలాగే, తిమింగలాలు ఉన్న చోటు నుంచి వెళ్లిపోతే అక్కడ చేపలుండవని కూడా లెక్కలేసుకుంటాం. తిమింగలాలు ఉన్న ప్రదేశాల గురించి అధికారులు కూడా మాకు సమాచారం ఇస్తారని మసేన్ తెలిపారు.

కొన్నిసార్లు తిమింగలాలు మత్స్యకారుల వలల్లో కూడా చిక్కుకుంటాయి. అది మాత్రం తమకు నష్టం చేకూర్చుతుందని మత్స్యకారుడు అమ్మోరు చెప్పారు.

“మేం చేపల కోసం వేసిన వలలో ఒక్కోసారి తిమింగలం చిక్కుకుంటుంది. వలకు తిమింగలం తగిలిందంటే ఆ వల పని అయిపోయినట్టే. ఎందుకంటే, దానిని మేం లాగలేం. అలాగని అది చిక్కుకుపోయి ఉంటే వల బయటకు రాదు. దీంతో మేమే వలకు వేసిన తాడుని కట్ చేసేస్తాం. తిమింగలం మా బోట్లు కంటే పెద్దవిగా ఉంటాయి.

తిమింగలాల వీపుపై ఒక రకమైన పొర కనిపిస్తుంది. దాని వలన వాటి వీపు దురద వేస్తుందో ఏమో, ఆ సమయంలో అక్కడ బోట్లు ఉంటే బోటు కింద భాగానికి వీపుని ఆనించి పోతుంటాయి. కొన్నిసార్లు బోట్లు కుదుపుకు లోనవుతాయి. ఆ సమయంలో బోటు తిరగబడినా కూడా మనుషుల్ని తిమింగలాలు ఏమీ చేయవు” అని అమ్మోరు తెలిపారు.

“సముద్రం నీలంగా ఉండటం వల్లనో ఏమో మాకు కనిపించే తిమింగలాలన్నీ నీలం రంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే మేం చూసిన ప్రతి తిమింగలాన్ని నీలి తిమింగలమే అంటాం” అని మరో మత్స్యకారుడు గంగరాజు చెప్పారు.

నీలి తిమింగలం

మత్స్య పరిశోధన సంస్థ ఏం చెబుతోంది?

తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమద్ర జలాల్లోని డాల్ఫిన్లు, తిమింగలాలపై భారతీయ మత్స్య పరిశోధన సంస్థ (ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా - ఎఫ్‌ఎస్‌ఐ) సర్వే చేస్తోంది.

మత్స్య దర్శిని, మత్స్య షికారి అనే రెండు నౌకలు ఈ సర్వేను నిర్వహిస్తున్నాయి. 2021 జులైలో ప్రారంభమైన ఈ సర్వే జులై 2025 వరకు కొనసాగుతుందని భారత మత్స్య పరిశోధన సంస్థ బీబీసీతో చెప్పింది.

తూర్పు తీరంలో ఎన్ని రకాల తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్నాయి? వాటి సంఖ్య ఎంత ఉండవచ్చు? వాటికి పొంచి ఉన్న ప్రమాదాలేంటి? వాటిని సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఎస్ఐ తెలిపింది.

“ఇప్పటి వరకు తూర్పు తీరంలో నాలుగు జాతులకు చెందిన 2703 డాల్ఫిన్లు, 4 తిమింగలాలను గుర్తించాం. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో 26 జాతులకు చెందిన 10,443 డాల్ఫిన్లు, నాలుగు జాతులకు చెందిన 27 తిమింగలాలను భారత మత్స్య పరిశోధన సంస్థ గుర్తించింది.

మేం చేస్తున్న సర్వే తీరప్రాంతం నుంచి 12 నాటికన్ మైళ్ల అవతలి నుంచి 200 నాటికన్ మైళ్ల మధ్యలో జరుగుతుంది. ఈ సర్వే కోసం కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించడమే కాకుండా అధునాతన బైనాక్యులర్లు, హై రిజల్యూషన్ కెమెరాలు అందించింది. వీటి సాయంతో సర్వే నౌకల ద్వారా డాల్ఫిన్లు. తిమింగలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది” అని భారత మత్స్య పరిశోధన సంస్థ విశాఖ కేంద్రం ఇన్‌చార్జి డి. భామిరెడ్డి బీబీసీకి వివరించారు.

నీలి తిమింగలం

నీలంగా ఉంటే నీలి తిమింగలాలు కావు

తూర్పు తీరంలో ఇటీవల కాలంలో డాల్ఫిన్లు, తిమింగలాలు మృత్యువాత పడుతుండడంతో వాటిని గుర్తించేందుకు సర్వే చేపట్టాలని భారత మత్స్య పరిశోధన సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

సముద్ర జలాల్లో డాల్ఫిన్లు, తిమింగలాలపై నెలకు 20 రోజుల చొప్పున సముద్రంలో నౌకల ద్వారా ఎఫ్ఎస్ఐ సర్వే చేస్తోంది.

“తూర్పు తీరంలో చనిపోతున్న తిమింగలాలన్నీ నీలి తిమింగలాలు కావు. ఏ తిమింగలం చనిపోయినా మత్స్యకారులు దానిని నీలి తిమింగలం అంటారు. తిమింగలాల పైపొర సాధారణంగా నీలంగా ఉండటమే అందుకు కారణం. అయితే, నీలి తిమింగలాలూ ఇక్కడ చనిపోయి కొట్టుకొస్తున్నాయి'' అని భామిరెడ్డి చెప్పారు.

''శ్రీకాకుళం తీరంలోని సంతబొమ్మాళిలో చనిపోయి కొట్టుకొచ్చిన తిమింగలాన్ని నీలి తిమింగలం అన్నారు. దానిపై రంగును చూసి, అలాగే ఎండలో అది మెరుస్తున్న తీరును చూసి దానిని నీలి తిమింగలం అంటున్నారే కానీ, నిజానికి అది శాస్త్రీయంగా చెప్పుకునే నీలి తిమింగలం కాదు. కొట్టుకొచ్చిన తిమింగలం శాస్త్రీయ నామం బాలేనోప్టెరా ఎడెని (Balaenoptera edeni). నీలి తిమింగలం శాస్త్రీయ నామం బాలేనోప్టెరా మస్క్యులస్ (Balaenoptera musculus).

సంతబొమ్మాళిలో చనిపోయిన తిమింగలం శాంపిల్స్ సేకరించాం. దానిని ల్యాబ్‌కు పంపించాం. దాని ద్వారా అది ఏ విధంగా చనిపోయిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫలితాలను విశ్లేషించి, తిమింగలాలను రక్షించేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రణాళికను సిద్ధం చేస్తాం” అని భామిరెడ్డి వివరించారు.

తిమింగలాల వేటపై నిషేధం

ఒకప్పుడు తిమింగలాల వేట విపరీతంగా సాగేది. దీంతో వాటి మనుగడ ప్రమాదకరంగా మారడంతో 1986లో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ప్రపంచవ్యాప్తంగా తిమింగలాల వేటపై పూర్తి నిషేధం విధించిందని ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

భారత్‌లో కూడా సముద్ర క్షీరదాలను రక్షించేందుకు చట్టాలున్నాయి. 1972 చట్టం ప్రకారం సముద్ర జలాల్లోని అన్ని రకాల క్షీరదాలను వేటాడటం, వాటికి హాని కలుగజేయడం నిషేధం.

ప్రొఫెసర్ మంజులత

“ప్రపంచ వన్యప్రాణి సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం నీలి తిమింగలం జాతి ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అంతరించిపోతున్న జీవజాతుల్లో ఈ నీలి తిమింగలం కూడా చేరింది. వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది.

అంతర్జాతీయ వేలింగ్ కమిషన్ హెచ్చరికల తర్వాత కూడా తిమింగలాల వేట, ముఖ్యంగా నీలి తిమింగలాల వేట కొనసాగింది. 1926లో ప్రపంచవ్యాప్తంగా 1,25,000 నీలి తిమింగలాలు ఉండగా, ప్రస్తుతం అవి 10 వేల నుంచి 25 వేల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

కానీ, అంతకంటే తక్కువే ఉండే అవకాశం ఉంది” అని మంజులత తెలిపారు.

వీడియో క్యాప్షన్, తిమింగలాలు చనిపోయాక ఆంధ్రప్రదేశ్ తీరానికి ఎందుకు కొట్టుకొస్తున్నాయి?

ఇవి కూడా చదవండి: