చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్’లో చేరి తప్పు చేశామని ఇటలీ ఎందుకు అంటోంది?

ఫొటో సోర్స్, FABIO FRUSTACI/EPA-EFE/REX/SHUTTERSTOCK
నాలుగేళ్ల క్రితం చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)’ ప్రాజెక్టులో చేరడం తొందరపాటు, వినాశకర నిర్ణయమని ఇటలీ రక్షణ మంత్రి గొయిదో క్రొసెటో చెప్పారు. ఈ నిర్ణయం వల్ల తమ దేశ ఎగుమతులు పెరగలేదన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్త సిల్క్ రోడ్‌లో చేరాలనేది తొందరపాటులో తీసుకున్న నిర్ణయం, దారుణమైన అడుగు అని ‘కొరియర్ డెలా సెరా’ అనే వార్తా పత్రికతో మాట్లాడుతూ గొయిదో క్రొసెటో అన్నారు.
‘‘దీనివల్ల ఇటలీకి చైనా ఎగుమతులు ఎన్నో రెట్లు పెరిగాయి. కానీ, చైనాలో ఇటలీ ఎగుమతులపై ఇది అంతగా ప్రభావం చూపలేదు’’ అని క్రొసెటో వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ప్రాజెక్ట్ వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతోందని చైనా ఇటీవలే పేర్కొంది.
చైనాతో సంబంధాలకు నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలా తప్పుకోవాలనేదే ప్రస్తుతం అతి ముఖ్యమైన సమస్య అని క్రొసెటో అన్నారు.
‘‘చైనా మాకు పోటీదారు అనేది నిజం. కానీ, చైనా మాకు భాగస్వామి కూడా. అంతర్జాతీయ స్థాయిలో చైనా మరింత దూకుడైన వైఖరిని అవలంబిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ ఎలాంటి విపరీత పరిణామాల బారిన పడకుండా ఈ ఒప్పందం నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి’’ అని క్రొసెటో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా వెళ్లనున్న ఇటలీ ప్రధాని
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని జులై 27న వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, చైనా బీఆర్‌ఐ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి తమ ప్రభుత్వానికి డిసెంబర్ వరకు సమయం ఉందని చెప్పారు. త్వరలోనే చైనాలో పర్యటిస్తానని కూడా వెల్లడించారు.
టీజీ5 ఇటాలియన్ న్యూస్ ప్రోగ్రామ్‌కు శనివారం మెలోని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘ఇది ఒక వైరుధ్యం. ఇటలీ అనేది బీఆర్‌ఐలో ఒక భాగమే. కానీ, చైనాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న జీ-7 దేశం ఇటలీ కాకపోవడం ఒక విరుద్ధ అంశం.
అంటే, బీఆర్‌ఐలో భాగం కాకపోయినప్పటికీ మీరు మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉండొచ్చని ఇది చూపిస్తుంది’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, JEROME FAVRE/EPA-EFE/REX/SHUTTERSTOCK
చైనా-ఇటలీ ఒప్పందం ఎలా కుదిరింది?
ఇటలీ గత ప్రభుత్వం 2019 మార్చిలో బీఆర్‌ఐ ప్రాజెక్ట్ కోసం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇటలీ ఆర్థిక మంత్రి జియోవానీ ట్రియా, 2018 చైనా పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో చేరాలని ఇటలీ నిర్ణయించుకుంది. దీంతో అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు పశ్చిమ దేశాల్లోని దాని ఇతర మిత్రదేశాలు ఈ విషయంలో ఇటలీని విమర్శించాయి.
అయితే, ఈ ఏడాది మే నెలలో ఇటలీ కొత్త ప్రధాని జార్జియా మెలోని ఈ ఒప్పందం నుంచి తాము వైదొలగాలని అనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన తర్వాత కూడా చైనాతో మెరుగైన సంబంధాలు కొనసాగించడం అసాధ్యమేమీ కాదని అన్నారు.
ఈ ఒప్పందం 2024 మార్చిలో ముగుస్తుంది. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా పునరుద్ధరణ జరుగుతుందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
ఒకవేళ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే రెండు పక్షాల్లో ఎవరైనా మూడు నెలల ముందుగానే ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, PRESS INFORMATION DEPARTMENT (PID)/HANDOUT VIA REUTERS
చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి?
చారిత్రక కాలం నాటి సిల్క్ రూట్‌ను పునర్నిర్మించాలనే ఆలోచనపై బీఆర్‌ఐ ప్రాజెక్ట్ భావన ఆధారపడి ఉంది. దీని ద్వారా చైనాను యూరప్‌తో పాటు ఇతర దేశాలకు అనుసంధానం చేయాలని చూస్తున్నారు.
సిల్క్ రూట్ అనేది ఒకే రహదారి లేదా మార్గం కాదు. ఇది రహదారుల నెట్‌వర్క్. దీని ద్వారా వాణిజ్యం మాత్రమే కాకుండా సంస్కృతి మార్పిడులు కూడా జరిగాయి.
దాదాపు 6,437 కిలోమీటర్లు ఉండే ఈ రూట్- గోబీ ఎడారి, పామీర్ కొండలు వంటి ప్రపంచంలోని అనేక క్లిష్టమైన, ప్రయాణానికి అనుకూలంగా లేని ప్రాంతాల గుండా సాగుతుంది.
2013లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వాణిజ్య మార్గాన్ని పునర్నిర్మించాలని భావించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు.
ఈ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ మొదలైన పదేళ్ల కాలంలోనే ఇది ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఓషియానియా వరకు విస్తరించింది.
ఈ ప్రాజెక్ట్ కింద చైనా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక చైనా ఆయుధమని చైనా విమర్శకులు నమ్ముతారు. దీని ద్వారా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రాభవాన్నిపెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుందని వారు చెబుతున్నారు.

బీఆర్‌ఐలో ఎవరెవరు ఉన్నారు?
యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రకారం, చైనాకు చెందిన బీఆర్‌ఐ ప్రాజెక్టులో ఇప్పటివరకు 130 దేశాలు ఉన్నాయి.
ఇందులో సబ్-సహారా ఆఫ్రికాలోని 38 దేశాలు, యూరప్- మధ్య ఆసియాలోని 34 దేశాలు, తూర్పు ఆసియా- పసిఫిక్‌లోని 25 దేశాలు, మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికాలోని 17 దేశాలు, లాటిన్ అమెరికా-కరేబియన్‌లోని 18 దేశాలు, ఆగ్నేయాసియాలోని 6 దేశాలు ఉన్నాయి.
భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ కూడా ఇందులో ఉన్నాయి.
బీఆర్‌ఐ ప్రాజెక్టులో 100కు పైగా దేశాలను చైనా అనుసంధానించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ ప్రొఫెసర్ ప్రభాకర్ సాహూ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2,600 బీఆర్‌ఐ ప్రాజెక్ట్‌లు జరుగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘రాహుల్‌కు పెళ్లి చేస్తాం, అమ్మాయి ఉంటే చెప్పండి’: హరియాణా మహిళలతో సోనియా గాంధీ వ్యాఖ్యలు
- అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్‌కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు
- మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు
- ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? మలబద్ధకం ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి?
- వెయిట్ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














