తెలంగాణ: కేసీఆర్ అప్పుడు అసంభవం అని చెప్పిన పనులను ఇప్పుడు హడావిడిగా ప్రకటిస్తున్నారెందుకు?

కేసీఆర్, బాజిరెడ్డి గోవర్థన్

ఫొటో సోర్స్, facebook/KCR

ఫొటో క్యాప్షన్, టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగస్ట్ 1న ప్రగతి భవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అంతే పట్టుదలతో ఉంది.

‌‍ఈ క్రమంలో గత కొద్ది రోజుల వ్యవధిలోనే ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం చూపే వివిధ కార్యక్రమాలు, పథకాలను బీఆర్ఎస్ తెరపైకి తీసుకువస్తోంది.

గత నాలుగున్నరేళ్లలో అసంభవం అని కేసీఆర్ స్వయంగా చెప్పిన కార్యక్రమాలను ఇప్పుడు ఎలాగైనా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.

ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయాన్నే తీసుకుందాం..

జులై 31న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది జరిగిన మరుసటి రోజు నుంచి కేసీ‌‍ఆర్ గతంలో ఆర్టీసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ మాటలను కేసీఆర్.. అక్టోబరు 24, 2019న హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత అన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా వివిధ డిమాండ్లతో అప్పట్లో కార్మికులు సమ్మె చేశారు.

ఈ సమ్మెను ఉద్దేశించి అప్పట్లో కేసీఆర్ ఏం అన్నారో ఒకసారి చూద్దాం..

‘‘ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడమనేది ఒక అసంబద్ధమైనటువంటి.. అసంభవమైనటువంటి.. అర్థరహితమైనటువంటి డిమాండ్. ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకుని.. అదొక నినాదమా.. అండీ..?’’ అంటూ కేసీఆర్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అప్పట్లో ఆర్టీసీ విలీనంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు ఎన్నిలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళిత బంధు లబ్ధి అందజేస్తున్న కేసీఆర్

గతంలోనూ ఎన్నికల ముందు కార్యక్రమాలు

హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దీన్ని ‌‍హుజురాబాద్‌ ఎన్నికలలో గెలిచే లక్ష్యంతో హడావిడిగా ప్రారంభించారన్న విమర్శలు వినిపించాయి.

తర్వాత 2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఘటన చోటు చేసుకుంది.

అప్పట్లో హైదరాబాద్ లో ప్రజలకు రూ.10వేలు చొప్పున ప్రభుత్వం వరద సాయం అందించింది.

ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తోంది.

దళితబంధు తరహాలోనే గత నెలలో మైనార్టీలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

దళితబంధులో రూ.10లక్షల సాయం అందిస్తుండగా.. మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకర‌ణ పూర్తి అయ్యింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

రైతులకు రుణమాఫీ కూడా ఇప్పుడే..

రైతులకు రూ.లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని 2018లో బీఆర్ఎస్ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రకటించింది.

ఆ తర్వాత హామీని ప్రభుత్వం అమలు చేయలేదు.

తెలంగాణ వ్యాప్తంగా రైతుల రుణాలు పెండింగులో ఉన్నాయి.

రుణమాఫీ అమలు చేయకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకునే విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు.

ఈ విషయంపై ఇటీవల వామపక్ష నాయకులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 20లక్షల మంది రైతుల ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని విమర్శించారు.

మరోవైపు వరంగల్ లో నిర్వహించిన రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించింది.

రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది.

రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉందని భావించిన సీఎం కేసీఆర్ రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ఈ నెల 3వ తేదీ నుంచి దశల వారీగా రూ.19వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది.

దీనివల్ల 29.61లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో రూ.36వేల లోపు ఉన్న రుణాలకు సంబంధించి రూ.1207 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నాలుగున్నరేళ్లపాటు జాప్యం చేయడంతో రైతులు చాలా అవస్థలు పడ్డారని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.

రైతు

ఫొటో సోర్స్, Getty Images

దీనిపై రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి బీబీసీతో మాట్లాడారు..

‘‘రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో డిసెంబరు, 2018లోపు ఉన్న రుణాలను రైతులు చెల్లించలేదు.

దీనివల్ల వడ్డీ భారం బాగా పెరిగింది.

ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెబుతున్నా.. రుణాల్లో అసలు మాత్రమే మాఫీ చేస్తుందా.. లేదా వడ్డీ కూడా కడతారా.. అనేది స్పష్టత ఇవ్వలేదు.

ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం మార్చి 2023నాటికి 76వేల కోట్ల రుణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం 21వేల కోట్లు మాఫీ చేస్తే, వడ్డీల సంగతి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి.

45 రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని ద్రష్టిలో పెట్టుకుంటే సరిపోయే పరిస్థితి లేదు.’’ అని చెప్పారు.

 పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ర్ట అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘డిసెంబరు 6, 2018 వరకు 29.61లక్షలకు సంబంధించి 42.1లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నట్లో అప్పట్లో గుర్తించాం. దానికి సంబంధించి 20488 కోట్ల రుణాలు ఉన్నాయి. 5.30 లక్షల మందికి సంబంధించి రుణాలు ఇప్పటికే కట్టాం. మిగిలినవి సెప్టెంబరు నెలాఖరులోగా దశల వారీగా చెల్లిస్తాం.

మేం కట్టే రుణాలకు సంబంధించి రూ.లక్షలోపు ఉన్న వారికి చెల్లించాలని నిర్ణయించాం. ప్రభుత్వం నిధులు ఎక్కడ నుంచి తీసుకువస్తుందనేది రైతు సంఘాలకు అనవసరమైన విషయం. రైతులకు మేలు జరుగుతుందా.. లేదా అన్నది చూడాలి.

అప్పులు తెచ్చి కడుతుందా లేక మరో రూపంలో ఆదాయం సమకూర్చుకుందా.. అనేది ప్రభుత్వం చూసుకుంటుంది’’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.

ఆర్థికంగా కార్యక్రమాలు సాధ్యమేనా..?

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక పరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు భారీ ఎత్తున నిధులు అవసరమయ్యే కార్యక్రమాలు తీసుకువస్తోంది.

ప్రస్తుతం రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,488 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.

ఆర్టీసీ విలీనంతో కార్మికులకు వేతనాల చెల్లింపు, చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, దివ్యాంగులకు పింఛన్ల పెంపు... ఇలా అనేక పథకాలు, కార్యక్రమాలు ఆర్థికంగా ముడిపడినవే.

మరి ఈ నిధులు ఏ విధంగా సమకూర్చకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

దీనిపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎకనామిక్స్ ఆచార్యుడు చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి.

ఇటీవల వచ్చిన కాగ్ రిపోర్టును పరిశీలిస్తే, అప్పులు తెచ్చి అప్పులు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు పొందేందుకు తీసుకువస్తున్న కార్యక్రమాలు, పథకాలుగా కనిపిస్తున్నాయి.

గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది. అవి ఏ దశలో ఉన్నాయో తెలియదు గానీ, మళ్లీ ఇప్పుడు గ్రహలక్ష్మీ పథకం తీసుకువచ్చారు.

రైతు రుణమాఫీ చేయలేదని చెబితే, రుణమాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్నికల కోసమే పూర్తిగా ఈ పథకాలన్నీ తీసుకువస్తోంది.

ఇవన్నీ తాయిలాలుగా గుర్తించవచ్చు.’’ అని కృష్ణారెడ్డి చెప్పారు.

ktr

ఫొటో సోర్స్, facebook/ktr

ఆదాయ మార్గాల కోసం వెతుకులాట

నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ శివారుల్లోని భూములు వేలం వేస్తోంది ప్రభుత్వం.

కోకాపేట, బుద్వేల్, షాబాద్, మోకిల ప్రాంతాలను ఎంచుకుంది.

అలాగే మద్యం టెండర్ల కేటాయింపు ప్రక్రియను మూడు నెలల ముందే చేపట్టింది.

అంతకుముందు హైదరాబాద్ లోని అవుటర్ రింగు రోడ్డును 30ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనివల్ల ఏటా 7380 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

ఈ విషయంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది.

కేంద్రమేమో మెడపై కత్తి పెట్టి రావాల్సిన పైసలు రానివ్వడం లేదు. అందుకే సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమీకరణకు ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఏర్పాటు చేశాం.

కల్యాణలక్ష్మి ఆపాలా.. రైతుబంధు ఆపాలా.. రైతు బీమా ఆపాలా.. పింఛన్లు ఆపాలా.. వాటిని కొనసాగించేందుకు కమిటీ సూచనల మేరకు ఓఆర్ఆర్ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించాం.’’ అని చెప్పారు.

వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని కొత్తగా చేపట్టే కార్యక్రమాలకు మళ్లించవచ్చని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మున్ముందు ఆర్థిక స్థితిగతులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

‘‘ఖర్చులు పెరిగిపోతే ఆర్థిక పరిస్థితి గాడి తప్పే ప్రమాదం ఉంది.

ప్రణాళిక ప్రకారం పేదలను పేదరికం నుంచి బయటపడేలా కార్యక్రమాలు చేపడితే మంచిది.

అంతేకానీ ఓట్లు తెచ్చుకునేందుకు అన్నట్లుగా పథకాలు సరికావు. ఇవి ప్రభుత్వంపై అప్పటికప్పుడు వచ్చిన వ్యతిరేకత తగ్గించవచ్చేమో గానీ, అప్పుల భారం పెరిగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఫిస్కల్ డెఫిషియట్ 25లోపు ఉండాలి. కానీ ఇప్పుడు అది పెరిగిపోయింది.’’ అని బీబీసీతో చెప్పారు చిట్టెడి కృష్ణారెడ్డి.

kcr

ఫొటో సోర్స్, facebook/kcr

గత రెండు వారాలలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..

  • వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు చొప్పున చేనేత కార్మికులకు ఆర్థిక సాయం
  • నిర్దేశిత నిబంధనల మేరకు పనిచేస్తున్న జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ
  • విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేయడం.. ఇందుకు వివిధ శాఖల్లో 14954 పోస్టులు మంజూరు.
  • మెట్రో రైల్ మూడో ఫేజ్ ప్రకటన.. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో 60,100 కోట్ల రూపాయలతో 142 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం.
  • అవుటర్ రింగు చుట్టూ 136 కిలోమీటర్ల లైనును ప్రతిపాదించింది. ఇప్పటికే హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ లైన్ ఉంది.
  • దీనికి అదనంగా రెండో ఫేజ్ కింద ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల లైను విస్తరిస్తోంది. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 5కిలోమీటర్లు రెండో దశలోనే ప్రతిపాదించింది.
  • అనాథల కోసం ప్రత్యేకంగా పాలసీ ప్రకటన. వారిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలు గుర్తించాలని నిర్ణయం.
  • ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఐఆర్.. పీఆర్సీ వేయాలని నిర్ణయం
  • సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్.. గతంలో దసరా, దీపావళి బోసన్ రెండూ కలిపి రూ.83కోట్లు ఇచ్చేవారు.
  • 7వేల మంది మౌజం, ఇమామ్ లకు నెలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం
  • పట్టణ ప్రాంతాల్లో అసైన్డ్ భూములన్న వారికి అమ్ముకునేందుకు హక్కులు కల్పించాలని నిర్ణయం.
  • రేషను డీలర్ల కమిషన్ రూ.900 నుంచి 1400 వరకు పెంపు.. రేషను డీలర్లకు రూ.5లక్షల కమిషన్ అమలుకు నిర్ణయం.
  • బీడీ కార్మికులతోపాటు టేకేదారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయం
  • నోటరీ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ..

ఇవి కూడా చదవండి: