ఎన్టీఆర్ తరువాత కీలక రెవెన్యూ సంస్కరణలు తెచ్చిన కేసీఆర్.. కొత్త వ్యవస్థలో ఆ 5 పనులు ఎవరు చేస్తారు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పులు వచ్చాయి.
ఒకప్పటిలా గ్రామాలలో వీఆర్వోలు, వీఆర్ఏలు లేరు. తహసీల్దార్ అధికారాలు తగ్గిపోయాయి. ఆర్డీవోలు ఉంటారో ఉండరో తెలియదు. దశాబ్దాల తర్వాత తెలంగాణ పాలనలో వచ్చిన అతి పెద్ద మార్పు ఇది.
80లలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కంటే చాలా పెద్ద మార్పులు ఇవి.
అప్పట్లో ఎన్టీఆర్ రద్దు చేసిన మునసబు, కరణాల వ్యవస్థ ఇప్పటికీ చర్చలోనే ఉంది. తాజాగా కేసీఆర్ చేపట్టిన మార్పు అంతకంటే పెద్దది.
ప్రస్తుతం రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న విధుల్లో ప్రధానమైనవి:
1. భూమి రికార్డుల నిర్వహణ
2. సాధారణ పరిపాలన
3. ప్రొటోకాల్ పనులు
4. ధ్రువపత్రాల జారీ
5. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో న్యాయపరమైన పనులు
6. ప్రకృతి - మానవ వైపరీత్యాల్లో సహాయక చర్యలు

రెవెన్యూ శాఖలో హోదాలు
1. గ్రామ స్థాయి: వీఆర్వో, వీఆర్‌ఏ
2. మండల స్థాయి: తహసీల్దార్(ఎమ్మార్వో), డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ
ఇన్‌స్పెక్టర్ (సీనియర్ అసిస్టెంట్)
3. డివిజన్ స్థాయి: ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్)
4. జిల్లా స్థాయి: కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)
వీళ్లలో గ్రామ స్థాయి అధికారులను పూర్తిగా తొలగించారు.
మండల, డివిజన్ స్థాయి వ్యక్తుల అధికారాలను తగ్గించారు కేసీఆర్. దీంతో పైన చెప్పిన పనుల్లో ఒక్క భూమి రికార్డుల నిర్వహణ తప్ప,
మిగిలిన ఐదు పనులు ఎవరు చేస్తారన్నది తెలంగాణలో పెద్ద ప్రశ్నగా మారింది.
అటు భూరికార్డుల విషయంలో కూడా భవిష్యత్తులో వచ్చే సమస్యలకు పరిష్కారం సామాన్యులకు అందుబాటులో ఉండదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ మార్పుల వల్ల వచ్చే సమస్యలు అర్థం కావాలంటే అసలు ఈ రంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలియాలి.
అసలు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మార్పులేంటి? ఈ మార్పులు సామాన్యుడికి మేలు చేస్తాయా? అవి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి?

ఫొటో సోర్స్, KCR/FACEBOOK
కేసీఆర్‌కి ముందు ఎలా ఉండేది?
రెవెన్యూ అంటే ఆదాయం అని అర్థం. ఇప్పుడు భూమి వ్యవహారాలు చూసే శాఖను రెవెన్యూ శాఖగా పిలుస్తున్నారు.
దాంతో పాటు జిల్లా నుంచి గ్రామం వరకూ సాధారణ పరిపాలన అంటే గవర్నమెంటు చేయాల్సిన అన్ని పనులనూ చేసే పెద్దరికం కూడా ఈ శాఖ దగ్గరే ఉండేది.
ఆ మాటకొస్తే 'ప్రభుత్వం' అనగానే ముందుగా గుర్తొచ్చేది వీళ్లే.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ విభాగంతో పని పడుతుంది. భూమితోపాటు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎలాగైతే అన్ని శాఖల విషయంలో సర్వాధికారిగా వ్యవహరిస్తారో, డివిజన్లో ఆర్డీవో, మండలంలో తహసీల్దార్, గ్రామంలో వీఆర్వోలు అంతే ముఖ్యపాత్ర పోషిస్తారు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్ వరకూ:
1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పటేల్, పట్వారీలను (ఆంధ్రలో మునసబు, కరణాలు) రద్దు చేశారు. కరణాలు/ పట్వారీల దగ్గర భూమి వివరాలు, చరిత్ర ఉండేవి. దీంతో కరణం వ్యవస్థ రద్దు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.
కరణం వ్యవస్థ రద్దు చేశారే కానీ, వారికి ప్రత్యామ్నాయంగా ఎవరినీ నియమించలేదు. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో రెవెన్యూ రికార్డు పనులు ఆగిపోయాయి. పరిస్థితి గందరగోళంగా మారింది.
అప్పటి జిల్లా కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. ఇక తాలూకాలను ఇంకా చిన్నగా విభజించి మండలాలు అనే పేరు పెట్టి, వాటికి మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో)లను పెట్టారు.
దీంతో అప్పటి వరకూ అనువంశిక పటేల్ పట్వారీలుగా ఉన్నవారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. వారిలో అర్హత ఉన్నవారికి ఆ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కొందరికి ఆ ఉద్యోగాలు వచ్చాయి.
పదో తరగతి కూడా చదవని కొందరు వీఏ (విలేజ్ అసిస్టెంట్) పేరుతో వచ్చారు. పది కంటే ఎక్కువ చదివిన వారు వీఏఓ (విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)గా వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటి నుంచీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ వీరి చేతుల్లోకి వచ్చింది.
ఆ తర్వాత చంద్రబాబు హయాంలో క్షేత్ర స్థాయిలో పంచాయితీ వ్యవస్థనూ, రెవెన్యూ వ్యవస్థనూ కలిపేశారు. అంటే వీఏవోలను పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. వీరే పంచాయతీ విధులు, రెవెన్యూ విధులు నిర్వహించాల్సి వచ్చేది. వీరిని ఎమ్మార్వో నుంచి ఎంపీడీఓ (మండల పరిషత్ డవలప్‌మెంట్ ఆఫీసర్) కిందకు తెచ్చారు.
తరువాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూని, గ్రామ పంచాయతీని విభజించి వీఆర్ఓలను నియమించారు. దీంతో గ్రామంలో మూడు పోస్టులు వచ్చాయి.
1. పంచాయతీ కార్యదర్శి - పంచాయతీ పాలన, గ్రామంలో సౌకర్యాలు చూస్తారు.
2.వీఆర్ఓ - విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ - భూమి, పన్నులు వ్యవహారాలు చూస్తారు.
3. వీఆర్ఏ - విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ - గ్రామ నౌకరు లేదా మస్కూరి, వీరు గ్రామ పాలనలో సహకారిగా ఉంటారు.
ఇప్పుడు మళ్లీ కేసీఆర్ తెలంగాణలో ఈ వీఆర్వో, వీఆర్‌ఏలను రద్దు చేశారు.
ఆ పనులు ఎవరు చేయాలి?
రద్దు వరకూ బాగానే ఉంది కానీ, మరి వాళ్లు చేయాల్సిన పనుల సంగతేంటి? అవి గవర్నమెంటు ఆఫీసులో క్లర్కు ఉద్యోగాల వంటివి అయితే మిగిలిన వారితో ఎలాగోలా నెట్టుకురావొచ్చు.
కానీ, అవన్నీ రోజూ జనంతో ముడిపడిన కీలకమైన ఉద్యోగాలు కావడంతో ఇప్పుడీ పనులు ఎవరు చేయాలనే ప్రశ్న వస్తోంది.
భూమికి సంబంధించి అన్ని విషయాల్లోనూ వీఆర్వోలు కీలకంగా ఉండేవారు. కానీ, ఇకపై ఈ వ్యవస్థ రద్దయింది. తహసీల్దార్ల అధికారాలు తగ్గాయి. ఆర్డీవో అధికారాలు పోయాయి.
గతంలో ఏదైనా భూవివాదాలను తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు పరిష్కరించగలిగే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఏ సమస్య ఉన్నా నేరుగా కోర్టుకే వెళ్లాలి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూమి సమస్యలపై కోర్టు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
‘‘తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ అవడం వల్ల జరిగిన మేలు ఒకటే. అది మ్యుటేషన్ బాధ తప్పింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి అయిపోతున్నాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదెకరాలు అమ్మితే, వాస్తవంగా అక్కడ నాలుగెకరాలే ఉంది కాబట్టి మ్యుటేషన్ చేయను పొమ్మనేవాడు తహసీల్దారు.
ఇప్పుడా సమస్య లేదు. ఎక్కడ ఎంత భూమి ఉంటే అంతే భూమి అమ్మి, అంతే భూమి మ్యుటేషన్ అవుతోంది.’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఆర్డీవో బీబీసీతో చెప్పారు.
‘‘భూ సమస్యలు డైనమిక్‌గా ఉంటాయి. రోజుకో కొత్తరకమైన భూ సమస్య వస్తుంది. ఇక గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఉండరు. దీంతో ప్రతిచిన్న సమస్యకూ కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ చిత్రం ఏంటంటే, కోర్టు ఆ ఫైలును తిరిగి మళ్లీ రెవెన్యూ శాఖకే పంపుతుంది. చాలా సందర్భాల్లో మేం చేయాల్సిన పనిని కూడా ‘‘కోర్టుకు వెళ్లండని సలహా ఇచ్చి, కోర్టు చెప్పిన తరువాతే ఆ పని చేస్తున్నాం.’’
ఈ కొత్త వ్యవస్థలో రైతులు కోర్టుకు వెళ్లే అదనపు భారం పెరిగింది. ఇక తహసీల్దార్లు చేస్తోన్న రిజిస్ట్రేషన్లు క్లర్కులు అయినా చేయగలరు. దాని కోసం ఆఫీసర్లను పెట్టడం కూడా దండగే’’ అని బీబీసీతో అన్నారు ఆర్డీవో లచ్చిరెడ్డి.
నిజానికి తహసీల్దారుకు వీఆర్వో, వీఆర్‌ఏలు చేతులు, చెవుల్లాగే ఉండేవాళ్లు. భూమి సమస్యల పరిష్కారం వీరి చేతుల మీదుగా జరిగేది. అయితే దానికి రెండు పార్శ్వాలూ ఉన్నాయి.
ఒకవేళ ఈ ముగ్గురూ అవినీతిపరులైతే అప్పుడు భూ వివాదాల పరిష్కారంలో కూడా ఆ అవినీతి ఆనవాళ్లు కనిపించేవి. కానీ ఒక్క చట్టంతో ఈ మొత్తం వ్యవస్థ లేకుండా చేశారు కేసీఆర్.
టెక్నాలజీతో సాధ్యమేనా?

‘‘ఎన్టీఆర్ పటేల్ పట్వారీలను తీసేసినా దాని స్థానంలో మరో వ్యవస్థ తెచ్చారు. వ్యవస్థను ఇంకా పెంచి, మరింత అందుబాటులోకి తెచ్చారు. తాలుకా పోయి మండలం వచ్చి దగ్గరయ్యింది. అలా ఒక రకమైన ప్రత్యామ్నాయం ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయం లేదు. మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలంగాణలో భూమి అనే వ్యవస్థ అంతా గందరగోళం అయింది’’ అన్నారు లచ్చిరెడ్డి.
అయితే, టెక్నాలజీయే వీఆర్వోలాగా పనిచేస్తుందంటున్నారు కేసీఆర్. 2020లో చట్టాలు తెచ్చే సమయంలో కేసీఆర్ చేసిన ఉపన్యాసం చాలా ఆసక్తికరంగా సాగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలో మార్పుల గురించి గొప్పగా చెప్పారు కేసీఆర్.
‘‘విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేస్తున్నారు. కానీ, అందుకు ప్రత్యామ్నాయంగా ఎవరినీ నియమించడం లేదు. వారు చేసే పనులు ఇకపై తహసీల్దార్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని చేస్తారు. ఐటీ నడిపించే వెబ్ సైటే వీఆర్వోలకు ప్రత్యామ్నాయం’’ అని అప్పట్లో అసెంబ్లీలో చెప్పారు కేసీఆర్.
కానీ వాస్తవంగా ఆ టెక్నాలజీ, అంటే ఇక్కడ ధరణి వెబ్ సైట్ తెచ్చిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. ధరణి వల్ల జరిగిన మేలు లేకపోలేదు. కానీ, ధరణి వల్ల వచ్చే సమస్యలు సామాన్యుడు తట్టుకోలేనంత ఖరీదైనవి.
‘‘భూమి వివాదాలు మాత్రం నేరుగా సివిల్ కోర్టులకు వెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ వారు వివాదాలు పరిష్కరించరు’’ అని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. ఆ సివిల్ కోర్టు వ్యవహారం ఎప్పటికి తేలుతుందో, ఎంత ఖర్చవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఇక వీఆర్వోలు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల వ్యవహారాలు చూస్తుండేవారు.. కానీ, ఇకపై ఆ బాధ్యత ఎవరు చూస్తారనేది కూడా ప్రశ్నే.
సర్టిఫికెట్లు, ఎమర్జెన్సీ పనుల సంగతేంటి?
రెవెన్యూ శాఖ పేరుకే భూమి శాఖ అయినా, జిల్లా నుంచి గ్రామం వరకూ అన్ని పనులూ తామే చేసే ప్రధాన ప్రభుత్వ శాఖ అదే.
ఊళ్లో విపత్తు వచ్చినా, గొడవలు జరిగినా, ఎన్నికలు వచ్చినా, పథకాలు రావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా ఆ శాఖాధికారులే చేసేవారు.
కానీ, ఇప్పుడు వాళ్లు లేకపోవడంతో ఈ పనులన్నీ ఎవరు చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
దానికి కేసీఆర్ సమాధానమూ ఉంది. కానీ, ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా, ప్రభుత్వ స్కీములకు అర్హత పొందాలన్నా రెవెన్యూ శాఖ జారీ చేసే సర్టిఫికెట్లే కీలకం.
ప్రభుత్వం తరపున క్యాస్ట్, ఇన్ కం, నేటివిటీ సర్టిఫికెట్లను జారీ చేసే బాధ్యత రెవెన్యూ శాఖదే.
ఈ పర్టిఫికెట్లు జారీ చేసేముందు తహసీల్దార్లు గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వోల)తో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించేవారు. ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం చేసి ఇస్తే తహసీల్దార్ ఫైనల్ సంతకం చేసి సర్టిఫికెట్ ఇష్యూ చేసేవారు.
వీఆర్వోలను తొలగించాక.. వీఆర్ఎలతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి నుంచి డబుల్ బెడ్ రూమ్ వరకూ వీళ్ల సర్టిఫికెట్లు అత్యంత కీలకం. కానీ, ఇకపై ఈ సర్టిఫికెట్లను వెరిఫై చేసే రెవెన్యూ వ్యవస్థ గ్రామాల్లో ఉండదు.
ఎన్నికల నిర్వహణలోనూ ఇప్పటి వరకూ రెవెన్యూ అధికారులదే కీలకపాత్ర. ఎన్నికల ప్రక్రియ మొత్తం వీళ్ల చేతుల మీదుగానే నడిచేది. గ్రామంలోకి వచ్చిన ఎన్నికల సిబ్బందికి బస, భోజనాల మొదలు, ఎన్నికల సంఘం చేసే ఇతరత్రా పనులు చాలా వరకూ వీళ్లే చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తారనేది సమస్య.
‘‘భూమి సంగతి పక్కన పెడితే ప్రభుత్వానికి ఏ అసవరం వచ్చినా ఒక పాయింట్ పర్సన్‌గా ఉంటూ అన్ని శాఖలనూ సమన్వయం చేసే ఒక కోఆర్డినేషన్ పోయింది. గతంలో రెవెన్యూ వాళ్లు అన్ని శాఖలకూ పాయింట్ పర్సన్‌గా ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు.
అత్యవసరాలు, కల్లోలాలు, విపత్తులు వచ్చినప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై భూ రిజిస్ట్రేషన్లు, సాధారణ పరిపాలన వ్యవహారాలు స్థానిక సంస్థలు కూడా చూడాలి. అలా కూడా నడిపించవచ్చు. వ్యవస్థ ఆగిపోతుందని కాదు కానీ అస్తవ్యస్తం అవుతుంది.’’ అన్నారు లచ్చి రెడ్డి.

ఎన్నో అనుమానాలు
‘‘కొత్త వ్యవస్థను తీసుకురాకుండా, ఉన్న వ్యవస్థలను ఇలా అకస్మాత్తుగా రద్దు చేయడం అంటే తెలంగాణను చాలా దారుణ పరిస్థితుల్లోకి నెట్టడమే. విపత్తు సమయాల్లో ప్రభుత్వాలు పని చేయలేక అట్టర్ ఫ్లాప్ అవుతాయి. పెద్ద గ్రామాల్లో ఒకరి కంటే ఎక్కువ వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉంటారు. అలానే కొన్ని పెద్ద మండలాల్లో వంద మంది వీఆర్‌ఏలు ఉంటారు. వీరంతా విపత్తుల సమయంలో నిలబడి పనిచేస్తారు. చెరువుల నీటి మట్టాలు చూసే నీరడి పని చేసేవారు.
ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి? సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎవరు చేయాలి? ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు ఇవ్వలేరు కదా? వీఆర్వోలు చెప్పిన వివరాల ఆధారంగా, కొంచెం పెద్ద స్థాయి అయితే ఆర్ఐలను పంపి పరిశీలించి చేసేవారు. కూకట్‌పల్లి వంటి మండలాల్లో తహసీల్దార్ రోజుకు 300-400 సర్టిఫికెట్లు ఇస్తారు? ఈ వ్యవస్థ వల్లే అది జరుగుతుంది. ఇప్పుడు వాళ్లు లేకపోతే ఆ వెరిఫికేషన్లు ఎవరు చేస్తారు?’’ అని బీబీసీతో మాట్లాడిన ఒక ఆర్డీవో తన అనుమానాలను వ్యక్తం చేశారు.
అయితే, పంచాయతీ సిబ్బందే ఆ పనిచేయాలని గతంలో కేసీఆర్ అన్నారు.
‘‘ఇకపై కుల సర్టిఫికెట్లు గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీలే ఇస్తాయి. ఇకపై ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు మనుషులతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఇస్తారు. మీకున్న ఆస్తిపాస్తుల వివరాలు ప్రభుత్వానికి తెలుసు (సమగ్ర సర్వే ద్వారా) కాబట్టి, వాటి ఆధారంగా అప్లై చేసిన వారికి ఆన్లైన్లో సర్టిఫికెట్ ఇస్తారు.’’ అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
కానీ, క్షేత్ర స్థాయిలో అది ఇంకా అమలు కావడం లేదు. వీధి లైట్లు, చెత్త, పరిశుభ్రత, రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు చూసే పంచాయతీ, మునిసిపాలిటీ వాళ్లు ఈ బాధ్యతలను కూడా సక్రమంగా చూడగలరా? అనేది మరో ప్రశ్న.
అదంత తేలిక కాదు అంటారు లచ్చిరెడ్డి. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఏదైనా ఒక విషయం చెప్తే అది అందరికీ చేరేది. కానీ, ఇకపై ఏ శాఖ ఆ శాఖ పని చూసుకోవాలి.
‘‘రెవెన్యూ వాళ్లు ఫోన్ చేస్తే ఏ శాఖ వాళ్లైనా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్లు నేరుగా కలెక్టర్ కింద ఉంటారు కాబట్టి. కానీ, ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తారో చూడాలి.’’ అని ఆర్డీవో లచ్చిరెడ్డి బీబీసీతో అన్నారు.
ఇప్పటి వరకూ ఉన్న పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలకు జవాబుదారీ. ఇక ఎంపీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులపైనే అసలు భారం పడబోతోంది. కానీ, వీరు నేరుగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ దగ్గర ఉంటారు. దీంతో మిగతా శాఖలతో ప్రోటోకాల్ సమస్య వస్తుంది.
‘‘ఈ కొత్త వ్యవస్థతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూడాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం దృష్టిలో తహసీల్దార్ కీలకం. కానీ, ఇప్పుడు ఆ తహసీల్దార్ కింద పనిచేయడానికి మనిషి లేడు. ఎవరు చేస్తారు ఆ పని?’’ అని ప్రశ్నించారాయన.
గుప్త నిధులు సీజ్ చేయడం, పంచనామా చేయడం, పోస్టుమార్టం దగ్గర ఉండడం, 144 సెక్షన్ అమలు, వారసుల్లేని వారి ఆస్తులు వెరిఫై చేయడం లాంటి విధుల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, TRSPARTYONLINE/TWITTER
ఆర్డీవోలు రద్దవుతారా?
ప్రస్తుతం తెలంగాణలో ఆర్డీవోల అధికారాలకు కత్తెరపడింది. తహసీల్దార్లకూ, ఆర్డీవోలకు కూడా పెద్దగా సంబంధాలు లేకుండా పోయాయి. వాళ్లకు ఎవరిపైనా సమీక్షించే అధికారం లేదు. వీటికి మించి తెలంగాణలో జిల్లాలు చాలా చిన్నగా అయిపోయాయి.
ఒకప్పుడు పెద్ద జిల్లాల్లో కలెక్టర్ ఎక్కడో ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా జిల్లాలు డివిజన్ల కంటే చిన్నగా ఉన్నాయి. దీంతో తహసీల్దారుకు కలెక్టరుకూ మధ్య ఆర్డీవో అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
‘‘విచిత్రం ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థ రద్దు చేస్తే, దానికి ప్రత్యామ్నాయం ఏంటని ఎవరూ ప్రభుత్వాన్ని అడగడం లేదు. తెలంగాణ యువతకు 30 వేల ఉద్యోగాలు పోయాయి కదా అని ఎవరూ మాట్లాడడం లేదు.’’ అన్నారు లచ్చిరెడ్డి.
అయితే, ఇవేవీ పెద్ద సమస్యలు కాబోవనీ, ఆధునిక టెక్నాలజీ వచ్చాక పనులన్నీ సరళమవుతాయని ధీమాగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.
‘‘మీకు హైదరాబాద్‌లోనో, లేక మరో పట్టణంలోనో భూమి ఉందనకుందాం. దాని కోసం భూమి వ్యవహారాలు చూసే ఉద్యోగి, లేదా మునిసిపాలిటీతో రోజూ పని ఉండదు కదా. అలాగే గ్రామాల్లో వీఆర్వోతో రోజూ పని ఉండదు.
పట్టణాల్లో ఆస్తుల విషయంలో ఎలా అయితే స్థానిక సంస్థలు పన్నులు కట్టించుకుంటూ తమ పని తాము చేసుకుపోతున్నాయో, గ్రామాల్లోనూ భూముల విషయంలో అలానే జరుగుతుంది. భూమి సమస్య భూమి యజమానిది మాత్రమే. దానికి ఏదైనా ఇతరత్రా సమస్యలు ఉంటే అతను కోర్టులో చూసుకోవాలి.’’ అన్నారు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్.
'ఆ వ్యవస్థ అవసరం లేదు'
పూర్వం భూమి పన్ను ప్రధాన ఆదాయంగా ఉన్న రోజుల్లో వాటి వసూళ్ల కోసం ఏర్పాటు చేసిన తహసీల్దార్, కలెక్టర్ ఉద్యోగ వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేయడం లేదని గుర్తు చేశారు. రెవెన్యూ శాఖ స్వరూపం మారిపోయింది. అవసరం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘రెవెన్యూ వసూళ్లు లేనప్పుడు ఆ శాఖ ఉండాల్సిన అవసరం ఏముంది?’’ అని వినోద్ ప్రశ్నించారు.
''అంతా ధరణిలో కంప్యూటరైజ్ అయింది. ధరణిలో లోపాల గురించి అడిగే వారికి నా సమాధానం ఒకటే, కొన్ని వందల ఏళ్ల అంశాన్ని పరిష్కరించడానికి రెండు మూడేళ్లు పడుతుంది. 95 శాతం సమస్యలు తీరాయి. మిగిలినవి పరిష్కారమవుతాయి.
మేం టెక్నాలజీని వాడుకుని వెళుతున్నాం. అక్షాంశాలూ, రేఖాంశాల ఆధారంగా సరిహద్దులు నిర్ణయిస్తాం. మిగతావి ఏమైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవాలి’’ అన్నారు
రెవెన్యూ సిబ్బంది ఇతర పనులు కూడా ఇకపై ఆయా శాఖలే స్వయంగా చూసుకుంటాయనీ, వాటికి ఈ సిబ్బంది అక్కర్లేదనీ వినోద్ అభిప్రాయపడ్డారు.
పంచాయతీ రాజ్ పనులు పంచాయతీ కార్యదర్శి చూస్తారు. వ్యవసాయం ఆ శాఖ సిబ్బందీ, రైతు వేదికల వాళ్లూ చూస్తారు. ఆరోగ్య వ్యవహారాలు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లూ చూస్తారు… ఇక రెవెన్యూ వాళ్లు చేసే పరిపాలన ఏముంటుంది? అని వినోద్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది?
- లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్: నంద్యాల అమ్మాయి దౌలత్, పాకిస్తానీ అబ్బాయి గుల్జార్... రాంగ్ కాల్‌తో మొదలైన లవ్ స్టోరీ
- రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- ఆంధ్రప్రదేశ్: తోలుబొమ్మలాట మొగలుల దండయాత్ర వల్లే తెలుగు నేలకు చేరిందా?














