వివాహేతర సంబంధం బయటపడడంతో భర్తతో కలిసి ప్రియుడి హత్య, తల సముద్రంలో విసిరేసి మొండెం పెట్టెలో పెట్టి రైలెక్కించేశారు

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

తమిళనాడులో 1950వ దశకం తొలినాళ్లలో ఇండో-సిలోన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఒక రైలు నడిచేది. చెన్నైలోని ఎగ్మోర్ స్టేషన్ నుంచి ధనుష్కోటి వరకు ఇది రాకపోకలు సాగించేది. శ్రీలంకలోని తలైమన్నార్ వరకు వెళ్లేవారు కూడా చెన్నైలో టిక్కెట్ తీసుకొని ఈ రైలు ఎక్కేవారు.

రైలులో ఎగ్మోర్ నుంచి ధనుష్కోటికి 19 గంటల ప్రయాణం. ధనుష్కోటి చేరుకున్నాక అక్కడ నుంచి ఫెర్రీలో మూడున్నర గంటలు ప్రయాణిస్తే తలైమన్నార్ చేరుకోవచ్చు. అక్కడివారు ఈ రైలును ‘‘బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్’’ గా పిలిచేవారు.

సుమారు 70 ఏళ్ల క్రితం ఈ బోట్ మెయిల్ రైలులో ‘తల లేని మృతదేహం’ ఒకటి కనిపించడంతో తమిళనాడు షాక్‌కు గురైంది.

హత్య జరిగిన తీరుపై, దానికి గల కారణాలపై తమిళనాడులో చాలా రోజుల పాటు చర్చ నడిచింది.

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

బోగీలో తల లేని మృతదేహం

అది 1952 ఆగస్టు 29. చెన్నైలో రాత్రి 8 గంటలకు బయల్దేరిన మెయిల్ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మనమదురై చేరుకుంది.

ఒక బోగీలో ఉన్న పెట్టె నుంచి దుర్వాసన వస్తోందని అందులోని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు అక్కడి చేరుకున్నారు.

మనమాదురై రైల్వే స్టేషన్‌లో రైలు ఆగగానే పోలీసులు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో తల లేని మృతదేహం కనిపించింది.

ఆ మృతదేహం కాళ్లకు ఆకుపచ్చని సాక్సులు ఉన్నాయి. అంతకుమించి గుర్తించదగిన ఆనవాళ్లేమీ లేకపోవడంతో ఆ మృతదేహాన్ని మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు 25 ఏళ్ల యువకుని మృతదేహంగా అంచనా వేశారు.

సున్తీ చేసి ఉండటం వల్ల అతనొక ముస్లిం అని పోలీసులు భావించారు.

కానీ, నిజానిజాలు బయటపడిన కొద్దీ ఈ రెండు నిర్ధారణలు తప్పని తేలింది.

చెన్నైలో ఎఫ్‌ఐఆర్ నమోదు

మరోవైపు, ఒక స్త్రీ తన భర్తను వెదుక్కుంటూ రాయపురంలోని పరిచయస్థుల ఇంటికి వచ్చారు.

దేవకి అనే మహిళను కలిసేందుకు ఆమె ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టారు. కానీ, ఆ సమయంలో దేవకి లేకపోవడంతో ఆమె భర్త ప్రభాకర్ మీనన్ తలుపు తెరిచారు.

‘‘నిన్నటి నుంచి నాభర్త ఇంటికి రాలేదు. దేవకీతో నా భర్తను చూసినట్లు నాకు తెలిసిన వారు చెప్పారు’’ అని ప్రభాకర్‌తో ఆ మహిళ చెప్పారు.

‘‘తన భర్త కోసం ఆమె వచ్చారు. కానీ, ఆమె చెబుతున్న వ్యక్తి ఎవరూ మా ఇంటికి రాలేదు’’ అని ప్రభాకర్ మీనన్ అన్నారు.

కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఒక చిరు వ్యాపారి. ఆయన పేరు అల్వందర్. రాత్రి నుంచి అల్వందర్ ఇంటికి రాకపోయేసరికి ఆ మహిళ ఉదయం నుంచి ప్రతీచోటా వెదుకుతున్నారు.

చివరకు ఎలాంటి ఆచూకీ దొరక్కపోవడంతో అల్వందర్ సన్నిహితుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఆయన అదృశ్యం గురించి ఫిర్యాదు చేశారు.

దేవకి ఇంటి నుంచే పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తును మొదలుపెట్టారు. దేవకి ఇంటికి పోలీసులు చేరుకున్నప్పుడు ఆమె ఇల్లుకు తాళం వేసి ఉంది.

పొరుగువారు చెప్పినదాని ప్రకారం దేవకి, ఆమె భర్త ప్రభాకర్ ఇద్దరూ ముంబైకి వెళ్లారు.

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, THE MADRAS POLICE JOURNAL, 1955

బీచ్ వద్ద బ్యాగ్‌లో తల

ప్రభాకర్ మీనన్ చేతిలో ఒక బ్యాగ్‌తో బీచ్‌కు వెళ్తూ కనిపించినట్లు పొరుగువారు చెప్పడంతో కొన్ని రోజుల పాటు పోలీసులు రాయపురం బీచ్‌లో సోదాలు చేశారు.

బీచ్‌లోని ఒక బ్యాగ్ నుంచి చెడు వాసన వస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా, బ్రౌన్ రంగు చొక్కాలో చుట్టి ఉన్న తల కనిపించింది. అది కుళ్లిన స్థితిలో ఉంది. మరుసటి రోజు వార్తపత్రికలో ఈ వార్త రావడంతో చెన్నైలో కలకలం మొదలైంది.

పరీక్షించడం కోసం ఆ తలను మద్రాస్ మెడికల్ కాలేజీకి పంపించారు. మరోవైపు తల లేని మిగతా మృతదేహాన్ని మదురై నుంచి చెన్నైకి తరలించారు.

ఈ రెండు దేహ భాగాలను ప్రముఖ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ సీపీ గోపాలకృష్ణన్ పరీక్షించారు.

పరీక్షల అనంతరం మృతదేహం వయస్సు 42 నుంచి 45 మధ్య ఉంటుందని ఆయన చెప్పారు.

చెన్నైలో లభ్యమైన తల చెవిలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ తలను ఆ మహిళకు చూపించారు. చెవికి ఉన్న రంధ్రాలు, పళ్ల నిర్మాణాన్ని చూసిన వెంటనే ఆమె ఇది తన భర్త అల్వందర్ మృతదేహం అని గుర్తించారు.

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

అల్వందర్ ఎవరు?

1952లో హత్యకు గురైనప్పుడు అల్వందర్ వయస్సు బహుశా 42 ఏళ్లు ఉండొచ్చు.

ఆయన మిలిటరీ ఆఫీసులో సబ్ డివిజనల్ అధికారిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి తిరిగొచ్చారు.

తర్వాత ఆయన ప్లాస్టిక్ వస్తువులు అమ్మడం మొదలుపెట్టారు. ఆయన స్నేహితుడు కునమ్ చెట్టి, చెన్నైలోని ఎస్ప్లానేడ్ ప్రాంతంలో పెన్నులు అమ్మేవారు. అల్వందర్ కూడా ఆయన దగ్గరే ఒక చిన్న దుకాణాన్ని తెరిచారు.

దీనితో పాటు ఆయన చీరలు కూడా అమ్మేవారు. వాయిదాల రూపంలో వినియోగదారుల నుంచి ఆయన డబ్బులు తీసుకునేవారు. ఆ సమయంలో వాయిదా పద్ధతిలో చెల్లింపులు చేయడం కొత్త. ఆయన ఈ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నారు.

అల్వందర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఓపియం వంటి మత్తు పదార్థాలను కూడా ఆయన తీసుకునేవాడని తేలింది.

రాత్రి అయినప్పటికీ అల్వందర్ ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య, దుకాణం వద్దకు వెళ్లి ఆరా తీశారు. దేవకి అనే మహిళను కలిసేందుకు అల్వందర్ వెళ్లినట్లు ఆమెకు తెలిసింది.

హత్యకు కుట్ర పన్నిన దేవకి-ప్రభాకర్ దంపతులు

దేవకి స్వస్థలం కేరళ. కాలేజీ చదువు పూర్తయ్యాక ఆమె చెన్నైలోని భాషా పరిరక్షణ సంస్థలో పని చేయడం మొదలుపెట్టారు.

స్టేషనరీ కొనడానికి వచ్చినప్పుడు ఒక షాపులో దేవకి, అల్విందర్ మధ్య పరిచయం ఏర్పడింది.

1951 ఆగస్టులో ఏర్పడిన ఈ పరిచయం ప్రేమగా మారింది. అప్పటికీ దేవకికి పెళ్లి కాలేదు. కానీ, అల్వందర్ వివాహితుడు.

దేవకితో అల్వందర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇది కొన్ని రోజుల పాటే సాగింది. 1952లో ప్రభాకర్ మీనన్‌తో దేవకి పెళ్లి జరిగింది.

మొదట్లో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసిన ప్రభాకర్, తర్వాత స్వతంత్ర అనే మ్యాగజీన్‌కు సంపాదకుడిగా పని చేశారు.

మ్యాగజీన్ పబ్లిసిటీ కోసం ప్రభాకర్ సతమతం అయ్యారు. తెలిసిన వారి ద్వారా అల్వందర్ అడ్వర్టైజ్‌మెంట్లు తెప్పించగలడని చెబుతూ ప్రభాకర్‌ను అల్వందర్‌ దుకాణానికి తీసుకెళ్లారు దేవకి.

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

దేవకిని అల్వందర్ వేధించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ అధికారి సింగారవేలు చెప్పినదాని ప్రకారం, దేవకిని అల్విందర్ వేధించడం వల్లే ఈ హత్య జరిగింది.

ఈ హత్యకు సంబంధించి 1955లో మద్రాస్ పోలీస్ జర్నల్‌లో సింగారవేలు వివరాణాత్మక కథనం రాశారు.

‘‘ప్రభాకర్‌ను అల్వందర్ ఒకసారే కలిశారు. ఒక పెద్ద కంపెనీ అధికారికి కలవడానికి వెళ్తున్నానని ప్రభాకర్‌కు చెప్పిన అల్వందర్, తనతో పాటు దేవకి కూడా వస్తే మ్యాగజీన్ కోసం పెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌ను అడగొచ్చని ఆశ చూపించారు. అల్వందర్‌తోపాటు దేవకి కూడా వెళ్లారు. కానీ, అల్వందర్ ఉద్దేశం వేరేలా ఉంది. ఆయన నేరుగా దేవకిని హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై బలవంతం చేశారు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన దేవకి జరిగినదంతా భర్తకు చెప్పారు. అదంతా విని అల్వందర్‌తో నీకు అఫైర్ ఉందా? అని ప్రభాకర్ అడగడంతో దేవకి అవునని చెప్పారు. ఏదో ఒత్తిడి కారణంగా తమ మధ్య బంధం ఏర్పడిందని ప్రభాకర్‌తో దేవకి చెప్పారు’’ అని ఆ కథనంలో సింగారవేలు రాశారు.

ప్రభాకర్ ఆమెకు అండగా నిలిచారు. ఇద్దరు కలిసి అల్వందర్ హత్యకు కుట్ర పన్నారు. దేవకి కూడా దీనికి అంగీకరించారు.

ఇంటికి పిలిచి హత్య..

1952 ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం వేళలో దేవకి, అల్వందర్ దుకాణానికి వెళ్లి తమ ఇంటికి రావాల్సిందిగా అల్వందర్‌ను ఆహ్వానించారు.

ఇంట్లో పని చేసి నారాయణకు ఏదో పని పురమాయించి సాయంత్రం వరకు ఇంటికి రావొద్దంటూ బయటకు పంపించారు.

అల్వందర్ ఇంటికి రాగానే దేవకి వెళ్లి వీధిలో నుంచి ఎవరైనా వస్తున్నారా? అని చూస్తుండగా, లోపల అల్వందర్‌ను ప్రభాకర్ కత్తితో పొడిచి హత్య చేశారు.

తర్వాత తల, మొండెం వేరుచేసి బ్యాగ్‌లో తలను ఉంచారు. తర్వాత రాయపురం సముద్రంలో తల ఉన్న సంచిని విసిరేశారు.

కానీ, అలలకు తల ఉన్న సంచి బీచ్‌కు కొట్టుకువచ్చింది. దీంతో ఆ బ్యాగ్‌లో మరికొంత మట్టిని నింపి తిరిగి నీటిలోకి విసిరేశాడు. అప్పటికే కొంతమంది అక్కడికి రావడంతో ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇంటికి తిరిగొచ్చాక దేవకి, ప్రభాకర్ ఇద్దరూ మిగతా మృతదేహాన్ని ఒక పెట్టెలో పెట్టి, రిక్షాలో దాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ పోలీసులు ఉండటంతో రిక్షాలో ఎగ్మోర్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ప్రభాకర్ ఆ పెట్టెను ఒక కూలీ సహాయంతో బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి ఎక్కించి ఇంటికి తిరిగొచ్చారు.

బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

మరుసటి రోజే అల్వందర్‌ను వెతుక్కుంటూ ఆయన భార్య దేవకి ఇంటికి రావడంతో వారిద్దరూ ముంబైకి పారిపోయారు.

ఈ హత్యకు దేవకి దంపతుల మధ్య సంబంధాన్ని నిర్ధరించేందుకు పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు.

ఎందుకంటే దేవకి ఇంటికి అల్వందర్ వెళ్లడాన్ని చాలా మంది చూశారు. కానీ, ఆ ఇంట్లో నుంచి అల్వందర్ బయటకు రావడాన్ని ఎవరూ చూడలేదు.

మద్రాస్ పోలీసులు ముంబైకి వెళ్లి దేవకి, ప్రభాకర్‌లను అరెస్ట్ చేశారు.

చెన్నైకి తీసుకొచ్చి విచారించగా తొలుత ఈ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ, వారికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి.

రిక్షా డ్రైవర్, కూలీ ఇద్దరూ ప్రభాకర్‌ను గుర్తు పట్టారు. దేవకి ఇంట్లో పనిచేసే నారాయణన్ కూడా చాలా విషయాలను పోలీసులకు చెప్పారు.

పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది.

కానీ, ఈ కేసును విన్న న్యాయమూర్తి అల్వందర్ పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, ప్రభాకర్-దేవకి జంటకు స్వల్పకాల శిక్షను విధించారు.

ప్రభాకర్‌కు ఏడేళ్లు, దేవకికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. జైలు శిక్ష అనుభవించిన అనంతరం వారిద్దరూ స్వస్థలమైన కేరళకు వెళ్లిపోయి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఈ హత్య కేసును నిర్ధరించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రముఖ పాత్రను పోషించినందువల్ల తమిళనాడు పోలీస్ దర్యాప్తు చరిత్రలో ఈ కేసును చాలా కీలకంగా పరిగణిస్తారు.

ఈ హత్యపై తమిళనాడులో చాలా పుస్తకాలు వచ్చాయి.

1995లో ఈ కేసు మీద ఒక టీవీ సీరియల్ కూడా తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)