కీర్తన: ‘అమ్మ, చెల్లితోపాటు నన్ను కూడా అంకుల్ గోదావరిలోకి తోసేశాడు. పైపు పట్టుకొని నేను ఎలా బతికానంటే..’

వీడియో క్యాప్షన్,
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"అమ్మ, అంకుల్ కారు దిగారు. సెల్ఫీ తీసుకుందామని అంకుల్ అమ్మను ఒడ్డు‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అమ్మను నదిలోకి తోసేశాడు. నా దగ్గర్నుంచి చెల్లిని కూడా తీసుకుని నదిలోకి విసిరేశాడు. భయమేసి పారిపోబోయాను. నన్ను కూడా పట్టుకుని నదిలోకి నెట్టేశాడు. కానీ నాకు పైప్‌లైన్ దొరికింది. వంతెనకున్న పైప్‌లైన్‌లో నా కాలు ఇరుక్కుంది. అందువల్ల బయటపడగలిగాను" అంటూ కీర్తన వివరించింది.

తన తల్లి నమ్మిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఈ 13 ఏళ్ల బాలిక చెబుతోంది.

సుహాసిని అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి గోదావరి నదిలోకి నెట్టేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ- రావులపాలెం వంతెన వద్ద జరిగింది.

ఇదే ఘటనలో ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా అతడు నదిలోకి నెట్టేశాడు. అయితే ప్రాణాలు కాపాడుకున్న పెద్దమ్మాయి కీర్తన, ప్రస్తుతం తెనాలిలో బంధువుల ఇంటికి చేరింది.

సుహాసిని, పాప జెస్సీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సుహాసిని, ఆమె చిన్న కుమార్తె జెస్సీ. జెస్సీ వయసు ఏడాది.

ఈ ఘటన ఎలా జరిగింది?

కీర్తన తల్లి పుప్పాల సుహాసిని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివసించేవారు.

భర్తతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటూ ఓ హోటల్‌లో పనిచేసే సమయంలో ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్‌తో సుహాసినికి పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది.

ఆ క్రమంలోనే సుహాసినికి ఏడాది క్రితం మరో పాప జెస్సీ పుట్టింది.

జెస్సీ పుట్టిన తర్వాత సురేష్ క్రమంగా సుహాసినికి దూరమవుతూ వచ్చారు.

దాంతో పదే పదే నిలదీసినా ఫలితం కనిపించకపోవడంతో సుహాసిని తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల హెచ్చరికతో దారిలోకి వచ్చినట్టు కనిపించిన సురేష్, ఆమెను అడ్డు తొలగించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఆగస్టు 5 సాయంత్రం అన్నవరం గుడిలో దర్శనం కోసమంటూ సుహాసినిని, ఆమె పిల్లల్ని తీసుకుని అద్దెకు తీసుకున్న కారులో బయలుదేరారు సురేష్.

మార్గం మధ్యలో అనేక చోట్ల ఆగుతూ వెళ్లినట్టు కీర్తన బీబీసీకి తెలిపింది.

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రావులపాలెంలో టీ తాగి బయలుదేరిన తర్వాత వంతెన మీదకు రాగానే ఫోటో తీసుకుందామని చెప్పి సురేష్ తన తల్లి సుహాసినిని కారు నుంచి కిందకి దింపినట్లు కీర్తన చెబుతోంది.

‘‘ ఆ తర్వాత అమ్మను గోదావరిలోకి తోసేశాడు. కారులో ఉన్న నా చెల్లి జెస్సీని కూడా తీసుకుని నదిలోకి విసిరేశారు. నేను పారిపోతుండగా పట్టుకుని నదిలోకి తోసేశారు. కానీ, అనుకోకుండా నదిలోకి ఉన్న ఓ పైప్‌లైన్ ఆసరాగా దొరకడంతో దాన్ని పట్టుకున్నా’’ అని ఆమె తెలిపింది.

ఆ తర్వాత కీర్తన తన దగ్గరున్న సెల్‌ఫోన్‌తో 100కి ఫోన్ చేసింది. సమీపంలోని రావులపాలెం పోలీసులు వెంటనే స్పందించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న గోదావరి వంతెనపై ఆమె ఎక్కడ ఉందో కనుక్కోవడం కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు.

టార్చిలైట్ వేస్తూ, విజిల్స్ వినిపిస్తూ చివరకు కీర్తన ఆచూకీ కనుగొని, ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు. కీర్తన ప్రస్తుతం తన పెద్దమ్మ సునీత ఇంట్లో ఉంది.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో అక్కడ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది. అటూ ఇటూ ఎవరు లేరని తెలుసుకుని కారు ఆపి ఇలా చేశాడని కీర్తన చెబుతోంది.

కీర్తన ఇంకా షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. తన తల్లి, చెల్లి ఎక్కడ అని ఆమె అడుగుతోంది.

సాయి కీర్తన

‘100కి కాల్ చేయాలని సినిమాల్లో చూశా’

100కి కాల్ చేయాలనే విషయాన్ని సినిమాల్లో చూశానని కీర్తన చెప్పింది. చెల్లిని ఆడించడం కోసం తీసుకొచ్చిన సెల్‌ఫోన్‌తోనే తాను పోలీసులకు ఫోన్ చేశానని తెలిపింది.

కాలు పైప్‌లైన్‌లో ఇరుక్కుపోవడంతో ఓ చేత్తో పైప్ పట్టుకుని, రెండో చేత్తో సెల్‌ఫోన్ వాడగలిగానని ఆమె చెప్పింది.

"ఆ టైమ్‌లో అందరూ నిద్రపోతారు. ఎవరికైనా ఫోన్ చేస్తే తీస్తారో తీయరో అనుకున్నాను. పోలీసులకు ఫోన్ చేస్తే వస్తారని వాళ్లకి చేశాను. వెంటనే వచ్చారు. కొంతసేపు టార్చిలైట్ వేసి ‘కనిపిస్తోందా’ అన్నారు. కనిపిస్తోందని చెప్పాను. ఆ తర్వాత సెల్‌లో సిగ్నల్ ఉంటే లొకేషన్ పెట్టమన్నారు. దాంతో వాళ్ల నంబర్ ఫీడ్ చేసుకుని లొకేషన్ పెట్టాను. నాకు తాడు వేసి పైకి లాగారు. నర్సును తీసుకొచ్చి, చిన్న చిన్న దెబ్బలు ఉంటే ట్రీట్‌మెంట్ చేశారు" అంటూ కీర్తన వివరించింది.

ఆమె తాడేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది.

నిందితుడు సురేష్

ఫొటో సోర్స్, FB/ Ulava Suresh

ఫొటో క్యాప్షన్, నిందితుడు సురేష్

పోలీసుల అదుపులో నిందితుడు

గోదావరి వంతెన మీద జరిగిన ఈ ఘటనపై రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నంబరు 237/2023తో కేసు నమోదు చేశారు.

తమను గోదావరిలోకి తోసేసిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి కారులో పరారైనట్లు కీర్తన చెప్పింది.

కీర్తన అందించిన వివరాల మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.

నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

నిందితుడిని విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

గోదావరిలో గల్లంతైన సుహాసిని, జెస్సీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రెండో రోజులుగా ప్రయత్నిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. గోదావరి ఉధృతి కారణంగా వారి జాడ తెలియలేదని పోలీసులు చెప్పారు.

నిందితుడు సురేష్ గతంలో సుహాసినితోపాటు తాడేపల్లిలో ఓ హాటల్‌లో పనిచేశారు.

సుహాసిని సోదరి, కీర్తన పెద్దమ్మ సునీత
ఫొటో క్యాప్షన్, సుహాసిని సోదరి, కీర్తన పెద్దమ్మ సునీత

సురేశ్‌ను వదలొద్దు: సుహాసిని సోదరి

తన చెల్లి ఎంసీఏ చదివి మంచి స్థాయిలో స్థిరపడుతుందని ఆశిస్తే, పెళ్లి తర్వాత వచ్చిన ఒడిదుడుకుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైందని సుహాసిని అక్క సునీత అన్నారు.

"మా చెల్లిని, పిల్లను గోదావరిలోకి తోసేసిన వ్యక్తిని వదలకూడదు. ఇప్పటికే ఆమెను మోసగించి హైదరాబాద్‌లో మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. కన్న పిల్ల పట్ల కూడా ఇంత ఘాతుకానికి పాల్పడినవాడు, తర్వాత మిగిలిన వాళ్లను వదులుతాడని నమ్మలేం. కాబట్టి అతడిని కఠినంగా శిక్షించాలి" అని ఆమె కోరారు.

గతంలో కూడా సురేష్ పలుమార్లు హత్యాయత్నం చేసినట్లు ఆమె ఆరోపించారు.

"ప్రస్తుతానికి కీర్తనను మేం చూసుకుంటాం. కానీ, ఆమె భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏదైనా ఆధారం చూపించాలి. ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం" అని సునీత చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)