అదానీ గంగవరం పోర్ట్: ‘కనీస వేతనాలు లేవు, హక్కులు లేవు’ అంటున్న కార్మికులు.. ఏమిటీ వివాదం?

వీడియో క్యాప్షన్, అదానీ గంగవరం పోర్ట్ కార్మికులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మత్స్యకార పల్లె గంగవరంలో 2006 మార్చిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మత్స్యకారుడు మరణించాడు. అప్పుడు స్థానికులు చేసిన ఆందోళనలతో ఈ ప్రాంతం అట్టుడికిపోయింది.

నాడు మీడియాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ కాల్పులపై చర్చ జరిగింది.

ఈ ఆందోళన జరిగే నాటికి అదొక చిన్నపల్లె. మత్యకారుల గుడిసెలు, ఎదురుగా సముద్రం, బోట్లు, వలలు మాత్రమే కనిపించేవి.

ఆ గంగవరం గ్రామం ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. ఊళ్లో బోట్లు, వలలు కనిపించడం లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా గంగవరం ఎదురుగా ఉన్న సముద్రం కనిపించడం లేదు. మధ్యలో పెద్ద గోడ వచ్చింది.

అప్పటికీ, ఇప్పటికీ ఉన్న ఒకే ఒక పోలిక- గంగవరం వెళ్లేదారిలో కనిపిస్తున్న ఆందోళన శిబిరం. అప్పుడు గంగవరం పోర్టు నిర్మాణం వద్దంటూ శిబిరం వేసి ఆందోళనలు చేస్తే, ఇప్పుడు అదానీ గంగవరం పోర్టులో కార్మికుల హక్కులు కాలరాస్తున్నాని ఆరోపిస్తూ నిరసన తెలుపుతున్నారు.

వారి పోరాటానికి కార్మిక సంఘాలు అండగా నిలుస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన కూడా సంఫీుభావం తెలిపాయి.

పోర్టు కోసం భూములు ఇచ్చి సముద్రంపై వేటను వదులుకుని, పోర్టులో ఉద్యోగులుగా చేరిన గంగవరం, దిబ్బపాలెం నిర్వాసితులు మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు?

పోర్టులో ఏం జరుగుతోంది? కార్మికులు ఏమంటున్నారు? సంస్థ యాజమాన్యం ఏం చెబుతోంది? కార్మికశాఖ స్పందన ఏమిటి?

అదానీ గంగవరం పోర్ట్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడి పే స్లిప్
ఫొటో క్యాప్షన్, అదానీ గంగవరం పోర్ట్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడి పే స్లిప్

14 ఏళ్లుగా ‘బేసిక్ పే’ మారలేదా?

అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ లో గంగవరం, దిబ్బపాలేనికి చెందిన మత్స్యకారులు 595 మంది పని చేస్తున్నారు. వీరిలో నిర్వాసితులు దాదాపు 400 మంది ఉంటారు. వీరంతా సెక్యూరిటీ, క్లీనింగ్, లోడింగ్, అన్ లోడింగ్ వంటి నాన్ స్కిల్డ్ విభాగాల్లో పని చేస్తున్నారు.

దాదాపు అందరూ కూడా పోర్టు ప్రారంభం నుంచి పని చేస్తున్నవారే. అంటే ఒక్కక్కరికి 14 ఏళ్ల అనుభవం.

కానీ వీరికి అందుతున్న జీతం రూ. 9 వేల నుంచి రూ. 18 వేల వరకు మాత్రమే. అందులోనూ వీరందరికి జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు బేసిక్ పే(మూల వేతనం) రూ. 3,700గా ఉంది.

“ఒకే సంస్థలో 14 ఏళ్లుగా పని చేస్తున్న మాకు ఇంత తక్కువ జీతాలు ఇస్తున్నారేంటని యాజమాన్యాన్ని అడిగితే పట్టించుకోలేదు. ఇలాగైతే లాభం లేదని యూనియన్ పెడితే ఉద్యోగాల నుంచి తొలగించారు. షిప్ట్ ఛేంజ్ చేసుకున్నా కూడా తప్పేనంటూ నోటీసులు ఇస్తున్నారు” అని గంగవరం పోర్టులో పని చేస్తూ సస్పెన్షన్ నోటీసు అందుకున్న యల్లాజీ చెప్పారు.

బేసిక్ పే 14 ఏళ్లుగా పెరగలేదనే అంశంపై సీనియర్ న్యాయవాది అశోక్ కుమార్‌తో బీబీసీతో మాట్లాడింది.

‘‘ఏళ్ల తరబడి ఒకే బేసిక్ పే ఉండటం, కార్మిక చట్టాల ప్రకారం నేరం. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతభత్యాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ పెరుగుదల లేకుండా అతి తక్కువ జీతాలు ఉండటం జరగదు. పోర్టు యాజమాన్యం వీళ్లతో ఏదైనా అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకుందా అనేది కూడా చూడాలి” అని ఆయన చెప్పారు.

పోర్ట్ కార్మికుల నిరసన
ఫొటో క్యాప్షన్, అదానీ గంగవరం పోర్ట్ కార్మికుల నిరసన

‘పోర్టు రాక ముందు మాపై కేసులు లేవు’

‘‘జూన్ 29న నేను ఎప్పటిలాగే పోర్టు‌కు వెళ్లాను. గేటు దగ్గరే నువ్వు రానవసరం లేదంటూ అడ్డుకున్నారు. నన్ను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు’’ అని కార్మికుడు నొల్లి తాతారావు బీబీసీతో చెప్పారు.

“గంగవరం పోర్టు రాక ముందు మా మత్స్యకారుల్లో ఎవరి మీద కూడా పోలీసు కేసులు లేవు. పోర్టులో ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఏ యాజమాన్యం ఉన్నా నిర్వాసితులమైన మాపై కేసులు పెట్టారు. వాటి కోసం మేం మళ్లీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. గంగవరం పోర్టు రాక ముందు మేం సముద్రంలో వేట చేసుకుని హాయిగా బతికేవాళ్లం. పోర్టులో పని చేయాలంటే కార్మికుల హక్కులు, చట్టాలు, జీతాల కోసం మాట్లాడకూడదు. కానీ, మేం అడుగుతాం” అని ఆయన ఆరోపించారు.

పోర్ట్ ప్రాంతంలో లారీలు
ఫొటో క్యాప్షన్, పోర్ట్ ప్రాంతంలో లారీలు

ఈ జీతాలతో పిల్లలను చదివించుకోలేకపోతున్నాం: కార్మికురాలు

తక్కువ జీతాలపై ఏళ్ల తరబడి ప్రశ్నిస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు అంటున్నారు.

“వాళ్లు ఇచ్చిన జీతాలతో మా బిడ్డలను చదివించుకోలేకపోతున్నాం. ఇవే జీతాలైతే బతకడానికి మా పిల్లల్ని కూడా ఇదే పోర్టులో కూలీకి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. 14 ఏళ్లుగా మా బేసిక్ పే రూ. 3700గానే ఉందంటే మమ్మల్ని పోర్టు యాజమాన్యం ఏ లెక్కన చూస్తున్నట్లు‘‘ అని క్లీనింగ్ సెక్షన్‌లో పని చేస్తున్న సోమలత బీబీసీతో అన్నారు.

నిర్వాసితులు కానివారికి ఈ బేసిక్ ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు.

‘‘జీతాలు, ఉద్యోగాలు, హక్కులపై అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వడం లేదు. దీంతో మేం ఆందోళనకు దిగాం. దాదాపు 500 మందితో ఆందోళన చేస్తున్నాం. అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిర్వాసిత మత్స్యకారులను బయటకు పంపడమే ధ్యేయంగా అదానీ గంగవరం పోర్టు ఆలోచన చేస్తున్నట్లు ఉంది” అని నొల్లి తాతారావు ఆరోపించారు.

పోర్ట్ కార్మికుల నిరసన

కార్మికుల డిమాండ్ ఏమిటి?

2006లో పోర్టుకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళనలు, ఉద్యమాల తర్వాత 2009లో గంగవరం పోర్టు ప్రైవేటు లిమిటెడ్ (జీపీఎల్) పేరుతో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 89.6 శాతం వాటా, ప్రభుత్వానికి 10.4 శాతం వాటాతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఈ పోర్టు కోసం వేటను, భూములను వదులుకున్న మత్స్యకారులకు దశల వారీగా నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు కల్పించారు.

ఆ ఉద్యోగాలన్నీ గంగవరం పోర్టు ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కాకుండా గంగవరం పోర్ట్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీపీఎస్) అనే మరో సంస్థ పేరుతో ఇచ్చారు.

ఆ తర్వాత ఈ పోర్టులో వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అనంతరం ఏపీ ప్రభుత్వం తనకున్న10.4 శాతం వాటాను కూడా అమ్మేసింది. ప్రస్తుతం ఈ పోర్ట్ ‘అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్(ఏజీపీఎల్)’ పేరుతో నడుస్తోంది.

“మా భూములు తీసుకున్నది గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. అదే పేరుతో అప్పుడు అగ్రిమెంట్లు జరిగాయి. మాకు ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం గంగవరం పోర్ట్ సర్వీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో. ఇదొక ఏజెన్సీలాగా పని చేస్తుంది. ఇందులో ఉన్న మాకు ఎలాంటి కార్మిక హక్కులు, చట్టాలు వర్తించకుండా చేస్తున్నారు. అందుకే మమ్మల్ని అదానీ పోర్ట్స్ కార్మికులుగా గుర్తించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం” అని కార్మికుడు యల్లాజీ చెప్పారు.

పోరాటాలు, ఉద్యమాలు చేసే లక్షణమున్న మత్స్యకారులను బయటకు పంపించేస్తే, పోర్టులో తాము ఆడిందే ఆట అన్నట్లుగా ఉంటుందనే ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నారని యల్లాజీ ఆరోపించారు.

గంగవరం పోర్టులో జీపీఎల్‌, జీపీఎస్ కార్మికులుగా 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు జీతభత్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే వేజ్ బోర్డు ఏర్పాటు చేసి, తమకు చట్టపరమైన వేతనాలు కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

“కార్మికులు రూ. 36 వేల జీతం డిమాండ్ చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం కూడా ఇది సరైనదే. వారి వేతనాలను రూ. 26 వేలు చేస్తే, పీఎఫ్, ఈఎస్ఐ కలిపితే రూ. 30 వేలు దాటుతుంది. అది కూడా పోర్టు యాజమాన్యం చేయడం లేదు” అని టీడీపీ సీనియర్ లీడర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు.

“కార్మిక చట్టాలు దేశంలో అందరికి ఒకే రకంగా ఉంటాయి. కానీ అదానీ పోర్ట్స్ కార్మికులకు మాత్రం ఎందుకు వర్తింపచేయడం లేదు. కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు పోర్టు యాజమాన్యం ముందుకు రాకపోతే రాజకీయ పార్టీలతో కలిసి ఈ ఆందోళనను ఉద్యమంగా మారుస్తాం” అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. జగన్ అన్నారు.

ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: కార్మికశాఖ

ఏళ్ల తరబడి ఒకే బేసిక్ పే, తక్కువ జీతాలు, ఏజీపీఎల్ పోర్టులో పని చేయించుకుంటూ జీపీఎస్ అనే సంస్థ పేరుతో అపాయింట్‌మెంట్ లేఖలు, ఐడీ కార్డులు ఇవ్వడం వెనుక మోసం ఉందంటూ కార్మికులు చేస్తున్న ఆరోపణలపై విశాఖపట్నం జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.

“కార్మికుల ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే గంగవరం పోర్టులో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించాలి. కార్మికులను ఏ కంపెనీ పేరుతో ఉద్యోగులకు తీసుకున్నారో, ఆ కంపెనీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యిందో చూడాలి. అప్పుడే ఏ చట్టం వర్తిస్తుంది, ఆ చట్ట ప్రకారం కార్మికుల ఆరోపణల్లో వాస్తవాలేంటి అనే విషయాలు తెలుస్తాయి” అని విశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ సునీత బీబీసీతో చెప్పారు.

గంగవరం పోర్టు పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోర్టు యాజమాన్యం కొంత సమయం కావాలని అడిగిందనీ, ఆ తర్వాత కార్మికులు ఆందోళనకు దిగారని, అందువల్ల అక్కడ పరిశీలనకు వెళ్లలేకపోయామని ఆమె చెప్పారు. పరిశీలన తర్వాతే ఈ విషయంపై పూర్తి సమాచారంతో మాట్లాడగలమని తెలిపారు.

గంగవరం పోర్టు యాజమాన్యం, మత్స్యకారులు సమావేశమైనప్పుడు అందులో డిప్యూటీ లేబర్ కమిషనర్ పాల్గొన్నారు. అక్కడ గంగవరం పోర్టు యాజమాన్యం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని ఆమె చెప్పారు.

పోర్టు ప్రతినిధులను సంప్రదించేందుకు బీబీసీ మూడు రోజులు పాటు ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.

జీపీఎస్ అనే సంస్థ విజయవాడలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైనట్లు వారి వెబ్ సైట్ చెప్తోంది.

గంగవరం
ఫొటో క్యాప్షన్, గంగవరం

చర్చలు ఏమయ్యాయి?

కార్మికుల సమస్యలు, డిమాండ్లపై అదానీ గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, కార్మికులు, ప్రభుత్వ అధికారులు ఇటీవల రెండు, మూడుసార్లు సమావేశమయ్యారు.

జులై 21న వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమస్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా చర్చలు జరిగాయి.

వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పోర్ట్ ప్రతినిధులకు చెప్పారు.

ఈ సమావేశం అనంతరం గంగవరం పోర్ట్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, ఆ సంస్థ‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జీజే రావు పేరుతో జులై 24న ఒక లేఖను విడుదలైంది.

లేఖలో ఏముందంటే...

  • సస్పెండైన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటాం. కానీ వారిపై విచారణ కొనసాగుతుంది.
  • ఆందోళన చేస్తున్న నిర్వాసిత ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరితే, వారి వ్యవహారశైలి బాగుంటే వారికి దసరాకు రూ. 10 వేలు ఎక్స్ గ్రేషియాగా ఇస్తాం.
  • అదానీ కంపెనీ పద్దతుల ప్రకారం వచ్చే ఏడాది ఇంక్రిమెంట్లు ఇస్తాం.
  • ప్రభుత్వం ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో నిర్ణయించిన విధంగా మూల వేతనం అమలు చేస్తాం.

2006లో మాదిరి మళ్లీ ఉద్యమిస్తాం: కార్మికులు

‘‘పోర్టులో పని చేసే వారికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం జీతాలు, మూల వేతనం అందిస్తామని అంటున్నారు. జీతాలు, మూల వేతనం పెంపు విషయంలో చూస్తాం, చేస్తామని చెప్పడమేగానీ, స్పష్టంగా మీకు ఇంత జీతం ఇస్తామని చెప్పడం లేదు. గత సమావేశాల్లో కూడా ఇలాగే చెప్పారు. మేమెంత కాలం ఎదురుచూడాలి’’ అని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

‘‘మా డిమాండ్లను త్వరగా పరిష్కరించకపోతే 2006లో గంగవరం మత్స్యకారుల ఉద్యమం తరహాలోనే జీతాలు, హక్కుల కోసం మరో ఉద్యమం చేస్తాం. ఇప్పటికే దశల వారీ ఆందోళనలకు కార్యాచరణ రూపొందించాం’’ అని కార్మిక సంఘం తరపున నొల్లి తాతారావు బీబీసీతో చెప్పారు.

గంగవరం పోర్టు నిర్వాసితులు, ప్రస్తుతం పోర్టు కార్మికులుగా ఉన్నవారు 24 గంటలు ఆందోళన శిబిరంలోనే ఉంటున్నారు. వీరికి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)