విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Vizagsteel

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... అనే నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తొలిసారి వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆకస్మాత్తుగా ఎందుకు వీఆర్ఎస్ అంశం తెర మీదకు వచ్చింది? దీన్ని ఎప్పటీ నుంచి అమలు చేస్తారు...?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ పథకం(వీఆర్‌ఎస్‌) అమలుకు రూపొందించిన విధివిధానాలు ప్లాంట్‌లోని వివిధ కార్యాలయాల నోటీసు బోర్డులపై దర్శనమిస్తున్నాయి. ఆర్ఐఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీం పేరుతో తీసుకుచ్చిన ఈ వీఆర్‌ఎస్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.

నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో విధులకు సక్రమంగా హాజరుకానివారు, ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో బి, సి గ్రేడ్‌ వచ్చినవారు, మెడికల్‌గా ఇబ్బందులు పడుతూ విధులకు హాజరుకాలేనివారు... దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించారు.

మరోవైపు ప్రత్యేక విద్యార్హతలు ఉన్నవారు, స్పెషలిస్ట్‌ డాక్టర్లు, బాయిలర్‌ ఆపరేటర్లు, మైనింగ్‌ ఇంజినీర్లు, జాతీయ పురస్కారాలు పొందిన వారు, విదేశాల్లో శిక్షణ పొందిన వారు అనర్హులుగా చెప్పారు. వీఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరణకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంటు దాదాపు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రారంభంలో దీని సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. ఇది క్రమంగా పెరుగుతూ...2015 నాటికి 6.5కి, ప్లాంట్ విస్తరణ తర్వాత ఇప్పుడు 7.3 మిలియన్‌ టన్నులకు చేరింది. స్టీల్ ప్లాంట్‌లో 17,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌నే...రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Vizagsteel

వీఆర్‌ఎస్ ఎందుకు?

విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL), కొరియాకు చెందిన పోస్కో (POSCO - Pohang Iron and Steel Company) సంస్థలు సంయుక్తంగా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండింటీ మధ్య నాన్ బైడింగ్ ఏంవోయూ కుదిరినట్లు స్టీల్ ప్లాంట్ అధికారులు బీబీసీతో చెప్పారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటీవల కాలంలో తీవ్ర నష్టాలను చవిచూసింది. కర్మాగార విస్తరణ పనులకు చేసిన అప్పుల కారణంగా వడ్డీ భారం, సుదూర ప్రాంతాల నుంచి ముడి సరుకు తెచ్చుకోవడం వంటి కారణాలు కూడా నష్టాలకు కారణమే. ఈ నష్టాలనే సాకుగా చూపించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ఎస్‌ని తెర మీదకు తెచ్చిందని ఐఎన్టీయూసీ (ఇంటక్) నాయకులు గంధం వెంకటరావు అన్నారు. ఇది ఆరంభమని...దీనితో మొదలు పెట్టి క్రమంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోస్కో వంటి ప్రయివేటు సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని చెప్పారు.

"విశాఖలో పోర్టు ఉండటం వల్ల ప్లాంటు ఏర్పాటు చేస్తే అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఉంటుందని పోస్కో సంస్థ భావిస్తోంది. పోస్కో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూములు ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఈ భూములన్ని ప్రస్తుత స్టీల్ ప్లాంట్‌ని, గంగవరం పోర్టుని అనుకునే ఉన్నాయి. ఈ కారణంతోనే ఇక్కడ మరో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. జాయింట్‌ వెంచర్‌ పేరుతో ఏకంగా 3000 ఎకరాల విశాఖ స్టీల్‌ ప్లాంట్ భూములను బదలాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం. పోస్కోకు ఏడాదికి 5 టన్నుల ఉక్కుని సప్లై చేసేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది" అని వెంకటరావు అన్నారు.

అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)లు రెండు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి నుంచి పోస్కోకి అవసరమైన ఉక్కుని అందించలేనందున, దాన్ని సాకుగా చూపి పోస్కో... తానే స్వయంగా ఎస్ఎంఎస్ ప్లాంట్లను ఏర్పాటుకు ప్రతిపాదన చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసిన వెంకటరావు, "అదే జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ క్రమంగా కుదేలవ్వడం మొదలవుతుంది. ఇది చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని పోస్కోలో విలీనం చేసేందుకు దారితీస్తుంది. అందులో భాగంగానే... విశాఖ స్టీల్ ప్లాంట్ తక్కువ సిబ్బందితోనే ఎక్కువ ఉత్పత్తి సాధించే పరిశ్రమగా చూపించడం కోసం వీఆర్ఎస్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే పోస్కో వంటి కార్పొరేట్ కంపెనీ దక్షిణ కొరియాలో కేవలం 6 వేల మంది సిబ్బందితో 43 మెట్రిక్ టన్నుల స్టీల్‌ని ఉత్పత్తి చేస్తోంది. అందుకే వారి అంచనాలకు అనుగుణంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులను తగ్గించేందుకు రంగం సిద్దమైంది"అని అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Vizagsteel

గతడాదే ప్రకటించిన కేంద్ర ఉక్కు మంత్రి

గతేడాది నవంబర్ 9న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఆ రోజు అధికారులతో, కార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రి "విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రపంచ దిగ్గజ ఉక్కు ఉత్పత్తి సంస్థ పోస్కోతో భాగస్వామ్యం అవసరం ఉంది" అని అన్నారు. ఆ వెంటనే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కర్మాగారం ఆవరణలో మానవహారం నిర్వహించాయి. పోస్కో కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదని, విశాఖ ఉక్కు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచననే తాము వ్యతిరేకిస్తున్నామని వివిధ సంఘాల నాయకులు చెప్పారు.

"తొలుత పోస్కో సంస్థ ఒడిశాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి ప్రజలు పోస్కోను తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థకు కేటాయించిన భూముల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు పదేళ్లపాటు వేచి చూసిన పోస్కో.. స్థానికుల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వెనక్కి తగ్గింది. విశాఖ ఉక్కులో అయితే భూములు సిద్ధంగా ఉండటంతో పోస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై దృష్టి పెట్టింది. ఒకవైపు ఆర్‌ఐఎన్‌ఎల్‌ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. తక్కువ ధరకే ముడిసరకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మరో వైపు పోస్కో వంటి భారీ కార్పొరేట్ సంస్థలను వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను మింగేయడానికి ఊసిగొల్పుతున్నారు. పోస్కోకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి మధ్య జరిగిన ఒప్పందం బయట పెట్టాలి. అందులోని ఏఏ అంశాలున్నాయో...? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, ప్రజలకు తెలియపర్చాల్సిన అవసరం ఉంది. రహస్యంగా ఆన్‌లైన్ ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?" అని కార్మిక సంఘం నాయకులు రామచంద్రరావు బీబీసీతో చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

‘‘వెనుక నుంచి నరుక్కొస్తున్న పోస్కో’’

"తమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నారని తెలిసి...ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని 26వేల ఎకరాల భూములను వేలాది మంది ఇచ్చారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకునే క్రమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. ప్రస్తుతం 17,500 మంది ఉద్యోగులతో విశాఖ ఉక్కు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తోంది. ఇప్పుడు వీఆర్ఎస్ ద్వారా 1700 నుంచి క్రమంగా 4 వేల మంది ఉద్యోగులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్పత్తి తగ్గకుండా వేర్వేరు ప్రయివేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పని చేయించుకుంటారు. తక్కువ మందితో అదే ఉత్పత్తిని సాధించే సంస్థగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను చూపిస్తారు. కార్పొరేట్ సంస్థలు ఇటువంటి సంస్థలను కొనేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఒక పద్ధతి ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోంది’’అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు రామచంద్రరావు బీబీసీతో అన్నారు.

"ప్రస్తుతం కేవలం స్టీల్ రోలింగ్ మిల్లులు మాత్రమే పోస్కో పెడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మిల్లులకు ఉక్కుని అందించాలంటే స్టీల్ మెల్ట్ షాపులు ఉండాలి. స్టీల్ మెల్ట్ షాపులకి ఉక్కు ద్రవాన్ని నిరంతరం అందించాలంటే బ్లాస్ట్ ఫర్నేసులుండాలి. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పోస్కో పెట్టాలనుకునే మిల్లులకు ఉక్కుని అందించే సామర్థ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి లేదు. దీంతో తగిన ఉక్కుని అందించలేకపోతుంది కాబట్టి...తామే ఎస్ఎంఎస్, బ్లాస్ట్ పర్నేస్ లను పెట్టుకుంటామంటూ పోస్కో ముందుకు వస్తుంది. లేదంటే అనుకున్న ప్రకారం మెటీరియల్ అందించలేదు కాబట్టి నష్టపరిహారం కోరుతుంది. నష్టపరిహారం చెల్లించలేక... వైజాగ్ స్టీల్ ప్లాంట్... పోస్కో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకరిస్తూ... క్రమంగా దానిలో భాగమైపోతుంది. ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతుంది. అందుకే తెలివిగా పోస్కో వెనుక నుంచి మొదలు పెట్టి క్రమంగా ముందుకు వస్తూ తానొక స్టీల్ ప్లాంట్ ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది’’అని ఆయన వివరించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Vizagsteel

ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం

పోస్కోతో భాగస్వామ్యం ముసుగులో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. "విశాఖలో అయిదు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఆటోమోటివ్ లాంగ్ ప్రోడక్ట్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సిద్ధంగా ఉంది. ఈ సంస్థకు 3000 ఎకరాల భూములు కేటాయించేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంగీకరించింది. ఈ ఒప్పందాలను కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులుగా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోస్కో కంపెనీకి విశాఖలో స్టీల్‌ప్లాంట్ భూములు కేటాయించడం ద్వారా ప్రైవేటీకరణకు తలుపులు తెరుస్తున్న తీరును ఖండిస్తున్నాం. వీఆర్ఎస్‌ను అందులో భాగంగానే భావించాల్సి వస్తోంది"అని టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

స్పందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్

వీఆర్ఎస్, పోస్కోతో ఒప్పందం అంశాలపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో బీబీసీ మాట్లాడింది.

"వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో అనేక రికార్డులను అధిగమించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ దీనికి వీఆర్ఎస్‌కి ఎటువంటి సంబంధం లేదు" అని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

"ఉద్యోగుల్లో కొందరు ఆనారోగ్యం, ఇతర సమస్యలు కారణంగా ఎప్పటి నుంచో వీఆర్ఎస్ కోరుకుంటున్నారు. అటువంటి విన్నపాలు దృష్టిలో పెట్టుకుని వీఆర్ఎస్ విధివిధానాలు రూపొందించి... ఉద్యోగులకు పంపించడం జరిగింది.

ఇంకా దీని అమలుపై కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే వీఆర్ఎస్ అనేది ప్లాంట్‌ని ప్రైవేటీకరణ కోసం చేస్తున్న పనుల్లో భాగంగా కొందరు అంటున్నారు. ఇది నిజం కాదు.

అలాగే వీఆర్ఎస్ వలన ప్లాంట్‌లో ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం చూపదు. ప్రస్తుతం ఉన్న మానవ వనరులను ఉపయోగించుకునే ఉత్పత్తిని అధిక స్థాయిలో సాధించేందుకు ప్లాంట్ సిద్ధంగా ఉంది.

అలాగే పోస్కోతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంవోయూ కుదుర్చుకుంది. అత్యంత నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులను తయారు చేసే ప్లాంట్ పెట్టేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్కోకు సహకరిస్తుంది" అని ఆ అధికారి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)