తల్లిపాలు: ‘బిడ్డకు పాలివ్వకపోతే చెడ్డ తల్లిగా చూస్తున్నారు’

- రచయిత, స్వాతి జోషి, తజీన్ పఠాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సొనాలి బందోపాధ్యాయ్ 29 ఏళ్ల వయస్సులో తొలిసారి తల్లి అయినప్పుడు చాలా సంతోషించారు. మరో ఏడాది తర్వాత ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆమె బాబు వయస్సు ఏడేళ్లు కాగా, పాప వయస్సు 8 ఏళ్లు.
అయితే, వారు పుట్టినప్పుడు రొమ్ము పాలు ఇవ్వకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.
సొనాలి 19 ఏళ్ల వయస్సు నుంచి స్కిజోఫ్రేనియా కోసం మందులు వాడుతున్నారు. బాబు పుట్టినప్పుడు, సైకియాట్రిస్ట్ సలహా కోరగా బ్రెస్ట్‌ఫీడింగ్ ఇవ్వొచ్చని సిఫార్సు చేశారు. అయితే, పిల్లలకు తన పాలు పట్టకూడదని ఆమె గట్టిగా తీర్మానించుకున్నారు.
‘‘నా రక్తంలో మందుల మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను వదిలేయలేను. అందుకే నా పిల్లలకు పాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నా’’ అని బీబీసీతో సొనాలి చెప్పారు.
పిల్లలకు రొమ్ము పాలు ఇవ్వకుంటే తల్లీబిడ్డల మధ్య బంధం ప్రభావితం అవుతుందని అందరూ చెబుతుండటంతో తొలినాళ్లలో తాను చాలా ఆత్మన్యూనతకు గురయ్యాయని ఆమె తెలిపారు.
‘‘కానీ, పిల్లలిద్దరూ ఇప్పుడు పెరిగారు. అందరూ చెప్పింది నిజం కాదు. ఏదీ ఏమైనప్పటికీ తల్లికి పిల్లలకు మధ్య గొప్ప అనుబంధం ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

తల్లి పాలతో ప్రయోజనాలు ఉంటాయని ఆమెకు తెలుసు. కానీ, తన కేసులో పిల్లల భవిష్యత్ కోసం పాలు పట్టకపోవడమే ఉత్తమ నిర్ణయమని ఆమె నమ్మారు.
కొత్తగా తల్లి అయిన వారిని తరచుగా బిడ్డ క్షేమం గురించి, బ్రెస్ట్‌ఫీడింగ్ గురించి అడుగుతుంటారు. ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానం ఇస్తే అంతా బాగుంటంది. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదని చెప్పినట్లయితే వెంటనే అదొక అవమానకర చర్యగా చూడటం మొదలుపెడతారు.
రొమ్ముపాలతో తల్లికి, బిడ్డకు ప్రయోజనం కలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యూనిసెఫ్ సూచించాయి. బిడ్డ పుట్టిన తొలి ఆరు నెలల పాటు ప్రత్యేకంగా రొమ్ముపాలే తాగించాలని సిఫార్సులు కూడా చేశాయి.
జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-2020 డేటా ప్రకారం, నిజానికి 6 నెలల లోపున్న వారిలో 64 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లి పాలు పడుతున్నారు. పది మందిలో నలుగురికి మాత్రమే పుట్టిన గంటలోగా రొమ్ముపాలు పట్టిస్తున్నారు.
ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డకు చనుబాలు పట్టించగలరు. కానీ, ఇందులో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. అయితే, బిడ్డ పుట్టిన గంటలోగా లేదా అదే రోజులో రొమ్ముపాలు పట్టించడం కొందరు తల్లులకు ఎందుకు సాధ్యం కాదనే విషయాన్ని బీఎల్‌కే మ్యాక్స్ సెంటర్ ఫర్ చైల్డ్ బర్త్ (న్యూ దిల్లీ) ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెట్ డాక్టర్ శచీ ఖరే బవేజా వివరించారు.
సీ సెక్షన్ ద్వారా పుట్టిన పిల్లలకు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన పిల్లలకు ఇలా పుట్టిన గంటలోగా చనుబాలు పట్టించడం కుదరదని శచీ చెప్పారు.

‘చెడ్డ తల్లిగా చూస్తారు’
బిడ్డ పుట్టినప్పటి నుంచి కొందరు మహిళలు రొమ్ముపాలు ఇవ్వలేరు. మరికొందరు కొంత కాలం తర్వాత చనుబాలు ఇవ్వడం ఆపేయాలని నిర్ణయించుకుంరు.
కసౌలీకి చెందిన మీనాక్షి నిగమ్ ఒక వ్యాపారవేత్త. బిడ్డ పుట్టిన తొలినాళ్లలో రొమ్ముపాలు పట్టడం ఆమెకు చాలా సంతృప్తిగా అనిపించింది. కానీ, నాలుగు నెలల తర్వాత పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆమెకు సవాలు ఎదురైంది.
‘‘నేను పంప్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. పాలు కొద్దిగా మాత్రమే తయారయ్యేవి. బిడ్డ కడుపు నిండటానికి సరిపడా పాలు ఉత్పత్తి కాలేదు’’ అని ఆమె చెప్పారు.
మిచెల్లీ మోరిస్‌కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. తొలి సంతానానికి ఆమె పాలు ఇవ్వలేకపోయారు. ఇది ఆమెను బాధించింది. తరచుగా దాని గురించే ఆలోచించేలా చేసింది. ‘‘నాలో అంతా బాగానే ఉందా?’’ అని ప్రశ్నించుకునేదాన్ని అని ఆమె చెప్పారు.
రెండో బిడ్డ పుట్టినప్పుడు కూడా ఆమెకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గైనకాలజిస్ట్ ఆమెకు సూచించారు.
అయితే, మూడో సంతానం కలిగినప్పుడు తొలిరోజుల్లో బిడ్డకు ఆమె పాలు ఇవ్వగలిగారు. కానీ, ఇది ఒక నెల రోజులకు మించలేదు. తర్వాత ఆమె పాలను పంపింగ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, దానికి చాలా కృషి అవసరం. ఇకపై తనవల్ల కాదని ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
నిగమ్ అనే మహిళ తన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి బ్రెస్ట్‌ఫీడింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కుటుంబీకులు మద్దతు ఇచ్చినప్పటికీ, ఆమె నిర్ణయాన్ని ఇతరులు వేలెత్తి చూపారు.
ఈ తరం వారు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, సులభ మార్గాలను ఎంచుకుంటారంటూ ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
‘‘వారు మిమ్మల్ని ఒక చెడ్డ తల్లిగా చిత్రీకరించడం మొదలుపెడతారు’’ అని నిగమ్ అన్నారు. తన బిడ్డకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తల్లికే ఉంటుందని ఆమె గట్టిగా నమ్మారు.
ఈరోజుల్లో రొమ్ముపాలు పట్టించడం కష్టంగా మారిందా? లేదా ఈ తరం వారు తప్పించుకుంటున్నారా? అనే అంశంపై బవేజా మాట్లాడారు.
జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా శరీర నిర్మాణంలో, హర్మోన్లలో వచ్చే మార్పుల గురించి ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
‘‘మన శరీరాలు, హార్మోన్లు మారిపోతున్నాయి. ఫలితంగా పిల్లలను ప్రసవించే విధానం మారుతుంది. బ్రెస్ట్‌ఫీడింగ్‌పై కూడా దాని ప్రభావం ఉంటుంది’’ అని ఆమె వివరించారు.

‘తప్పు ఏమీ కా దు’
నేహా సింగ్ యాదవ్ వయస్సు 37 ఏళ్లు. ఆమె గర్భం దాల్చిన 28 వారాల్లోనే ప్రిమెచ్యూర్డ్ ట్విన్స్ (గర్భధారణ సమయం ముగియక ముందే పుట్టిన కవలలు)కు జన్మనిచ్చారు.
ఆ కవలలను ఒక నెలరోజుల పాటు ఎన్-ఐసీయూలో ఉంచారు. ఆ సమయంలో వారికి రొమ్ముపాలు పట్టించే అవకాశం లేదు. పిల్లలు స్వయంగా పాలు తాగకపోవడంతో ఆమెకు చనుబాలతో చాలా కష్టంగా, నొప్పిగా మారింది.
ఈ సమస్య పరిష్కారం కోసం ఆమె మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఎంచుకున్నారు. డాక్టర్ సలహా మేరకు ఆమె పాలు పంపింగ్ చేస్తూనే ఉన్నారు. ఫీడింగ్ షెడ్యూల్ కారణంగా ఆమె నిద్రపోయే సమయం కూడా తగ్గిపోయింది. రోజుకు 3, 4 గంటలు మాత్రమే ఆమె నిద్రపోగలిగారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఆమెలో పాల ఉత్పత్తి తగ్గిపోయింది. పిల్లలిద్దరికీ సరిపడా పాలు ఇవ్వలేకపోయారు.
‘‘ఈ సమాజం మాతృత్వాన్ని అందంగా చిత్రీకరించి చూపిస్తుంది. కానీ, నాకు అందరిలాగే నొప్పి కలుగుతుంది’’ అని ఆమె అన్నారు.
నేహా తరహాలోనే చాలామంది తల్లులు.. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే తల్లీబిడ్డల మధ్య బంధం బలహీనంగా ఉంటుందనే భావనతో ప్రభావితం అయ్యారు. దీని గురించి మాట్లాడుతూ, ‘‘ఇందులో ఏదీ తప్పు కాదు, ఏదీ ఒప్పు కాదు. ఎందుకంటే తల్లీ బిడ్డలు సంతోషంగా కలిసి ఉంటే, బ్రెస్ట్‌ఫీడింగ్‌తో సంబంధం లేకుండా వారిద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది’’ అని బవేజా వివరించారు.
రొమ్ముపాలు పట్టడం వల్ల తల్లీబిడ్డల బంధం బలంగా ఉంటుంది. కానీ, ఈ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషించాలి. నా పాపతో కలిసి పుస్తక పఠనాన్ని ఒక ఆచారంగా మార్చుకొని నేను మా బంధాన్ని బలపరుచుకున్నా’’ అని మెహజ్‌ఖాన్ అనే మహిళ చెప్పారు.
అధిక ప్రొలాక్టిన్ స్థాయిల కారణంగా చాలా చిన్న వయస్సు నుంచే మెహజ్ ఖాన్ మందులు వాడుతున్నారు. అధిక ప్రొలాక్టిన్ కారణంగా గర్భవతులు కానప్పటికీ, బిడ్డను కననప్పటికీ రొమ్ముల్లో పాలు ఉత్పత్తి అవుతాయి. విచిత్రంగా తల్లి అయ్యాక ఆమెలో బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి కాలేదు.
‘‘నేను గంటల పాటు పంపింగ్ చేస్తే కేవలం మిల్లీలీటర్ల పాలు మాత్రమే వచ్చేవి. నా ఎంత తీవ్రంగా కృషిచేశానో నా భాగస్వామికి తెలుసు. అందుకే ఆయన నన్ను తప్పుపట్టలేదు’’ అని ఆమె చెప్పారు.
ఇందులో కుటుంబం, సమాజం పాత్ర గురించి డాక్టర్ బవేజా మాట్లాడారు.
‘‘తల్లి అయిన ప్రతీ మహిళ నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌ను ఆశిస్తారు. అదొక బాధ్యతగా చెబుతుంటారు. ఒకవేళ పాలు ఇవ్వలేకపోతే దాన్నొక తప్పుగా చూస్తారు. ఇది కొత్తగా తల్లి అయిన వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అత్యంత సహజమైన పని కూడా చేయలేకపోతున్నామనే భావనలో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














