ఆంధ్రప్రదేశ్: సమ్మె విరమించుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు సన్నద్ధమైన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెనక్కు తగ్గింది. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో అంగీకారం కుదరడంతో బుధవారం రాత్రి సమ్మె విరమించుకుంది.
బుధవారం సచివాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణతోపాటు అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఒప్పందానికి వచ్చారు.
ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి తర్వాత పదో తేదీ ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించిన సమ్మెను ఉపసహరించుకున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు.
ఉద్యోగుల పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు చెప్పారు. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపిందన్నారు. ఈ హామీలపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సంతృప్తి చెందారు. ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు చెప్పారు.
అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్ చేయడానికి ఏపీజెన్‌కోఎండీ నేతృత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది.

ఫొటో సోర్స్, UGC
సమ్మె విరమణకు ముందు ఏం జరిగింది?
ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సమ్మెలోకి వెళతామంటూ 21 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. జులై 21 నుంచి వివిధ దశల్లో, పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.
ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సిబ్బంది ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేసింది. విద్యుత్ సౌధ వద్ద నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులను రంగంలో దింపింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాల వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
మంగళవారం నుంచే ఏపీలో పలుచోట్ల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దానికి సిబ్బంది కారణమనే విమర్శలు అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 1999లో విద్యుత్ సిబ్బంది సమ్మె చేశారు. నాడు వేతనాలు, ఇతర సమస్యలపై వారు సమ్మెకు దిగారు.

ఫొటో సోర్స్, UGC
సమ్మెకు ఎందుకు పూనుకున్నారు?
ఉద్యోగుల వేతన సవరణ విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్న డిమాండ్‌తో విద్యుత్ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, విద్యుత్ పంపిణీ సంస్థల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులున్నారు. మరో 25 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. వారి సమస్యలపై ఏడాది కాలంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. నిరుడు కూడా ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చి వెనక్కి తగ్గారు.
ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ అమలు కావాల్సి ఉందని జేఏసీ చెబుతోంది.
2022 ఏప్రిల్ నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకావడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
వివిధ సంఘాల్లోని ఉద్యోగులు, కార్మికులంతా కలిసి ఉమ్మడిగా జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనలకు దిగారు. జేఏసీ పేరుతోనే సమ్మె నోటీసు ఇచ్చారు.

ఫొటో సోర్స్, UGC
పెండింగులో ఉన్న వేతన సవరణ అమలు చేయాలని, కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులరైజేషన్, ఇతర డిమాండ్లను ఇంతకుముందు జేఏసీ నేతలు ప్రభుత్వం ముందుంచారు. వాటిని పరిష్కరించాలంటూ కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు అమలు కావాల్సిన పీఆర్సీ ఏడాదిన్నరగా పెండింగులో ఉందని, దాని మూలంగా ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ ఉద్యోగులు ఆందోళనల వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ డిమాండ్ కూడా అనూహ్యంగా పెరిగింది. దాని మూలంగా లోడ్ రిలీఫ్ పేరుతో వివిధ ప్రాంతాల్లో ఒకటి, రెండు గంటల పాటు కరెంటు సరఫరాను అధికారికంగానే నిలిపివేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- యూసీసీ: గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారు ప్రత్యేక గుర్తింపును కోల్పోతారా?
- బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా
- హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్
- తల్లిపాలు: మందులు వాడే తల్లులు బిడ్డకు పాలివ్వకూడదా... 7 అపోహలు, వాస్తవాలు
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














