అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఆగస్టు 10న (గురువారం) ఓటింగ్ జరుగనుంది.
ఇంతకూ అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? దీని విధివిధానాలు ఏమిటి?
అవిశ్వాస తీర్మానం అంటే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం (మంత్రివర్గం/ప్రభుత్వం) కానీ పదవిలో కొనసాగడానికి అనర్హులంటూ ప్రవేశపెట్టే తీర్మానం.
ఎన్నికైన ప్రభుత్వం మీద పార్లమెంటుకు ఇక విశ్వాసం లేదని చెప్పే తీర్మానం.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగంలో ఉందా?
భారత రాజ్యాంగంలో విశ్వాస తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. అయితే మంత్రి మండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణ చెబుతోంది. అంటే ప్రధానమంత్రి, మంత్రి మండలి కొనసాగాలంటే లోక్‌సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించరాదని దీని అర్థమని చెప్పుకోవచ్చు.
దేశంలో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన అవిశ్వాస తీర్మానం విధివిధానాలను నిర్దేశిస్తోంది. దీని ప్రకారం లోక్‌సభ సభ్యుడు లేదా సభ్యురాలు ఎవరైనా సరే రాతపూర్వకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వవచ్చు.
అవిశ్వాస తీర్మానం నోటీసు నిర్దేశిత విధానంలో ఉందని స్పీకర్ భావిస్తే దానిని సభలో చదవాలి. దీనిని చర్చకు చేపట్టడానికి మద్దతు ఇచ్చేవారందరూ నిలబడాలని కోరాలి.

ఫొటో సోర్స్, ANI
నోటీసుకు ఎంత మంది మద్దతు ఉండాలి?
అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీలు మద్దతు లభించకపోతే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు.
తీర్మానం ప్రవేశపెట్టటానికి కనీసం 50 మంది ఎంపీలు మద్దతు తెలిపితే, స్పీకర్ తీర్మానాన్ని స్వీకరించి, దానిపై చర్చకు ఒక తేదీ లేదా తేదీలను నిర్ణయిస్తారు. ఆ తేదీ, నోటీసు ఇచ్చిన పది రోజుల లోపే ఉండాలి.
ఈ తీర్మానంపై చర్చలో ప్రసంగాలకు స్పీకర్ అవసరమని భావిస్తే కాలపరిమితి కూడా నిర్ణయించవచ్చు. ఈ చర్చలో అవిశ్వాస తీర్మానం పెట్టినవారు, దానికి మద్దతు ఇచ్చినవారు ప్రసంగిస్తారు.
ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు సాధారణంగా ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ సమాధానం ఇస్తారు.

ఫొటో సోర్స్, Reuters
చర్చ తర్వాత ఓటింగ్
ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు.
మూజువాణి ఓటు ద్వారా కానీ, సభ్యుల విభజన ద్వారా కానీ ఈ ఓటింగ్ ఉండవచ్చు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే, మంత్రిమండలి వైదొలగాల్సి ఉంటుంది.
మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది.
లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉంది.
అయితే, ఈ అవిశ్వాస తీర్మానం ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ సభలో నోరు విప్పేలా చేస్తుందని విపక్షాలు చెబుతున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ గురువారం సమాధానమిచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ సహా 26 విపక్షాలతో ఇటీవల ఏర్పడిన కూటమి ‘ఇండియా’కు తమ ఐక్యతను చాటేందుకు ఈ తీర్మానంపై చర్చ ఒక అవకాశం కూడా.
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














