జైలర్ రివ్యూ: రజనీకాంత్ కనిపించాడు కానీ..

ఫొటో సోర్స్, sun pictures
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
రజనీకాంత్ ఇమేజ్ హిమాలయం అంత ఎత్తుంటుంది. అన్ని కథలూ ఆయనకు సెట్ కావు. రజనీ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ పుడితే మాత్రం... ఆ సినిమా ఓ బాషా అవుతుంది. ఓ నరసింహలా చరిత్ర సృష్టిస్తుంది.
యువ దర్శకులందరికీ రజనీ అంటే ఇష్టమే. కానీ.. ఆయనకు తగిన కథని తయారు చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. అందుకే ఈమధ్య రజనీకి వరుస పరాజయాలు చుట్టుముట్టాయి.
నెల్సన్ కూడా రజనీ అభిమానే. ఆయన.. ఇప్పుడు తన హీరో కోసం `జైలర్` అనే కథని రాసుకొన్నారు.
తమిళ నాట స్టార్ హీరోలతో పనిచేసి, హిట్లు ఇచ్చిన ట్రాక్ రికార్డు నెల్సన్‌కి ఉంది.
మరి.. ఆయన రజనీని ఎలా చూపించారు? రజనీకాంత్ స్టైల్‌కి సెట్టయ్యే పాత్ర `జైలర్`లో దొరికిందా..?

ఫొటో సోర్స్, Sun Pictures
ఓ తండ్రి తీర్పు
ముత్తు (రజనీకాంత్)ది సింపుల్ జీవితం. జైలర్‌గా పనిచేసి రిటైర్ అయి విశ్రాంత జీవితాన్ని తన పిల్లలు, మనవళ్లతో గడుపుతుంటాడు.
కొడుకు అర్జున్ ఏసీపీగా పనిచేస్తుంటాడు. చాలా నిజాయితీ పరుడు. దేవాలయాలను దోచుకొంటున్న విగ్రహాల ముఠా కోసం అన్వేషిస్తుంటాడు.
ఈ ముఠా నాయకుడు వర్మ చాలా క్రూరుడు. తనకు అడ్డొస్తే ఎంతటివాళ్లనైనా తుదముట్టించగలడు. తనే.. ఏసీపీ అర్జున్‌ని చంపేస్తాడు.
కొడుకుని పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో ఉన్న ముత్తు కనీసం మిగిలిన తన కుటుంబాన్నయినా కాపాడుకొందామని భావిస్తాడు.
కానీ.. వర్మ మాత్రం `అందర్నీ చంపేస్తా` అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ముత్తు ఏం చేశాడు? శత్రు సంహారాన్ని ఎటు నుంచి మొదలెట్టాడు..? సామాన్య జీవితాన్ని గడుపుతున్న ముత్తు... టైగర్ ముత్తు వేల్ పాండ్యన్‌గా ఏం చేసేవాడు..? ఇదంతా తెరపై చూడాల్సిందే.

ఫొటో సోర్స్, Sun Pictures
వయసుకు తగ్గట్లుగా..
అరక్కోణంలోని ఓ గుళ్లో విగ్రహాల దొంగతనం జరుగుతుంది.
అక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది. ఏసీపీ అర్జున్.. విచారణ సాగిస్తుంటాడు. సినిమా మొదలైన పది నిమిషాలకు ముత్తు పాత్రలో రజనీ ఎంట్రీ ఇస్తాడు.
ఆయన ఎంట్రీ అనగానే సాధారణంగా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓ బ్యాంగ్, బిల్డప్.. ఇవన్నీ ఊహించడం సహజం.
ఎందుకంటే.. రజనీ సినిమాలన్నీ ఇలాంటి కొలతలతోనే ఉండేవి. కానీ రజనీకాంత్‌ని దర్శకుడు నెల్సన్ చూసిన విధానం వేరు.
రజనీ వయసుకి తగిన పాత్ర చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు నెల్సన్.
తొలి ఇరవై నిమిషాలూ `మనం చూస్తోంది రజనీ సినిమానేనా?` అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రని అలా కామ్‌గా, సెటిల్డ్ గా డిజైన్ చేశాడు.
‘సూపర్ స్టార్’ ఇమేజ్ వచ్చేసిన తరవాత హీరోయిజం చూపించడానికి వందమందిని ఒంటిచేత్తో కొట్టాల్సిన పనిలేదు. చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు. భారీ డైలాగుల్ని గుక్క తిప్పుకోకుండా చెప్పాల్సిన అగత్యం కూడా లేదు.
ఓ చిన్న స్మైల్ చాలు.
రజనీ అదే చేశాడు. రజనీ నుంచి ఇప్పటి వరకూ చూసిన ఏ స్టైల్, ఏ మేనరిజం.. తొలి సగంలో కనిపించవు.
కానీ.. రజనీ మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. అది మెల్లమెల్లగా పెరుగుతూ... ఇంట్రవెల్ కార్డ్ వచ్చే సరికి సునామీలా మారుతుంది.

ఫొటో సోర్స్, Sun Pictures
డైనింగ్ టేబుల్‌పై విధ్వంసం
యోగిబాబు ఎంటర్ అయ్యాక... కాస్త ఫన్ పుట్టుకొస్తుంది.
ముఖ్యంగా కార్లో యోగితో రజనీ చేసిన కామెడీ నవ్విస్తుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే సన్నివేశం ఇంట్రవెల్ బ్యాంగ్. డైనింగ్ టేబుల్ దగ్గర ఓ ఫైట్ కంపోజ్ చేశాడు దర్శకుడు.
రజనీ తన భార్య, కోడల్ని కూర్చోబెట్టుకొని, జాగ్రత్తలు చెబుతుంటాడు.
వెనుక ఓ విధ్వంసం జరిగిపోతూ ఉంటుంది. ఇది కచ్చితంగా కొత్త రజనీని చూపించే ప్రయత్నమే.
ఇంత స్టైలిష్‌గా ఓ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేయొచ్చా? అనిపించేలా ఆ ఫైట్ కంపోజ్ చేశాడు దర్శకుడు.
విశ్రాంతి కార్డు పడేసరికే రజనీ అభిమానుల ముఖాలు వెలిగిపోయేలా చేశాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, Sun Pictures
సెకండాఫ్‌కి ఏమైంది..?
విశ్రాంతి ఘట్టం దగ్గర రజనీ మొదలుపెట్టిన విధ్వంసకాండ చూసి.. రెండో భాగంపై ఆశలు పెరుగుతాయి. అవి మెల్లమెల్లగా కుప్పకూలడం మొదలవుతుంది.
విలన్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి రజనీ చేసే ప్రయత్నాలు ఏమాత్రం మెప్పించవు. బ్లాస్ట్ మోహన్ (సునీల్) ఎపిసోడ్ చూస్తే... ఫస్టాఫ్ తీసిన దర్శకుడేనా, సెకండాఫ్ కూడా తీసింది? అనే అనుమానాలు వస్తాయి.
ఎక్కడో మొదలైన కథ, ఎటో వెళ్లిపోతోందేంటి? అని కూడా అనిపిస్తుంది.
ముత్తు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత ఆసక్తికరంగా లేదు.
జైలర్ గా ముత్తు కనిపించింది 5 నిమిషాలే. ముత్తు అంటే దేశంలోని గ్యాంగ్ స్టర్లు, దాదాలూ ఎందుకు వణికిపోతున్నారు? అనిపిస్తుంది.
అలా వణికారంటే.. జైలర్‌గా ముత్తు ఏవో అద్భుతాలు సృష్టించి ఉండాలి.
కానీ.... ఆ ఫ్లాష్ బ్యాక్‌లో అవేం కనిపించవు. ముత్తుకి ఇంత నెట్ వర్క్ ఉంటే.. తన కొడుకుని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? కనీసం తన కొడుకు ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అనే అనుమానం కూడా కలుగుతుంది.
కన్నడ సూపర్ స్టార్... శివ రాజ్ కుమార్‌నీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌నీ.. ఈ కథలోకి తీసుకురావడం, వాళ్లని తెలివిగా వాడుకోవడం బాగున్నాయి.
అయితే ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇంకా బాగుండేది. ఆ అవకాశం రాలేదు.
తొలి సగంలో ప్రేక్షకుల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన దర్శకుడు.. రెండో సగంలో సరాసరి నేలపైకి తీసుకొచ్చి దించేశాడు.
అప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులు, అభిమానులు ఓ అంచనాకి వచ్చేసేసరికి.. ఓ ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్టు అవసరమా, కాదా? అనేది పక్కన పెడితే - క్లైమాక్స్‌ని కాస్త ఆసక్తికరంగా మార్చడానికి మాత్రం ఉపయోగపడింది.
చివర్లో మళ్లీ... శివ రాజ్ కుమార్, మోహన్ లాల్‌లను తెరపైకి తీసుకొచ్చి జోష్ తీసుకొచ్చాడు.
రమ్యకృష్ణ స్పెషల్ అట్రాక్షన్.. తమన్నా సంగతేంటి
ఇప్పటి వరకూ చూడని ఓ కొత్త రజనీని `జైలర్`లో చూసే ఛాన్స్ దక్కింది. ఆయన వయసుకి తగిన పాత్ర చేయడం వల్ల.. ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. కొడుకు చనిపోయిన వార్త తెలిసినప్పుడు కూడా ఎక్కువ మెలోడ్రామాకి చోటివ్వలేదు.
రజనీ సినిమాల్లో తరచూ పొలిటికల్ డైలాగులు వినిపించేవి. ఈ సినిమా మాత్రం అందుకు మినహాయింపు.
ముత్తు భార్యగా రమ్యకృష్ణ కనిపించారు. ఆమె కూడా తన హుందాతనంతో పాత్రకు వన్నె తీసుకొచ్చారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు.
కానీ.. ఆమెది కేవలం అతిథి పాత్ర మాత్రమే. ఓ పాటలో మెరిసిందంతే.
ఆ పాట ఉన్నా, లేకున్నా కథకొచ్చే నష్టమేం లేదు. బ్లాస్ట్ మోహన్ గా సునీల్ కనిపించాడు. ఆ ఎపిసోడ్ తేలిపోవడంతో... సునీల్ కష్టం వృథా అయ్యింది. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లని రజనీ సినిమాలో చూడడం కచ్చితంగా ఓ విజువల్ ఫీస్ట్.
విలన్ పాత్రలో నటించిన వినాయకన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడే. కాకపోతే.. తన విలనిజం బాగుంది.
ఓ కొత్త నటుడ్ని ఆ పాత్రలో చూడడం ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Sun Pictures
అనిరుధ్ మాయ
టెక్నికల్ టీమ్‌లో ఎప్పటిలానే ఎక్కువ మార్కులు తెచ్చుకొంది మాత్రం అనిరుధ్ రవిచంద్రన్.
ఈ సినిమాలో పాటలకు స్కోప్ చాలా తక్కువ.
రావాలయ్యా.. పాట ఉన్నా, దానికి కథతో సంబంధం లేదు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో మాత్రం అనిరుధ్ మెరుపులు మెరిపించాడు. `ఉరుముకి మెరుపుకి పుట్టాడురా` పాటని బ్యాక్ గ్రౌండ్ లో వాడుకొన్న విధానం మెప్పిస్తుంది.
మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ ఎంట్రీ సమయంలో ఇచ్చిన బీజియమ్స్ కూడా ఆకట్టుకొన్నాయి.
దర్శకుడు నెల్సన్‌కి ఓ స్టార్‌ని ఎలా చూపించాలో తెలుసు.
రజనీని అలానే చూపించాడు. తొలి సగం వరకూ తను ఏం చేసినా చూడబుద్దేసింది.కానీ ద్వితీయార్థం ట్రాక్ తప్పేశాడు.
కథని ఎటువైపో తీసుకెళ్లిపోయాడు. అక్కడ కూడా ఏదో మ్యాజిక్ చేయగలిగితే... `జైలర్` ఎవరి అంచనాలకూ అందనంత ఎత్తులో ఉండేవాడు.
కానీ.. మంచి ప్రారంభాన్ని వాడుకోలేకపోవడంతో.. `జైలర్` ఓ సాదా సీదా సినిమాగానే మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- చిరంజీవి: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు కారణమేంటి? భీమ్లా నాయక్, బ్రో సినిమాల తరువాత వివాదాలు ఎందుకు రాజుకున్నాయి
- ప్రతిద్రవ్యోల్బణం: చైనాలో తగ్గుతున్న వస్తువుల ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా
- లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?
- అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: సమ్మె విరమించుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















