చిరంజీవి: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు కారణమేంటి? భీమ్లా నాయక్, బ్రో సినిమాల తరువాత వివాదాలు ఎందుకు రాజుకున్నాయి

ఫొటో సోర్స్, YouTube/MythriMovieMakers
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో నటుడు చిరంజీవి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి.
నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని పేర్లు ప్రస్తావించకుండా చిరంజీవి విమర్శలు చేశారు.
చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ప్రతి విమర్శలకు దిగారు.
ఒక సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు చిరంజీవిపై ఆరోపణలు చేశారు.
కొడాలి నాని పరుష పదజాలంతో మాట్లాడారని ఆరోపిస్తూ చిరంజీవి అభిమానులు గుడివాడలో ఆందోళనకు దిగారు.

ఫొటో సోర్స్, YouTube/MythriMovieMakers
చిరంజీవి ఏం అన్నారు?
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.
ఆ సినిమా 200 రోజుల వేడుక సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఆ సందర్భంలో…
‘‘పెద్ద పెద్ద విషయాల్లో మీరు(ప్రభుత్వం) ఇన్వాల్వ్ కావాలి. అవి వచ్చేట్టు చేయాలి. అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి. లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి. లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి. లేదా పేదవాళ్ల కడుపు నింపే పథకాల గురించి కానివ్వండి. ఉద్యోగ అవకాశాల గురించి కానివ్వండి. ఉపాధి అవకాశాలు కానివ్వండి. ఇలాంటివి చూసి.. వాటి కోసం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా.. మా ఇండస్ట్రీ ఏం చేసింది?’’ అని చిరంజీవి అన్నారు.
దీని తర్వాత చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.
ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం పేరు చెప్పకపోయినా, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలుస్తుంది.
చిరంజీవి వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని స్పందించారు.

ఫొటో సోర్స్, ANI
మంత్రులు ఏమన్నారంటే?
బొత్స సత్యనారాయణ మీడియతో మాట్లాడారు..
‘‘చిరంజీవి ఉద్దేశమేంటి? సినీ పరిశ్రమ పిచ్చుక అనా? దానిపై బ్రహ్మాస్త్రం వేయొద్దని అంటున్నారా.. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో దాని వెనుక ఏముందో నాకు తెలియదు. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. సినిమాపై ఎందుకు పనిచేస్తుంది’’ అని అన్నారు.
మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ‘‘చిరంజీవి రాజకీయాలను కడిగే ముందు ఆయన తన తమ్ముడిని కడిగితే మంచిది. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా? ’’ అని అన్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయం ఎంత దూరమో, ఇక్కడ నుంచి ఫిల్మ్‌నగర్ కూడా అంతే దూరం. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారు. అలాంటప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదు’’ అని చెప్పారు.
చిరంజీవి వ్యాఖ్యలు తొలగించినా..
సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడం, దానిపై ఏపీ మంత్రుల విమర్శలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.
చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ప్రమోటింగ్ ఏజెన్సీ తొలగించింది.
వాల్తేరు వీరయ్య ఫంక్షన్ వీడియో లింకులో ఆ వ్యాఖ్యలు లేకుండా చేశారు. అయితే, అప్పటికే సెల్ ఫోన్లో రికార్డు చేసిన విజువల్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ వివాదంపై తెలుగు సినీ నిర్మాత కె. దామోదర ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
‘‘కేవలం సినీ పరిశ్రమనే కాదు, ఏ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రభుత్వాలకు సరికాదు.
సినీ పరిశ్రమ అనేది చాలా పరిశ్రమల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నది.
నటులకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వారిని టార్గెట్ చేస్తుంటారు. అలాగని ఎవరైనా రాజకీయంగా వాడుకోవడం సరికాదు. వ్యక్తిగత లబ్ధి కోసం సినీ పరిశ్రమను వాడుకోరాదు. ప్రస్తుత వివాదంపై మరి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PEOPLE MEDIA FACTORY
చిరంజీవి వ్యాఖ్యలకు బ్రో వివాదమే కారణమా?
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలైంది.
అందులోని ఓ సన్నివేశంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి స్పూఫ్ చేశారనే వివాదం నడుస్తోంది. రాంబాబు పేరును పోలినట్లుగా శ్యాంబాబు పేరుతో నటుడు పృథ్వీ, బ్రో సినిమాలో పాత్ర పోషించారు.
గతంలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలలో పాల్గొని డ్యాన్స్ చేశారు. అదే డ్రెస్సులో.. దాదాపు అవే స్టెప్పులు వేస్తూ నటుడు పృథ్వీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది.
సినిమా విడుదలయ్యాక శ్యాంబాబు పాత్రపై అభ్యంతరం చెబుతూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్స్ పెట్టారు.
పవన్ కల్యాణ్ , సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
పవన్‌ను ఉద్దేశించి ‘ఎంఆర్ఓ’ సహా వివిధ పేర్లతో ఓ సినిమా తీస్తున్నట్లు వారం కిందట ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపై కథ, కథనం తయారుచేస్తున్నారన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రసంగం..
హీరోల రెమ్యూనరేషన్ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంతకుముందు రాజ్యసభలో ప్రస్తావించారు.
గత నెల 27న సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు సందర్భంగా రెమ్యూనరేషన్ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.
‘‘పెద్ద సినిమాల బడ్జెట్‌లో అధిక భాగం హీరోల రెమ్యునరేషన్‌కే వెళుతోంది. సినిమా బడ్జెట్‌లో మూడో వంతు హీరోలకే వెళుతోంది. సినిమా అంటే హీరో ఒక్కడే కాదు. భారత చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు నామమాత్రంగా వేతనాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకు కేంద్రం తన వంతు చర్యలు తీసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
ఇలా వరుసగా జరిగిన పరిణామాలన్నింటితో తాజాగా చిరంజీవి వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.
ఈ వివాదంపై సినీ నిర్మాత మద్దినేని ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
‘‘సినీ పరిశ్రమలోని కొందరు రాజకీయాలు చేస్తుండటమే పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు.
ఆర్థిక లావాదేవీలు ఉన్న సమయంలో కొంత తగ్గినా, తర్వాత రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇది చివరికీ నిర్మాతలు, సినిమా విడుదలపై ఈ ప్రభావం పడుతోంది.
గతంలో ఈ పరిస్థితి లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మొదలైంది. తర్వాత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా నటుల మధ్య విమర్శలు పెరిగిపోయాయి.
రాజకీయల్లోకి వెళ్లినప్పుడు సినిమాలను వదిలేస్తే మంచిది’’ అని మద్దినేని ప్రసాద్ అన్నారు.
ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ వివాదం ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు.
ఏడాదిన్నర కిందట టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడిచింది.

అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందా..?
ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా హాళ్లలో టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం 2021 ఏప్రిల్ 8న జీవో నం.35ను జారీ చేసింది.
టికెట్లను ప్రభుత్వం తరఫున విక్రయించాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ జీవోపై పెద్ధ ఎత్తున చర్చ నడిచింది. టికెట్ ధరలు బాగా తక్కువగా ఉన్నందున థియేటర్ నిర్వహణ సాధ్యం కాదని థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం తెలిపాయి.
ఆ తర్వాత తెనాలికి చెందిన లక్ష్మీ, శ్రీలక్ష్మీ థియేటర్ యాజమాన్యం సహా థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో కేసు వేశాయి. వందల కోట్లు ఖర్చు చేసే సినిమాలకు నామమాత్రపు ధరలు నిర్ణయిస్తే మనుగడ సాగించలేమంటూ థియేటర్ల యాజమాన్యాలు కోర్టులో వాదనలు వినిపించాయి. ఇదే విషయంపై అప్పట్లో రాజకీయంగానూ వివాదం రేగింది.
తనపై ఉన్న కోపంతో సినిమాలపై పగ తీర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత, ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను ఏపీ హైకోర్టు 2021 డిసెంబరు 15లో కొట్టేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ వేసి టికెట్ల రేట్ల పెంపుపై అధ్యయనం చేసింది.
‘‘టికెట్ల పెంపు విషయంలో చిన్న సినిమాలకు ఎప్పుడూ నష్టమే జరుగుతూ వచ్చింది. ఏటా పది సినిమాల కోసం 150 సినిమాలను బలి పెడుతున్నారు. టికెట్ల రేట్ల పెంపు, తగ్గింపు.. ఇలా ఏదైనా అంతిమంగా నష్టపోతున్నది చిన్న సినిమాలు తీసేవాళ్లే’’ అని నిర్మాత మద్దినేని ప్రసాద్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, AP CMO
చిరంజీవి నేతృత్వంలోనే చర్చలు
అప్పట్లో చిరంజీవి నేతృత్వంలోని బృందం, టికెట్ల తగ్గింపు వివాదంపై ఏపీ ప్రభుత్వంతో చర్చించింది.
2022 ఫిబ్రవరి 11న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి బృందం సమావేశమైంది.
చిరంజీవితోపాటు మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, అల్లు అరవింద్, ఆర్.నారాయణమూర్తి తదితరులు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి ఏపీ సీఎంను కలిశారు. ఆ తర్వాత టికెట్ల రేట్లను పెంచుతూ గతేడాది మార్చి 7న ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దీనిపై అప్పట్లో బీబీసీ కథనం ప్రచురించింది.
ఈ జీవో విషయంలోనూ వివాదం నడిచింది. అప్పట్లో ఫిబ్రవరిలో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తర్వాతే జీవో తీసుకువచ్చారని అప్పట్లో పవన్ అభిమాన సంఘాలు విమర్శించాయి.
తాజాగా మరోసారి బ్రో సినిమాతో మొదలైన వివాదం, చిరంజీవి వ్యాఖ్యలతో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














