లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ANI
నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండో రోజు బుధవారం కొనసాగింది.
బీజేపీపై సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మణిపుర్‌లో ఎందుకు పర్యటించలేదని రాహుల్ ప్రశ్నించారు. తాను కొద్ది రోజుల క్రితం మణిపుర్‌లో పర్యటించాన్నారు.
‘‘మీరు మణిపుర్ ప్రజలను చంపి, భారతదేశాన్ని చంపారు. మీరు దేశభక్తులు కాదు, దేశద్రోహులు’’ అని ఆయన ఆరోపించారు.
రాహుల్ ప్రసంగిస్తుండగా, పలువురు బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. అయితే రాహుల్ ఓ మహిళా ఎంపీకి సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారనే వార్తలు రావడం చర్చనీయాంశమైంది.
ఈ విషయం స్పీకర్ వరకు వెళ్లింది. దీనిపై ఎన్డీఏ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకూ రాహుల్ సభలో ఏం మాట్లాడారు? ఆయన ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? సభలో దీనిపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీ ఎవరు?

ఫొటో సోర్స్, SANSAD TV
రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ?
అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన చేసిన మొదటి ప్రసంగం ఇది.
రాహుల్ ప్రసంగం ప్రారంభించే ముందు, తన సభ్యత్వం పునరుద్ధరించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘గత ఏడాది నేను భారతదేశంలోని దక్షిణం నుంచి ఉత్తరం వరకు 130 రోజుల పాటు నడిచాను. ఒంటరిగా కాదు, చాలా మందితో వెళ్లాను. పాదయాత్ర సమయంలో చాలా మంది మీరు ఎందుకు నడుస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అని అడిగారు. ఆ సమయంలో నేను దేశాన్ని చూడాలనుకున్నా, ప్రజలను లోతుగా అర్థం చేసుకోవాలనుకున్నా. రోజూ 10 కిలోమీటర్లు నడిచే నాకు, 25 కిలోమీటర్లు నడవడం పెద్ద విషయం కాదనుకున్నా. ఈ ప్రయాణంలో రైతు కళ్లలో బాధను చూశాను’’ అని రాహుల్ చెప్పారు.
‘‘గత కొన్నిరోజుల క్రితం మణిపుర్ వెళ్లాను, కానీ మన ప్రధానమంత్రి ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదు. ఆయన దృష్టిలో మణిపుర్ భారత్ కాదు. మీరు మణిపుర్‌ను రెండుగా విడదీశారు. మణిపుర్‌లో భారత్‌ను హత్య చేశారు. భరతమాతను చంపేశారు. అందుకే ప్రధాని మోదీ మణిపుర్‌కు వెళ్లడం లేదు’’ అని ఆయన విమర్శించారు.
రాహుల్ పార్లమెంట్‌లో మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో లేరు. స్పీచ్ అనంతరం రాహుల్ సభ నుంచి బయటికి వెళ్లారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ- ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారని సభలో వ్యాఖ్యానించడంతో గందరగోళం నెలకొంది.

ఫొటో సోర్స్, SANSAD TV
స్మృతి ఇరానీ ఏమన్నారు?
మణిపుర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఇది ఇలాగే కొనసాగుతుందని స్మృతి ఇరానీ అన్నారు. సిక్కు అల్లర్లు, కశ్మీరీ పండిట్ల వలసలను ఆమె సభలో ప్రస్తావించారు.
అవినీతి, వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ బాధ్యత వహించి, దేశం విడిచి వెళ్లాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
ఆ తర్వాత డీఎంకే తీరును ఆమె తప్పుబట్టారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ- ''నాకంటే ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి బయటకు వెళ్లే ముందు దురుసుగా ప్రవర్తించారు. మహిళా సభ్యులు కూర్చునే పార్లమెంటులో కేవలం స్త్రీ ద్వేషి మాత్రమే ఇలా ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు చట్టాలు రూపొందించిన ప్రజల సభలో ఇలాంటి అసభ్య ప్రవర్తన గతంలో ఎన్నడూ చూడలేదు'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు
రాహుల్ పార్లమెంటు లోపల ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న స్మృతి ఇరానీ వ్యాఖ్యల అనంతరం దీనిపై ఎన్డీఏ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
స్మృతి ఇరానీని ఉద్దేశించి రాహుల్ అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను వారు కోరారు.
అయితే ఫ్లయింగ్ కిస్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సభలో అలాంటిదేమీ జరగలేదన్నారు. స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా ఉందని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ అన్నారు.
"ఇది స్మృతి ఇరానీకి పెద్ద సమస్య. ఆమె రాహుల్ ఫోబియాతో ఉంటున్నారు. రాహుల్ ఏం మాట్లాడినా, ఆమె తిడతారు. ఆమె ఈ ఫోబియాను విడిచిపెట్టాలి" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీ సంబరాల ఛాయాచిత్రాలు
- ఆంధ్రప్రదేశ్: నంద్యాల అమ్మాయి దౌలత్, పాకిస్తానీ అబ్బాయి గుల్జార్... రాంగ్ కాల్‌తో మొదలైన లవ్ స్టోరీ
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














